కథ

చందమామోళ్ళవ్వ

జూలై 2014

సాయంకాలం స్కూలు నుండి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మమ్మ అరుగెక్కి సన్నజాజి కొమ్మని వంచి పట్టుకుని మొగ్గలు కోస్తంది. పుస్తకాల సంచిని అరుగు మీద పారేసి “నేను కోస్తా అమ్మమ్మా! నేను కోస్తా!” అంటా రెండు పూలు కోసి ఇచ్చాను. అప్పటికే కింద పూలన్నీ కోసేసింది.

“అమ్మమ్మా! గోడెక్కి పైనున్న పూలు గూడా కోసేదా?” అన్నాను.

“ఆఁ ఎక్కు కాళ్ళు యిరుగుతాయి” అంటా గోడ మీద పెట్టిన పూల గిన్నె తీసుకుని అరుగు దిగింది. కిందే నిలబడి మమ్మల్ని చూస్తన్న మా అక్కాయిని వాటేసుకోని “అప్పుడు నీకు కుంటి పెళ్ళాం వచ్చిద్ది నా బంగారు మనవరాలికి రాజకుమారుడు వస్తాడు” అంది.

నాకు అప్పటికి ఏడేళ్ళు గూడా లేవు గాని నాకేదో నిజంగానే కుంటి పెళ్ళాం వచ్చినట్లయ్యి బలే కోపమొచ్చేసింది ఆ మాటకి. పుస్తకాల సంచి గూడా తీసుకోకుండా దొడ్లో బియ్యం ఏరుకుంటన్న మా అమ్మ కాడికి పోయా. “అమ్మా! చూడు అమ్మమ్మ దొంగ ముండ ఏమంటందో! నన్ను పెళ్ళి చేసుకోడానికి కుంటిది వచ్చిద్దంట. అక్కాయికేమో రాజకుమారుడు వస్తాడంట” అన్నాను. అమ్మ నవ్వి “అమ్మమ్మని అట్లా అనగూడదు” అంది .

“ఏడవబాకరో – ఇదిగో సంచి. నీగ్గూడా రాజకుమార్తే వచ్చిద్దిలే. పై పూలు కోయగూడదు – అయ్యి చందమామ పూలు. నువ్వే అన్నీ కోసేసుకుంటే చందమామకి కాబన్లే?” అంది అమ్మమ్మ.

“చందమామకా? చందమామకి పూలెందుకమ్మమ్మా?” అన్నాను ఆమె యెంట పడతా. అమ్మమ్మ దొడ్డి గుమ్మానికి అవతలేపున్న తన ఇంట్లోకి పోయి సన్నజాజి మొగ్గలను తడి గుడ్డలో పోసి వాటికి దెబ్బ తగలకుండా తేలిగ్గా పైపైన మూట గట్టి బుట్టలో పెట్టింది.

“చెప్పు అమ్మమ్మా చందమామ ఏం చేసుకుంటాడు పూలని?” అన్నా కొంగు పట్టుకుని లాగతా.

“చందమామ అంత తెల్లంగా ఎందుకున్నాడనుకుంటన్నావు మరి? చిన్నప్పటి నించి సన్నజాజి పూలు పెట్టుకోని పెట్టుకోని అట్లా తెల్లంగా అయ్యాడు” అంది.

“చందమామ అబ్బాయి గదా! పూలెందుకు పెట్టుకుంటాడు? నువ్వు దొంగాబద్దాలు చెబుతున్నావు” అంటా యీపు మీద రెండు పిడి గుద్దులు గుద్ది కసి తీర్చుకున్నా – మరి ఇందాక నా పెళ్ళాం కుంటిదంది గదా!?

“నేను చెప్పేది నిజమేరా మనవడా” అంటా నా చేతులని లాగేసి గట్టింగా పట్టుకోని “పూలంటే నీకూ ఇష్టమే గదా మరి నువ్వు అబ్బాయివా అమ్మాయివా చూద్దాం రా…. నిక్కరు ఊడదియ్యి” అంది.

