కథ

కృతి

జనవరి 2016

నా గురువు గారు కావ్యం రచించారు. కేవలం నా భర్తతో నన్ను కలపాలని రాసిన కావ్యమట అది. నిన్న రాత్రి ఆ కావ్యాన్ని చదవమని దాన్ని నా మందిరానికి పంపారు. ‘స్త్రీలు అసూయ, అభిజాత్యం, అహంకారాలతో తెలియక ఏమైనా తప్పులు చేస్తే మగవాళ్ళు క్షమించాలి కాని వాళ్ళని దూరం చేయకూడదు’ అని మగవారికి చెప్తున్నట్లుగా రాసిన ఆ కావ్యాన్ని చదివినప్పటినుండీ నా మనసు మరింత వ్యధలోకి జారిపోయింది. ఇన్నేళ్ళ ఆవేదనల జ్ఞాపకాల రొదకి ఈ వ్యధ తోడై రాత్రి నిద్ర దూరమైంది.

నా భర్త నాకు చేసిన అన్యాయాన్ని నా గురువుగారు తన కావ్యంలో ఎత్తి చూపుతాడనుకున్నాను. నా ఆవేదనకి అక్షరరూపమిస్తాడనుకున్నాను. నాకు విద్యాబుద్దులు నేర్పి, మా ఇంట్లో తిరుగాడిన నా గురువు గారు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా!!?

అంతకాక ఏమిటి నా యీ పిచ్చి ఆలోచన? ఒకరి భావనలు మరొకరు ఎలా అర్థం చేసుకోగలరు? ఎలా అనుభూతి చెందగలరు?

ఈరోజు గురువుగారు కావ్యాన్ని ‘మా’ ఆయనకి అంకితం ఇస్తున్నారట, తయారవ్వమని ఆదేశం వచ్చింది. నాకు మంగళస్నానాలు చేయించడానికి చెలులు ఎదురుచూస్తున్నారు. నాకు లేవాలనిపించడం లేదు. నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని నా ఆలోచనల్లోకి వెళ్ళిపోయాను.

2.

మా జాతిలో కొంతమంది విషయంలో అదృష్టం బాగాలేకపోతే భర్తని మరో స్త్రీతో – సాటి కుల స్త్రీతో పంచుకోవాల్సొస్తుందని తెలుసు. కాని నా భర్త పెళ్ళికి ముందే ఆమెని ప్రేమించాడన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను. మా కళ్యాణ సంబరాలు ముగిసీముగియక ముందే ఆమెతో వివాహానికి తయారైనాడు. ఆ పెళ్ళి జరిగాక భరించలేని వేదనతో, అసూయతో ఆవిడ నుంచి ఆయన్ని దూరం చేయాలని ఇన్నేళ్ళూ ఎన్నో ప్రయత్నాలు చేశాను.

యుక్తవయస్కురాలినైనప్పటి నుండీ నాకు కాబోయే భర్త గురించీ కలలు కనే దాన్ని. నా స్నేహితులతో “నా భర్త మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేట్లు నా ప్రేమలోని దివ్యత్వాన్ని పంచుతాను. ఆయన ప్రేమని నేను మాత్రమే పొందుతాను” అనేదాన్ని. నా పట్ల నేను పెంచుకున్న ఆత్మవిశ్వాసానికీ, నా మాటల్లోని గాఢమైన స్పష్టతకీ వాళ్ళంతా నా వైపు గొప్పగా చూసేవాళ్ళు.

మా పెళ్ళయ్యాక మనుగుడుపులకి మా ఇంట్లో ఉన్నన్నాళ్ళూ ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. నాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరనుకున్నాను. నాకసలు ఆయన మరో స్త్రీని ప్రేమించాడన్న అనుమానమే కలగలేదు.

అత్తవారింటికి వచ్చిన మర్నాడే నా చెలి చంద్రిక “ఎవరో నాట్యగత్తె అటమ్మా!” అంది గుసగుసగా, ఆందోళనగా.

