కడిమిచెట్టు

రససిద్ధుని ప్రస్థానం

ఏప్రిల్ 2014

నా వ్యక్తిగత  దృక్పథం లోంచి ఆయన శాపగ్రస్తుడై జన్మించిన కిన్నరుడో , విద్యాధరుడో. పూర్వ జ్ఞానం లేదు, లేకనూ పోలేదు. ఆకాశ గంగా నిర్మల ధారలు, దేవ పారిజాత వృక్ష ఛాయలు, మానవ కంఠాలలో పలకని దివ్యతరమైన సంగీతం , ఇవన్నీ స్ఫురించీ స్పష్టమవని అయోమయం , కొన్ని మధుర కటుత్వాలు, , కొన్ని జ్వరిత స్వప్నాలు, మరి కొన్ని భ్రాంతులూ సాక్షాత్కారాలూ. .. వాటిలోంచి పుట్టిన కవిత్వ సౌందర్యం.

ఇంద్రజాలపు గవాక్షాలలోంచి ఆ  నిషిద్ధ సముద్రాల పొంగే నురగలు, చేరరాని గంధర్వలోకాలు.

ఇరవై ఐదేళ్ళ జీవితవ్యవధిలో కిక్కిరిసిపోయిన శోకాలూ తీవ్రతలూ స్నేహాలూ అనురాగం…. కొన్ని దోసిళ్ళ సన్నజాజులూ కొన్ని గుప్పెళ్ళ విరజాజులూ …వెరసి యాభై మూడు పద్యాలు,  మిగిలాయి.

ఇంగ్లీష్ రొమాంటిక్ కవులలో అందరికన్న ఆఖర్న జన్మించి ముందుగా గతించినవారు జాన్ కీట్స్.

పదిహేడవ శతాబ్దపు చివరలో ఉధృతమైన  ‘ Age of enlightenment ‘  ’ పాశ్చాత్య మేధోవిప్లవాలలో ముఖ్యమైనది.  అంతకు ముందే ఏర్పరచిన మతపు, రాజకీయపు నియమాలూ నిబంధనలూ వీటిని పక్కకు పెట్టి  సొంత మేధతో ఆలోచించమని ఎలుగెత్తిన ఇమాన్యుయేల్ కంట్[  ' The Critique of pure reason ‘  రచయిత  ]వంటివారు  కొన్ని సంకెళ్ళను తెంచారు. కాని అన్నిటినీ రీజన్ తో ముడిపెట్టట మూ బంధనమనీ మనిషి శక్తిని కుంగదీస్తోందనీ ఊపిరి ఆడనీయటం లేదనీ ఆ కొత్త సంకెళ్ళనూ తెగగొట్టినది రొమాంటిక్ మూవ్ మెంట్.

మానవ ఉద్వేగం, ఊహాశక్తి, వైయక్తికమైన అనుభూతి, స్వేచ్చగా విస్తృతంగా  దాన్ని వ్యక్తీకరించటం, ఆదర్శాలు…స్థూలంగా వీటి పైన ఆధారపడినది రొమాంటిక్ కవిత్వం.

పద్నాలుగు పదిహేనేళ్ళ వయసులో వర్జిల్ కి అభిమాని అయారు. పదహారేళ్ళప్పుడు ఎడ్మండ్ స్పెన్సర్ దీర్ఘ కవిత ‘ ద ఫెయిరీ క్వీన్ ‘ కి విపరీతంగా ఆకర్షితులయారు. అందులోని ఛందస్సునూ అనుసరించే ప్రయత్నం చేశారు, తన మొదటి పద్యమూ దాని గురించే. మానవ జీవితపు అత్యున్నతమైన ఘనతలను కీర్తించటం ఆ కవిత్వపు లక్ష్యంగా స్పెన్సర్ స్వయంగా  చెప్పుకున్నారు. ఆ ప్రభావం కీట్స్ భావధారను బలంగా మలచింది.

