డైరీ

సగంకాలిన సిగరెట్తో – ఓ సాయంత్రపు సంభాషణ

అక్టోబర్ 2014

మేస్టారూ, జీవితానికర్ధముందంటావా?. గురూ, నిన్నే,
నటించింది చాలుగానీ నీకు విన్పించిందన్నాక్తెల్సు, చెప్పు
సగం కాలిన నీకే తెలీదా? అర్ధం లేదుకానీ విలువుంది.
ఇంటిగోడకు వేళ్ళాడదీస్కునే మిస్టిక్ మాడర్న్ ఆర్ట్ పెయింటింగ్లా,
ఫ్రెంచ్ సింబలిస్ట్ “మల్లార్మే” పోయెట్రీలా. అంతూ దరీ అర్ధముండదు, కానీ విలువైంది.
-మరెందుకీ బ్రతుకు? ప్రాణం అస్తిత్వం రెండూ ఒకటేనా!
చరాలకి మాత్రమే ప్రాణముంటుంది, చరాచరాలన్నింటికీ అస్తిత్వముంటుంది.
నాకునేనుగా అస్తిత్వాన్ని కలిగున్నా, ప్రాణం ఉండే ఉంటుందని నమ్ముతున్నా.
(ప్రాణమంటే చైతన్యమే అనుకుని) ఆలోచించలేవు కాబట్టి నీకు నువ్వుగా అస్తిత్వాన్ని కలిగిలేవు,
కానీ నువ్వు నాకు అస్తిత్వాన్ని కలిగున్నావు.
-పార్డన్ ప్లీజ్! ఒక్క ముక్కర్ధమైతే అరిగిపోయిన నీ చెప్పుకిందేసి తొక్కు.
(జనాలకర్ధంకాకుండా మాట్లాడ్డం రాయడం ఒక సైకలాజికల్రోగంరా వెధవా)

“నేను” ఉన్నానని నేను అనుకోడం ప్రాణం, “నేను” ఉన్నానని లోకం నమ్మడం అస్తిత్వం.
(ఏంచెప్పానో ఏంటో) ఓనా ప్రియమైన సిగరెట్టా! నువ్వున్నావని నీకు తెలీదు, నాకు తెలుసు.
-ఎన్నాళ్ళిలా?
నువ్వారిపోతూ మరో సిగరెట్ని వెలిగించేదాకా, నేనారిపోతూ ఆలోచించడం మానేసేదాకా.
-యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ బాసూ, మరి బ్రతకడమే వేస్టా, చావడమ్మంచిదా?
ఇన్ని విరుధ్దభావాల్తో ఎలా చచ్చేది, అసలివేం తెలీకుండా ఉంటే హాయిగా ఉండొచ్చేమో కదా!
యూ ఆర్ జస్ట్ ఓవర్ స్క్రుటినైజింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్టివ్ టు వరల్డ్.
ఏమీ తెలీకుండా ఉండడం అదృష్టమోయ్, అబ్బదందరికీ. బ్రతకడం, బ్రతికేశాం అనిపించుకోడం ముఖ్యమైనయ్ మనకు, నిన్ను కాల్చిన్తర్వాతేగా ఇన్ని మాట్లాడ్తున్నావ్, మండిస్తేనే నీకు బ్రతుకు.
ఎవరూ ఎప్పటికీ స్వేఛ్చగా విశృంఖలంగా బ్రతకలేరు, వాటికీ కొన్ని పరిమితులున్నాయ్.
ఒకరిమీదొకరం ఆధారపడకుండా బ్రతకలేం. అన్నం, నీళ్ళు, మందు, నువ్వు, నన్ను మండించే కొందరి మాటలు, నవ్వించే కొందరి మౌనాలు, నాకవసరం.
-(వీడబ్బా జీవితం, నేనిడిగిందేంటి వీడు చెప్పేదేంటి, తిక్కనా కొడకా!)
ఇవన్నీ కాదుగానీ ఎలా బ్రతకాలో తెలిస్తే జీవితానికర్ధం దొరుకుద్దేమో.
హ హ హ, ఎలా బ్రతకాలో తెలీడమేముంది?