రాజుల గురించి ఇలా చెప్పుడు మాటలు చెప్పుకోవడం మామూలేలే అనుకున్నాను. ఆయన సాహచర్యంలో తడిసి ముద్దయిన నా మనసూ, శరీరమూ ఆయన్ని గురించిన చెడు వినడానికి నిరాకరించాయి. చంద్రిక చెప్తుంటేనే బయటకి నెట్టేసినంత పని చేశాను. నా అసహనాన్ని చూసి పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయింది.

తర్వాత ఎక్కువ రోజులు కూడా గడవకముందే ‘ఆ ఆమెని పెళ్ళి చేసుకుంటాననీ, అనుమతి ఇవ్వమనీ’ నన్నాయన అడిగినప్పుడు నేను దిగ్భా్రంతికి లోనయ్యాను. అసలు ఏం అడుగుతున్నాడో ఒక్క నిమిషం పాటు నాకు అర్థం కాలేదు. భూమిలోకి దిగిపోయిన నా తలని నా చుబుకం కింద చేయి వేసి లేపుతూ “ఏమంటావు చెప్పు దేవీ… మాట్లాడవేం?” అన్నాడు.

“మన ఆచారంలో బహుభార్యత్వం ఉంటుందని తెలుసు కాని మీరు చేసుకోవాలనుకుంటున్నది ఒక దేవదాసినా?” అంటుండగానే నేనెంత తప్పుగా మాట్లాడుతున్నానో అర్థం అయింది….. ఈమె ‘కులం’ నాకు ఇబ్బందా? అంటే నా భర్త నా కులపు స్త్రీని పెళ్ళి చేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదా?

నా పొరపాటుని సవరించుకుని, ‘మీరు మరో వివాహం చేసుకోవడమే నాకిష్టం లేదు’ అని చెప్పేలోపు “మనుషులు మంచివారే. కులాలు, మతాలు అంటూ సిద్ధాంతాలు చేసిన ఈ లోకం మంచిది కాదు” అని కిటికీ వైపుకి నడుస్తూ “మా అమ్మతో ఈ విషయం చెప్పినప్పుడు ‘చేసుకుంటే చేసుకున్నావు గాని ఈ పిల్లని చేసుకుంటే మీ ఇద్దరూ అవమానపాలవుతారేమో నాయనా, ధైర్యం ఉంటేనే చేసుకో’ అంటోంది. అమ్మని రాచరికం ఎంత బాధ పెడితే ఆ మాట అందో కదా దేవీ! ” అన్నాడు. అతని గొంతులో దిగులు.

“అది కాదు” నసిగాను.

నా మాటలు విననట్లుగా సుదూరంగా కనిపిస్తున్న మబ్బుల్ని చూస్తూ “మీ ఇద్దరూ అంగీకరించారు ఇక ప్రజలు ఏమన్నా ధైర్యంగా సమాధానమివ్వగలను” అన్నాడు.

“ఈమే ఎందుకు?”

ఆ మాటకి గిరుక్కున వెనక్కి తిరిగి నన్ను పరిశీలనగా చూశాడు. నా ముఖం లోని ఆవేదన గమనించాడేమో నాకు దగ్గరగా వచ్చి “నన్ను క్షమించు. నీకు చెబ్దామనుకుంటూనే దాట వేశాను. ఆమెని నేను మన పెళ్ళికి ముందే ప్రేమించాను. రాచరిక శక్తులు ఆమెని నా భార్యగా స్వీకరించనివ్వలేదు” ఆగాడు. “అలా అని నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు నాకే బాధా లేదు. నీకు చేసిన ద్రోహమూ లేదు. నిన్ను నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నీకున్న ఆరాధన నన్ను నీ వాడిగా మార్చింది” అన్నాడు.

“అలాంటప్పుడు ఇక ఈ పెళ్ళి ఎందుకు?”