గ్రీక్ పురాణ గాథలు కీట్స్ కవిత్వంలో పదే పదే కనబడతాయి. ఇంగ్లీష్ లో అనువదించబడిన గ్రీక్ సాహిత్యం తో బాటు గ్రీక్ శిల్పం కూడా అద్భుతంగా తోచింది. గ్రీక్ భాష రాని కీట్స్ అంత అందంగా పద్ధతిగా ఆ  దేవతల గురించి ఎలా రాయగలిగారని షెల్లీ ని ఎవరో అడిగినప్పుడు ” he is Greek  ” అని జవాబిచ్చారట. చంద్రుడినీ  అరణ్యాన్నీ   ఇతర ప్రకృతి భాగాలనూ మానవరూపంలో భావించటం , సౌందర్య స్పృహ, పొంగి పొరలే జీవన కాంక్ష..ఇవన్నీ గ్రీక్ లక్షణాలు గా చెప్పబడినాయి. స్థలం దృష్ట్యా గ్రీస్ దాటి తూర్పుకి రాలేదు ఆ ఊహ , కాని ఆ కవిత్వానికి ప్రాణాధారమైన  ’ instinct  ’ గ్రీక్ పురాణాల కన్నా ప్రాచీనమైనదిఏమో .

ఆ  పద్యాల ప్రేరణతో అద్భుతమైన ప్రీ రాఫెలైట్ చిత్రాలు రూపొందాయి , వాటికి తమదైన ఘనత ఉంది.

‘’ భూమి నా   సిం హాసనం,  ఆకాశం కిరీటం, గాలి నేను కట్టిన దుకూలం…సముద్రం నా కోసం గానం చేస్తూ ఉంది ‘’

అన్న,  మన్నూ మిన్నూ ఏకమైన ఉత్సవం ఆ కవిత్వం.  వింటూనే లాక్కునేదీ అనంతరం వెంటాడేదీ రెండూ , అది ”  రాతిరీ పగలూ మరపు రాని హొయలు.  ”

శస్త్ర వైద్యుడిగా తర్ఫీదు పొందటం ఆయనకు వేదనను దగ్గరగా చూపించింది. డ్రెస్సర్ గా గాయాలకు కట్లు కట్టటం, ఎముకలను సరిచేయటం కూడా ఆయన చేయవలసి ఉండేది. అప్పటి రాజకీయాలలో ‘ లిబరల్ ‘ పక్షాన్ని తీసుకున్నారు. అయితే ప్రపంచపు రుగ్మతను నయం చేయటానికి కవిత్వానికే శక్తి ఉందని ఆ స్వాప్నికుడి  విశ్వాసం. ‘’ ‘’ కనబడేవాటిని మాత్రమే చూడగలవారు కాదు, అంతకుముందు ఉందని తెలియనిదాన్ని దర్శించగలిగేవారే ప్రపంచపు సమస్యలను తీర్చగలరు ‘’ఇదే భావాన్ని తన కవిత్వానికీ లార్డ్  బైరన్ రచన కూ భేదాన్ని చెప్పుకోవటం లోనూ వాడతారు.

తోటి వైద్యుల, వైద్య విద్యార్థుల మధ్య ఆయన విలక్షణంగా కనిపించేవారు. ఎవరో దేవుడు దిగివచ్చినట్లుండేది ఆ ప్రవర్తన అని సహపాఠి హెన్రీ స్టీఫెన్స్ ఫిర్యాదు చేస్తారు. . అయి ఉండాలి, ఆ చూపు, ప్రయత్నం …వాటి గమ్యం అక్కడక్కడే ఖచ్చితంగా ఉండి ఉండదు.

షేక్ స్పియర్ ని చదివి లోతుగా అర్థం చేసుకోగలిగినందుకు  జన్మకి సరిపడా తృప్తి ఉందని అంటారు. మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో   ” ఏమిటి ఈయన్ని [షేక్ స్పియర్ ]   అంత గొప్పవాడిని చేసిందో అర్థమవుతోంది నాకు. అనిశ్చితత్వాల మధ్య నిలిచిఉండగలగటం ఆయన సాధించారు. నిజాలనీ తర్కాలనీ సాయం తెచ్చుకోకుండా సందేహాలనీ రహస్యాలనీ సహించటం అది  ”

