సూర్యుడి ఆగమనాన్ని ప్రకటించి కీర్తించిన దూతలూ వైతాళికులూ చీకట్ల నీడలని వెతికి తరిమికొట్టారు. అప్పుడిక దినరాజు తన సముద్రశయ్యమీంచి లేచి వచ్చాడు , భూమిని తన వైభవోపేతమైన వెచ్చదనం తో వెలిగించాడు. అలల మీద ఊగుతున్న పడవ లో కూర్చున్న నేను నీటి సవ్వడిని వింటూ మేము చేరవస్తూన్న కొండ కొమ్ము ని తిలకించాను. వెనకనుంచి భగ్గుమంటున్న వెలుతురు లో దాని ఆకారం స్పష్టంగా తెలిసింది. ఇంచుమించు నూట యాభై అడుగుల చుట్టుకొలత తో, ఎనభై అడుగుల ఎత్తున ఉంది. ఆఫ్రికన్ జాతి మనిషి ముఖం లాగా ఉన్నమాట నిజమే - ఆ కవళిక లో భావం క్రూరంగా , ఒళ్ళు జలదరించేలాగా అనిపించింది. పైన పెరిగిన పొదలు తల మీది జుట్టులాగా ఉన్నాయి – మొత్తం మీద అది ప్రాకృతికమైనదిగా కాక పనిగట్టుకుని మలచిన శిలాకృతి లాగా ఉంది…బహుశా ఏ ఆదిమవాసులో సముద్రం మీంచి వచ్చే శత్రువులని బెదరగొట్టేందుకు దాన్ని చెక్కి ఉంచారేమో ! ఆ మాట నిజమో కాదో తెలుసుకునే అవకాశం మాకు ఆ తర్వాత కూడా దొరకలేదు. కాని రెండు వేల ఏళ్ళనాడు లియో పూర్వీకురాలు అమెనార్టస్ తన భర్త కాలిక్రేటస్ తో కలిసి వీక్షించినది ఇదే – ఇప్పుడు మేము చూస్తున్నాము – మేము కాలగర్భం లో కలిసిపోయిన ఎన్నోశతాబ్దాల తర్వాతా ఇది ఇలాగే ఉంటుంది …
వీలైనంతగా ఎండపొడ పడేలాగా పడవ కి ఒక అంచున కూర్చుని ఉన్నాడు జాబ్ – అసౌకర్యంగా , భయం భయంగా. అతనికి ఆ రాక్షసి శిలని చూపించి అడిగాను – ” దాన్ని చూస్తే నీకేమనిపిస్తోంది ?”
దాని వైపు తేరిపారజూస్తూ జాబ్ అన్నాడు – ” ఓరి భగవంతుడా ! ఆయనెవరో తన బొమ్మ గీయించుకుందుకు కూర్చున్నట్లుంది కదండీ అక్కడ”
నాకు బాగా నవ్వొచ్చింది..నా నవ్వు కి లియో కి మెలకువ వచ్చింది . అతను అన్నాడు ” అంకుల్ హొరేస్ ..నాకేమైంది ? మన నౌక ఏదీ ?? ఒళ్ళంతా ఇలా బిగిసిపోయినట్లుందేం ? కొంచెం బ్రాందీ ఉంటే ఇవ్వు”
” పూర్తిగా బిగిసిపోనందుకు సంతోషించు ” చెప్పాను నేను – ” మన నౌక మునిగిపోయింది , మనం నలుగురం తప్ప అంతా పోయారు…నువ్వు బతకటమైతే ఒక అద్భుతమే ! ” . ఈ లోపు జాబ్ పడవంతా గాలించి బ్రాందీ తెచ్చి ఇచ్చాడు. నేను మాకు జరిగినదాన్నంతా చెప్పుకొచ్చాను.
” అవునా !!!! మనం మాత్రమే బతికి ఉన్నామా …ఎందుకో కదా ! ” లియో దిగ్భ్రాంతి.
అందరం కొద్ది కొద్ది గా బ్రాందీ సేవించాము , శరీరాల్లోకి వేడి వచ్చింది. కాస్త ఎండ కూడా కాస్తోందేమో , తెప్పరిల్లాం ..అయిదు గంటలకి పైగా నీళ్ళలో నాని ఉన్నాం కదా మరి !
” అరె ! ఆ అమెనార్టస్ చెప్పిన ‘ మనిషి తల కొండ ‘ అదేలా ఉందే ? ” అప్పుడే దాని మీద దృష్టి పడిన లియో అన్నాడు.
” అవును , అదే ”
” అయితే అదంతా నిజమేనన్నమాట ! ”
” అలా ఎలా చెప్పగలం ? మీ నాన్న చూసి ఉన్న కొండ ఇదే , ఆ మట్టి పలక మీది రాత లో చెప్పి ఉన్నదీ ఇదే కావచ్చు – అయినంత మాత్రాన ఏమిటి ? ”
లియో అదొకలాగా నవ్వాడు – ” అపనమ్మకపు యూదుడి లాగా మాట్లాడకు అంకుల్ హొరేస్ ! ‘ జీవించియున్నవారు దర్శించగలరు గాక ‘ ” [Those who live will see (Bible) ]
” ఆ. అక్షరాలా అంతే . ఈ ఇసక మేట మీదినుంచి నదీముఖం వైపుకి వెళుతున్నాం … జీవించి ఉన్న మనం చేరగల తీరమేదైనా ఉంటే దాన్ని దర్శించుదాం , తెడ్డు గట్టిగా పట్టుకో జాబ్ !”
నది సముద్రం లో కలుస్తున్నప్పుడు రేగుతున్న నురగ అంత ఎత్తున లేచి తీరాన్నంతా కప్పేసింది . అందువల్ల స్పష్టంగా కనిపించకపోయినా , నదీ ముఖం అంత వెడల్పైనది గా అనిపించటం లేదు. దాదాపు అన్ని తూర్పు ఆఫ్రికన్ నదులకి లాగే ఈ నదీముఖం లోనూ అడ్డుకట్ట వంటిది ఉంది. సముద్రం ఆటు లో ఉండి , గాలివాటు నీటి వైపుకి ఉన్నప్పుడు ఆ అడ్డుకట్టని దాటటం ఇంచుమించు అసాధ్యం. మా అదృష్టం కొద్దీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందువల్ల ఇరవై నిమిషాల్లో దాన్ని దాటేయగలిగాము. అప్పటికి సూర్యుడు బాగా పైకి వచ్చి నెత్తి మాడుస్తున్నాడు. ఒడ్డు అంతా చిత్తడి మయం…ఆ బురదలో మొద్దుల్లాగా కదలకుండా పడుకున్న మొసళ్ళు. ఒక మైలు దూరాన గట్టి నేల ఉన్నట్లు కనిపించి , ఆ వైపుకి పడవ నడిపాము. ఆ ఒడ్డున ఒక పెద్ద వృక్షం – మగ్నోలియా జాతిది కావచ్చు - విప్పారిన ఆకులతో, నీటి మీదికి వాలే గులాబి రంగు పువ్వులతో ఉంది – పావుగంట లో ఆ నేల మీద అడుగు పెట్టాం. స్నానాలు చేసి తడిబట్టలనీ పడవలో తడిసిపోయి ఉన్న సామానునీ ఎండలో ఆరబెట్టుకున్నాం. పడవలోకి సరిపడా తిండి పదార్ధాలు చేర్చుకుని ఉన్నాం కనుక తృప్తిగా తిన్నాం. మా ఒళ్ళు నొప్పులూ బడలికా అప్పటికి బాగా సర్దుకున్నాయి…బట్టలూ ఆరాయి , వేసుకుని తయారైపోయాం.
