నా గురువు గారు కావ్యం రచించారు. కేవలం నా భర్తతో నన్ను కలపాలని రాసిన కావ్యమట అది. నిన్న రాత్రి ఆ కావ్యాన్ని చదవమని దాన్ని నా మందిరానికి పంపారు. ‘స్త్రీలు అసూయ, అభిజాత్యం, అహంకారాలతో తెలియక ఏమైనా తప్పులు చేస్తే మగవాళ్ళు క్షమించాలి కాని వాళ్ళని దూరం చేయకూడదు’ అని మగవారికి చెప్తున్నట్లుగా రాసిన ఆ కావ్యాన్ని చదివినప్పటినుండీ నా మనసు మరింత వ్యధలోకి జారిపోయింది. ఇన్నేళ్ళ ఆవేదనల జ్ఞాపకాల రొదకి ఈ వ్యధ తోడై రాత్రి నిద్ర దూరమైంది.
నా భర్త నాకు చేసిన అన్యాయాన్ని నా గురువుగారు తన కావ్యంలో ఎత్తి చూపుతాడనుకున్నాను. నా ఆవేదనకి అక్షరరూపమిస్తాడనుకున్నాను. నాకు విద్యాబుద్దులు నేర్పి, మా ఇంట్లో తిరుగాడిన నా గురువు గారు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా!!?
అంతకాక ఏమిటి నా యీ పిచ్చి ఆలోచన? ఒకరి భావనలు మరొకరు ఎలా అర్థం చేసుకోగలరు? ఎలా అనుభూతి చెందగలరు?
ఈరోజు గురువుగారు కావ్యాన్ని ‘మా’ ఆయనకి అంకితం ఇస్తున్నారట, తయారవ్వమని ఆదేశం వచ్చింది. నాకు మంగళస్నానాలు చేయించడానికి చెలులు ఎదురుచూస్తున్నారు. నాకు లేవాలనిపించడం లేదు. నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని నా ఆలోచనల్లోకి వెళ్ళిపోయాను.
2.
మా జాతిలో కొంతమంది విషయంలో అదృష్టం బాగాలేకపోతే భర్తని మరో స్త్రీతో – సాటి కుల స్త్రీతో పంచుకోవాల్సొస్తుందని తెలుసు. కాని నా భర్త పెళ్ళికి ముందే ఆమెని ప్రేమించాడన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను. మా కళ్యాణ సంబరాలు ముగిసీముగియక ముందే ఆమెతో వివాహానికి తయారైనాడు. ఆ పెళ్ళి జరిగాక భరించలేని వేదనతో, అసూయతో ఆవిడ నుంచి ఆయన్ని దూరం చేయాలని ఇన్నేళ్ళూ ఎన్నో ప్రయత్నాలు చేశాను.
యుక్తవయస్కురాలినైనప్పటి నుండీ నాకు కాబోయే భర్త గురించీ కలలు కనే దాన్ని. నా స్నేహితులతో “నా భర్త మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేట్లు నా ప్రేమలోని దివ్యత్వాన్ని పంచుతాను. ఆయన ప్రేమని నేను మాత్రమే పొందుతాను” అనేదాన్ని. నా పట్ల నేను పెంచుకున్న ఆత్మవిశ్వాసానికీ, నా మాటల్లోని గాఢమైన స్పష్టతకీ వాళ్ళంతా నా వైపు గొప్పగా చూసేవాళ్ళు.
మా పెళ్ళయ్యాక మనుగుడుపులకి మా ఇంట్లో ఉన్నన్నాళ్ళూ ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. నాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరనుకున్నాను. నాకసలు ఆయన మరో స్త్రీని ప్రేమించాడన్న అనుమానమే కలగలేదు.
అత్తవారింటికి వచ్చిన మర్నాడే నా చెలి చంద్రిక “ఎవరో నాట్యగత్తె అటమ్మా!” అంది గుసగుసగా, ఆందోళనగా.
రాజుల గురించి ఇలా చెప్పుడు మాటలు చెప్పుకోవడం మామూలేలే అనుకున్నాను. ఆయన సాహచర్యంలో తడిసి ముద్దయిన నా మనసూ, శరీరమూ ఆయన్ని గురించిన చెడు వినడానికి నిరాకరించాయి. చంద్రిక చెప్తుంటేనే బయటకి నెట్టేసినంత పని చేశాను. నా అసహనాన్ని చూసి పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయింది.
తర్వాత ఎక్కువ రోజులు కూడా గడవకముందే ‘ఆ ఆమెని పెళ్ళి చేసుకుంటాననీ, అనుమతి ఇవ్వమనీ’ నన్నాయన అడిగినప్పుడు నేను దిగ్భా్రంతికి లోనయ్యాను. అసలు ఏం అడుగుతున్నాడో ఒక్క నిమిషం పాటు నాకు అర్థం కాలేదు. భూమిలోకి దిగిపోయిన నా తలని నా చుబుకం కింద చేయి వేసి లేపుతూ “ఏమంటావు చెప్పు దేవీ… మాట్లాడవేం?” అన్నాడు.