వైరుధ్యాలకి కారణాలు వెతక్కుండా జీవించటాన్ని,  ఏదో ఒక  మూసలో  బిగిసే  ప్రయత్నం చేయకుండా ఉండగలగటాన్ని ‘ అభావ సామర్థ్యం ‘ [negative capability] అన్నారు కీట్స్. ఆ సందేహం, ఆ రహస్యం చాలా విధాలుగా జీవనాన్ని ఆకర్షణీయం  చేస్తాయి. ఇది కొంత అదనపు విలువ ఇచ్చినా ఆ సిద్ధాంతం పరమావధి అది మాత్రమే కాదు . ప్రశ్నలతో కలిసి బ్రతకటం దగ్గర మొదలయి అన్ని ప్రశ్నలూ అంతమైన చోట పర్యవసించటం ఆ మార్గం.

వర్ణించబడే వస్తువు , వర్ణన, వర్ణించే వ్యక్తి ముగ్గురూ ఒకటే అయిన స్థితి ని కీట్స్ దర్శించారు.

ఆయన మాటలలో కవిత్వపు లక్షణం దానికి సొంత ఉనికి  అంటూ లేకపోవటమే. ” అది అన్నీ అవును, ఏదీ కాదు. ఎండనీ  నీడనీ  ఒకేలా అనుభవిస్తుంది  కవిత్వం . ఔన్నత్యం, నీచత్వం- సంపన్నత, పేదరికం -వికృతతత్వమూ సౌందర్యమూ అన్నిటినీ నింపగలదు . తత్వవేత్త లకు అఘాతం కలిగించేవాటిని, కవి- ఊసరవెల్లి వంటి వాడు,  ఆస్వాదించగలడు. కవి ఒక్కడే ఇక్కడ కవిత్వం కానిది, ఎప్పుడూ ఇంకొక శరీరం లో జీవించే అతనికి తనది అంటూ ఏముంటుంది ! ”

ఇంగ్లీష్ లో డౌట్ అనేది లాటిన్ ‘ డ్యూబిటైర్ ‘  నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదానికి ‘ రెండు ‘ అని అర్థం. అంటే ద్వంద్వత్వం. ఆ రెంటిమధ్యా నలగటం కాకుండా వాటిని వదిలేసి, దాటి చూడగలగటాన్ని కీట్స్ కలలు కన్నారు. మరొకలా చెప్పాలంటే అన్నిటి, అందరి  ఎడలా సానుభూతి, తనకూ మరొకదానికీ భేదం తెలియని, లేని సహానుభూతి. దీన్ని సామర్థ్యం అనటం చాలా మంది  పాశ్చాత్యులకి , సహజం గానే- మింగుడు పడలేదు. ఇందులో భారతీయులకి అర్థం కానిదేమీ లేదు. తత్వ వేత్తలు వేటి  వలన ఖంగు తింటారని కీట్స్ అన్నారో ఆ ముడులను విప్పటమే ఇక్కడి తత్వశాస్త్రం.

అనిశ్చితత్వం వల్ల , తెలియక పోవటం వల్ల వచ్చే అయో మయాన్నీ  బాధనూ భరించటం అభావ సామర్థ్యం అని ప్రముఖ సైకో అనలిస్ట్ విల్ఫ్రెడ్ బియాన్ అంటారు. నిజంగానే ఇరవైయవ శతాబ్దపు అనాలిసిస్ లో , సైకో థెరపీ లో ఈ అంశాన్ని ఉపయోగించుకున్నారు.

వివిధ స్థాయిల, విధాల అనుభూతుల, స్పందనల సమాహారంగా జీవితపు సంపత్తి గురించి రాశారు.

ఒక ప్రమాద కరమైన స్త్రీ సమక్షం లో ఆ కౄరత్వాన్ని అనుభూతి చెందుతూ గడిపాను అంటే ఏ కాస్తో అర్థం చేసుకున్నా బిలియర్డ్  బంతి ని దాని గుండ్రదనానికీ నున్నదనానికీ సంసిద్ధతకీ వేగానికీ నేను ఆనందిస్తాను అన్న ఆయన మాటలు విమర్శకులను తికమక పెట్టినట్లున్నాయి. మనిషిలో తప్ప జంతువులలో, వృక్షాలలో ఆత్మ ఉందని అంగీకరించని సంప్రదాయం లో నిర్జీవమనిపించే వస్తువులకు ఆ స్థాయి ఇచ్చి చెప్పటం ఏమనిపించి ఉండాలి ?