అప్పుడు చుట్టుపక్కలంతా పరికించి చూశాం. మేము ఉన్న భూభాగం అయిదువందల అడుగుల మేరన పొడిగా ఉంది – వెడల్పు రెండు వందల అడుగులుంటుంది. దానికి ఒక వైపున నది – మూడు వైపులా అంతు కనిపించని చిత్తడి నేలలు. వీటి నుంచి మేమున్న చోటు ఇరవై అయిదు అడుగుల ఎత్తున ఉంది – ప్రకృతి సిద్ధమైనది గా కాక మానవులు ఏర్పరచుకున్నట్లుగా తోచింది.
” ఇదేమైనా రేవు అయి ఉంటుంది ” లియో అన్నాడు.
” ఊహూ. ఈ బురద నేల మధ్యన నిర్మానుష్యమైన చోట రేవు ఎందుకు నిర్మిస్తారు ? ఒక వేళ దగ్గర్లో మనుషులు ఉన్నారనుకున్నా వాళ్ళు ఆటవికులు , అనాగరికులు ” – నేను ఖండించాను.
” ఇది ఒకప్పుడు బురద నేల కాదేమో…ఇక్కడి వారు నాగరికులేనేమో – ఇదిగో చూడు ” – రాత్రి తుఫానుకి నది అంచున ఉన్న చాలా చెట్లు పెకలించుకుపోయాయి , వాటిలో ఒక పెద్ద మగ్నోలియా ని చూపించాడు లియో - ” చెట్టు అడుగున ఉన్నది బురద నేలగా కాక రాతి చెక్కడపు అవశేషం లాగా అనిపిస్తోంది”
” అలా ఎలా ఉంటుంది లియో – నీ పిచ్చి గాని ” – ఇద్దరం ఆ బ్రహ్మాండమైన వేళ్ళ మధ్యకి దిగాము.
” ఇదిగో ” – లియో అన్నాడు. ఈసారి నేను ఏమీ అనలేదు . అక్కడ- చెట్టు పడిపోయిన చోట చాలా లోతున పెద్ద గొయ్యిలాగా ఉంది. అందులో , నిజంగానే – పెద్ద పెద్ద బండరాళ్ళు పేర్చి గోడ కట్టినట్లు కనిపిస్తోంది. మధ్యలోంచి పైకి పొడుచుకు వస్తూ పెద్ద రాతి చక్రం ఒకటి..ఒక అడుగు వ్యాసం ఉంటుంది దానికి , మూడు అంగుళాల మందం. నేను విస్తుపోయాను.
” అవునా ? ఓడలు ఆగే చోటు లాగా ఉందా ? ” – లియో అడిగాడు.
కాదనేందుకు నాకు నోరు రాలేదు. అవునేమో కదా – ఇది రేవు అయిఉండ చ్చు…ఇక్కడి నగరపు శిథిలాలు బహుశా దీని కింద మునిగిపోయి ఉండచ్చు…
” ఆ కథలో నిజం ఉన్నట్లే ఉందిగా ” లియో హుషారుగా అన్నాడు.
నేను సూటిగా జవబివ్వలేదు. ” ఆఫ్రికా లాంటి ప్రదేశం లో ఏ కాలం నాటివో ఎన్నైనా నాగరికతలు భూస్థాపితమైఉండచ్చు. ఈజిప్ట్ నాగరికత ఎంత ప్రాచీనమైనదో చెప్పటం కష్టం ..అది ఇక్కడివరకూ వ్యాపించి ఉండచ్చు. బాబిలోనియన్ లు, ఫొనీషియన్ లు , పర్షియన్ లు ..వీళ్ళంతా ఎంతో కొంత నాగరికులే – వీళ్ళు కాక యూదులు ఉండనే ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఇక్కడ జనావాసాలో వ్యాపార కేంద్రాలో ఏర్పరచుకున్నారేమో ! భూమిలో కప్పబడిపోయిన పర్షియన్ నగరాలు కిల్వా [ ఆఫ్రికా తూర్పు తీరం లో , జాంజిబార్ కి నాలుగు వందల మైళ్ళు దక్షిణంగా ఉంది. అక్కడి పురాశోధన లో మూడు పొరల్లో ప్రాచీన కట్టడాలు కనిపించాయి. మొదటి పొర ఏడు శతాబ్దాల కిందటి పర్షియన్ నగరాల కి చెందినది. రెండో పొర ఇంకొంత పాతది. మూడో ది ఎప్పటిదో అంచనా దొరకలేదు ] తవ్వకాలలో బయట పడ్డాయి కదా ? ”
” అవును ” – లియో అన్నాడు – ” ఇదివరకు నువ్వు ఒప్పుకోలేదు మరి ”
” సరేలే. ఏం చేద్దామని ఇప్పుడు ? ” – మాట మార్చాను నేను. లియో కి మాత్రం ఏం తెలుసు ??
దగ్గర్లో ఉన్న చిత్తడి నేల అంచుకి వెళ్ళి చూశాము. దానికి అంతు ఎక్కడుందో కనిపించటమే లేదు. దాని పైనుంచి నీటి పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరి ఆకాశం నిండా పరచుకుంటున్నాయి. ఎండ ఎక్కువవుతూ ఉంది – చిత్తడి లోంచి , అక్కడక్కడా నిలిచిపోయిన నీటి మడుగుల్లోంచి , వస్తూన్న విషవాయువులు పైకి లేచి మురికి పట్టిన మబ్బుల్లాగా కనిపిస్తున్నాయి.
” రెండే విషయాలు అర్థమవుతున్నాయి నాకు ” – భయానకనిశ్శబ్దం లో మునిగిఉన్న ఆ ప్రకృతిని నాతోబాటు చూస్తున్న సహచరులతో అన్నాను , ” ఒకటి- మనం దీన్ని దాటి వెళ్ళలేం , రెండు- ఇక్కడ ఆగామా, విష జ్వరం వచ్చి చచ్చిపోతాం ”
” అవునండి , తెలుస్తూనే ఉంది ” – జాబ్ అన్నాడు . ” మనకి రెండు దార్లున్నాయనిపిస్తోంది నాకు. ఒకటి – వెనక్కి సముద్రం లోకి పడి వెళ్ళి ఇంకో రేవుని వెతుక్కోవటం ..అది చాలా ప్రమాదం. రెండోది – నది మీదినుంచి లోపలికి వెళ్ళి ఏమవుతుందో చూడటం ”
” మీసంగతేమో గాని, నేను మాత్రం నది దాటే వెళ్ళబోతున్నాను ” – లియో నిశ్చయంగా అన్నాడు .