“ఛీ! సరేలే చెప్పు కథ” అన్నా.

“చందమామకి సన్నజాజి పూలంటే బలే ఇష్టమంట. వాళ్ళమ్మేమో ‘ఒరేయ్ నాయనా పూలు పెట్టుకునేది ఆడపిల్లలురా – నువ్వు పెట్టుకుంటే అందరూ ఎగతాల్జేయరా?’ అందంట. వాడు యినకుండా మంకుపట్టు పట్టి రెండు రాత్తుర్లు రెండు పగళ్ళూ అన్నం తినకుండా ఏడ్చాడంట. అయ్యో! బిడ్డ ఈ రకంగా ఏడిస్తే ఏం గాను అనుకోని ‘సరేలేరా! అందరూ నిద్దర్లు పోయాక రేత్రిపూట పూలు పెట్టుకో’ అందంట.

అమ్మ ఒప్పుకుందని సంతోషపడిపోయి చందమామ పూలు కోసుకుందామని చెట్టుకాడికి పోతే ఎక్కడుంటాయి పూలు? అందరూ ఒక్క పువ్వు గూడా లేకుండా సాయంకాలమే కోసుకోని పోయుంటారు గదా! వాడు మళ్ళా ఏడుస్తా వాళ్ళమ్మ తోటి ‘అమ్మా! అందరూ సాయంకాలం పూటే కోసుకోని పోయారమ్మా నాకు ఒక్క పూవు గూడా దొరక లేదు’ అన్నాడంట. ‘ఏడవ్వొద్దులే నాయనా’ అని వాళ్ళమ్మ తరవాత రోజు నించీ అందరికంటే ముందే సాయంకాలం పూట పూలు కోసి మాల గట్టి తడిగుడ్డలో దాచిపెట్టి కొడుక్కి రాత్తుర్లు తలలో పెట్టేదంట.

కొన్ని రోజులకి ఆయమ్మ పాపం మంచాన పడింది. నేను చచ్చిపోతే నా బిడ్డకి పూలు ఎవురు పెడతారు పరమేస్సరా’ అని ఏడిచిందంట. పార్వతీపరమేస్సర్లు పత్తెచ్చమయ్యి నువ్వేమీ దిగులు పడబాకమ్మా ఇంక నించీ కొన్ని జాజి పూల కొమ్మలని పైకి ఉండేట్లు చేస్తాలే – పైనున్న పూలన్నీ నీ కొడుక్కే’ అన్నారంట. ఆయమ్మ వాళ్ళకి దణ్ణం పెట్టి తృప్తిగా చచ్చిపోయిందంట. అందుకే పై పూలు కోయగూడదు” అంది అమ్మమ్మ.

“మరి ఇప్పుడు ఆ పూలన్నీ కోసి చందమామలో ఉండే అవ్వ కట్టిద్దా మాల” అన్నాను.

“నువ్వు గూడా బలే అల్లుతావురే కథలు! నా పోలికలే నా బుజ్జి మనవడికి” అని అమ్మమ్మ ముసిముసిగా నవ్వుకుంటా నన్ను ఒళ్ళోకి లాక్కుంది. “ఆ అవ్వ కథ రేత్రికి చెప్తాలే పో. ఇయ్యాల రంగూన్ తాత వస్తన్నాడు. అన్నం తినేసి పొడుకోని ఉండు. తాత పోయాక పిలుస్తా” అంది.

రంగూన్ తాత వస్తన్నాడనేటప్పటికి నాకు భలే సంతోషమేసింది. అమ్మమ్మ ఈ రేత్రి కథ చెప్పేటప్పుడు తాత తెచ్చిన ఏరుశనగపొప్పు, చేగోడీలు పెట్టిద్ది. గబాల్న మా ఇంట్లోకి లగెత్తా తాత వస్తన్నాడని మా అక్కాయికి చెప్పడానికి.