వస్తువుతో కవి మమేకమైపోతే ఇక చెప్పటం ఎలాగా అన్న ప్రశ్నలూ  లేచాయి. స్పృహలో ఉన్న మనస్సుతో ఎంత దూరం వెళ్ళవచ్చో ఆ మేరకు ఏకత్వం అది. ఆ స్పృహ పోయిన తర్వాత అది కవిత్వం అవదు, అసలు ఏమీ అవదు. [శమనం అవుతుంది,  శాంతి అవుతుంది .]

ఎన్నెన్ని గ్రంథాల అధ్యయనమూ ఆ దశ కి తీసుకు వెళ్ళలేదు, సౌందర్యదృష్టి తప్ప అని కీట్స్ అభిప్రాయం. ఇక్కడ సౌందర్యం అన్న మాటకి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ” సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం . ఇది తెలిస్తే ప్రపంచం లో  ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు ” అని Ode to Grecian urn ‘  లో అంటారు. అది అన్నిటీకీ అవతలికి తీసుకువెళుతుందని, కాదు, అన్నిటినీ నశింపజేస్తుందనీ కూడా అంటారు ఆయన.

ఈ అభావ సామర్థ్యం అంతరాత్మను నమ్మటం వంటిది అని ఒక విమర్శకులు అంటారు. ఆ నమ్మకానికి హెచ్చు తగ్గులు ఉంటాయి గనుక సామర్థ్యానికీ ఉంటాయి… దాని కోసం ప్రయత్నం చేస్తూ పోవాలా, కాదు , వేచి చూడాలేమో. ‘ ఎండీమియాన్  ‘ అనే కవితను పూర్తిచేసేందుకు  కొన్ని నెలలల పాటు ఏమీ రాయలేని స్థితిని దాటవలసి వచ్చిందని కీట్స్ అంటారు. ” కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది ”

ఈ లోకం పరిహరించవలసినది కాదనీ ప్రతి ఉనికిలోనూ దాగి ఉన్న దివ్యత్వాన్ని కనుగొనవచ్చనీ ఆయన నమ్మారు. విశ్వానికంతటికీ ఒక రక్షకుడు అన్నదాన్ని త్రోసిపుచ్చారు. జీసస్ ని  శిలువ వేయటాన్నీ   దైవికంగా తీసుకోలేకపోయారు. ” ఊహ ని ఆడం   కన్న కలగా అనుకోవచ్చు, అతను మేల్కొని అది నిజమని తెలుసుకున్నాడు ” వంటి మాటలు ఆయనకి మతం బొత్తిగా లేదని చెబుతాయి .

గ్రీక్ దేవతల ప్రస్తావన తరచు చేసినా అపోలో ను ఆరాధిస్తున్నారనిపించినా వారినీ ‘ ముక్తిదాతలు ‘ గా భావించలేదు. విముక్తి అన్నది తర్కం తో సాధ్యపడదు అనే చివరివరకూ భావిస్తూ వచ్చారు. అనుభూతి, దాని వలని జాగృతి , లౌకికమైన అవధులను అధిగమించి శాశ్వతమైన ఆనందం లో లీనమవటం…స్థూలంగా ఇది ఆయన ప్రణాళిక. నిజంగానే ఒక పది సంవత్సరాలు పట్టే అధ్యయనాన్ని ,వ్యక్తీకరణని చివరి సంవత్సరంలో ఊహించారు.