జాబ్ కళ్ళు తేలేసి ఒక్క మూలుగు మూలిగాడు. మహమ్మద్ ” యా..అల్లా ” అని భయంగా గొణుక్కున్నాడు. ముందు నుయ్యీ వెనక గొయ్యీ గా ఉన్న ఆ రెండిట్లో దేన్ని ఎంచుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదని నేను ప్రకటించాను .[ కాని నా లోపలి అభిప్రాయం వేరు - ఆ మనిషి తల కొండా ఈ ప్రాచీనమైన రాతి గోడా నాకు విపరీతమైన కుతూహలాన్ని కలిగిస్తున్నాయి , ఖచ్చితంగా లోపలికి వెళ్ళి వాటి సంగతి తెలుసుకోవాలని ఉంది. ] సరే, పడవ తెరచాపని బిగించుకుని తుపాకులు సరిచూసుకుని బయల్దేరాం మళ్ళీ. అదృష్టవశాత్తూ గాలి సముద్రం లోంచి నేల మీదికి వీస్తోంది – మాకు అనుకూలంగా. మధ్యాహ్నం వరకూ గాలివాటం ఇలాగే ఉంటుందనీ , ఆపైన కొద్దిగంటలపాటు స్థంభించిపోయి, సూర్యాస్తమయం తర్వాత నేలమీంచి సముద్రం లోకి వీస్తుందనీ తర్వాతి రోజుల్లో తెలుసుకోగలిగాను.
మూడు నాలుగు గంటల సేపు ఉల్లాసంగా నది ఎగువకి ప్రయాణించాం. దారిలో , మా పడవకి పది పన్నెండు బారల దూరాన – నదిలోంచి హిప్పోపొటామస్ ల గుంపు లేచింది…భీకరంగా అరుస్తూ. జాబ్ హడలిపోయాడు , నిజానికి నేను కూడా. మేము హిప్పో లని చూడటం అదే మొదటిసారి…మా పట్ల వాటి వీరాసక్తి ని చూస్తే వాటికి కనిపించిన
మొదటి[ తెల్లజాతి ]మనుషులమూ మేమే ననిపించింది…మాకు మరీ దగ్గరగా రాబోయాయి - వాటికి తుపాకులని గురిపెడితే పరిస్థితి మరింత వికటిస్తుంది గనుక ఆ పని చేయద్దని హెచ్చరించాను…త్వరలోనే వాటిని దాటిపోయాము.
నది ఒడ్డు మీద వందలకి వందల మొసళ్ళు పడుకుని ఉన్నాయి. ఆకాశం లో వేలకి వేల సముద్ర పక్షులు. కొన్నిటిని ఆహారం కోసం తుపాకితో కొట్టాం. వాటిలో ఒక అడవిబాతుకి రెండు కళ్ళ మధ్యలోంచి ముప్పావు అంగుళం పొడుగున చిన్న కొమ్ములా ఉంది – అలాంటిదాన్ని ఇదివరకెప్పుడూ చూసింది లేదు[ జాబ్ దాన్ని ' ఒంటికొమ్ము బాతు ' అన్నాడు ]..జంతుశాస్త్రజ్ఞులకి ఈ సంగతేమైనా పనికొస్తుందేమో.
మధ్యాహ్నానికి ఎండ భరించలేనంత వేడిగా అయింది. బురదలోంచి లేచే విషవాయువులు ముక్కులు బద్దలు చేశాయి – ముందు జాగ్రత్తగా అందరం తలా ఒక మోతాదు క్వినైన్ మింగాము. కాసేపటికి గాలి పూర్తిగా స్థంభించింది. ఆ వేడిలో పడవని ప్రవాహానికి ఎదురు నడపటం అసాధ్యమనిపించి నదిమధ్యన లంక పైన , విల్లో వృక్షాల గుంపు కింద తలదాచుకున్నాము…ఆ కాస్త చల్లదనానికే ప్రాణాలు లేచి వచ్చాయి. పొద్దువాలేదాకా అక్కడ సేదదీరాము. అనువుగా అనిపించినవైపుకి తిరిగి బయల్దేరేలోపు లియోకి పెద్ద నీటికొంగ కనిపించింది. ఉత్సాహంగా దానికి తుపాకి గురిపెట్టాడు.
ఆ సంధ్యాకాశపు నేపథ్యం లో , చిన్న గుట్ట మీద అతను నిటారుగా నిలుచున్న దృశ్యం నా జ్ఞాపకం లో ముద్రించుకుపోయింది. ఎక్కడా పిలిస్తే పలికే దిక్కు లేదు , రెండువైపులా చూపు ఆనినంత మేరా మృత్యునిలయాలైన బురద నేలలు… ఎర్రటి అస్తమయ కిరణాల్లో తళతళలాడుతున్న నల్లటి నీటి చెలమలు అక్కడక్కడా … వెనకా ముందూ బద్ధకంగా కదులుతున్న నది , దానికి ఒక చివరన రెల్లు పొదలు చుట్టిన చెరువు. మెల్లగా వీస్తున్న గాలి కి దాని మీద రేగుతున్న నీడలు సంజ వెలుగు తో ఆడుతున్నాయి. పడమటి దిక్కున – దిగంతం వెనక్కి, బ్రహ్మాండమైన నారింజపండు లాగా సూర్యుడు దిగిపోతున్నాడు. ఆవిర్లు తేలుతూన్న దిజ్మండలం మీద కొంగలూ అడవి పక్షులూ , బంగారు - రక్త వర్ణాలలో గీసిన సరళ రేఖల్లాగా, త్రికోణాల లాగా, చతురస్రాల్లాగా. ఈ పరిసరాలలో ఒదగని ఆధునిక మానవులం మేము ఇక్కడ, మా అత్యధునాతనమైన ఇంగ్లీష్ పడవ లో.
చాలా చురుగ్గా కదిలినా , లియో గురి రెండు సార్లు తప్పింది . అప్పుడు నేను పూనుకున్నాను, కొంగ దొరికింది. దాన్ని తీసుకుని వీలైనంతగా శుభ్రం చేసేప్పటికి వెలుతురు దాదాపు పూర్తిగా పోయింది. ఇక ప్రయాణం సాగదనిపించి ఒక చోట పడవ కి లంగరు వేసుకున్నాము . ఆ చీకట్లో , దిగి నేల మీదికి వెళ్ళే దుస్సాహసం చెయ్యలేక- ఒక లాంతరు వెలిగించుకుని డబ్బాల్లోంచి ఆహారం తీసి భోజనాలు ముగించి పడవలోనే నిద్రపోయేందుకు సిద్ధపడ్డాము. మేము సిద్ధంగా ఉన్నామేగాని నిద్ర రావటం అసాధ్యమైపోయింది. దీపం వెలుగుకో, మనుషుల వాసనకో మరి – ఇంతింత లావున , వేలకి వేల దోమలు రక్తదాహం తో మమ్మల్ని చుట్టుముట్టాయి. పెద్ద పెద్ద మబ్బుల్లాగా మా మీద వాలి పొడుచుకు తిన్నాయి…అటువంటివి ఉంటాయని వినను కూడా లేదు. పొగాకు ముట్టించుదాం, పారిపోతాయని జాబ్ సలహా చెప్పాడు…ఆ పొగలో అవి ఇనుమడించిన శక్తితో విహారం చేశాయి.మాకు ఇంచుమించు పిచ్చులు ఎక్కాయి…గట్టిగా కంబళ్ళు ముసుగు పెట్టుకుని, వాటి కిందని ఉడికిపోతూ, గోక్కుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ … కాసేపటికి ఆ నిశ్శబ్దం లోంచి ఉరుము లాంటి శబ్దం..సిం హం గర్జిస్తోందెక్కడో. దానికి బదులు చెబుతూ , మాకు అరవై అడుగుల దూరన ఒడ్డు మీది పొదల మధ్య నడుస్తూ ఇంకో సిం హం. ….