“మన ఆచారంలో బహుభార్యత్వం ఉంటుందని తెలుసు కాని మీరు చేసుకోవాలనుకుంటున్నది ఒక దేవదాసినా?” అంటుండగానే నేనెంత తప్పుగా మాట్లాడుతున్నానో అర్థం అయింది….. ఈమె ‘కులం’ నాకు ఇబ్బందా? అంటే నా భర్త నా కులపు స్త్రీని పెళ్ళి చేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదా?
నా పొరపాటుని సవరించుకుని, ‘మీరు మరో వివాహం చేసుకోవడమే నాకిష్టం లేదు’ అని చెప్పేలోపు “మనుషులు మంచివారే. కులాలు, మతాలు అంటూ సిద్ధాంతాలు చేసిన ఈ లోకం మంచిది కాదు” అని కిటికీ వైపుకి నడుస్తూ “మా అమ్మతో ఈ విషయం చెప్పినప్పుడు ‘చేసుకుంటే చేసుకున్నావు గాని ఈ పిల్లని చేసుకుంటే మీ ఇద్దరూ అవమానపాలవుతారేమో నాయనా, ధైర్యం ఉంటేనే చేసుకో’ అంటోంది. అమ్మని రాచరికం ఎంత బాధ పెడితే ఆ మాట అందో కదా దేవీ! ” అన్నాడు. అతని గొంతులో దిగులు.
“అది కాదు” నసిగాను.
నా మాటలు విననట్లుగా సుదూరంగా కనిపిస్తున్న మబ్బుల్ని చూస్తూ “మీ ఇద్దరూ అంగీకరించారు ఇక ప్రజలు ఏమన్నా ధైర్యంగా సమాధానమివ్వగలను” అన్నాడు.
“ఈమే ఎందుకు?”
ఆ మాటకి గిరుక్కున వెనక్కి తిరిగి నన్ను పరిశీలనగా చూశాడు. నా ముఖం లోని ఆవేదన గమనించాడేమో నాకు దగ్గరగా వచ్చి “నన్ను క్షమించు. నీకు చెబ్దామనుకుంటూనే దాట వేశాను. ఆమెని నేను మన పెళ్ళికి ముందే ప్రేమించాను. రాచరిక శక్తులు ఆమెని నా భార్యగా స్వీకరించనివ్వలేదు” ఆగాడు. “అలా అని నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు నాకే బాధా లేదు. నీకు చేసిన ద్రోహమూ లేదు. నిన్ను నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నీకున్న ఆరాధన నన్ను నీ వాడిగా మార్చింది” అన్నాడు.
“అలాంటప్పుడు ఇక ఈ పెళ్ళి ఎందుకు?”
“ఆమె లేకుండా నేను లేను. ప్రేమించడం అంటే నాకు నేర్పింది ఆమె. ప్రేమోద్రేకపు అనుభూతిని మొదటిసారిగా నేను పొందిందీ ఆమె దగ్గరే. నేను ఆమె దగ్గరకి వెళ్ళకపోతే నిస్సహాయతతో ప్రాణాలు తీసుకుంటుంది. అలా అని నీకు తెలియకుండా దొంగ చాటుగా ఆమె ఇంటికి వెళ్ళడం నాకు మనస్కరించడం లేదు. నాకు క్షేమమూ కాదు. అందుకే పెళ్ళి చేసుకుని మన ఇంటికి తీసుకు రాదలుచుకున్నాను” అన్నాడు.
ఇక నేనేం చెప్పాలో అర్థం కాలేదు. నిజం నిప్పుగా కాలుస్తోంది.
“ఆమె మన కులస్త్రీలకు ఏ విషయంలోనూ తీసేయతగినది కాదని నువ్వు గ్రహిస్తావు, నన్ను నమ్ము, సంతోషంగా ఉండు” నిష్క్రమిస్తున్న ఆయన్ని చూస్తూ నా కళ్ళు మా్రన్పడిపోయాయి. పందిరి మంచం కోడుని ఆసరగా తీసుకుని అలాగే కూలబడిపోయాను.
తన వ్యామోహానికి ఎంత అందమైన మాటలు పొదిగాడు? మాటల సంగతి అటుంచి ఆయన్ని నేను ఏమైనా అనగలనా? ఆయన మనసులోకి నాకంటే ముందు వచ్చిన ఆమె రూపాన్ని నేను ఎలా తీసేయగలను?
దు:ఖంతో వంగి పోతున్న నా భుజం మీద చేయి పడింది. ఉలికిపాటుతో కళ్ళెత్తి చూశాను. మా అత్తగారు…
“నేను భయపడినట్లే జరిగిందమ్మా! వీడు కూడా తండ్రిలాగే ప్రవర్తిస్తున్నాడు. వద్దన్నా వినేట్లు లేడు. నువ్వేమీ దిగులుపడకు, ఈ ఇంట్లో నీదెప్పుడూ గౌరవనీయమైన స్థానమే” అంది.
సమాజం, అది విధించిన కులమతాల గురించి ఎంతో ఆవేదనగా మాట్లాడిన ఈయన కూడా తన లోపలి క్లిష్టతలకి తెలియకుండానే బానిసయ్యాడు. పెళ్ళికి ముందే మరొక స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఆమెని పెళ్ళి చేసుకుంటే తండ్రి అడుగుజాడల్లో నడిచాడని ప్రజలు నిందిస్తారని కేవలం రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను పెళ్ళి చేసుకున్నాడు. తన తల్లిని అవమానించిందనీ, తను చేసుకోబోయే ఆ భార్య బాధపడుతుందనీ సంఘాన్ని నిందిస్తున్న ఈయన నేనెంత బాధపడతానో గమనించుకోడా? నేను పెద్దకులపు దాన్ని కాబట్టి నాకు హృదయం ఉండదా!? అది వేదన చెందదా!!?
