నాతో పాటు ఆర్ట్ కాలేజీలో చదువుకున్న నా ఫ్రెండ్ రాం ప్రసాద్ సినిమాల్లో ఆర్టిస్్ట గా చేరి వేగంగా ఆకాశపథంలోకి దూసుకుపోతున్నాడు. నేనేమో మా ఆవిడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో కూర్చుని బొమ్మలు వేసుకుంటుంటాను. అప్పుడప్పుడూ – అప్పుడప్పుడూ కాదులే బాగానే పత్రికల్లో కనపడుతుంటాయి నా బొమ్మలు.
‘రాం ప్రసాద్, ది గ్రేట్ ఆర్టిస్ట్’ అని వాడికున్నంత పేరు నాకు లేదు కాని పర్లేదు నన్ను కూడా ఆంధ్రదేశంలో గొప్ప ఆర్టిస్ట్ అనే వాళ్ళున్నారు.
రాం ప్రసాద్ అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుంటాడు. వాడెంత ఉన్నత స్థితిలో ఉన్నాడో నా దగ్గర చూపించుకోవాలిగా మరి! మా ఆవిడ వాడు చెప్పే సినిమా వాళ్ళ విశేషాలు వింటూ వంట కూడా చేయదు. వాడొచ్చిన రోజు హోటల్ తిండే మాకు గతి.
బొమ్మలు వేయడం లోనే కాదు కథలు చెప్పడంలో కూడా వాడు నేర్పరే. లేకపోతే మెటీరియలిస్ట్ అయిన మా ఆవిడని ఎలా మెప్పించగలడు?
ఒకరోజు వాడొచ్చి మాట్లాడుతుంటే ఎవరో చాలా మంది మా ఇంటి ముందు చేరి “రాం ప్రసాద్! రాం ప్రసాద్! బయటకి రా” అని కేకలు వేసి పిలిచినట్లనిపించింది. నాకు భయమేసింది, రక్షించడానికి ఇంట్లో మా ఆవిడ కూడా లేదు. పాలిపోయిన నా ముఖం చూసి పెద్దగా నవ్వుతూ నా భుజాన ఒకటి చరిచి “దా! తమాషా చూద్దువుగాని, నన్ను ‘ఆ’ కాకులు పిలుస్తున్నాయి” అన్నాడు.
నాకు అర్థం కాలేదు. వాడి వెనకే నక్కుతూ బయటకి వెళ్ళాను. ఆశ్చర్యం! అన్నీ తెల్ల కాకులే – పైగా ఠీవిగా ఉన్నాయి.
వీడిని చూడగానే “రాం ప్రసాద్, నువ్వు తప్పు చేస్తున్నావ్, నీకెంత ధైర్యం? వాళ్ళని – ఆ నీచులని మాలాగా మార్చడానికి?” అన్నాయి.
“బాగుందే మీరనేది, మీరు మాత్రం… మీకు ఎంత చేస్తే ఇలా మారారు? అందరికీ ఉండదా, ముఖ్యంగా నాకుండదా బలవాలని? చెప్పొచ్చారు నీతులు పాండి” అన్నాడు విసుగ్గా.
“ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, బుద్ధి ఉందా? అసలు వాటికీ మాకు తేడా తెలియనంతగా బలవాలని ఉందా? దీన్ని బలం ఎక్కడం అనరు కొవ్వు అంటారు – దించుతాం ఎప్పుడో” అంటూ కోపంగా ఎగిరిపోయాయి.
“ఏంటిరా ఇది?” అన్నాను.
“ఎంత దర్పమో చూడు, మళ్ళీ అవి నా దగ్గరికే రాకపోతే నన్నడుగు. పద పార్టీ చేసుకుందాం, ఇంకాసేపటికి నాకు గొప్ప అదృష్టం పట్టబోతోంది” అన్నాడు.
వామ్మో, వీడికేమైనా పిచ్చెక్కిందా? కొడతామని అవి అంటుంటే అదృష్టం అంటాడేమిటి? నేనేమైనా కల గంటున్నానా? గిచ్చి చూసుకున్నాను. “అబ్బ!” అన్నాను పెద్దగా.