ఫానీ బ్రాన్  అనే యువతిని తీవ్రంగా గాఢంగా ప్రేమించారు.” నేను ఇంతగా ప్రేమించగలనని నాకే తెలియదు ”, ” నాకెప్పుడూ నువ్వు కొత్తగానే అనిపిస్తావు ” ,” నీ కోసం ఎంత వేదన పడతానో ఊహించలేవు నువ్వు ”  ” నువ్వు నన్ను పీల్చివేస్తున్నావా, నేను కరిగిపోతున్నానా అనిపిస్తోంది ”   ఆ తర్వాతి కాలం లో రకరకాలైన కళారూపాలలో మనం అదే పనిగా విన్న ఇటువంటి మాటలు కీట్స్  గొంతులో వాటి అసలైన అర్థంతో వినిపిస్తాయి . ‘’  చలించిపోయే నా మనసుకి నా ఈ చిన్న దేహం చాలదు, నాకు తృప్తి లేదు.  నీమీద నిలిచినట్లు నేను ఇంక దేని మీదా ఎవరి మీదా నిలవలేను. నువ్వు నాతో  ఉంటే నా ఆలోచనలు గంతులు వేయవు ‘’

 

చివరి కొన్ని సంవత్సరాలలో …sఆత్మీయుల మరణాలు వరసగా చూడవలసి రావటం, ఆ తర్వాత – అప్పటికి సరయిన వైద్యం లేని క్షయ వ్యాధి తనకే ప్రాప్తించటం….

ప్రపంచం సుందరమైనది, గొప్ప కవికి మరింతగా.  అనురాగం మధురమైనది,భావుకులకి ఇంకా చాలా. ప్రేమించే వస్తువులో ప్రకృతి లో ఎడం లేనంతగా  లీనమయి ఎంత ఆనందాన్ని అయినా పొందగలిగే హృదయాలుంటాయి. ఒక్కటే కదా హద్దు, ఆటంకం- అది మృత్యువు.  దేన్నీ  శాశ్వతమని అనుకోలేని ఆ నిస్పృహ ఎంత చేయదని ! ఎంత సాంద్రతర అనుభవమైనా ఇప్పటికీ ఇక్కడా మాత్రమే కదా సత్యం అనిపించే నిర్వేదం  నుంచి కీట్స్ చేస్తూ పోయిన అన్వేషణ లోనుంచి ఆయన ఆఖరి సంవత్సరాల పద్యాలు వచ్చాయి. అప్పటి The eve of St. Agnes  ఒకవెటకారపు తిరుగుబాటు…కాని తక్కిన కవిత్వమంతా ఆశ, ఆర్ద్రత…

” నాకు అమరత్వం కావాలని ఉంది. నీతో కలిసి ఎల్లకాలమూ బ్రతకాలని ఉంది ” అని ఆ ఇరవై నాలుగేళ్ళ యువకుడు ప్రేయసితో అనటం వింటే గుండె చెరువై పోతుంది.  ‘’ ఏడవకు, కళ్ళు తుడుచుకో. ఈ పూవు మళ్ళి వచ్చే ఏడు పూస్తుంది ‘’ అనే ఓదార్పూ తనే ఇస్తారు.

ఆయన  పద్యాలలో ముఖ్యమైన odes ఆ 1819 లో వచ్చాయి. వాటిలో చివరిదీ అత్యుత్తమమని చెప్పబడేదీ To Autumn . .హేమంతాన్ని ఒక పక్వత గా, ప్రశాంతి గా చూపించిన ఆ పద్యం జీవితం ముగియబోతుందన్నప్పటి అంగీకారం. పగలు అంతమైనప్పటి సంధ్య కాలపు గులాబివర్ణం , కోత పూర్తయిన పొలాలు, రసం ఓడ్చబడుతూన్న ఆపిల్ పళ్ళు – హేమంతపు సంకేతాలు.  వసంతగానం వెనకబట్టినా సంగీతం అంతమవదు.  తనూ మరో లోకానికి ఎగిరిపోబోవటాన్ని వాన కోయిలల వలసగా చెబుతారు.

Ode to nightingale లో నైటింగేల్ తో  ” ఎగిరిపో, నేనూ నీ వెనకే కవిత్వపు రెక్కలపైన వస్తాను కదా   ” అంటూ ”  ఇప్పటికే నీతో ఉన్నాను ”  అని తెలుసుకుంటారు.   వెన్నెల కూడా చొరబడని సాంద్రమైన అడవిలో , పూలనైనా కన్నులతో చూడలేని అర్థరాత్రి  చీకటిలో… సౌరభాల అలల మధ్యన- మరణాన్ని కలగంటారు.