ఐనా నీ బ్రతుకు నువ్వెలా బ్రతకాలో ఎవడో ఎందుకు చెప్పాలి? మహాఐతే ఎందుకు బ్రతకాలో చెప్పగలరేమో ఎవరైనా. నువ్వు తెలుసుకున్న జ్ఞానంతో నీకనుకూలమైన ఒక సిధ్దాంతం పుట్టించుకునే ఉంటావ్గా! జీవితానికర్ధం లేదు బంగారం, సింపుల్ మాథ్స్. లెక్క చేయాలంటే స్పష్టమైన విలువలూ అంతిమ సత్యాలూ తెలిసుండాలి. నీ గతాన్ని నువ్ మార్చలేనప్పుడు, నీ రేపెలా ఉంటుందో నువ్ ఊహించలేనప్పుడు,
మనం తెలుసుకున్న సత్యాలనే అంతిమవిలువలుగా ప్రతిక్షేపించలేం.. బ్రతికినంతకాలం (అందరూ చెప్పేదొకటే) నిన్ను నువ్వు తెలుసుకో. నీకు తెల్సిన నువ్వూ నాకు తెల్సిన నువ్వుల నడుమే నీ జీవితం.

-మనల్ని మనం ఎలా తెల్సుకోగలం?
ఎవరికీ ఎవరూ పూర్తిగా తెలీదు. తననితాను పూర్తిగా తెలుసుకున్న మనిషి తన ఉనికిని భరించలేడు. “ఇంతేనా నేను?” అని “ఇదా నేను?” అని నిరాశతో తననించి తాను పారిపోయి తనకుతానే శత్రువౌతుంటాడు. అన్నింటినీ, ముఖ్యంగా తన అస్తిత్వాన్ని మర్చిపోడానికి ఆలోచనలని ఆపేసుకోడానికి కోరికలని చంపేస్కోడానికి షట్చక్రాల ధ్యానమో మంత్రమో మొదలెడతాడు. ధ్యానమంటే ఏంలేదు మెదడ్ని పూర్తిగా నిద్రపుచ్చడమే.
-ఒసోస్. ఇన్ని మాటల్చెప్తున్నవ్ గా, నీకు నువ్వు తెలుసా?
తెలీదు, ప్రయత్నించాను. అంత సుఖంగా అన్పించలేద్నాకది.
దానికంటేకూడా మన ఆలోచన్ల పుట్టుక, పరిపక్వత, వాటిభౌతిక పరిణామాలు, ప్రతిచర్యగా మళ్ళీ జనించే ఆలోచన్లు- వీట్ని గమనించడమిష్టం. సుఖం కూడా. “నేను” ని తెలుసుకోడానికిదికూడా మార్గమే.
-(ఛ, ఏదో చెప్తాడనుకుంటే సోదిచెప్పి టైమ్ దొబ్బుతున్నాడు)
ఇన్ని పెద్దపెద్ద మాటల్చెప్పి మళ్ళీఓ రెండోశ్రేణి వాక్యం వాడావేంటన్నా”సుఖం” అని?
నీకింకా అర్ధమవలేదా, నేన్నీకు స్వర్గమో శూన్యమో ఇద్దామని తగలెట్టాననుకుంటున్నావా?
కేవలం నా సుఖంకోసం, కొన్ని క్షణాలని సిఫర్(cipher) చేస్కోడంకోసం, కొన్ననుభవాల్ని భవిష్యత్తులోకి రిఫర్ చేయడంకోసం, వేళ్ళనడుమ కప్పెట్టుకున్న అనుభూతులని తవ్వుకోడానికి, నీ “లేని” ప్రాణాన్ని లోకం ఉందనుకుంటున్న “నా” ఊపిరితిత్తుల అస్తిత్వాన్ని తగలేసుకున్నా.
మనిషి తను మనిషినని రుజువు చేసుకోగలిగే ఒకే ఒక్క అవకాశం సుఖపడ్డం.
అందరూ కొట్టుకుచచ్చే ఆ అంతిమసత్యం “ది అల్టిమేట్ ట్రూత్” ఏమిటో చెప్పనా?
ఎవరూ ఎప్పటికీ మరణించరు. అసలెవరికీ మరణం లేదు.
అంతరించిందనుకున్న చరిత్రంతా, నాగరికతలన్నీ మన మూలాలన్నీ, మన రక్తంలో మన జన్యువుల్లో ఉండి మన గొంతులో నిండి మాట్లాడిస్తున్నాయ్.  వారే, ఆ ఆదిమ నీడలే మన కళ్ళవెనక దాక్కుని పురాతనత్వాన్నీ హేతువునీ ప్రశ్నిస్తుంటారు.