“ఏంటిరా శ్రీ, ఆర్ యు ఆల్ రైట్?” అన్నాడు.
కాకులు మా ఇంటికి రావడం, అవి బెదిరించడం, వీడి మాటలు – నాకు ముక్క అర్థం కాలేదు. ఆ మాటే అన్నాను వాడితో.
“మందబుద్ధులకి ఒక్కసారిగా అర్థం కాదులేరా, చిన్నగా అర్థం అవుతుందిలే గాని” అని “అవునొరేయ్! ముక్క అంటే గుర్తొచ్చింది, చెల్లెమ్మ వచ్చే లోపు నాలుగు ముక్కలు తెచ్చుకుని తిందామా?” అన్నాడు.
“వద్దురా, వాసన పట్టేస్తుంది. తెలిసిందంటే ఇక నిన్ను ఇంట్లోకి రానివ్వదు. నాకు నాలుగు రోజులు పస్తూనూ” అన్నాను.
“నీ భయమే గాని చెల్లెమ్మ మనసు నీకు తెలీదు. సరేలే అక్కడే తినేసి వద్దాం, పద” అని కారు స్టార్ట్ చేశాడు.
జరిగినదంతా పునరాలోచించుకుంటున్నాను ఏమైనా అంతు పడుతుందేమోనని. అస్సలు క్లూ దొరకలేదు. అడిగితే ఇక డైరెక్టుగానే “నువ్వింత బుద్ధి హీనుడవేమిరా?” అంటాడేమోనని గమ్మున కూర్చుని విండోలో గుండా దారిన పోయే వాళ్ళను చూస్తున్నాను.
మా కారు ముందు ఓ షేరింగ్ ఆటో వెళుతుంది. ఆటో వెనుక కూర్చున్న అమ్మాయిలు, రోజు వారీ కూలీల్లా ఉన్నారు ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు. మధ్యలో కూర్చున్న అమ్మాయి బుగ్గన ఉన్న నల్లని పుట్టుమచ్చ ఆమె నవ్వినప్పుడు పెద్దదై మరింత నల్లగా, అందంగా కనిపిస్తోంది. వీడు వదిలితే ప్రశాంతంగా ఆమె బొమ్మ గీసుకోవాలి.
ఉన్నట్లుండి “చూడు, చూడు శ్రీ – వెనక చూడు – ఎలా ఎగురుకుంటూ వస్తున్నాయో చూడు” అని అరిచాడు రాం ప్రసాద్ సైడ్ మిర్రర్ లోంచి చూస్తూ. వెనక్కి తిరిగి సీట్ మీదుగా చూశాను. ఇందాక మా ఇంటికి వచ్చిన తెల్ల కాకులే – మళ్ళీ వస్తున్నాయి. మమ్మల్ని దాటి వచ్చి మా ఎదురుగ్గా క్రిందికి దిగాయి. రాం ప్రసాద్ కారుని సైడుకి తీసి ఆపాడు.
“ఏమిటీ, మీరు కూడా పార్టీ చేసుకోవడానికి వస్తున్నారా? నాకు పార్టీ ఇద్దామని వస్తున్నారా? ఇహిహి” అన్నాడు నవ్వుతూ.
“ఇస్తాంలే, పార్టీలకేం భాగ్యం? దానికి ముందు మమ్మల్ని ఏదో చెయ్. ఛండాలంగా ఆ నీచ జీవులతో మమ్మల్ని కలపకు” అన్నాయవి.
“సరే, మీ బాధ అర్థం అయింది. అయితే ఇప్పుడు నేనేం చేయగలను? వాటికి వేసిన తెల్లరంగుని మార్చలేను. ఒక వేళ మారుస్తానన్నా అవి ఒప్పుకోవు” అన్నాడు.
“ఒక్క నిమిషం” అని అన్నీ మాకు దూరంగా వెళ్ళి కలగాపులగంగా టాట్ టూట్ అని అరుస్తూ చర్చించుకున్నాయి.
రాం ప్రసాద్ దగ్గరకి వచ్చి “మేము వాటి నుండి వేరని తెలియచేయడానికి నీకు ఒకే మార్గం ఉంది” అన్నాయవి.