‘’ వ్యాకులతను భరించేందుకు విషం వద్దు, మధువు వద్దు, లేత్ నది [ఆ నది పూర్వస్మృతిని పోగొడుతుంది ] లో మునగవద్దు …ఇంద్రధనుసు వన్నెలనూ ప్రేయసి నేత్రాలనూ వికసించే పుష్పాలనూ చూడు…సౌందర్యం  మరణించాల్సిందే…సంతోషపు వెల్లువ వెనకే  శోకం కనిపిస్తుంది, ఆ ద్రాక్ష జిహ్వకి తగిలి  చిట్లి విషం చిందితేనేమీ,  ఆ విషాదమొక అనుభవమే.   ‘’

‘’ వినిపించని రాగాలు వినబడేవాటికన్న మధురమైనవి, ఈ చర్మ శ్రవణానికి కాదు, ఆత్మలోకి మ్రోగుతాయి అవి.’’

‘’  సౌందర్యం మరణించీ  నశించదు, శూన్యమవదు. విశ్రాంతిగా నిద్రించేందుకు, కలలు కనేందుకు అందమైన పొదరిల్లును  సిద్ధం చేస్తుంది.’’

ఇంత తెలుసుకునీ దిగులు పడిన క్షణాలూ ఉన్నాయి…” గాయం మాన్పేవారు   లేరే అనుకోకుండా మనసు రాయి చేసుకోవటాన్ని ఏ కవులూ చెప్పలేదే…’’

‘’ ఈ విశాల ప్రపంచపు ఒడ్డున  నిలుచుని ఒక్కడినే ఆలోచిస్తున్నాను, ప్రేమా కీర్తీ అంతమైన ఇప్పుడు ,నేనిక ఉండనని తట్టినప్పుడు…     నేను మరణిస్తే నన్ను తలచుకుని మిత్రులు గర్వపడేలాగా ఏ అమరమైన కృతినీ వదిలి వెళ్ళటం లేదు. కాని, చరాచరమైన అన్నింటిలోనూ తొణికే సౌందర్యాన్ని ప్రేమించగలిగాను. సమయం ఉండి ఉంటే…నన్ను గుర్తుంచుకోవటానికి ఏమయినా చేయగలిగి ఉండేవాడినేమో ‘’

మెల్లిగా మృత్యువు తో సగం ప్రేమలో పడ్డానని అంటారు. ‘’ నా శ్వాసను సుతిమెత్తగా  గాలిలో కలిపేయమని బ్రతిమలాడుతున్నాను చావుని, తేలికగా తీసుకుపొమ్మని ‘’

తనను సమాధి చేయవలసిన చోటు … రకరకాల పూలు పూసే గడ్డి మైదానం అది, వయొలెట్ పూలు అసంఖ్యాకంగా  ఉన్నాయి, ఒక  గొర్రెల మంద, దాన్ని  కాచే  కుర్రవాడు …ఈ దృశ్యం చూసి వచ్చానని మిత్రుడు చెప్పినఫ్ఫుడు సంతోషపడ్డారు. ” ఇప్పటికే నా పైనంతా వయొలెట్ పూలు వికసిస్తున్నట్లు అనిపిస్తోంది ” అన్నారట.

‘ ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి పైని  రాసిన రాత’  అని ఉందట  ఇటలీ లోఉన్న కీట్స్ సమాధి పైన. నిజానికి ఆ పేరు పగలూ రేయీ వెలిగే చుక్కలతో రాసి ఉన్నది. ఇంద్రియాలతో పొందగలిగినదానిని చివరంటా దర్శించాక  వాటికి అతీతమైన మధుకాంతిని వెదికేందుకు ఆయన బయలుదేరి వెళ్ళారు.

