కథ

హైవే

జనవరి 2013

ఫిబ్రవరి 6, 2012, 1.30 am

-” హలో, బహ్దూర్ పురా పోలీస్ స్టేషనా, ఇక్కడ జూ పార్క్ కాడ ఆక్సిడెంట్, స్విఫ్ట్ డిజైర్, హా, 100 స్పీడ్ ల డివైడర్ మీదెక్కి పక్కకున్న బండకు పెట్టింది, ఒక్క డ్రైవర్ తప్ప అందరు చచ్చిపోయిర్రు, 108 కా, హా, సార్, ఫోన్ చేశినం..”
ఫిబ్రవరి 5, 2012, 11.30 p.m
“నాన్నా తొందరగా, ఫ్లైట్ మిస్ ఔతుంది, బాంబే టు జోహాన్నెస్ బర్గ్ కన్నెక్టింగ్ ఫ్లైట్ ఉదయం ఏడింటికే..ఐనా ఇండియాలో ఎక్కడా దొరకనట్టు సౌతాఫ్రికా దాకా పోవాలా నా పెళ్ళికి, ఏంటో మీ పిచ్చిగానీ, సర్లెండి, కష్టపడండి..”
“అవునా సిధ్దు, టికెట్స్ కాన్సిల్ చేద్దామైతే, నీకు చెప్పడం మర్చిపోయా, మొన్నో మాచ్ వొచ్చింది, హైద్రాబాదే, కానీ కీర్తి నిన్ను చంపేస్తే నా బాధ్యత కాదురేయ్, హ హ , అమ్మా విద్యా పిల్లల్రడీ అయ్యారా, శేఖర్ ప్రాజెక్ట్ వర్క్ అయ్యాకా రేపు ఈవెనింగ్ డిల్లీ నుండే వొస్తా అన్నాడు, సిద్దూ నువ్ కూడా మాతో రావొచ్చుగా, ఒక్కడివే ఎలాఉంటావింట్లో”నన్నుడికిస్తూ నాన్న..
“పప్పా, వాడొక్కడే ఎందుకుంటాడిక్కడ, మనల్ని పంపించేసి కీర్తితో షాపింగ్ ప్లాన్చేసాడ్లే, రేయ్, కొంచం ఆ లగేజ్ డిక్కీలో సర్దు, అత్తయ్య ఆవకాయజాడీ తెమ్మంది, శేఖరెందుకో చాలా హాప్పీగా ఉన్నాడురా నీ ఎంగేజ్మెంట్ సౌతాఫ్రాకాలో అంటే..కేప్ టౌన్లో బాచిలర్ పార్టీ చేసుకుంటున్నందుకేనా.. శేఖర్తో ఎక్కువ తాగిస్తే చచ్చావే నా చేతుల్లో..” అక్క ఓ చేత్తో సుహాస్ కి తల దువ్వుతూ మరో చేత్తో అమూల్యకి తినిపిస్తూ..
“సిధ్దు మామా, కీతు ఆంటీతో నీ పెళ్ళికి నా ఫ్రెండ్స్ రింకూ, శాలినీని కూడా పిలవనా వొద్దా.. మొన్న వాళ్ళ డాగ్ బర్త్ డేకి నన్ను ఇన్వైట్ చేయలేదుగా మరి” సుహాస్, ఫిఫ్త్ స్టాండర్డ్..
“మామా, వాళ్ళని పిలవొద్దని చెప్పు అన్నయ్యకి, రింకూ నా జామెట్రీ బాక్స్ తీసుకుని ఎక్కడో పారేసింది” ఏడుపు ముఖంతో అక్క కూతురు అమూల్య..
“పిల్లలూ అల్లరిచేస్తే ఆఫ్రికా ఫారెస్ట్ లో సఫారీకి మిమ్మల్ని తీస్కెళ్ళను, కార్ డ్రైవింగ్ చేసేప్పుడు మామయ్యను విసిగించొద్దు.రేయ్, సిద్దు, ఎన్నిసార్లు చెప్పాలి, డ్రైవింగ్లో వాట్స్ అప్ మెస్సేజ్లు చూడ్డమవసరమా” నాన్న నా పక్క సీట్లో ఒకింత కోపంగా, ఎప్పట్లాగే,
“లేదు నాన్నా, కీతూ మెసేజ్, రేపు షాపింగ్ కి మేబాజ్ ఆ, మాన్యవరా అనడుగుతుంది, అవున్నాన్నా పెళ్ళికి, గాలే ఆడని సూట్, షేర్వాణీలకంటే టీ షర్ట్, షార్ట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందంటావ్, నా కంఫర్ట్ కూడా ఆలోచించండోసారి, అక్కా ఎలా ఉంటుందే, నీ ఒపీనియన్చెప్పు” ముసి ముసిగా నవ్వుతూ నేను.