“ఏంటది?”
“మాకు కిరీటాలు వేయించు”
“చాలా ఖర్చవుతుంది” అన్నాడు రాం ప్రసాద్ గుసగుసగా.
“ఏం ఫరవాలేదు, ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు, వాటి నుండి మేము వేరుగా ఉండాలి అంతే. బంగారం తెచ్చి పోస్తాం, కిరీటాలు వేసేసెయ్, నీకేం కావాలో తీసుకో” అన్నాయవి. వాటి గొంతునిండా దర్పం, గర్వం.
రాం ప్రసాద్ కళ్ళు వెలిగిపోతుండగా నా వైపు తిరిగి “చూడు శ్రీ, పొరపాటునైనా బ్రతిమాలుతున్నట్లు మాట్లాడతాయేమో ఇవి!? ‘మాకున్నది నీకిస్తాం కొనబడు, మాకు కావలసింది నువ్వు చెయ్’ అంటాయే గాని. సర్లే దీనికి ఫలితం లాక్కోవచ్చులే కానీ, నీ బ్రష్ అందుకో త్వరగా పని అవుతుంది” అన్నాడు.
“కూర్చోండి వరసగా మరి, కిరీటాలు వేసేస్తాం” అన్నాడు వాటి వైపుకి తిరిగి.
“ఛీ! రోడ్డు ప్రక్క కూర్చోవడానికి మనకేం ఖర్మయ్యా? రోడ్ల మీద కూర్చుని అరిచే అలవాటు వాటికీ ఉంది – మాకు కాదు. వాళ్ళతో చేరి నువ్వు కూడా ఎవరు, ఏమిటి అనే సంగతి మర్చిపోతున్నావు, పదండి మా ప్రదేశానికి పోదాం” అంటూ ఎగిరాయవి.
రాం ప్రసాద్ తిండి సంగతి కూడా మర్చిపోయి వాటి వెనకే కారుని నడిపాడు.
నాకంతా అయోమయంగా ఉంది. నీచ జీవులని ఎవరిని అంటున్నాయో, ఎవరి నుంచి ఇవి మార్పుగా ఉండాలని కోరుకుంటున్నాయో నాకు అర్థం కావడం లేదు.
అవి ఉండే ప్రదేశం చాలా పచ్చగా, డాబుగా ఉంది. ఇద్దరం మా కుంచెలతో వాటికి కిరీటాలు తగిలించాము. ఆ పని చేసినందుకు నాకు ఒక సూట్ కేస్ అందించాడు రాం ప్రసాద్. అది చూసిన మా ఆవిడ ఆనందానికి అంతులేదు. ఆమె కూడా వెళ్ళి ఒక కిరీటం కొనుక్కొచ్చుకుంది. అది పెట్టుకున్నా తెల్లగా లేనంటూ నాలుగు రోజుల నుండి బ్యాంక్ కి సెలవు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతోంది.
నాలుగు రోజులయ్యాక పొద్దున్నే మా ఇంటికి తెల్లని కాకుల గుంపు వచ్చింది. అరె, పెట్టిన కిరీటాలు ఏమైనాయబ్బా అనుకుంటుండగా “రాం ప్రసాద్ మీ ఇంట్లో ఉన్నాడా?” అని అరిచాయి. వీటి గొంతు వేరుగా ఉంది.
“వాటికి కిరీటాలు తగిలించినందుకు ఎంత కాజేశాడో తెలుసుకుందామని వచ్చాం” అన్నాయవి.
ఇవేనా కిరీటం పెట్టించుకున్న గుంపు అంటున్న నీచ జీవులు!!? వాటి లాగానే ఉన్నాయే ఏంటి తేడా కిరీటం తప్ప అనుకుంటుండగా… “వాటికెంత పొగరు, రాం ప్రసాద్ ని కొనేసి కిరీటాలు పెట్టుకుని అందలాలు ఎక్కుతాయా? మాకేనా కిరీటం ధరించడానికి చేతగానిది….” ఏమిటేమిటో మాట్లాడసాగాయవి.