చివరగా రాసిన వాక్యాలు ఇవి

‘’ ఇదిగో, ఈ చేయి చాస్తున్నాను. ఇప్పుడు వెచ్చగా సజీవంగా నీ చేతిని మమతగా అందుకోగలను. ఇదే    చేయి సమాధిలో శీతలమై పోతే  నీగుండెనిండిన  రక్తిమనంతా నాకోసం  వాడేస్తావా,  నా రక్తం పరుగెత్తేందుకు- నీ తృప్తి కోసం , పోనీ. ‘’

ఆ మాటలు ప్రేయసి ఫానీ బ్రాన్ ని ఉద్దేశించినవని కొందరు, కాదు రాబోయే చదువరుల కోసం అని మరికొందరు. రెండూ అవునేమో. రచయిత్రి   Dianne Setterfield  అడుగుతారు… ” మరణించిన రచయితలకి వారి రచన ఎవరైనా చదువుతూంటే తెలుస్తుందా?  చదివే వారి హృదయం వారి ఆత్మతో మెత్తగా రాసుకుంటుందా ? ” అని. మృత్యువు చాలా ఒంటరిది అంటారు ఆమె , తెలిసినవారేగాని అది పూర్తిగా పడమటి మాట.

పాశ్చాత్యులకి పునర్జన్మ పైన నమ్మకం లేదు. మళ్ళీ పుడతాము, అప్పుడు  చూసుకోవచ్చు అనే’  ఆశ అంతరించినప్పటి  ఆశ ‘   ఇవ్వగల ఆ కొంత ఉపశమనం అందదు వారికి. మొదలూ తుదీ లేని విశ్వలీల లో భాగం ఇది అంతా అనే జ్ఞానమూ విస్తరించి ఉపయోగించుకోరు.   కర్మ సిద్ధాంతం భారతీయులకి వేల ఏళ్ళుగా అందజేస్తూన్న శాంతిలో దానికి అదే సాటి.

ఇవి ఏవీ వర్తించని  ఒక దేశం లో, సంస్కృతిలో …. ఎంత నల్లటి చీకటో కమ్ముకున్న ఆ స్థితిలో ” ఇది కాదు అంతం, ఇదే కాదు మొత్తం, అవతల ఉన్నది ఏదో ఆ నిలకడ మూలకందం ” అనే ఎఱుక కోసమని వేసిన  అడుగులలో….

పరిమితులని అధిగమించి bards and minstrels గురించి రాసిన పద్యం  మనకి సమాధానం  .  ముందే కూర్చినా  కూడా  ఇదే ఆ హంస కు ఆ జన్మకు హంసగీతం  .

రసోద్వేగం, నిర్భరానందం కలిసిన ఉన్నత ప్రకృతులుగా కవులను, గాయకులను  కీర్తించారు . వారికి రెండు జీవితాలు చిరకాలమూ ఉంటాయట. భూమి పైనా స్వర్గం లోనూ కూడా వారు శాశ్వతులు. అక్కడి  రోజాపూలది దివ్యమైన పరిమళం. అక్కడి కోయిల పాటలో సత్యపు శ్రావ్యత. స్వర్ణమయ కాంతుల గాథల రహస్యాల మధ్య, సూర్యచంద్రులతో సంభాషిస్తూ,  నీలి పూల డేరాల కిందన , ఆకుల గుసగుసలు వింటూ ఆ పచ్చిక పైన శాంతంగా  ….

ఇక్కడా వదలి వెళ్ళారు తమను  , నవ్వులలో కన్నీళ్ళలో  , తీవ్రతలో నైచ్యంలో, వైభవం లో అవమానంలో -మానవులకి నేర్పేందుకు. అక్కడి సంతోషాన్నంతా ఇక్కడ స్ఫురింపజేసేందుకు, అందాకా ఆ దారిని చూపిస్తూ ఉండేందుకు !

[ఇది భారతీయమైన  వాక్కు -

జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా

నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం  ]

 

Picture credit:
1. John-Keats-In-His-Last-Illness,-Engraved-After-The-Sketch-By-Joseph-Severn,-From-The-Book-The-Century-Illustrated-Monthly-Magazine,-May-To-October,-1883

2. listening to the nightingale by joseph stevern