” మనం దిగకపోవటం మంచిదైనట్లుంది , ఏమంటావు అనుకుల్ హొరేస్ ? ” కంబళిలోంచి తల బయటపెట్టి , ” ఛీ. దరిద్రం..నా ముక్కుమీద కుట్టింది దిక్కుమాలిన దోమ ” – మళ్ళీ ముసుగు పెట్టేశాడు లియో.
ఇంకాసేపటికి చంద్రోదయమైంది. చెవులు గింగిర్లెత్తిస్తున్న ఆ గర్జనల మధ్యన మాకెలా భద్రం గా అనిపించిందోగాని , మెల్లిగా నిద్రకి పడ్డాం.
మధ్యరాత్రిలో నాకు మెలకువొచ్చింది – బహుశా కంబళి మీదినుంచీ కూడా దోమలు పీకాయేమో , తల ఎత్తాను. సరిగ్గా అప్పుడే జాబ్ గుస గుసగా అంటున్నాడు ” ఓరి నాయనో..చూడండి ….”
అందరం చూశాము. నీటి మీద పెద్దవవుతూ చప్పుళ్ళు చేస్తూ కదులుతూన్న చక్రాలు రెండు..వాటి మధ్యన మాకు దగ్గరవుతూ రెండు ఆకారాలు.
” ఏమిటవి ? ”
” సిం హాలయ్యా…ఇంకేమిటి…మనల్ని తినేసేందుకే వస్తున్నాయ్ ”..జాబ్ గజ గజ.
నిజమే, చీకట్లోంచి వాటి కళ్ళు మెరుస్తూ మావైపే వస్తున్నాయి. పడవలో ఉన్న కొంగ కళేబరం వాసన పసిగట్టినట్లున్నాయి.
లియో తుపాకి గురిపెట్టాడు. ఇంకాస్త దగ్గరికి వచ్చేవరకూ ఆగమన్నాను. మాకు పదిహేను అడుగుల దూరం లోకి వచ్చి మొదటి సిం హం నోరు తెరిచి గర్జించింది..లియో వదిలిన తుపాకిగుండు దాని నోట్లోంచి దూసుకుపోయి , కూలిపోయింది. వెనకాల ఉన్న ఇంకోటి మామీదికి లంఘించబోయింది. సరిగ్గా అప్పుడే నీళ్ళ లో పెద్ద కలకలం…చేపలు పట్టుకు తినే నీటి పాము వంటిదేదో , పాముకి వెయ్యి రెట్ల పరిమాణం లో భయంకరంగా సిం హాన్ని పట్టేసుకుంది. సిం హం భీబత్సం గా గర్జించి వెనక్కి ఒడ్డు మీదికి దూకింది , నల్లగా ఉన్న దాన్ని దేన్నో తన తోబాటు ఈడ్చుకు వెళ్ళింది.
” అల్లా…” అరిచాడు మహమ్మద్ – ” మొసలి పట్టుకుంది దాని కాలిని ”
అవును. పొడుగాటి మూతీ వరసలకి వరసలు ఈటెల్లాంటి పళ్ళు , ఆ కిందన పొలుసులు పొలుసుల శరీరం.
ఆ తర్వాత జరిగినదాన్ని వివరించేందుకు మాటలు సరిపోవు. సిం హం వెనక కాలుని ఒడిసిపట్టుకున్న మొసలి సగం నేల మీదా , సగం నీటిలోనూ ఉంది. సిం హం దాని తల మీద దాడి చేసింది , మొసలి సిం హం పొట్టని పళ్ళతో కరిచి పట్టుకుంది. భయంకరమైన పోరాటం అనంతరం రెండూ చచ్చిపోయాయి.
ఆ తర్వాత , దోమలు ఉండనిచ్చినంత ప్రశాంతంగా నిద్రపోగలిగాము ..వంతులవారీగా కాపలా కాస్తూ.
ఎలాగో తెల్లారింది ఆఖరికి. గబగబా తయారయాము.. ప్రయాణం కొనసాగించాలిగదా ! వెలుతురు రాగానే ఒకరి మొహాలు ఒకరికి కనిపిం చాయి …ఆపుకోలేనంతగా నవ్వుకున్నాము. పుష్టిగా ప్రసన్నంగా ఉండే జాబ్ మొహం..పాపం , దోమ కాట్లకి రెండింతలు ఉబ్బిపోయింది. లియో పరిస్థితీ ఇంచుమించు అంతే. నా చర్మం కొంత నల్లటిది కావటానా , గడ్డాన్ని గుబురుగా పెరగనిచ్చి ఉన్నందునా నా మొహం అంత ఘోరం గా లేదు . వాళ్ళిద్దరూ నున్నగా గడ్డాలు గీసుకుని ఉన్నారు గనుక దోమలకి బాగా ఖాళీగా చోటు దొరికినట్లుంది. మహమ్మద్ ని దోమలు ఎక్కువ కుట్టనే లేదు…మేమూ అరబ్ దేశస్థుల్లాగానే ఉండి ఉంటే ఎంత బాగుండేది !
మా వాచిపోయిన పెదవులతో నవ్వగలిగినంతగా నవ్వుకుని … పొగమంచు లాగా ముసిరిన చిత్తడి వాయువులని ఉదయపు గాలులు చెదరగొడుతూ ఉండగా – తెరచాప ఎత్తి బయల్దేరాము. చనిపోయిన రెండు సిం హాలవీ మొసలిదీ కళేబరాలు మాకు దగ్గర్లోనే ఉన్నాయి. వాటి చర్మాలు మాకు పనికొస్తాయేమోననిపించినా అవసరమైన పనిముట్లేవీ మా దగ్గర లేవు గనక వదిలేశాము. మధ్యాహ్నానికి కాస్త వసతిగా కనిపించే లంక ఇంకొకటి తగిలింది. ఆగి, నిప్పు చేసి , నిన్న పట్టిన కొంగలని కొంతభాగం కాల్చాము . మిగిలిన మాంసాన్ని పొడుగ్గా కత్తిరించి ఆరబెట్టాము , తర్వాత ఉపయోగించేందుకు. మర్నాడు తెల్లవారేవరకూ అక్కడే ఉన్నాము..దోమల బాధ తప్పించి ఇంకే ఆపదలూ ఎదురవలేదు. ఆ తర్వాతి ఒకటి రెండు రోజులు కూడా దాదాపు అలాగే గడిచాయి … ఒక లేడి దొరికింది ఆహారానికి. రంగు రంగుల తామర పువ్వులు కనిపించాయి , చాలా అందంగా ఉన్నాయి – ముఖ్యంగా నీలి రంగువి.