“సూపర్రా, మీ తమ్ముడు కాస్త తేడా అని మీ బావంటే ఏంటో అనుకున్నా,ఇప్పటికి తెలిసింది, హ హ, కాసేపా ఇంగ్లీష్ పాటలాపి రేడియో ఆన్ చేయ్, ఈ టైమ్కి మెలోడీస్ వొస్తాయ్, అవునూ, అప్పట్లో కీతూకి తెగ డెడికేట్ చేసేవాడివిగా పాటలు, పప్పా, మీ కొడుకులో మనం గుర్తించని అద్భుతమైన సింగరున్నాడు, అనవసరంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని అడవుల వెంట తిరుగుతున్నాడుగానీ, లేపోతే కార్తీక్కి, నరేష్ అయ్యర్కీ గట్టిపోటీ ఉండేది..అంతే కదరా సిధ్దు..హ హ..”అక్క, వెనక సీట్లో, పిల్లల్తో..
“హ హ, ఏంట్రోయ్,నిజమేనా,, అమ్మ పోయేటప్పుడు ఒక్కటే అడిగింది, వాళ్ళ అన్నయ్య కూతురిని నీకే చేసుకోవాలని, కానీ మీరిదివరకే ప్రేమలో ఉన్నారని దానికి తెలీదు, తెలిస్తే సంతోషంగా పోయేదేమో, యూ ఆర్ సచ్ అన్ ఇడియట్, నాకైనా చెప్పాల్సింది, ఈ పాటికే మీ పెళ్ళైపోయేది, మీ మామయ్యక్కాస్త తిక్క.. ఆస్తి చూసుకునో, మరేంటో గానీ.. చదూకోడానికి ఇండియాలో ఉన్న తన కూతుర్ని నువ్వే మాయచేసి ఆస్తికోసం ప్రేమించావని అనుకున్నా అనుకుంటాడు, అందుకే నువ్వూ, కీర్తి ఎల్లుండికల్లా వొచ్చేయండక్కడికి,నువ్వుంటే నాక్కాస్త ధైర్యం రా.అంతే, సిద్దూ, చూసుకో, ఎదురుగా లారీ..”
భా అ అ అ అ అ అ అ న్ న్ న్ న్ న్ న్ డ్ డ్ డ్ డ్ర్ ర్ ర్ ర్ ర్ గ్ గ్ గ్ గ్ శ్ శ్ శ్ శ్ శ్ శ్ శ్ శ్ శ్….
మాటల్లో చెప్పలేనంత పదాల్లోకి మార్చలేనంత వింత శబ్దం,
రెప్పపాటులో రెక్కలు విరిగిన పావురాల్లాగా సుహాస్, అమూల్య, వాళ్ళని చూసి అరిచే ప్రయత్నంలో పగిలిన అద్దమ్ముక్కలు గొంతులో దిగబడి నిశ్శబ్దంగా అక్క,
చేతులు తెగి దూరంగా పడిపోయి నాన్న, నన్నేదో అడగాలనుకుంటున్నట్టు చూస్తూ..
డివైడర్ మీదుగా పల్టీలు కొట్టి కొన్ని జీవితాలను ఆపి ఆగిన కార్, తలలోంచి, చెవుల్లోంచి రక్తం ముఖంపైకి జారుతుండగా, కళ్ళు మూసుకుపోతూ నేను..
****
ఆర్నెల్ల తర్వాత,
కుడికాలు తీసేయబడి హాస్పిటల్నించి డిశ్చార్జై, ఇంటికొచ్చి, ప్లాస్టిక్ సర్జరీకి మారిన నా ముఖాన్ని చూసుకునే ధైర్యంలేక, చీకట్లో దిండుకు తలాన్చి ఏడుస్తూ..నేను..
ఎపుడు నిద్ర పట్టిందో, అసలది నిద్రో నిజమో తెలీకుండా..ఏవో మాటలు..