అయినా ఈవిడేమిటి? తన సవతి వల్ల ఎన్నో అవమానాలు పొందిన ఈమె ఇప్పుడు నేను తన కొడుకునీ తన కులపు కోడల్నీ ఏమైనా అంటానేమోనని తెలుసుకోవడానికి వచ్చిందా? ‘కులబలం, గౌరవనీయమైన స్థానం ఉన్నాయి కాబట్టి నీకు ఏమీ తక్కువ లేదు’ అని చెప్పి ఓదార్చడానికి వచ్చిందా?’ కోపంతో నా శరీరం ఊగింది.
అప్పుడు అత్తగారిని ఏహ్యంగా చూశాను కాని తనూ ఓ నిస్సహాయురాలేగా పాపం ఏం చేయగలదు సానుభూతి చూపించడం తప్ప.
అయ్యో! అత్తా! దు:ఖాన్ని సానుభూతితో తొలగించడం సాధ్యమేనా?
ఇంకా నయం నేను ఆమెని నోరు జారి ఏమీ అనలేదు. ఆవిడ ఏదోదే మాట్లాడబోతుంటే ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా లేచి ఆమె పాదాలకి నమస్కరించి స్నానాల గదిలోకి వెళ్ళిపోయాను.
ఆమె ముందు ఏడవటం నాకిష్టం లేకపోయింది.
“దేవీ! సభామంటపానికి బయల్దేరాలి ఆలశ్యమవుతుంది” చంద్రిక మాటలకి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాను.
3.
ముత్యాలశాలని అందంగా అలంకరించారు. కావ్యాంకిత కార్యక్రమం అక్కడే జరగబోతోంది. ఆవిడ – అతని మరో భార్య స్థానంలో నా ఎదురునున్న మండపంలో తెరల చాటున కూర్చుని ఉంది. క్రింద సభలో అందరూ ఆశీనులవుతున్నారు. పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు. జేజేల మధ్య ఠీవిగా నడుస్తూ వస్తున్న అతన్ని చూసి సభలోని వారంతా లేచి నిలబడి నమస్కరిస్తున్నారు. కృతి భర్తనవుతున్నందుకేమో ఆయన ముఖంలో సంతోషం తాండవమాడుతోంది.
ఆయన కావ్యాన్ని చదివి “నువ్వెందుకు ఈ కావ్యం రాశావో గ్రహించాను గురువర్యా! నీ శిష్యురాలిని తప్పకుండా కలుసుకుంటాను” అన్నాడట నవ్వుతూ. అంటే… ఈరోజు రాత్రికి నా గదికి వస్తాడు. నేనేం చేయాలి? ఇన్ని రోజులూ నేను పడిన క్షోభని మరచి ఆయన్ని మునుపటిలా ఆహ్వానించగలనా?
దు:ఖం అశ్రురూపంగా మారిందని తెలుస్తోంది. అయితే అది బుగ్గల మీదకి జారిందో లేదో కళ్ళు మూసుకున్న నాకు తెలియడం లేదు. ఎవరైనా చూస్తారేమోనని మేలి ముసుగు మరింత ముందుకు లాక్కున్నాను.
రెండు నెలల ముందు వసంతోత్సవం రోజు ఆమె నాట్యాన్ని చూసిన మత్తులో ఆమెనే తల్చుకుంటూ ఉంటాడని ఊహించి నా మందిరానికి వస్తాడో లేదో అని అనుకుంటూనే ఉన్నాను. రాకపోతే ఎలా సాధించాలా అన్న ఆలోచనలు నాలో. పాపం అప్పుడు నిబంధన ప్రకారం నా మందిరంలో ఉండాలి కాబట్టి తప్పదన్నట్లు ఏ అర్థరాత్రికో శయ్యామందిరానికి వచ్చాడు. ఎదురు చూసి చూసి అలసిన నేను కాళ్ళకట్ట వైపు తల వాల్చాను. నిద్రలో నాకు తెలియకుండానే నా కాళ్ళు తలగడ మీదకు చేరి ఉంటాయి. ఆయన వచ్చి పడుకున్న అలికిడికి దిగ్గున లేచి కూర్చుంటుండగా నా కాలు అతని తలని తాకింది. అది పొరపాటని గ్రహించి కూడా నేనేదో తప్పు చేసినట్లు నన్ను కోపంగా చూస్తూ గబగబా నడుచుకుంటూ ఆమె మందిరంలోకి వెళ్ళిపోయాడు.
ఎంత అసహ్యమైన పరిస్థితి అది నాకు?
నేను కాదు తన్నింది ఆయన్ని… ఆయన నన్ను తన్నాడు ఏకంగా గుండెల మీద. ఆ తాపుకి కూలిపోయింది. ఇంత కాలం రాచరికపు స్త్రీ నన్న నా భావన, అభిజాత్యంతో పాటు ప్రాణపదంగా అదేదో గొప్ప అన్నట్లుగా భద్రపరుచుకుంటూ వచ్చిన సతీత్వమూ పటాపంచలుగా, చెల్లాచెదురుగా విరిగి పడిపోయింది. భరించలేని నిస్సహాయతని తట్టుకోలేని శరీరం ముక్కలయింది. సంఘర్షణ పడీ పడీ మనసు జీవాన్ని కోల్పోయి మరణించింది.