నిన్నటి నేను నేను కాదు, కొన్నికోట్ల పిండాల బ్రతుకుల్ని నాలో ఇంకించుకుని ఇవ్వాల్టి నేను రేపటికి ఇలా ఉండను. “నేను” అనిశ్చితి. “నేను” అస్థిరత, “నేను” అన్వేషణ, “నేను” అసంబధ్దత, “నేను” అమూర్తం, “నేను” అగమ్యం,
మన దురదృష్టం. మనిషి దేన్నీ అంతిమంగా అంగీకరించడు, “అంతిమ సత్యా”న్ని కూడా.
ఇదే బ్రహ్మజ్ఞానం, అతున్నత మైకం. ఇది తెలుసుకున్నాక ఇంకేం మిగల్దు.
మిగిలినట్టనిపిస్తే నీకింకా జ్ఞానం సిధ్దించనట్టే మరి.
-తర్వాత,
సర్వం బోధపడ్డాక ఇంకేముంది? రియాల్టీ నే, అప్పుడు మనిషికి ఇల్లు గుర్తొస్తుంది.
భార్యక్కొనిస్తానన్న బంగార్నగ, పిల్లల చదువులు, నిండుకున్న బియ్యం బస్తా, పుచ్చులుపడ్డ వంకాయలు, గుండీ ఊడిన నీ ఊదారంగు చొక్కా గుర్తొస్తాయ్. అది నిజం, అదే నిజం.
ఆకలెస్తుందోయ్, ఏమైనా తినొస్తా , ఇంక నీకు మోక్షానిస్తున్నా పో! వొద్దొద్దు ఆపేయ్, అర్ధమైంది.
మోక్షం ముక్తి అనేవున్నాయనేనా నీ డౌట్? కొన్ని పదాలు (అర్ధాల్తెలీకపోయినా) చదూకోడానికీ రాసుకోడానికీ మాట్లాడుకోడానికీ బావుంటాయ్, దమ్మిడీ లాభముండదు.
ఆత్మగౌరవాలూ మనోభావాలు మనస్సాక్షి పరమానందం లాంటివి ఇంకా బోలెడున్నాయ్.
ఇంక నువ్వు ఛావ్!
p.s :
మనమంతా ఒక బిందువు దగ్గర మొదలై మరో బిందువుదగ్గరాగిపోయే రేఖలం.
అస్టావక్రరేఖలెన్ని వెధవ్వేషాలేసినా చివరికి దిగాల్సింది సరళరేఖాంతానికే.
నిజానికి “నిజం”లో బ్రతకడానికి మూడు మార్గాలు.
1) సరళరేఖలా ఏమీ తెలుసుకోకుండా, ఏమైనా తెలుసుకుంటే బావుండన్న పాడాలోచన
ఒకటుందనికూడా తెలీనంత సుజ్ఞానంతో చివరిబిందువ్వైపు నడవొచ్చు.
2) ప్రపంచం గడవడానికి ఏదో ఉండే ఉంటుందన్నమ్మి, అసలు ప్రపంచం నడిచేది కోరికవల్లేననుకుని,
అసలా కోరిక జీవన్మరణాల్ని తెలుసుకునేందుకు పుస్తకాల్చదివి లోకాల్ని చూసి, అన్నీ వొదిలి అడవులకో లేపోతే లైబ్రరీలకో అంకితమై, కుదిర్తే గడ్డాలూ జుట్టూ పెంచుకుని ఎన్లైటెడ్ మనుషులై, మరీ కుదిర్తే ఆశ్రమాలు పెట్టి, ఖర్చెక్కువనుకుంటే పుస్తకాల్రాసుకుని, తమదైన ఒక విచిత్ర ప్రపంచంలోరోజులు గడిపి అంత్య బిందువుకొస్తారు (సాంఘీక జీవనానికలవాటు పడ్లేక, ఉంటుందనుకున్న అలౌకికజీవితపు మత్తు కొన్నాళ్ళే అని తెలిసి)-
3)వీళ్ళు సరళరేఖలా ఏం తెలుస్కోకుండా ఉండలేరు, అలా అని సంఘాన్నొదిలి వక్రరేఖలై తిరగలేరు.
కానీ వీళ్ళకు జ్ఞానంకావాలి, అదీ రెడీ మేడ్ గా. ఆశ్రమాల్లోంచి స్వాముల్నీ బాబాల్నీ పులిచర్మాలమీంచి లేపి బంగారు పీఠాలెక్కించి, పన్లో పనిగా కష్టడిపడి సంపాయించిన సొమ్ముని ఏకాంతసేవ టికెట్లుగా మార్చుకుని వీలైనంత జ్ఞానాన్ని పొందుతారు. స్వామీజీ శక్తియుక్తులని బట్టి బ్రహ్మజ్ఞానపాతంలో తడిసి పునీతమౌతుంటారప్పుడప్పుడూ.

p.p.s:
ఆద్యంతాల్నడుమ కుదుపులక్కారణమయ్యే చాలావాటిలో “సెక్సువల్ డ్రైవ్” ముఖ్యమైంది.
అసలిదే లేపోతే మనిషే లేడు. కానీ దీనిగురించెవడూ మాట్లాడ్డెందుకో!