అయిదో రోజుకి , రమా రమి నూట ముప్ఫై అయిదు మైళ్ళు పశ్చిమానికి ప్రయాణించిన తర్వాత – మేము ప్రయాణిస్తూన్న ప్రవాహం లాంటిదే ఇంకొకటి కనిపించింది. రెండూ ఒక చోట కలిసిపోతున్నాయి – అక్కడ ఎప్పట్లాగా మధ్యాహ్నపు విడిది చేశాము. భోజనాలు అయాక నడక సాగిస్తే ఒక దుర్భరమైన సంగతి తెలిసింది. ఇక పైకి వెళ్ళగల మార్గం లేదు , అక్కడినుంచి నీరు వెనక్కి తిరుగుతోంది – ముందుకి వెళ్ళగల లోతు లేదు. గుడ్డిలో మెల్లగా- మేము చూసిన మరొక ప్రవాహం నది కాదనీ పురాతనమైన కాలువ అనీ అర్థమైంది మాకు. తానా , ఓజీ నదులని కలుపుతూ జాంజిబార్ తీరం లో ఇటువంటిదే ఒక కాలువ ఉందట. తానా నది సముద్రం లో కలిసే చోటు ప్రమాద భూయిష్టమైనది గనుక , తానా లోంచి ఓజీ లోకీ అక్కడినుంచీ సముద్రం లోకీ నౌకలు వెళుతుంటాయి.ఇదీ ఎవరో ఏ కాలం లోనో తవ్విన కాలువ లాగే కనిపిస్తోంది. కొన్ని చోట్ల పడిపోయినా , చాలావరకు రెండు గట్లూ సమంగా ఉన్నాయి .
చాలా భాగాన్ని నాచు కప్పేసినా అక్కడక్కడా నీళ్ళలో దారి కనిపిస్తూనే ఉంది. ఈ కాలువ మీద వెళ్ళే ప్రయత్నం చేయటమో , లేదంటే వెనక్కి సముద్రం లోకి వెళ్ళిపోవటమో – మళ్ళీ రెండే దారులు మాకు . ఉన్న చోట ఉండిపోవటం కుదరదు – దోమలు మమ్మల్ని బతకనియ్యవు , ఆ పైన చిత్తడి నేల మీంచి విషపు గాలులు. కాలువ మీదే వెళదామన్నాను…అంతా ఒప్పుకున్నారు.
ఇక మీదట గాలివాటాన్ని నమ్ముకునేందుకు లేదు , అందుకని ఆ సాయంత్రానికే ప్రయాణం మొదలు పెట్టాము. తెడ్లు వేస్తే గాని పడవ కదలదు…ఆ పని పోను పోను మరింత కష్టమైపోయింది, అయినా వేస్తూనే పోయాము. పాపం మహమ్మద్ అందరికన్నా ఎక్కువ శ్రమ పడ్డాడు. చీకటి పడ్డాక ఒక చోట ఆగి కాసేపు దోమ కాట్లని ఆస్వాదించాము , కాని రాత్రి నిద్రపోలేదు , వెళుతూనే ఉన్నాం…రాత్రి చల్లగా ఉంది కనుక. తెల్లారుజామున మటుకు ఒక చోట మూడు గంటలపాటు విశ్రాంతి తీసుకున్నాం , మళ్ళీ బయల్దేరి పదిగంటలవరకూ రెక్కలు విరుచుకున్నాం. అప్పుడు పెద్ద గాలి వాన మమ్మల్ని ముంచెత్తింది , ఆరు గంటలపాటు నీళ్ళ కిందనే ఉన్నామని చెప్పాలి.
ఆ తర్వాత గడిచిన నాలుగు రోజుల గురించీ చెప్పేందుకు ఏమీ లేదు – తీవ్రమైన వేడి, విపరీతమైన శరీర శ్రమ , దిగులు, దోమలు – అంతే. మలేరియా నో విషజ్వరమో మమ్మల్ని మింగెయ్యకుండా క్వినైన్ మోతాదులూ పొట్ట శుభ్రపడేందుకు వేసుకున్నవీ కాపాడాయేమో…- నిరంతరం పని చేస్తూ ఉండటమూ మంచిదైందేమో – తెలియదు. మూడో రోజున దూరంగా ఒక కొండ శిఖరం గుండ్రంగా కనిపించింది , నాలుగో రోజుకి , బహుశా అది ఇరవై అయిదు, ముప్ఫై మైళ్ళ దూరం లో ఉందనిపించింది. ఆ సరికి మాకు ఏమాత్రం శక్తి మిగల్లేదు..ఘోరంగా బొబ్బలెక్కిపోయిన చేతులతో ఇంకొక్క అడుగు కూడా పడవని నడపలేమనిపించింది.. అక్కడే పడి చచ్చిపోవటం మేలనిపించింది. అటువంటి దశ ఇంకే మనిషికీ రాకూడదు – రెప్పలు మూసుకుపోతుండగా పడవలో వాలిపోయి , ఆ దరిద్రగొట్టు ప్రయాణానికి పూనుకున్నందుకు నన్ను నేను శపించుకున్నాను. మెల్లిగా నిద్ర కమ్మేస్తూ ఉండగా మునిగిపోయిన మా నౌకా అందులోని సహప్రయాణీకులూ గుర్తొచ్చారు ..ఇక్కడ మా గతీ అటువంటిదే కాబోతోంది – ఎందుకొచ్చిన అన్వేషణ ఇది ??? కాకమ్మ కథలు నమ్మి రహస్యాలని భేదించబోయే వాళ్ళందరికీ ఈ స్థితే దాపురిస్తుంది….
మేమంతా అక్కడే చచ్చి అస్థిపంజరాలైపోయినట్లూ మహమ్మద్ తన కపాలనేత్రాల్లోంచి నన్ను , అల్లాని నమ్మనందుకు ఉరిమి చూస్తున్నట్లూ కలగన్నాను. ఉలిక్కిపడి లేస్తే నిజంగానే రెండు పెద్ద కళ్ళు - మసక చీకట్లోంచి మిలమిలమంటూ నావైపే చూస్తున్నాయి. గట్టిగా అరిచాను – అయోమయంగా , భయంతో. జాబ్, మహమ్మద్ కూడా లేచి కేకలు పెట్టారు. నా గొంతుకి చల్లగా తగిలిందేదో – అది ఉక్కుతో చేసిన పెద్ద ఈటె..ఆ వెనక ఇంకొన్ని, అటువంటివే – క్రూరంగా ధగధగమంటూ.
” చెప్పండి , ఎవరు మీరు ? ” ఒక గొంతు పలికింది – అది అరబిక్ భాష లాగే ఉంది , ఇంకా వేరేలానూ ఉంది. ” నీళ్ళలో ఈదుకుంటూ ఎందుకొచ్చారు ఇక్కడికి ? చెప్తారా , చస్తారా ? ” ఈటె నా గొంతు ని ఇంకొంచెం నొక్కింది , వెన్ను లోంచి చలి పుట్టింది.
” మేము యాత్రికులం..దారి తప్పి వచ్చాము ” – గొంతు పెగల్చుకుని, వీలైనంత స్పష్టంగా , అరబిక్ లో చెప్పాను. అర్థమైనట్లే ఉంది , నన్ను నిలేసిన మనిషి వెనక్కి తిరిగి , పొడుగ్గా ఉన్న ఇంకొకరితో ” తండ్రీ , చంపెయ్యమంటావా ? ” అని అడిగాడు.