“ఆమె లేకుండా నేను లేను. ప్రేమించడం అంటే నాకు నేర్పింది ఆమె. ప్రేమోద్రేకపు అనుభూతిని మొదటిసారిగా నేను పొందిందీ ఆమె దగ్గరే. నేను ఆమె దగ్గరకి వెళ్ళకపోతే నిస్సహాయతతో ప్రాణాలు తీసుకుంటుంది. అలా అని నీకు తెలియకుండా దొంగ చాటుగా ఆమె ఇంటికి వెళ్ళడం నాకు మనస్కరించడం లేదు. నాకు క్షేమమూ కాదు. అందుకే పెళ్ళి చేసుకుని మన ఇంటికి తీసుకు రాదలుచుకున్నాను” అన్నాడు.

ఇక నేనేం చెప్పాలో అర్థం కాలేదు. నిజం నిప్పుగా కాలుస్తోంది.

“ఆమె మన కులస్త్రీలకు ఏ విషయంలోనూ తీసేయతగినది కాదని నువ్వు గ్రహిస్తావు, నన్ను నమ్ము, సంతోషంగా ఉండు” నిష్క్రమిస్తున్న ఆయన్ని చూస్తూ నా కళ్ళు మా్రన్పడిపోయాయి. పందిరి మంచం కోడుని ఆసరగా తీసుకుని అలాగే కూలబడిపోయాను.

తన వ్యామోహానికి ఎంత అందమైన మాటలు పొదిగాడు? మాటల సంగతి అటుంచి ఆయన్ని నేను ఏమైనా అనగలనా? ఆయన మనసులోకి నాకంటే ముందు వచ్చిన ఆమె రూపాన్ని నేను ఎలా తీసేయగలను?

దు:ఖంతో వంగి పోతున్న నా భుజం మీద చేయి పడింది. ఉలికిపాటుతో కళ్ళెత్తి చూశాను. మా అత్తగారు…

“నేను భయపడినట్లే జరిగిందమ్మా! వీడు కూడా తండ్రిలాగే ప్రవర్తిస్తున్నాడు. వద్దన్నా వినేట్లు లేడు. నువ్వేమీ దిగులుపడకు, ఈ ఇంట్లో నీదెప్పుడూ గౌరవనీయమైన స్థానమే” అంది.

సమాజం, అది విధించిన కులమతాల గురించి ఎంతో ఆవేదనగా మాట్లాడిన ఈయన కూడా తన లోపలి క్లిష్టతలకి తెలియకుండానే బానిసయ్యాడు. పెళ్ళికి ముందే మరొక స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఆమెని పెళ్ళి చేసుకుంటే తండ్రి అడుగుజాడల్లో నడిచాడని ప్రజలు నిందిస్తారని కేవలం రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను పెళ్ళి చేసుకున్నాడు. తన తల్లిని అవమానించిందనీ, తను చేసుకోబోయే ఆ భార్య బాధపడుతుందనీ సంఘాన్ని నిందిస్తున్న ఈయన నేనెంత బాధపడతానో గమనించుకోడా? నేను పెద్దకులపు దాన్ని కాబట్టి నాకు హృదయం ఉండదా!? అది వేదన చెందదా!!?

అయినా ఈవిడేమిటి? తన సవతి వల్ల ఎన్నో అవమానాలు పొందిన ఈమె ఇప్పుడు నేను తన కొడుకునీ తన కులపు కోడల్నీ ఏమైనా అంటానేమోనని తెలుసుకోవడానికి వచ్చిందా? ‘కులబలం, గౌరవనీయమైన స్థానం ఉన్నాయి కాబట్టి నీకు ఏమీ తక్కువ లేదు’ అని చెప్పి ఓదార్చడానికి వచ్చిందా?’ కోపంతో నా శరీరం ఊగింది.

అప్పుడు అత్తగారిని ఏహ్యంగా చూశాను కాని తనూ ఓ నిస్సహాయురాలేగా పాపం ఏం చేయగలదు సానుభూతి చూపించడం తప్ప.