రంగూన్ తాతది మా కులం కాదు. ఆయనకి పేటలో పెళ్ళాం, బిడ్డలూ ఉన్నారు. మా అమ్మమ్మని రంగూన్ తాత ఉంచుకున్నాడంట – అందరూ అంటారు. ఉంచుకోడమంటే అప్పుడప్పుడూ ఎవురికీ తెలియకుండా రాత్తుర్లు రావడం గామాల – ఎవురికీ తెలియకుండా చందమామ పూలు పెట్టకుంటుళ్ళా అట్లా అయ్యింటది.

తొందరగా అన్నం తినేసి దొడ్లో సన్నజాజి చెట్టు కాడ మంచాలేసుకోని పొడుకున్నాం నేను, అక్కాయి. అమ్మమ్మ ఇంట్లో నించి తాత పోవాలంటే మా మంచాలు దాటుకోని పోవాల. ‘తాత పోగానే లేచి చేగోడీలు తింటా చందమామలోని అవ్వ కథ చెప్పించుకుంటా అమ్మమ్మ చేత’ అనుకుంటా పొడుకున్నాను. రాముడి గుడిలో భజన యినపడతా ఉంది. ‘కోరివచ్చితినయ్యా’ అని కొంత మంది అంటంటే ‘కోదండపాణీ’ అని మరి కొందరు అంటా పాడతన్నారు. సన్నజాజి చెట్టు పైనున్న పూలు యిచ్చిపోయి కమ్మని వాసన వస్తన్నాయి. చంద్రుడొచ్చి ఆ పూలు కోసుకోని పోతాడేమో చూద్దామని వాటినే చూస్తా ఉన్నాను. తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి.

అమ్మమ్మ ఇంటి తలుపు కిర్రుమని చేసిన చప్పుడికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచా. “వస్తా బాగ్యం – రేపు పేటకొస్తే ఇంట్లోకి కావలసినయ్యి తెచ్చుకుందువు గాని” అంటన్నాడు తాత.

“సరేలే. జాగ్రత్తగా చూసుకోని పో – పాము పుట్రా ఉంటాయి” అంది అమ్మమ్మ

మేము కదలకుండా నిద్ర పోయినట్లు నటిస్తా పొడుకున్నాము. తాత మా మంచాల కాడి కొచ్చి వంగి అక్కాయినీ, నన్నూ ముద్దు పెట్టుకున్నాడు. నేను లేచి తాత మెడని కావలించుకున్నాను. “అమ్మమ్మ పొప్పులు పెడుతుంది తిను పో నాయనా” అన్నాడు గుసగుసగా. నేను సరేనని తలూపాను. దొడ్డి తలుపు తీసుకోని తాత చీకట్లోకి ఎళ్ళిపోయాడు.

తాత ముద్దు పెట్టుకుంటన్నా గూడా తెలియనట్లు పొడుకున్న మా అక్కాయి కిలాడీది – తాత అటు పోగానే లేచి అమ్మమ్మ కాడికి పోయింది. నేను గూడా లేచి లోపలకి పరుగుతీశాను. అమ్మమ్మ కాడ సన్నజాజుల గుమాయింపు. ఆమె జుట్టు ముడి సాయ చూశా. పూలన్నీ యిచ్చుకోని ఆకాశాన్ని పట్టుకోని ఉన్న నక్షత్రాల్లా మెరిసిపోతన్నాయి.

అమ్మమ్మ తల్లోని పూలు తీసి మూలనున్న గంపలో పారేసింది. నా మనస్సు చివక్కమంది వాటినట్లా పారేసేసరికి. చెక్కపెట్టె పైన బెట్టిన చేగోడీలు తీసి మా ఇద్దరికీ ఇచ్చి తన మంచం తెచ్చుకోని మా మంచాల పక్కన ఏసుకుంది. తలుపు గడేసి ముగ్గురం మా మంచాల మీదకి చేరాం.

చేగోడీలు మేకలా నముల్తా “అమ్మమ్మా! అవ్వ కథ చెప్తానంటివే” అన్నా.