తర్వాత అతను నా మందిరానికి రావడం మానేశాడు. అయితే ఆశ్చర్యంగా నాలో ఏ బాధా లేదు. బాధ లేకపోయినా ఆయన్ని ఆకట్టుకోవడానికి దు:ఖాన్ని వెలిబుచ్చే కన్నీళ్ళూ లేవు. ఈ కొద్ది రోజుల అనుభవంతోనే జీవితం అంతా పండిపోయినట్లనిపిస్తోంది. ఆయనతో గడిపిన జ్ఞాపకాలు వెలిసిపోయి మాయమవుతున్నాయి.
ఆమెని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడే ఈ స్థితి నాకెందుకు కలగలేదో!? పైగా పిచ్చి దానిలా ఆమెతో పోల్చుకుని ఆమె కంటే నేను గొప్పదాన్నని నిరూపించడానికి ప్రయత్నించాను. నాటకాలు ఆడాను. ఆమె నుండి అతన్ని దూరం చేయాలని గర్భవతిని అయ్యానని ఒకప్పుడు నేను ఆడిన నాటకం గుర్తొచ్చి హృదయం కలుక్కుమన్నట్లయింది.
మనం పెరిగిన పరిస్థితులని బట్టి మన లోలోపల మనకి సంబంధించి ఏర్పరుచుకున్న కొన్ని న్యూనతా భావనలు దాగి ఉంటాయి. అవి ఎప్పుడో బయటికి వచ్చి ఇతరులకు బాధ కలిగిస్తాయి, మనల్నీ బాధిస్తాయి. అత్తగారు నా దురదృష్టానికి ఓదార్పుగా మాట్లాడినప్పుడు నా యీ సంక్లిష్టతలనుండి దాటిపోవాలన్న ఆలోచన నా అంతరాంతరాలలో కదలాడింది కదా?… అప్పడు దాన్ని ఎందుకు వినలేకపోయాను?
వినలేకపోవడమే దౌర్భాగ్యం, ఇప్పటి ఈ బాధకి కారణం.
లోకంలో అందరూ ఇంతేనేమో! తమకున్న న్యూనతలను అంత తొందరగా దాటలేరేమో!
“ఆమెకి నీలా ఈర్ష్య లేదు, నా మీద ప్రేమ తప్ప. నేను ఆమె దగ్గరున్నపుడు నీ గురించే ఆలోచిస్తుంది. నీ దగ్గరకి వెళ్ళమని ప్రోత్సహిస్తుందేగాని నీలా నన్ను కట్టేసుకోవాలని అనుకోదు” ఒకప్పుడు ఆయన ఆవిడ గురించి నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి.
“పెద్దగా విరగబడి నవ్వి “ఆమె ఆ కులపు స్త్రీ కదూ పాపం! చిన్నప్పటినుండీ పంచుకోవడమే కదా తెలిసింది, నేర్చుకుంది. అంతకంటే ఏమనగలదు?” అన్నాను కచ్చగా.
ఎంత తప్పుగా మాట్లాడాను?
ఆమె తాను రాచరికపు స్త్రీ కాదు కనుక ‘తగ్గి ఉండాలన్న’ ఆత్మన్యూనత నుండి తనని బయట పడేసుకోలేకపోయిందనీ, నాలాగే తనూ ఓ నిస్సహాయురాలనీ నేనెందుకు గ్రహించలేకపోయాను? అసూయ, దౌర్బల్యాలతో ఆయన సమక్షంలో ఆమెని అవమానించి అతనిపై కక్ష తీర్చుకున్నాను.
నేనన్న మాటలు ఆమెకి చెప్పే ఉంటాడు. తన మనసులో నాగురించి ఎంత చెడ్డగా అనుకుందో…. అప్పటి నా మనస్థితిని గురించి ఆమెకి చెప్తే!!?
వద్దు, వద్దు. ఆమె ఇప్పుడు రాణీయే కావొచ్చు కానీ చిన్నతనం నుండి అణగద్రొక్కబడిన ఈమె తన లోపలున్న తక్కుతనపు భావాన్ని దాటి ఉండకపోతే నేనేమనినా ఆమెని తక్కువ చేసి మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోవచ్చు. ఒకప్పటి నా స్థితిలో నేను జారినట్లే మాటలు మీరి నన్ను బాధించవచ్చు.
నాకెవరి మీదా బాధగాని, కోపతాపాలు గాని లేవని ఇక ముందు నా ప్రవర్తనతో నేను తెలియచేయాలి తప్ప మాటలతో పనేల?
4.
మంగళవాద్యాల హోరు నా ఆలోచనలను చెదరగొట్టింది. ఆయన కృతిని అందుకుంటూ పల్చటి తెరల వెనుకనున్న నా వైపు కళ్ళెత్తి చూశాడు. అప్రయత్నంగా నేను ఆమెని చూశాను. నన్నే చూస్తున్న ఆమె కళ్ళల్లో నా కళ్ళు కలిశాయి. తడపడుతూ ఇద్దరం ఒకేసారి తల దించుకున్నాం. తెర చాటు ఉండటంతో ఆమెలో కదలాడుతున్న భావాలని నేను గమనించలేకపోయాను.