అయ్యో! అత్తా! దు:ఖాన్ని సానుభూతితో తొలగించడం సాధ్యమేనా?

ఇంకా నయం నేను ఆమెని నోరు జారి ఏమీ అనలేదు. ఆవిడ ఏదోదే మాట్లాడబోతుంటే ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా లేచి ఆమె పాదాలకి నమస్కరించి స్నానాల గదిలోకి వెళ్ళిపోయాను.

ఆమె ముందు ఏడవటం నాకిష్టం లేకపోయింది.

“దేవీ! సభామంటపానికి బయల్దేరాలి ఆలశ్యమవుతుంది” చంద్రిక మాటలకి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాను.

3.

ముత్యాలశాలని అందంగా అలంకరించారు. కావ్యాంకిత కార్యక్రమం అక్కడే జరగబోతోంది. ఆవిడ – అతని మరో భార్య స్థానంలో నా ఎదురునున్న మండపంలో తెరల చాటున కూర్చుని ఉంది. క్రింద సభలో అందరూ ఆశీనులవుతున్నారు. పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు. జేజేల మధ్య ఠీవిగా నడుస్తూ వస్తున్న అతన్ని చూసి సభలోని వారంతా లేచి నిలబడి నమస్కరిస్తున్నారు. కృతి భర్తనవుతున్నందుకేమో ఆయన ముఖంలో సంతోషం తాండవమాడుతోంది.

ఆయన కావ్యాన్ని చదివి “నువ్వెందుకు ఈ కావ్యం రాశావో గ్రహించాను గురువర్యా! నీ శిష్యురాలిని తప్పకుండా కలుసుకుంటాను” అన్నాడట నవ్వుతూ. అంటే… ఈరోజు రాత్రికి నా గదికి వస్తాడు. నేనేం చేయాలి? ఇన్ని రోజులూ నేను పడిన క్షోభని మరచి ఆయన్ని మునుపటిలా ఆహ్వానించగలనా?

దు:ఖం అశ్రురూపంగా మారిందని తెలుస్తోంది. అయితే అది బుగ్గల మీదకి జారిందో లేదో కళ్ళు మూసుకున్న నాకు తెలియడం లేదు. ఎవరైనా చూస్తారేమోనని మేలి ముసుగు మరింత ముందుకు లాక్కున్నాను.

రెండు నెలల ముందు వసంతోత్సవం రోజు ఆమె నాట్యాన్ని చూసిన మత్తులో ఆమెనే తల్చుకుంటూ ఉంటాడని ఊహించి నా మందిరానికి వస్తాడో లేదో అని అనుకుంటూనే ఉన్నాను. రాకపోతే ఎలా సాధించాలా అన్న ఆలోచనలు నాలో. పాపం అప్పుడు నిబంధన ప్రకారం నా మందిరంలో ఉండాలి కాబట్టి తప్పదన్నట్లు ఏ అర్థరాత్రికో శయ్యామందిరానికి వచ్చాడు. ఎదురు చూసి చూసి అలసిన నేను కాళ్ళకట్ట వైపు తల వాల్చాను. నిద్రలో నాకు తెలియకుండానే నా కాళ్ళు తలగడ మీదకు చేరి ఉంటాయి. ఆయన వచ్చి పడుకున్న అలికిడికి దిగ్గున లేచి కూర్చుంటుండగా నా కాలు అతని తలని తాకింది. అది పొరపాటని గ్రహించి కూడా నేనేదో తప్పు చేసినట్లు నన్ను కోపంగా చూస్తూ గబగబా నడుచుకుంటూ ఆమె మందిరంలోకి వెళ్ళిపోయాడు.

ఎంత అసహ్యమైన పరిస్థితి అది నాకు?