“అబ్బబ్బ వదలవుగదరా! సరే దా పొడుకో చెప్తా” అంది. నేను అమ్మమ్మ మంచం మీదకి చేరి ఒక్కొక్క చేగోడీ నోట్లో ఏసుకోని చిన్నగా చప్పుడు గాకుండా నములుతున్నా పెద్దగా నమిలితే కథ యినపడదని.

“చందమామలో ఉన్న అవ్వ చందమామ వాళ్ళ అమ్మమ్మ. ఇప్పుడంటే మొగుడు వాతలు పెట్టేలకి అట్లా నల్లంగా ఉంది గాని చిన్నప్ఫుడు బలే అందంగా ఉండేది. ఆయమ్మ చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది. వాళ్ళ పక్కింట్లో ఉండే దొరబాబుతో స్నేగితం చేసింది. చెట్లల్లో చేమల్లో చెరువుల్లో దొరువుల్లో ఎక్కడ చూసినా యీళ్ళే. మంచి చెడ్డా చెప్పడానికి తల్లి లేకపాయా – పెళ్ళి కాకుండానే ఆ దొరబాబుని ముద్దు బెట్టుకుంది ఆయమ్మ. వాళ్ళ నాన్నకి తెలిసి పక్కూళ్ళో తెలిసినోళ్ళ పిల్లోడికిచ్చి పెళ్ళి చేశాడు.

ఆయమ్మ మొగుడికి దొరబాబు సంగతి ఎవురు చెప్పారో మరి ‘నిజమేనా?’ అనడిగాడు. తెలియక ముద్దు బెట్టుకున్నా అని చెప్పేసింది. ఇంక జూస్కో అప్పటినుండీ మొగుడు ఆయమ్మకి చేతుల మీద వాతలు పెట్టనూ, చుట్ట కాల్చుకోని ఆయమ్మ యీపు మీద కాల్చనూ… తట్టుకోలేక పుట్టింటికి పారిపోయి వచ్చింది.

“అమ్మో! తెలియక చేశానని చెప్తే గూడా వాతలు పెట్టాడా! దొంగ నా బట్ట కదమ్మమ్మా ఆయమ్మ మొగుడు? ఆయబ్బికి ఇష్టమైతే ఆయబ్బిగూడా ముద్దు బెట్టుకోవాల లేకపోతే వదిలెయ్యాలగాని” అంది మా అక్కాయి.

“అంత యిశాలంగా ఆలోచించే దర్మాత్ములు ఏడో నూటికి కోటికి వొకరుంటారు” అని అమ్మమ్మ మవునంగా పొడుకుంది కథ చెప్పడం ఆపేసి.

మధ్యలో కదిలించిందని నాకు అక్కాయి మీద బలే కోపమొచ్చింది. “అక్కాయ్ నువ్వు నోరు మూసుకోని ఉండు కథ చెప్పినాక కొచ్చిన్లు అడగాల…. తర్వాతేమయిందో చెప్పు అమ్మమ్మా అన్నా” పొట్ట మీద చెయ్యేసి ఊపతా.

“ఆయమ్మ తండ్రి ‘నువ్వు చచ్చినట్లే పో నా ఇంటికి రాకూడద’న్నాడు. స్నేగితుడికి చెప్దామంటే దొరబాబు రంగూన్ లో ఉన్నాడని తెలిసింది. ఏం చేసిద్ది పాపం పోలేరమ్మ గుడికాడ జువ్వి చెట్టు కింద అట్లు పోసి అమ్ముకోని బతుక్కుంటంది. కొన్నాళ్ళకి రంగూన్ నించి వచ్చిన దొరబాబుకి స్నేగితురాలి సంగతి తెలిసి ఊరికి వచ్చాడు. ‘నీకు నేను తోడుళ్ళా’ అని ఆయన పొలంలో ఆయమ్మకి మంచి కలపేసి ఇల్లు కట్టిపెట్టాడు. కొన్నాళ్ళకి ఆయమ్మకొక కూతురు పుట్టింది. తర్వాత పిల్లలు కలగలా.