ఈ కావ్యం రాయించుకోగలిగానని, సంతోషంతో ఓలలాడుతున్నానని అందరూ అనుకుంటున్నారేమో!? తాపంతోనో, సుఖశయ్య లేదనే బాధతోనో నేనే దీన్ని రాయించానని కూడా అనుకుని ఉంటారు. కొన్నాళ్ళుగా ఆయన నన్ను విస్మరించి ఆమె మందిరంలోనే ఉంటూ నా దగ్గరకి రాకపోవడం వల్ల నేను దు:ఖిస్తున్నానని భావించి పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నా గురువుగారే పూనుకుని ఆ గ్రంథం రాశారని ఎవరికి తెలుస్తుంది?
పర్వాలేదు ఎవరేం అనుకున్నా దిగుల్లేదు.
నాలోని వైకల్యాలని నిరోధించకుండా అనుభవించి చూసి వాటి మూలాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. అది చాలు ముందున్న జీవితాన్ని సంతోషంగా గడపటానికి.
సభలోని సభికులు “శ్రీ కృష్ణదేవరాయల ప్రభువుకీ, నంది తిమ్మన కవిరాజుకీ జయోస్తు, విజయోస్తు” అంటూ జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఆలోచనల్లోనుండే అనుకోకుండా ఆయన వైపు చూశాను. నా గురువుగారికి అక్షరలక్షలు సమర్పించుకుంటున్నాడు.
ఆ గ్రంథంలో ఏముందని ఆ చప్పట్లు? అహంకారం ఉండేది ఆడవారికేనట. దాన్ని తొలగించుకోవాల్సిందీ వాళ్ళేట. నవ్వొచ్చింది.
బాగుంది నా అరణపు కవీ, జోహార్లు. కృతికర్తగా నువ్వు నాకు చేసిన సహాయము ఏమీ లేదు. నీకూ ఉంటాయిగా కొన్ని దౌర్బల్యాలు, అవి బయట పడటం తప్ప. నీ పుణ్యాన ఇక ఇప్పుడు అతను నా దగ్గరకి వచ్చినా కొత్తగా ఒరిగేదేమీ ఉండబోదు, లోకానికి మరో కావ్యం దొరకడం తప్ప.
**** (*) ****
illustration: Anwar
అయ్యో, ఇలా ముగించారా ఆ కలంపోటు గాథని… కానీ బాగా రాశారు. దుఃఖాన్ని సానుభూతి తో తొలగించటం సాధ్యమేనా…
వావ్ డాక్టర్ గారూ… ఎంత బాగా చెప్పారు – “కలం పోటు” అని. థాంక్ యు
అది శ్రీపాద వారి నాటిక అండీ. మొదట ఈ ఉదంతాన్ని అక్కడ చదివాను… మీరింకొన్ని ఇలాంటివి ప్రయత్నించండి, బాగా వచ్చింది
అవునా? ఆసక్తిగా ఉంది చదవాలని. తప్పకుండా ఆయన నాటికలు దొరుకుతాయేమో తెప్పించుకుంటాను. ఇక ఇలాంటివి ఈ వాకిలిలోనే చాలా రోజుల క్రితం రాసిన ప్రేమ జీవనం ఉంది. ఇంకో కథ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది డాక్టర్ గారూ… థాంక్ యు.
రాధగారూ,
కథనం చాలా బాహా రాశారు.
థాంక్ యు కృష్ణా!
మనసును కదిలించిందండీ కథనం రాధగారూ.. అభినందనలు..
చాలా సంతోషంగా ఉందక్కా. థాంక్ యు వెరీ మచ్
చాలా బావుంది రాధ గారూ.
థాంక్ యు ప్రసూనా…
ఒక చక్కటి కధ చక్కటి తెలుగులొ చదివిన అనుభూతి కావాలనుకుంటూ దారి తప్పి తిరుగుతున్న నాకు గమ్యంలా దొరికి సంతృప్తినిచ్చింది. స్త్రీవాద సాహిత్యమంటె మగ వారిని పచ్చి బూతులు తిడుతూ పిచ్చి పిచ్చిగా ప్రక్రుతిసహజాలను వికృతాల విపరీత క్రీడల్లా ఎం చెప్పదలచుకున్నారొ అర్ధం కాకుండా రాసే వారు ఈ కద చదివి కదానిక చెప్పవలసిన శైలీ రీతుల మీద ఎవరైనా ఒక చిన్న కోర్సు కానీ వర్క్ షాపు కానీ పెదితె ఈ kadhaని చూపిస్తూ స్త్రీ వాదాన్ని అనుభూతులను ఎంత అందంగా చెప్పవచొ భోదించ వచ్చును రాధ గారికి ఒక చిన్న విజ్ఞప్తి ఇలాటి కధానికలు మీ నుంచి ఇంకా ఇంకా రావాలని . మా కోరిక మన్నిస్తారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతాభివందనాలు.