నేను కాదు తన్నింది ఆయన్ని… ఆయన నన్ను తన్నాడు ఏకంగా గుండెల మీద. ఆ తాపుకి కూలిపోయింది. ఇంత కాలం రాచరికపు స్త్రీ నన్న నా భావన, అభిజాత్యంతో పాటు ప్రాణపదంగా అదేదో గొప్ప అన్నట్లుగా భద్రపరుచుకుంటూ వచ్చిన సతీత్వమూ పటాపంచలుగా, చెల్లాచెదురుగా విరిగి పడిపోయింది. భరించలేని నిస్సహాయతని తట్టుకోలేని శరీరం ముక్కలయింది. సంఘర్షణ పడీ పడీ మనసు జీవాన్ని కోల్పోయి మరణించింది.

తర్వాత అతను నా మందిరానికి రావడం మానేశాడు. అయితే ఆశ్చర్యంగా నాలో ఏ బాధా లేదు. బాధ లేకపోయినా ఆయన్ని ఆకట్టుకోవడానికి దు:ఖాన్ని వెలిబుచ్చే కన్నీళ్ళూ లేవు. ఈ కొద్ది రోజుల అనుభవంతోనే జీవితం అంతా పండిపోయినట్లనిపిస్తోంది. ఆయనతో గడిపిన జ్ఞాపకాలు వెలిసిపోయి మాయమవుతున్నాయి.

ఆమెని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడే ఈ స్థితి నాకెందుకు కలగలేదో!? పైగా పిచ్చి దానిలా ఆమెతో పోల్చుకుని ఆమె కంటే నేను గొప్పదాన్నని నిరూపించడానికి ప్రయత్నించాను. నాటకాలు ఆడాను. ఆమె నుండి అతన్ని దూరం చేయాలని గర్భవతిని అయ్యానని ఒకప్పుడు నేను ఆడిన నాటకం గుర్తొచ్చి హృదయం కలుక్కుమన్నట్లయింది.

మనం పెరిగిన పరిస్థితులని బట్టి మన లోలోపల మనకి సంబంధించి ఏర్పరుచుకున్న కొన్ని న్యూనతా భావనలు దాగి ఉంటాయి. అవి ఎప్పుడో బయటికి వచ్చి ఇతరులకు బాధ కలిగిస్తాయి, మనల్నీ బాధిస్తాయి. అత్తగారు నా దురదృష్టానికి ఓదార్పుగా మాట్లాడినప్పుడు నా యీ సంక్లిష్టతలనుండి దాటిపోవాలన్న ఆలోచన నా అంతరాంతరాలలో కదలాడింది కదా?… అప్పడు దాన్ని ఎందుకు వినలేకపోయాను?

వినలేకపోవడమే దౌర్భాగ్యం, ఇప్పటి ఈ బాధకి కారణం.

లోకంలో అందరూ ఇంతేనేమో! తమకున్న న్యూనతలను అంత తొందరగా దాటలేరేమో!

“ఆమెకి నీలా ఈర్ష్య లేదు, నా మీద ప్రేమ తప్ప. నేను ఆమె దగ్గరున్నపుడు నీ గురించే ఆలోచిస్తుంది. నీ దగ్గరకి వెళ్ళమని ప్రోత్సహిస్తుందేగాని నీలా నన్ను కట్టేసుకోవాలని అనుకోదు” ఒకప్పుడు ఆయన ఆవిడ గురించి నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి.

“పెద్దగా విరగబడి నవ్వి “ఆమె ఆ కులపు స్త్రీ కదూ పాపం! చిన్నప్పటినుండీ పంచుకోవడమే కదా తెలిసింది, నేర్చుకుంది. అంతకంటే ఏమనగలదు?” అన్నాను కచ్చగా.

ఎంత తప్పుగా మాట్లాడాను?

ఆమె తాను రాచరికపు స్త్రీ కాదు కనుక ‘తగ్గి ఉండాలన్న’ ఆత్మన్యూనత నుండి తనని బయట పడేసుకోలేకపోయిందనీ, నాలాగే తనూ ఓ నిస్సహాయురాలనీ నేనెందుకు గ్రహించలేకపోయాను? అసూయ, దౌర్బల్యాలతో ఆయన సమక్షంలో ఆమెని అవమానించి అతనిపై కక్ష తీర్చుకున్నాను.