” వీళ్ళ చర్మం ఏ రంగులో ఉంది ? ”
” తెల్లగా ”
” అయితే చంపకు ” – జవాబు వచ్చింది. ” నాలుగు దినాల నాడు రాణి నుంచి కబురొచ్చింది – ‘ తెల్లవాళ్ళు వస్తారు , వస్తే నా దగ్గరికి తెండి, చంపకండి ‘ అని . రాణి మాట తలదాల్చి తీరాలిరా, రానియ్యి వాళ్ళనీ,వాళ్ళు తెచ్చిందాన్నీ ”
” రండి ” సగం నడిపిస్తూ సగం లాక్కుపోతూ పడవలోంచి తీసుకు పోయారు మమ్మల్ని.
ఒడ్డున దాదాపు యాభై మంది గుమిగూడి ఉన్నారు. అందరి చేతుల్లోనూ ఆయుధాలున్నాయి. పొడుగ్గా, బలిష్ఠంగా ఉన్నారు. నడుముకి చుట్టుకున్న పులిచర్మాలు తప్పించి ఒంటిమీద ఇంకే దుస్తులూ లేవు.
” ఏమిటిది, ఏమైంది ? ” లియో కళ్ళు నులుముకుంటూ అడిగాడు. .. అప్పుడే మెలకువొచ్చినట్లుంది.
” మన పని అయిపోయినట్లుంది ” జాబ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ లోపు ఏదో గొడవ..మహమ్మద్ మా మధ్యకి - పడుతూ లేస్తూ అరుస్తూ వచ్చాడు… అతని చుట్టూ నాలుగు ఈటెలని గురిపెట్టారు.
” అల్లా, అల్లా – , రక్షించు, రక్షించు ” – మనుషులెవరూ కాపాడలేరనిపిస్తోంది కాబోలు.
” తండ్రీ, ఇతను నల్లటివాడు- రాణి , నల్లటివాడిగురించి ఏమి పలికింది ? ”
” ఏమీ పలకలేదు. కాని చంపద్దు- ఇలా రా, బాబూ ”
మా ‘ రక్షకుడు ‘ వెళ్ళాడు – పొడుగాటి మనిషి అతని చెవిలో ఏదో చెప్పాడు.
” సరే, సరే ” ఇతను నవ్వాడు – ఆ నవ్వు గుండెలు అవిసిపోయేలాగుంది.
” ముగ్గురు తెల్లవాళ్ళూ ఉన్నారా ? ” – అడిగింది పొడుగాటి ఆకారం.
” ఆ. ఉన్నారు ”
” అయితే వాళ్ళ కోసం సిద్ధం చేసినదాన్ని పట్టుకు రండి . ఆ తేలేదాని లోంచి తెల్లవాళ్ళు తెచ్చుకునేదాన్ని తెచ్చుకోనియ్యండి ”
ఆ మాటలు అన్నాడో లేదో - మనుషులు వాళ్ళ బుజాల మీద మోసుకుంటూ తెచ్చారు – అవి పల్లకీలు…నిజంగా
పల్లకీలే !! ఒక్కోదాన్నీ మోసేందుకు నలుగురూ పక్కన నడుస్తూ ఇద్దరూ. మేము వాటిని అధిరోహించాలని సూచించబడింది.
” బాగుంది ” – లియో అన్నాడు – ”ఇన్నాళ్ళూ మనల్ని మనమే మోసుకోలేకుండా ఉన్నాం కదా , ఎవరో మోసుకుపోతారంటే కాదనేదేముంది… ” – ఎలాంటి విషయం లోనైనా హాస్యం కనిపిస్తుంది ఇతనికి…ఏం చెప్తాం…!
చేసేదేమీ లేదు గనక తక్కినవాళ్ళు ఎక్కాక నేనూ నా పల్లకీ లోకి ఎక్కాను. నార తో నేసిన బట్ట తో తయారైంది అది , శరీరపు కదలికలకి అనువుగా సాగుతోంది - తలకీ మెడకీ ఆనుకునే వీలుతో చాలా సౌకర్యంగా ఉంది. హెచ్చు తగ్గులు లేకుండా ఒకేలాగా పాడుతూ దానికి తగినట్లు లయబద్ధంగా , చరచరా నడిచారు బోయీలు. నేను జరిగినదాన్నీ జరుగుతూ ఉన్నదాన్నీ తలపోస్తూ ఉండిపోయాను. పండితులూ మర్యాదస్తులూ అయిన నా స్నేహితులకి ఇదంతా చెప్పేందుకు నేను ఇప్పటికిప్పుడు కేంబ్రిడ్జ్ లో ప్రత్యక్షమైతే ? ఏమంటారు వాళ్ళు ? అటూ ఇటూ కదలకుండా కాల గమనం లో ఘనీభవించిన శిలాజాల్లాంటివాళ్ళు ..ఇప్పటి వరకూ నేనూ అలాంటివాణ్ణే – నా ప్రపంచం విస్తరిస్తోంది ఈ మధ్యనే కదా ? ఇదంతా చివరికి ఎలా పరిణమిస్తుందా అని ఆలోచిస్తూ , నాకు తెలియకుండానే నిద్ర పోయాను.
ఒక ఏడెనిమిది గంటలు నిద్రపోయి ఉంటానేమో – మా నౌక మునిగిపోయిన తర్వాత అంత విశ్రాంతి ని ఎప్పుడూ
ఎరగను . మెలకువ వచ్చేప్పటికి సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేశాడు. మేము ఇంకా వెళుతూనే ఉన్నాం..గంటకి నాలుగు మైళ్ళ వేగం తో అయిఉండచ్చునని లెక్కకట్టాను. పల్లకీ కి కట్టిన పల్చటి తెరల్లోంచి చూసినప్పుడు – ఆ చిత్తడి నేలలు దాటేశామని అర్థమై ఊపిరి పీల్చుకున్నాను. మేము వెళుతున్న నేల మీదంతా ఒత్తుగా గడ్డి మొలిచి ఉంది బోర్లించిన గిన్నె ఆకారం లో కనిపిస్తున్న ఒక కొండ వైపుకి మా ప్రయాణం సాగుతోంది. కాలువ మీద పడవలో వస్తున్నప్పుడు మాకు కనిపించింది ఈ కొండేనో కాదో నాకు ఆ తర్వాత కూడా తెలియలేదు – ఎందుకంటే ఇక్కడి మనుషులు అటువంటి సమాచారాన్ని అసలు ఇవ్వరు. కొత్తవాళ్ళకి దారులు తెలియకూడదని వాళ్ళ ఉద్దేశం అయిఉండాలి. నా పల్లకీని మోస్తున్న వాళ్ళని పరకాయించి చూశాను. పసుపూ గోధుమ రంగూ కలిసిన చాయలో అతి భారీ కాయాలు – ఏ ఒక్కరూ ఆరు అడుగులకి తక్కువ పొడుగుండరు. తూర్పు ఆఫ్రికాలో నివసించే సోమాలీ తెగ వాళ్ళకీ వీళ్ళకీ పోలికలున్నాయి , కాకపోతే వీళ్ళు జుట్టుని సోమాలీ లాగా ముడి పెట్టుకోకుండా జులపాలుగా బుజాల మీదికి వదిలేస్తారు. కనుముక్కుతీరు చాలా చక్కగా ఉంది, పలువరుసా తీరైనదే. కాని మొహాలు ముడుచుకుపోయిఉండటం వల్ల వాళ్ళ రూపాన్ని మెచ్చుకోలేకపోయాను . వాళ్ళు అసలు నవ్వరు. పాటలు పాడేప్పుడు తప్పించి ఇంచుమించు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు, ఒక్క చిరునవ్వు రేఖ కూడా మొహాల మీదికి రానే రాదు. వీళ్ళు ఏ జాతి వారయి ఉంటారు ? మాట్లాడేది అరబిక్ భాషే గాని దానిలో చాలా అపభ్రంశాలున్నాయి. అరబ్ జాతి వారి కంటే వీళ్ళు ముదురు రంగులో ఉన్నారు . ఎందుకో తెలియని భయం ఆవరించింది వాళ్ళని చూసి…అందుకు నాకే సిగ్గనిపించింది.
