కవిత్వం

నాన్న చొక్కా

15-మార్చి-2013

నాన్నా
తొందరగా రా
ప్లేట్లో పలావు చల్లబడేట్టుంది
తొందరగా..
వొచ్చేప్పుడు
వీధిమలుపు కొట్లో జంతికలు మర్చిపోకు
కాస్తంత మద్యం తోడుతెచ్చుకున్నాలే

అవును,
అమ్మ పోయినపుడు నేనేడ్చానా
ఆర్నెల్ల వయసుగా..ఏడ్చే ఉంటానేమో
ఏమో
నవ్వైనా ఉండొచ్చు..
నువ్వేడ్చావా నాన్నా
అసలు నువ్వెప్పుడైనా ఏడ్చావా
ఏడిస్తే నిజంగా బాధ తగ్గుతుందా
తొందరగా రా నాన్నా..
బాధ తగ్గుతుందా ఏడిస్తే
నిజంగా..

నువ్వు నన్నెపుడైనా కొడితే ఏడుపంటే తెలిసేదేమో..
దొంగచాటుగా సిగరెట్ కాల్చినపుడో
పక్కింటమ్మాయికి ప్రేమలేఖ రాసినపుడో
పరీక్షలో తప్పి చెప్పకుండా దాచినపుడో
నీ జేబులోంచి నవ్వుతున్న గాంధీల్ని
బెల్టు షాపుకి బట్వాడా చేసినపుడో..
ఎప్పుడైనా
నువ్వు నన్ను కొట్టుండాల్సింది
ఏడుపంటే తెలిసేటట్టు
నొప్పంటే పరిచయమయ్యేట్టు

ఎంతసేపు నాన్నా..
బడిలో పాఠాలు చెప్పుకుని, నీ
పాత చేతక్ మీద ఊరిలో అందరినీ పలకరించి
శివాలయంలో ప్రసాదం తీసుకుని వొస్తున్నావా
రా తొందరగా..
సీసా సగం శూన్యమై..నా ఆలోచనల్లాగే..
అడిగేవాడివిగా ఎప్పుడూ
తలకు నూనె రాయమని..
నీళ్ళు మరుగుతున్నాయి స్నానానికి

నానా..
నీకేంకావాలో చెప్పు నా మొదటి జీతంతో
రాహుల్ సాంకృత్యాయన్నీ సార్త్ర్ నీ మోసుకొచ్చేయనా
బాలమురళినీ ఈమని నీ జుగల్బంధించనా
చెప్పు
చెప్పు నాన్నా
ఏడుపంటే తెలుస్తుంది ఇప్పుడే
నిశ్శబ్దంగా ఉండకిక..

నాన్నా
నీకెపుడైనా భయం వేసిందా
నాక్కాస్త భయాన్నీ వొంపవూ..
నటించే ధైర్యంకంటే ఏడిపించే భయమే కావాలిపుడు

నిన్ను మింగిన కాలం
త్రేన్చిన అరుపులింకా చెవులనొదలకుండా..
నువ్వూ పోతావంటే నేనసలు వొచ్చేవాడినేనా

నాన్నా
నీ చొక్కాజేబు తడుముతుంటే
ఆగిన నీ గుండె చేతికంటుతుంది..
నాన్నా
ఒక్కసారొచ్చి తీసుకుపొవా
ఆ చొక్కాని
వీలైతే నన్నూ..