ఆయన పెళ్ళానికి మాత్రం వరసగా ముగ్గురు కూతుళ్ళు చివర్న ఒక కొడుకూ పుట్టారు. ఆయమ్మ కూతురికి పెళ్ళీడొచ్చింది కాని ఎవురూ చేసుకోవడంలా. అప్పుడు ఆయన ఊళ్ళో ఉన్న పొలం అంతా ఆయమ్మ కూతురికి రాసిచ్చినాక ఆ ఊళ్ళో వాళ్ళే వచ్చి ఆ పిల్లని తమ పిల్లోడికి చేసుకున్నారు. అప్పుడా అవ్వకి చందమామ మనవడు పుట్టాడు. వాడు గూడా నీలాంటోడే ఎప్పుడూ కథలు చెప్పవ్వా కథలు చెప్పవ్వా అంటాడు. అందుకని అవ్వ మనవడికి కథలు చెప్తా వాడి కాడే ఉంటది” అని కథ ముగించింది అమ్మమ్మ.

“అదేందమ్మమ్మా? చందమామ అమ్మ చచ్చిపోయిందంటివే ఇందాక సన్నజాజుల కథలో! అవ్వ కంటే ముందే వాళ్ళమ్మ చచ్చిపోయిందా?” అన్నాను.

“ఆఁ అంతేలే. వాళ్ళమ్మకి ముందే జబ్బు చేసి చచ్చిపోయిందని చెప్తినే – పడుకోరా నాయనా పోయి… నువ్వేసే కొచ్చిన్లకి నేను సమాదానం చెప్పలేను గాని” అంది పక్కకి ఒత్తిగిల్లి. నేను లేచి నా మంచం మీదికి చేరాను.

“అది అమ్మమ్మ కథేరా!” అంది అక్కాయి నా మంచం పట్టె మీదికి జరిగి గుసగుసగా. అక్కాయి ఆ మాట చెప్పగానే నాకు గుండె గబుక్కుమన్నట్లు బలే దిగులేసింది. అమ్మమ్మ చేతుల మీద, యీపు మీద కాలిన మచ్చలు కళ్ళ ముందు కనబడ్డాయి. ఇంక నాకు నిద్ర పట్టలా. పత్తి గుడ్లేసుకోని చందమామ సాయే చూస్తా పొడుకున్నా. కళ్ళంబడి నాకు తెలియకుండానే కన్నీళ్ళు కారిపోతన్నాయి. చప్పుడుగాకుండా లేచి అమ్మమ్మ మంచం కాడికి పోయి ఆయమ్మ చేతుల మీదుండే కాలిన మచ్చల్ని మెత్తగా నిమిరా. అమ్మమ్మ లేచి నన్ను వాటేసుకుని పైట చెంగుతో నా ముఖం తుడిచింది. అమ్మమ్మ కళ్ళల్లో నించి గూడా కన్నీళ్ళు కారి పోతా ఉంటే నేను నా చొక్కాయితో తుడిచా.
“అమ్మమ్మా! పెద్దయ్యాక నిన్నూ, రంగూన్ తాతని బాగా చూసుకుంటా” అని అన్నా గుసగుసగా. అమ్మమ్మ నన్ను వాటేసుకుని ముద్దు బెట్టుకోని పక్కన పడుకోబెట్టుకుంది. అమ్మమ్మ పక్కన పొడుకోని చందమామ సాయ చూశానా…. చందమామ వంగి చల్లని ఎన్నని నా కళ్ళకి పూసినట్లనిపించింది.

“అబ్బాయ్! బడికి పో బన్లా – లే” అంటా అమ్మ నిద్ర లేపుతంది పిర్ర మీద ఒకటేసి.

***

సన్నజాజి చెట్టు ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు వేస్తానే ఉంది. పువ్వులు పూస్తానే ఉంది. చెట్టు పాదిలో అంట్లు మొలిచి పెద్దవై తల్లి చెట్టుతో కలిసిపోతన్నాయి. నేను, అక్క విజయవాడలో హాస్టళ్ళల్లో ఉండి డిగ్రీ చదువుకుంటన్నాము.