అంతలో మరొక పల్లకీ నా పక్కగా వచ్చింది. అందులో , వదులుగా ఉన్న తెల్లటి ముతక బట్టలు ధరించి ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. మేము పడవలో ఉన్నప్పుడు ‘ తండ్రీ ‘ అని పిలవబడినవాడు ఇతనేనని ఊహించాను. అతని ముక్కు కొనదేలి గద్ద ముక్కులాగా వంగి ఉంది. తెల్లటి నిడుపాటి గడ్డం , దాని చివరలు పల్లకీలోంచి వేలాడుతున్నాయి. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి – అతని మొహం లో జ్ఞానం తో బాటు వ్యంగ్యం కూడా ఉట్టి పడుతోంది – విలక్షణమైన కవళిక.
” పరదేశీ , నిద్ర లేచావా ? ” – లోతైన గొంతు.
” అవును తండ్రి గారూ ” – ఇతన్ని మంచి చేసుకోవటం నయమనిపించి ఆ పిలుపు వాడాను.
అతను గడ్డం దువ్వుకుంటూ మందహాసం చేశాడు. ” ఏ దేశమో నీది..మా భాష తెలిసిన చోటే, మర్యాద ఉన్న చోటే…పెరవాడెవ్వడూ కాలుమోపని మా గడ్డమీదికి వచ్చినది దేనికి ..బతుకుమీద విరక్తి పుట్టిందా ? ”
” కొత్త విషయాలు తెలుసుకోవాలని వచ్చాం ” – నేను ధైర్యంగా జవాబు చెప్పాను – ” పాత విషయాలు విసుగుపుట్టించాయి. తెలియనిదాన్ని శోధించేందుకు సముద్రాలు దాటి వచ్చాం . మా జాతి ధైర్యం గలది
తండ్రి గారూ , మా అన్వేషణ లో మేము చావుకి కూడా భయపడం ”
” హూ’ – పెదవి విరిచాడు వృద్ధుడు - ” మొత్తం మీద నిజమే కావచ్చు, కాదనటం తొందరపాటే కావచ్చు , కాని నువ్వు అబద్ధమాడుతున్నావు పరదేశీ, నాకు తెలుసు. ఏమైనా, రాణి మీ కోరికేదో ఎరుగునులే , ఆమె మాటను
తలదాల్చి తీరాలి ”
” ఎవరామె ? ఎందుకలా ప్రతిసారీ ఆమె మాటను తలదాల్చి తీరాలని అంటున్నారు ?”
వృద్ధుడు తన పల్లకీ బోయీలని ఒక చూపు చూశాడు. రక్తం చల్లబడే చిరునవ్వుతో నాతో అన్నాడు – ” తప్పక తెలుసుకుంటావు పరదేశీ, నిన్ను ప్రాణాలతో చూడటం ఆమె ఇచ్ఛ అయితే, అలాగే ”
” ’ ప్రాణాలతో ‘ – నా ? ఏమిటి మీరనేది ? ”
వృద్ధుడు ఏమీ జవాబు చెప్పకుండా ఈసారి గట్టిగా నవ్వాడు .
” తండ్రి గారి జాతి పేరేమిటో తెలుసుకోవచ్చా ? ”
” అమహగ్గర్ ( రాతి నేల మనుషులు ] జాతి మాది ”
” తమరి నామధేయం ? ”
” నా పేరు బిల్లాలీ ”
” మనం ఎందాకా వెళుతున్నామో అడగచ్చా ? ”
” నువే చూస్తావుగా ” – వృద్ధుడి చేసైగ తో బోయీలు గబగబా నడిచి జాబ్ నిద్రిస్తూ ఉన్న పల్లకి వరకూ వెళ్ళి
ఆగారు [ ఒళ్ళెరగని నిద్ర జాబ్ ది - కాలొకటి బయటికి వేలాడుతోంది ] . అతని దగ్గర తెలుసుకోదగిందేమీ ఉన్నట్లు లేదు , ఆ వెంటనే సవారీ కదిలి లియో పల్లకీ వరకూ వెళ్ళింది , అక్కడేమి జరిగిందో నాకు తెలుసుకునే అవకాశం లేదు.
పల్లకీ ఊపుకి మళ్ళీ హాయిగా నిద్రపట్టేసింది…ఎంత పడుకున్నా తీరని అలసట అది. లేచేసరికి ఒక సన్ననిపర్వతపు కనుమ లోంచి వెళుతున్నాము. .. దారికి అటూ ఇటూచక్కటి వృక్షాలూ పూపొదలూ ఏపుగా పెరిగి ఉన్నాయి.
కొంత దూరం పోయాక ఆ సన్నటి కనుమ మలుపు తిరిగింది – నా కళ్ళ ముందరొక అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. అయిదారు మైళ్ళ పర్యంతం రోమన్ నాటకశాల లాగా వ్యాపించిన హరితవర్ణం.. అటూ ఇటూ ఉన్న కొండరాతిగోడలు కనిపించనంత గుబురుగా పెరిగి ఉన్న పొదలు …మధ్యలో మాత్రం అత్యంత సారవంతమైన మైదానం…దివ్యమైన వృక్షాలు , వాటి చుట్టూ పరుగులెత్తుతున్న సెలయేళ్ళు . మేకలూ ఆవులూ మేస్తూ కనిపించాయి.. పశ్చిమ దేశాలలోలాగా గొర్రెల మందలు కాకుండా. మొదట నాకు అది ఏమిటో అర్థమవలేదు..ఆలోచించగా స్ఫురించింది – ఏ నాడో అంతరించిపోయిన అగ్నిపర్వతపు బిలం అయిఉండాలి ఇది, అనంతరకాలం లో అటువంటివి సరస్సులుగా మారుతాయంటారు .ఇక్కడా అలాగే జరిగి ఆ తర్వాత ఆ సరస్సులో నీరు కూడా ఓడ్చుకుపోయి ఉంటుంది .[ తరువాతి రోజుల్లో, ఇంకా వేరే చోట్ల ఇలాంటివి నేను చూశాను ]. మేకలా , ఆవులా మందల మధ్య మనుషులు మసలుతునే ఉన్నారుగాని సమీపం లో పల్లెలవంటివేమీ కనిపించటం లేదు ..మరి వీళ్ళంతా ఎక్కడ నివసిస్తుంటారు ? ఎక్కడో నాకు త్వరలోనే తెలిసింది.