నేనన్న మాటలు ఆమెకి చెప్పే ఉంటాడు. తన మనసులో నాగురించి ఎంత చెడ్డగా అనుకుందో…. అప్పటి నా మనస్థితిని గురించి ఆమెకి చెప్తే!!?

వద్దు, వద్దు. ఆమె ఇప్పుడు రాణీయే కావొచ్చు కానీ చిన్నతనం నుండి అణగద్రొక్కబడిన ఈమె తన లోపలున్న తక్కుతనపు భావాన్ని దాటి ఉండకపోతే నేనేమనినా ఆమెని తక్కువ చేసి మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోవచ్చు. ఒకప్పటి నా స్థితిలో నేను జారినట్లే మాటలు మీరి నన్ను బాధించవచ్చు.

నాకెవరి మీదా బాధగాని, కోపతాపాలు గాని లేవని ఇక ముందు నా ప్రవర్తనతో నేను తెలియచేయాలి తప్ప మాటలతో పనేల?

4.

మంగళవాద్యాల హోరు నా ఆలోచనలను చెదరగొట్టింది. ఆయన కృతిని అందుకుంటూ పల్చటి తెరల వెనుకనున్న నా వైపు కళ్ళెత్తి చూశాడు. అప్రయత్నంగా నేను ఆమెని చూశాను. నన్నే చూస్తున్న ఆమె కళ్ళల్లో నా కళ్ళు కలిశాయి. తడపడుతూ ఇద్దరం ఒకేసారి తల దించుకున్నాం. తెర చాటు ఉండటంతో ఆమెలో కదలాడుతున్న భావాలని నేను గమనించలేకపోయాను.

ఈ కావ్యం రాయించుకోగలిగానని, సంతోషంతో ఓలలాడుతున్నానని అందరూ అనుకుంటున్నారేమో!? తాపంతోనో, సుఖశయ్య లేదనే బాధతోనో నేనే దీన్ని రాయించానని కూడా అనుకుని ఉంటారు. కొన్నాళ్ళుగా ఆయన నన్ను విస్మరించి ఆమె మందిరంలోనే ఉంటూ నా దగ్గరకి రాకపోవడం వల్ల నేను దు:ఖిస్తున్నానని భావించి పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నా గురువుగారే పూనుకుని ఆ గ్రంథం రాశారని ఎవరికి తెలుస్తుంది?

పర్వాలేదు ఎవరేం అనుకున్నా దిగుల్లేదు.

నాలోని వైకల్యాలని నిరోధించకుండా అనుభవించి చూసి వాటి మూలాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. అది చాలు ముందున్న జీవితాన్ని సంతోషంగా గడపటానికి.

సభలోని సభికులు “శ్రీ కృష్ణదేవరాయల ప్రభువుకీ, నంది తిమ్మన కవిరాజుకీ జయోస్తు, విజయోస్తు” అంటూ జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఆలోచనల్లోనుండే అనుకోకుండా ఆయన వైపు చూశాను. నా గురువుగారికి అక్షరలక్షలు సమర్పించుకుంటున్నాడు.

ఆ గ్రంథంలో ఏముందని ఆ చప్పట్లు? అహంకారం ఉండేది ఆడవారికేనట. దాన్ని తొలగించుకోవాల్సిందీ వాళ్ళేట. నవ్వొచ్చింది.

బాగుంది నా అరణపు కవీ, జోహార్లు. కృతికర్తగా నువ్వు నాకు చేసిన సహాయము ఏమీ లేదు. నీకూ ఉంటాయిగా కొన్ని దౌర్బల్యాలు, అవి బయట పడటం తప్ప. నీ పుణ్యాన ఇక ఇప్పుడు అతను నా దగ్గరకి వచ్చినా కొత్తగా ఒరిగేదేమీ ఉండబోదు, లోకానికి మరో కావ్యం దొరకడం తప్ప.

**** (*) ****

illustration: Anwar