చాలా సంతోషం శ్రీనివాస్ గారూ… కథలు చాలానే రాశాను. పుస్తకంగా వేస్తూ విశాలాంధ్రలో పని చేసే ఓ మేనేజర్ కూడా మీరన్నట్లే అన్నారు. రచయిత్రికి అంతకంటే సంతోషమేముంటుంది. మరో కథ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది త్వరలో. తప్పకుండా చదవండి. థాంక్ యు వెరీ మచ్.
కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది రాధ గారు , నాకు బాగా నచ్చింది .
Thank you భవాని. శ్రద్ధగా చదివి నచ్చితే తప్పకుండా కామెంట్ పెడతారు మీరు. థాంక్ యు వెరీ మచ్.
కొత్తగా ఉంది .. రాధ గారూ
చివరికి మిస్సింగ్ లింక్ లా అనిపించింది. అప్పటినుండి ఇప్పటికీ ఏదీ, ఎవరూ మారలేదు అనుకుంటా
ప్రతీ స్త్రీ దుఖం వొక సంపూర్తి లేదా అసంపూర్తి కావ్యమే
“ప్రతి సీ్త్ర దు:ఖం ఒక సంపూర్తి/అసంపూర్తి కావ్యమే” – ప్చ్! నిజమే. ప్రకృతి అది మనకిచ్చిన అదృష్టమో/దురదృష్టమో లా… థాంక్స్ సాయీ.
చాలా బాగుందండి
థాంక్ యు సురేష్ గారూ… (మీరు నాకు fb లో తెలుసాండీ? తెలిసినా తెలియకపోయినా పూర్తి పేరు రాస్తే బావుండేది )
అవునండి .. మీ ఫేస్బుక్ ఫ్రెండ్ ని. వెంకట్ సురేష్ అనే పేరు తో ఉంటుంది నా ప్రొఫైల్
ఓ, థాంక్ యు
బాగుంది రాధగారు. ఆ మధ్య ఆగ్రా కోటలో రాణుల గదులను చూసినపుడు (మన సినిమాల్లో చూపించినట్లు కాదు. గూళ్ళల్గా ఉన్నాయవి) ఎంత మంది స్త్రీలు ఇక్కడ నలిగి పోయారో అనుకొన్నాను.
నిజమే. గదులే కాదు పిచ్చి వాళ్ళలా మనసుల్ని కూడా ఇరుకు చేసుకుంటూ… ప్చ్! ఇంత చూస్తున్నా, ఇన్ని జరుగుతున్నా ఇంకా పిచ్చిలోనే పడి నలుగుతున్న ఓ సీ్త్ర ఎప్పుడు నీకు విముక్తి? అనుకుంటే దు:ఖం.
అతి సున్నితమైన జాగాలో.- భరించలేని అవమానం – చేసే గాయాన్నీ, అది కలిగించే బాధనూ, ఊహించే ప్రయత్నం చేసినప్పుడల్లా మాటలే రావు నాకు…ఎలా స్పందించను? రాధ గారూ…
నిజమే కల్యాణి గారూ! ఇలా లాలనతోనేననుకుంటా.
కవి గారు కూడా మగవాడే కాబట్టి ఆయన కోణం అలాగే ఉంటుంది కదా !
చాలా బావుంది wonderful narration ! కంగ్రాట్స్ రాధ గారూ !
థాంక్ యు గౌరీలక్ష్మి గారూ… బావున్నారా?
చాల బావుంది. దుఃఖాన్ని సానుభూతి తో తొలగించటం సాధ్యమేనా… తమకున్న న్యూనతలను అంత తొందరగా దాటలేరేమో! – ఎంత నిజం
థాంక్ యు రాజ్యలక్ష్మి గారు
కథ,కథనం చాలా బావుంది రాధ గారూ…
ఎక్కడా ఆపకుండా ఒక్క గుక్కలో చదివింప చేసారు.
ఇట్లాంటి మరిన్ని మంచి కథల్ని మీ కలం నుంచి ఆశిస్తూ…
భాస్కర్.
థాంక్ యు సర్
ఈ కథ నిజమేనా (బేస్ లైన్) , ఆ కృతి ఏమిటొ?
ఆ కృతి పారిజాతాపహరణం. తిరుమల దేవి కృష్ణదేవరాయల కోసం ఎదురుచూస్తూ నిద్రకి ఆగలేక వాలిపోయి కాళ్ళు తలగడ వైపు పెట్టుకుని పడుకుందని రాయలు వచ్చి పడుకున్న అలికిడికి లేచినప్పుడు ఆమె కాలు అతని తలకి తగిలి ఆమె మీద అలిగాడని కథలు ఉన్నాయి మరి. నిజమెంతో తెలియదు రాజ్యలక్ష్మి గారూ
అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల ( పదహారో శతాబ్దం 1509 – 1529 ) ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడై , పెద్దనతో బాటు రాయల వారికి కావ్యాన్ని అంకితం చేసిన మహాకవి నంది తిమ్మన, రాయల వారి పట్టమహిషి తిరుమల దేవి వెంట పుట్టింటి అరణంగా వచ్చిన కవి అనీ, రాజుగారికి, రాణిగారికి వచ్చిన అపార్ధాన్ని సవరించడం కోసం ‘ పారిజాతాపహరణం’ ప్రబంధ కావ్యాన్ని రాసాడని అంటారు. కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడు.
ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా రాణివారి కాలు రాయలవారి తలకు తగిలిందనీ, దానికి రాజు కోపించి ఆమె దగ్గరకు రావడం మానుకున్నాడనీ, ఆ బాధను ఆమె తిమ్మకవికి చెప్పుకున్నదనీ, భార్య కాలు భర్తకు తగలడం తప్పేమీ కాదని రాయలవారికి అన్యాపదేశంగా చెప్పడం కోసం కృష్ణా-సత్యభామలకు అటువంటి ఘట్టం ఒకటి కల్పించి ‘పారిజాతాపహరణ’ కావ్యం వ్రాసి సున్నితంగా సరసంగా రాయలవారికి బోధించాడనీ, ఆ సూచనను సహజ సహృదయమూర్తి ఐన రాయలు గ్రహించి తదాది భార్యతో సఖ్యంగా వున్నాడనీ – ఒక ఐతిహ్యం జనంలో ప్రచలితంగా వుంది.
నంది తిమ్మన మహాకవి వ్రాసిన ,‘ పారిజాతాపహరణం’ ప్రబంధం లోని ఒక ప్రముఖ సన్నివేశంలో, కథానాయిక ‘సత్యభామా దేవిని’ వేడుకొంటూ నాయకుడైన శ్రీ కృష్ణుడు పలికిన పద్యం
“నను భవదీయ దాసుని, మనంబున నెయ్యపు గిన్క,
బూని దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు,మ
త్కనుకులకాగ్ర కంటక వితానము దాకిన నొచ్చునంచునంచు నే,
ననియెద , నల్క మానవు కదా, ఇకనైన నరాళ కుంతలా !!
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ‘కృష్ణాతీరం’, ముళ్లపూడి వెంకటరమణ గారి ‘కానుక’ ల లెవిల్లో, ఆధునిక మహిళ ఆలోచనా వీక్షణంతో రాయలవారి దేవేరి అంతరంగ తరంగాలని అద్భుతంగా ఆవిష్కరించి …. ‘అసూయ, అభిజాత్యం, అహంకారం లాంటి మనోవైకల్యాలని గుర్తెరిగి వాటి మూలాన్ని అర్థం చేసుకుని, దౌర్బల్యాలు తొలగించుకుని ముందున్న జీవితాన్ని సంతోషంగా గడపమని’ సందేశమిచ్చిన ఆచార్యవర్య రాధా మండువ గారూ! రిషీవ్యాలి పిడూరి రాజశేఖర్ గారి అర్ధాంగి రాధా మేడం గారూ!! మంగిడీలు.
ఎంటీవోడి సినిమాలు, బాపూ రమణల భాగవతం టీవీ సీరియల్, గూగుల్ సెర్చ్ ల వల్ల యీ కాపీ డవిలావుగులు రాస్తున్నా గాని, పొట్టపొడిస్తే తెలుగచ్చరం ముక్కలేనోడినే ~ ఇట్లు, బెంగుళూరు బెమ్మ రాచ్చ…
( అఘాధ దుఃఖసాగర నిస్సహాయతలోకి నెట్టేసిన త్రిపురా! దు:ఖాన్ని తొలగించడం సాధ్యమేనా? )
ముందుగా మీకు ధన్యవాదాలు రామయ్యగారూ… ఎప్పుడూ అనుకునే దాన్ని ఈ రామయ్య గారికి కొన్ని కథలు భలే నచ్చుతాయి, నచ్చాక వాటిని గురించి ఎంత బాగా రాస్తారు అని ఆనందపడేదాన్ని. కొంచెం కుళ్ళుకునేదాన్నికూడా సుమా, నేనిన్ని కథలు రాశాను కదా, నా కథని ఒక్కదాన్నైనా ఇలా మెచ్చుకునే రోజు వస్తుందా అనుకుంటుండేదాన్ని. నామినికి, పెంచలయ్యకి చెప్పుకునే దాన్ని కూడా. ఆహా! ఇన్నాళ్ళకి కోరిన కొండ మీద వాన కురిసిందయ్యా నామినీ, ఆ రామయ్య మెచ్చుకున్నట్లే ఉంది. “రామ” అనే శబ్దంలోని ప్రశాంతతని, మనుషులందరూ మంచివాళ్ళే, అందరూ కలిసి మెలిసి ఉండాలి, అర్థం లేని inhibitions మనలో ఉండటం ఎందుకు అనుకోవడాన్ని, అవసరమైన వారికి – నిజంగా అవసరమైన వారికి సహాయం చేయాలని నిజంగా అనుకునే వాళ్ళని – ఇన్ని మాటలెందుకు “దయార్ద్ర హృదయుడు” అంటే సరిపోతుంది కాని కొంతమంది పొగడ్త అనుకుంటారని (మనకి చేతకాందే అది) ఇంత రాశాననమాట. దు:ఖాన్ని తొలగించడం సాధ్యమేనా రామయ్యగారూ… కాబట్టి సాయం చేయబోయి ట్రబుల్ లో పడకండి సుమా!
మీ గురించి ఇంత రాశాననమాట. పైన కామెంట్ లో “మీ గురించి” అనే మాట మిస్ అయిపోయింది
చాలా చక్కని కధ ఈ కధ గురించి అందరూ కామ్ంటేసారుగా ఇంక నాకుమాటలేం మిగల్లేదు. భగవంతుడి ఆశీర్వాదాలతో ఇంకా మంచి కధలు రాయాలని కోరుతూ–సుజలక్క
థాంక్ యు సుజలక్కా!