డిగ్రీ ఫైనలియర్ సెలవలప్పుడు ఇంటికెళ్ళాను. అమ్మమ్మ చాలా దిగులుగా కనపడింది. రంగూన్ తాత మంచంలో పడ్డాడని అమ్మ చెప్పింది. “తాతని చూసొద్దాం దా అమ్మమ్మా” అంటే “వద్దు నాయనా! వాళ్ళోళ్ళు అక్కడేమన్నా అంటే నేను, తాత ఇద్దరమూ తట్టుకోలేము” అంది.

ఒక్కడినే వెళ్ళి చూసొచ్చా. “ఎట్లున్నాడు? ఏమన్నాడు” అంటా ఆరోజంతా నా చుట్టే తిరిగింది. ఆయన నన్నసలు గుర్తు పట్టే స్థితిలోనే లేడని చెప్పబుద్ధి కాలేదు నాకు. “బాగున్నాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు” అని చెప్పాను. మొహం విప్పార్చుకుని నవ్వుకుంది. నేను తాతని చూసొచ్చిన కొన్ని వారాలకే తాత చచ్చిపోయాడంట. నాకు, అక్కాయికి పరీక్షల టైమని అమ్మ మాకు తెలియపరచలేదు. తాత పోయిన తర్వాత అమ్మమ్మ ఒక రెండు నెలలు బ్రతికింది అంతే -

మా చదువులు, చదువులయ్యాక ఉద్యోగాలు వెతుక్కోవడాలు, అక్కాయి పెళ్ళి, అక్కాయి పెళ్ళయ్యాక కొన్ని రోజులకే నాన్న గుండె నొప్పితో చనిపోవడం, బావకి అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కాయికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయడం అన్నీ ఒక దాని తరవాత ఒకటి జరిగిపోయాయి.

నాన్న ఉన్నన్నాళ్ళూ అమ్మ నాన్నకి తెలియకుండా రంగూన్ తాత కొడుకింటికి మా పాలేరు చేత ఏవేవో పంపిస్తా ఉండేది.

నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడప్పుడూ అమ్మ మాటల్లో తాతోళ్ళ మనమళ్ళు బాగా చదవుకుంటారనీ, మంచి పిల్లలనీ ఏదో చెప్పిద్ది గాని నేను పెద్దగా పట్టిచ్చుకోలేదు. నా పెళ్ళికి తాత కొడుకు, కూతుళ్ళు వచ్చారు. ఏదో మొక్కుబడిగా పలకరించాను ఆ హడావుడిలో.

నేను కూడా అమెరికాలో ఉద్యోగం చూసుకున్నాను. అమ్మని ఎన్ని సార్లు రమ్మన్నా రాదు. “వద్దులే నాయనా నాకు అక్కడ ఏమి పని? మీరే రండి అందరినీ చూసి పోయినట్లుంటది” అంటది.

కాలచక్రం తన పాటికి అది తిరుగుతా ఉంది. పాత నీరుకి కొత్త నీరు చేరతంది. అక్కాయి, నేను ఇద్దరం అమెరికాలో ఇళ్లూవాకిళ్ళూ ఏర్పరుచుకోని సెటిల్ అయిపోయాము.

లాంగ్ వీకెండ్ వచ్చిందంటే బావనీ, పిల్లలిద్దర్నీ తీసుకోని అక్కాయి నాకాడికి వచ్చిద్ది. లేకపోతే నేనన్నా నా పెళ్ళాన్ని కొడుకునీ తీసుకోని వాళ్ళింటికి పోతా. ఈ సంక్రాంతి పండక్కి అక్కాయోళ్ళు సెలవ బెట్టుకోని మా ఇంటికొచ్చారు. పండగ పూటన అక్కాయి అమ్మకి ఫోన్ చేసినట్లుంది “ఇడుగో శీనుతో మాట్లాడమ్మా!” అంటా ఫోన్ నాకిచ్చింది.