ఇంకో అరమైలు దూరం వెళ్ళాక పల్లకీలన్నీ ఆగాయి. నా ‘ దత్తత తండ్రి ‘ బిల్లాలీ దిగటం చూసి నేనూ దిగాను- నా వెనక లియో, జాబ్. పాపం…మహమ్మద్ కి పల్లకీ ఏర్పాటు చెయ్యలేదని నాకు అప్పుడే అర్థమైంది ..అతను బొత్తిగా నీరసించిపోయి అక్కడే నేల మీద పడుకుండిపోయాడు.
మేము ఆగిన చోట పెద్ద అరుగులాగా ఉంది, దాని వెనక పెద్ద కొండ గుహ. పడవలో తెడ్లూ తెరచాపా కూడా వదలకుండా తెచ్చిన మా సామానంతా ఆ అరుగు మీద పరిచారు. చుట్టూరా మమ్మల్ని మోసి తెచ్చినవారూ మరికొందరూ నిలుచుని ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు- మగవాళ్ళ లాగా పులిచర్మాలు కాకుండా వీళ్ళు ముదురు ఎరుపు రంగు జింక చర్మాలు మెడ నుంచి మోకాళ్ళ వరకూ చుట్టుకున్నారు. ఇంచుమించు అందరూ నల్లటి పెద్ద కళ్ళతో , తీర్చిదిద్దిన కనుముక్కు తీరుతో , ఉంగరాలు తిరిగిన జుట్టుతో – చాలా అందంగా కనిపించారు. వాళ్ళలో కొద్ది మంది నారబట్టలు కట్టుకుని ఉన్నారు , ఆ వస్త్రాలు బిల్లాలీ ధరించినవి లాగానే ఉన్నాయి. గొప్ప వంశానికి చెందినవారు మాత్రమే అవి ధరిస్తారని తర్వాత తెలిసింది. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే కొద్దిగా ఆహ్లాదంగా కనిపించారు , కొందరు నవ్వుతున్నారు కూడానూ. మమ్మల్ని ఆసక్తిగా గమనించారు. గ్రీక్ శిల్పంలా ఉండే లియో సహజంగానే వాళ్ళని ఎక్కువగా ఆకర్షించాడు. అతను మర్యాదని సూచిస్తూ తన టోపీ తీసి చేత్తో పట్టుకున్నప్పుడు కనిపించిన ఒత్తైన బంగారు రంగు జుట్టు ని చూసి వాళ్ళు మెచ్చుకోలుగా గుస గుసలాడుకున్నారు. అది అంతటితో ఆగలేదు…అందర్లోకీ అందగత్తెగా కనిపిస్తున్న అమ్మాయి ఒకతె సొగసుగా అడుగులు వేసుకుంటూ వచ్చి లియో మెడ చుట్టూ చేయి వేసి ముద్దుపెట్టేసుకుంది. నేను ఉక్కిరిబిక్కిరయాను. జాబ్ ” దేవుడోయ్..ఇదేం పిల్లరా ” గొణుక్కున్నాడు. లియో త్వరగానే తేరుకుని, అది వాళ్ళ మర్యాద కాబోలునన్నట్లుగా ఆమెని దగ్గరికి తీసుకుని వదిలాడు. నేను కంగారు పడ్డానుగానీ ఏ కలకలమూ రేగలేదు..వయసులో ఉన్న అమ్మాయిలు విసుగు మొహాలు పెట్టారు, వయసు మళ్ళినవాళ్ళు చిరునవ్వులు నవ్వారు – అంతే.
తర్వాత తెలిసిన సంగతులు ఇవి – అక్కడి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎందులోనూ తీసిపోరు , ఎటువంటి బంధాలతోనూ పురుషులకి స్త్రీలు కట్టుబడరు. పైపెచ్చు వంశం స్త్రీ పేరిటే కొనసాగుతుంది , తండ్రి ఎవరో అందరికీ తెలిసినా అతనికి ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ ఉండదు. ప్రతి తెగలోనూ కొన్ని ఉపతెగలూ ఒక్కోదానికీ ఒక్కో పెద్దా ఉంటారు , అతన్ని మాత్రమే అందరూ తండ్రిగా పిలుస్తారు. ఏడు వేల మంది ఉన్న ఆ ఉప తెగకి బిల్లాలీ తండ్రి అన్నమాట. ఎవరైనా అమ్మాయికి ఒక యువకుడు నచ్చితే అతన్ని బహిరంగం గా ముద్దాడుతుంది , అతనికీ ఇష్టమైతే తిరిగి ముద్దు పెట్టుకుంటాడు…కలిసి ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి చాలనిపించినా విడిపోయే అవకాశం ఉంది. అయినా కూడా భాగస్వాములను మార్చుకోవటం అంత తరచుగా ఏమీ జరగదట. జరిగితే మాత్రం ఆవేశ కావేషాలు లేకుండా ఊరుకుంటారట.
ఆ అందగత్తె పేరు ఉస్తేన్..లియోని ప్రేమిస్తున్నానని ఆమె అలా ప్రకటించింది – మరి లియో సంగతి ???
[ ఇంకా ఉంది ]
ఈ నెల ఎంతో కవితాత్మకంగా సాగింది. ప్రారంభమే “సూర్యుడి ఆగమనాన్ని ప్రకటించి కీర్తించిన దూతలూ వైతాళికులూ చీకట్ల నీడలని వెతికి తరిమికొట్టారు. అప్పుడిక దినరాజు తన సముద్రశయ్యమీంచి లేచి వచ్చాడు , భూమిని తన వైభవోపేతమైన వెచ్చదనం తో వెలిగించాడు” అంటూ చాలా బావుంది. సాగుతున్నకొద్దీ అనువాదం మంచి పాకాన పడుతోంది.
ధన్యవాదాలండీ
ఇంత దీర్ఘమైన ప్రయాణపు అలసట అంతా ..అదిగో ఆ సన్నటి మలుపు వద్ద సేదతీరింది !! ” …..ఆ సన్నటి కనుమ మలుపు తిరిగింది – నా కళ్ళ ముందరొక అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. అయిదారు మైళ్ళ పర్యంతం రోమన్ నాటకశాల లాగా వ్యాపించిన హరితవర్ణం.. అటూ ఇటూ ఉన్న కొండరాతిగోడలు కనిపించనంత గుబురుగా పెరిగి ఉన్న పొదలు …మధ్యలో మాత్రం అత్యంత సారవంతమైన మైదానం…దివ్యమైన వృక్షాలు , వాటి చుట్టూ పరుగులెత్తుతున్న సెలయేళ్ళు ….. ” ఒక అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ చలనచిత్రం అక్షరాల్లో !! , ఉస్తేన్ – పరిచయం చదువుతుంటే లోపలి నుంచి టైటిల్ ‘ రాజ్ఞి ‘ అని ఒక ప్రత్యేకమైన శబ్దంతో ప్రతిధ్వనించింది మైథిలీ Mam !! వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ … లియో ఏమనుకుంటున్నాడో !! TQQ for the sweet and wonderful effort Mam !!
థాంక్ యూ రేఖా. ఊహూ..ఉస్తేన్..కాదుగా…
ఈ నవల ఇంతకు ముందే ఇంగ్లిష్ లో చదివాను. కాని ఇప్పుడు చక్కని, చిక్కని తెలుగు అనువాదంలో చదవటం చాలా చాలా బాగుంది.
థాంక్ యూ సురేష్