చాల బావుంది కథ
థాంక్స్ అండీ
బాగుంది రాధ గారు
Thank you
బాగుంది రాధ గారు
చాలా బావుందండి కథ. మనోవైగ్నానికంగా సాగి, చివరికు ముక్కు తిమ్మన్న ముక్కుపై గుద్దేసింది. మీ వచనం సరళం, భావుకం.. థ్యాంక్యూ..
థాంక్ యు మోహన్ గారూ…
రాధ గారు…మీ కృతి కథ ఏకబిగిన చదివిస్తూనే చక్కటి ఆలోచనని కలుగజేసింది..ధన్యవాదాలు…
అభినందనలు చెప్పిన రోజే చదివారనుకున్నానండీ సురేష్ గారూ… ఆలస్యంగానైతేనేం చదివి మీ అభిప్రాయాన్ని చెప్పారు. సంతోషంగా ఉంది. థాంక్ యు.
మీ కలం నుంచి ఈ ఆలోచనా తరంగం ఎంతో కొత్తగా ఉంది రాధ గారు. it’s great to see how it all evolved through so many layers. wish to see many more such pieces from you.
చాలా చాలా బావుందమ్మా… ఇలాంటి ఓ కొత్త కోణంలో ఆలోచన అద్భుతంగా వుంది… మొత్తం కథంతా ఒక్కరే చెప్తున్నా ఆ ఫీల్ కలుగకుండా చక్కగా అక్షరీకరించారు…
ముగింపు ఏమిటో కాస్త బాధగా అనిపించింది అక్క..ఇదేలే తర తరాల చరితం అని కూడా అనిపించింది..
రాజు మారి వస్తాడు అని కాదు కాని…మూలం తెలుసుకుని జీవించడానికి…సిద్ధం అయిందా రాణి…ఆమె లోని మానసిక పరిణితి చెప్పడానికి..ఇంకాస్త రాస్తే బాగుండేదేమో అనిపించింది…కాని ఆసాంతం కట్టి పడేసింది…
రాధా– నిజాలు చాల బాగా చెప్పావు– ఇప్పటికి నాకు అర్థము కానిది– పెళ్ళయిన వ్యక్తిని భార్య పిల్లలున్నరని తెలిసి– వాల్లతో జీవిరాలను పంచుకునె రెండొ వ్యక్తిని— ఏ కారణము అతడిని మరోకరి వైపు మళ్ళించిందొ అనే విషయము తెలిసి అతనితో జీవితాన్ని పంచుకునే వాల్లు– ఎలా? రాధా ఎలా?—
నమస్కారం. కథ చాలా చాలా బాగుంది. ఏకబిగిని చదివించడమే కాదు తిరిగి తిరిగి చదివించింది. కవన శర్మ గారి ఫేసుబుక్ పోస్టు నుంచి ఇక్కడకు వచ్చి చదివాను. సురేష్ కొలిచాల గారు లింకు ఇచ్చి నడిపించారు.
ఇక మీభాష, భావావిష్కరణ, సన్నివేశ నిర్మాణ చాతురి గొప్పగా ఉన్నాయి అంటూ మీకు యోగ్యతా పత్రాలిచ్చే పోజులు నాకే ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పోతే మీకథ చదివినందుకు సొంతోషంగా ఉంది.
కధనం బాగుంది.రాసిన విధానం బావుంది. నిజంగా ఆలోచిస్తే ఏజీవీ ఇంకో జీవిని పూర్తిగా అర్ధం చేసుకోడు, చేసుకోలేడు. మొగవాళ్ళు, ఆడవాళ్ళ మధ్య మాత్రమే కాదు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కూడా సంపూర్ణ అవగాహన అసంభవం.అందుకనే ఇన్ని గొడవలూ, ఇన్ని కేసులూ. ఈ కధనే చిన్నాదేవి వైపు నించి రాస్తే మొత్తం వేరేగా ఉంటుంది.
దేశకాల పరిస్థితుల్ని తెలుసుకోకుండా రాసిన కధ ఇది. ఆ కాలం లో ప్రతి చిన్న రాజుకీ పదిమంది భార్యలూ, వందలకొద్దీ ఉంపుడు గత్తెలు సహజమైన కాలంలో, ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయి తన మొగుడు తనకే సొంతం అని ఎలా భావించగలదు. అలా అనుకున్నా మొగుడు వేరే పెళ్లి చేసుకుంటుంటే గట్టిగా మాట్లాడకుండా ఊరుకుని తరవాత ఏడ్చే నాయికని ఏవిధంగా సమర్ధించవచ్చుఁ .
ఇవాళ్టి భావాలని తీసుకెళ్లి దేశకాలాలు సంపూర్ణంగా భిన్నంగా ఉన్న మరో ప్రపంచానికి తీసుకుపోయి అతికించటం ఆకాలం వాళ్ళని అవమానించటం కాదూ. అప్పటి ధర్మం ప్రకారం అప్పుడు వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పటి ధర్మం ప్రకారం అప్పటి ప్రవర్తనని కొలవటం అసమంజసం కాదూ.
అద్భుతమైన శ్రీపాద వారి కధని ఇలా కలంపోటుతో బహూకరిస్తే ఎలా?