“అబ్బాయ్! బాగున్నావా? కోడలు మనవడు జాగ్రత్త నాయనా. ఇదిగో నారాయణ నీతో ఏందో మాట్లాడతాడంట చూడు” అంటా ఫోన్ నా ఫ్రెండు నారాయణకిచ్చింది. అమ్మ గొంతు దిగులుగా ఉంది. ఏమయిందో అనుకుంటా “అమ్మ ఎలా ఉందిరా?” అన్నా ఆందోళన పడిపోయి.

“మీ అమ్మ బాగానే ఉందిరా! నేనే పనుండి నీతో మాట్లాడదామని….. తీరిగ్గానే ఉన్నావా” అన్నాడు.

“ఆఁ ఏందో చెప్పు” అన్నా.

“ఒరేయ్ శీనా! మీ రంగూన్ తాత మనవడికి ఏదైనా ఉద్యోగం ఇప్పియ్యడానికి కుదిరిద్దా నీకు?” అన్నాడు. “రంగూన్ తాత మనవడా?” అన్నాను. అర్థం కాలా నాకు.

“అదేరా! ఆయన కొడుకు కొడుకు. మీ తాత చచ్చిపోయేనాటికి వాళ్ళకేమీ మిగల్లా. ఆయన కొడుక్కి చదువు రాలా. యెవసాయం చేయడానికి కూడా పొలం లేకుండా మీ రంగూన్ తాత అంతా మీ అమ్మకి కట్నం గా రాసి ఇచ్చేశాడు – నీకు తెలుసుగా! పేటలో చిల్లర కొట్లో గుమస్తాగా పని చేసుకుంటా కొడుకుని ఎమ్ సి ఎ చదివించుకున్నాడు. నువ్వు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ తాత ఋణం తీర్చుకున్నోడివి అవుతావని…. మీ అమ్మ గూడా నీతో చెప్పమంటే మాట్లాడదామని మీ ఇంటికి వచ్చా” అన్నాడు నారాయణ. అమ్మ దిగులు ఏమిటో అర్థమై ఆ దిగులు నన్ను చేరింది.

“ఉద్యోగం సంగతి తర్వాతరా! ఇప్పుడు కొంత డబ్బు పంపుతాను. ఆ అబ్బాయి పేరేమిటి” అని ఆగాను.
“కృష్ణ” అన్నాడు నారాయణ. అరెఁ రంగూన్ తాత పేరు! మనవడికి పెట్టుకున్నారు గామాల.

“ఆఁ కృష్ణ చేత ఇక్కడ ఎం ఎస్ కి అప్లై చేయించు. చదువుకుంటా ఉద్యోగం చేసుకోవచ్చు. యూనివర్సిటీల అడ్రస్ లూ, ఆ యివరాలూ అన్నీ నీకు పంపుతా. చదువయ్యాక ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం దొరికిద్ది – చూద్దాం” అన్నాను.

“సరేరా!” అన్నాడు నారాయణ – వాడి గొంతులో పట్టరాని సంతోషం. ఫోన్ పెట్టేసి అక్కాయి వైపు చూశాను. అక్కాయి మెరిసే కళ్ళతో నాకు దగ్గరగా వచ్చి నా తల పైన చెయ్యేసింది.

చిన్నప్పుడు అమ్మమ్మతో ‘నేను పెద్దయ్యాక నిన్నూ, తాతనీ బాగా చూసుకుంటానమ్మమ్మా” అన్నాను. అందులో సగం అవకాశం ఇప్పుడు కృష్ణ నాకిస్తున్నాడు. మరి అమ్మమ్మ సంగతో!? లేచి బాల్కనీలోకి వెళ్లి తల ఎత్తి చందమామ వైపు చూశాను. అందులో కనిపిస్తున్న అమ్మమ్మని చూసుకుంటా అపురూపంగా….. ఎప్పుడూ …..

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)