“సిధ్దూ, కార్ డ్రైవ్ చేసేప్పుడు ఫోన్ ఎందుకురా, అమ్మతో మాట్లాడ్తున్నావా, ఓ సారివ్వు, నేనూ మాట్లాడతా.”.
“తమ్ముడూ కీతూకేనా పాటలు, మాకు లేవా, వెళ్ళేలోగా ఒక్కసారైనా పాడవా మాకోసం “
“మామా, నా జ్యామెట్రీ బాక్స్ పగిలి చేయి కోసుకుపోయింది.చూడు.. “
ఆహ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్ హ్..ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, జరిగిన సంఘటనలు కళ్ళముందుకొచ్చి నిద్రను మింగేస్తూ..
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్.. ఈ టైమ్లో ఫోనా లాండ్ లైన్ కి,
“ఎవరూ, హ, హలో..ఎవరూ” కలా నిజమా నిద్రా అర్ధమవని విషాదపు క్షణాలవెంట నేనూ నడుస్తూ..
-”సిధ్దూ, ఎలా ఉన్నావ్, నేన్, నేను,నీ కీతూని..తన కన్నీళ్ల వేడి నాకు తెలుస్తూ..
ఆక్సిడెంట్ ఐన మర్నాడే బలవంతంగా నాన్న నన్ను ఆఫ్రికాకి తీసుకెళ్ళాడు. ఐ వాజ్ హెల్ప్ లెస్ రా, నీక్కోపం వొస్తుందా ఇప్పటికైనా నేను రాలేదని, ఇంకెప్పటికీ నేను నిన్ను చూడలేను, నన్నడక్కుండా నా పెళ్లి చేస్తున్నారు, రేపే, పోయేముందు నాతో నేను ఒకసారి మాట్లాడాలనిపించి.. నీకంటే నాకెవరున్నారిపుడు”
“కీతూ, కీతూ, డోం టాక్ లైక్ దట్, నీకేం కాదు, మామయ్యతో నేను మాట్లాడతాను, ప్లీజ్, ఫర్ గాడ్సేక్, డోంట్ ఎంటర్టైన్ నీథింగ్ డార్క్, ప్లీజ్ రా”, నా నీడ నన్నొదిలిపోతున్నాట్టవగా
-”లేదురా, హి నెవర్ అగ్రీ, నాకు తెలుసు , అందుకే, ఐ డోంట్ వాంట్ టూ లివ్ అటాల్, చాలాసేపైంది..  నిన్నందుకోలేని నా చేతి నరం తెగి, సారీ ఫరెవ్రీథింగ్ హాప్పెన్డ్ టు యూ హనీ, కుడెంట్ బి విత్ యూ దిస్ టైమ్, టేక్కేర్..”
బీప్ బీప్ బీప్ బీప్ బీప్ బీప్..
“కీతూ కీతూ కీతూ..” లేదు ఇది నిజం కాదు, కల, డామ్ డ్రీమ్..నిజం కాదూ.. కుడి కాలు లేదనే విషయం కిందపడేవరకూ గుర్తురాలేదు..
***
పిచ్చిగా అరుస్తూ, పడుతూ లేస్తూ చివరికి చేరాల్సిన మజిలీ చేరుకుని, ఆ రాత్రి ఆక్సిడెంటైన స్థలానికి,
హైవే మీద వాహనాలు, ఎక్కడికో ఎప్పటికో ఎవరికీ తెలీకుండా ఎడతెగని ప్రయాణం సాగిస్తున్నట్టు, నా గమ్యం అప్పటికే నిర్దేశించబడి..
ఏదో లారీ వొస్తుంది, సమయం లేదు, తొందరగా, నేను నా వాళ్ళని చేరుకోవాలి, రా.. రా.. తొందరగా, అమ్మా, నాన్నా, అక్కా , కీతూ.. ఆమ్ కమింగ్ టూ యూ..ఇది కలా నిజమా, ఏదైతేనేం దీర్ఘనిద్ర పొందడానికి, ,
భయం లేదెందుకో, బాధా లేదు,నా ఒంటరితనానికి నా నిష్క్రమణే సమాధానం..
ఏదో గట్టిగా శరీరానికి వేగాన్నిచ్చి శూన్యంలోకి తోస్తూ,
ఏ శబ్దాలూ వినపడని మహామౌనంలోకి నన్నాహ్వానిస్తూ…