ఈలోపు బ్యూటీ పార్లర్ నుంచి మా ఆవిడ వచ్చింది. ఆమెని చూసిన ఆ కాకులన్నీ మా ఇంటి ఎదురుగ్గా ఉన్న చింత చెట్టు క్రింద కూర్చుని మంతనాలు జరుపుతున్నాయి. నేను వినాలని చెవి అటే వేసి ఉంచాను.
మా ఆవిడ విననిస్తేగా “ఏమండీ, మీరు ఇటు రండి” అని లోపలనుంచి కేకలేసి పిలుస్తోంది. ఆమె గొంతులో ఏదో జరిగిందనే ఆదుర్దాని గమనించి లోపలకి వెళ్ళాను.
“రాం ప్రసాద్ సింగపూర్ లో సెటిల్ అయ్యాడటండీ” అంది.
నేను ఆశ్చర్యం, భయం కలగలిసిన గొంతుతో “ఆఁ, అవునా?” అన్నాను.
“అబ్బ! అదృష్టమంటే అది…” ఇంకా ఏదేదో అంటోంది మా ఆవిడ.
చర్చ ముగించినట్లుంది కాకులు మా వరండాలోకి వచ్చి “శ్రీ గారూ, శ్రీ గారూ!” అని పిలుస్తున్నాయి.
గుమ్మంలో నుండి బయటకి అడుగు కూడా పెట్టకుండా లోపల నుండే బయట ఉన్న వాటిని చూస్తూ “ఏమిటీ?” అన్నాను.
రాం ప్రసాద్ చేత మేం కూడ కిరీటాలు పెట్టించుకుందామని వెతుకుతుంటే మనిషి కనపడటం లేదు. మీ ఆవిడ కిరీటం చూడగానే మీ చేతే కిరీటాలు పెట్టించుకుందామనిపించింది. మీ ఆవిడకి మీరే పెట్టినట్లుందిగా, మాకు కూడా అలాగే పెట్టండి. మీ రుణం ఉంచుకోం” అన్నాయవి.
నాకు కూడా సింగపూర్ పోవాలని ఆశ కలిగింది.
నా కుంచె వైపు చూశాను. అది దానంతటదే గాలిలోకి లేచి కాన్వాస్ వైపుకి కదలి వెళ్ళి గబగబా ఓ దృశ్యం గీసింది.
కిరీటం లేని కాకులకి కిరీటం తగిలించగానే కిరీటం ఉన్న కాకులు అరుస్తూ వస్తున్నాయి. అవి శాలువాలు కప్పించమంటున్నాయి. వాటికి శాలువాలు కప్పగానే ఇవి మాకూ కప్పమంటున్నాయి. వీటికి కప్పగానే అవొచ్చి మాకు తోకలు తగిలించమంటున్నాయి. ఇవి వస్తున్నాయి, అవి పోతున్నాయి. అవి వస్తున్నాయి, ఇవి పోతున్నాయి. ఇవీ, అవీ. అవీ, ఇవీ. ఇవీ, అవీ. అవీ, ఇవీ..
నేను, మా ఆవిడ బంగారంలో మునిగిపోతున్నాము. ఊపిరి ఆడటం లేదు. దాహం వేస్తోంది. నాలుక పిడచకట్టుకు పోతోంది..
నేను అరుస్తున్నాను – “అమ్మో! నాకు చేతకాదండీ, నా కుంచె విరిగిపోయింది, దాహం! దాహం! మంచి నీళ్ళు….”
**** (*) ****
కిరీటం పెట్టించుకోవటం భలే ఉంది ఆర్టికల్!
Thank you రామకృష్ణ గారు.
Too గుడ్.. రాధా గారు…
హాయ్ లలితా, Thank you
కిరీటాలూ, శాలువాలూ, తోకలూ, బంగారం…! వావ్!
Thank you
ఆబ్స్ట్రాక్ట్ లో వుంది రాధ, భావం.
విడమరచి చెపితే ఇంకా బావుంటుందేమో!
గల్పిక కదా మరి దమయంతిగారూ!!?
సర్రియలజం లో ఎంత బాగా రాయగలిగారు ! వండర్ఫుల్