కవిత్వం

ఎదురుచూపు

22-ఫిబ్రవరి-2013

కోఠి వుమెన్స్ కాలేజ్ బస్ స్టాప్
నడి నెత్తిమీద నిర్ధాక్షిణ్యంగా దూకుతూ మిట్టమధ్యాహ్నపు ఎండ..

నమ్మరుగానీ
ఎదుచూడ్డం పెద్దకష్టమేం కాదు ఓ సారలవాటైతే..
సమయాన్నెలా చంపాలో తెలిసుండడమే అసలు కిటుకు..
ఆమె వొచ్చేదాకా
బస్ షెల్టర్ వెనకున్న కొద్దిజాగాలో
నన్నప్పటిదాకా నిద్రపుచ్చిన నా అతుకుల బొంతను మడతపెట్టి,
సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానా
వెదజల్లే పచ్చిబొడ్డు మాయ పరిమళాలను తప్పక పీల్చి,
రాత్రి చెత్తతొట్లో పందులతో పోరాడి గెలుచుకున్న
అభ్రకాయితపు చల్లారిన బిర్యానీని గారపళ్ళ పాచినోటికి కుక్కుకొని,
రోడ్డు వారగానో, సుజాతా లా బుక్స్ ముందో కడుపు ఖాలీ చేసుకుని
అట్టలుకట్టిన జుట్టుని కుళాయినీటితో కడుక్కుని,
సగం కాల్చిన బీడీ ముక్కలు కనబడితే పూర్తిగా తగలేసి, ఎప్పట్లాగే
ఎదురుచూస్తుంటాను ఒంటిగంటకు ప్రత్యక్షమయ్యే ఆమెకోసం ..

ఎప్పుడు పుట్టానో ఎవరికి పుట్టానో అని
ఆలోచించడం మానేసినప్పటినుంచి బిచ్చగాడినై అడుక్కుంటూనే..
మనుషులకు దేవుడంటే భయమో భక్తో
ఉన్నంతవరకూ నా కడుపు కళకళలాడుతూనే..

మొదటగా చూసిందెప్పుడో ఆమెని
బ్యాంక్ స్ట్రీట్లోనా.. చాదర్ఘాట్ సిగ్నల్ దగ్గరా..
అర్ధరూపాయా రెండ్రూపాయలా.. ఎంతిచ్చిందో..
ఆమె పేరేమిటో.. అసలు నాకు పేరెందుకు లేదు..అందుకేనా
ఎవరూ నాతో మాట్లాడరు..నాకూ
ఓ పేరుండి, నేనూ రోజూ స్నానం చేస్తే దేవుడ్ని చూడొచ్చా..
గుడిమెట్లేతప్ప గుడిలోకెవరూ రానీయలేదు బుధ్దెరిగాక, ఎప్పుడో
ఇలా ఓ దేవత నవ్వి నాణెం విసిరితే పండగే మర్నాకు..

ఒంటిగంట దాటినా ఆగక, నన్ను నిరాశలో ముంచుతూ కాలం..
రాకాసుల్లా పొగలూదుతూ అమాయకంగా ఆగుతున్న బస్సులు
1P, 2J, 3A, 40, 45..
ఆమె ఎక్కేది “86″ గా, ఇంకెంతసేపు ఎదురుచూడాలి
ఎక్కడినుండొస్తుందో ఎక్కడికెళుతుందో ఆమె
ఈ మజిలీలో ఆగి నా రోజుని నిర్దేశిస్తూ రోజూ..
అడుక్కుంటే బొచ్చైనా నిండేదీప్పటికి,
ఎదురుగా నుంచున్న అమ్మాయిని పదిహేడో సారి దొంగచాటుగా చూసి ఇప్పటికీ,
ఇంకెంతసేపీ ఎదురుచూపు..ఒకవేళ ఆమె రాకపోతే..
ఆమెకేదైనా జరిగుంటే..నేనేం చేయాలపుడు, ఎలా చూడాలి ఆమెను..
అసలు నేనెందుకు ఆమెని చూడ్డం..ఉహు,
ఆమెకేమవదు..ఏం అవొద్దు..బిచ్చగాడి మాట వంకరపోదెన్నటికీ..

ఆమింకా ఎందుకు రాలేదు..
“86″ కూడా గమ్యంవేపు దూసుకుపోతూ…ఆ వొస్తున్న శవాల
ఊరేగింపులో ఆడితే ఓ పిచ్చి క్వార్టరూ, అరచేతుల్నిండా చిల్లరా మిగిలేవేమో..
వెళ్తే.. ఉహూ..ఆమె వొస్తేనో.. నాకోసం చూస్తేనో.. వొద్దొద్దు..ఇక్కడే ఉంటాను.. ఉండాలి..

ముప్పై ముప్పయ్యైదేళ్ళుంటాయేమో..పెళ్ళైయ్యుంటుందా..
ఎంత దయగా నవ్వుతుందో ఆమె, అందరూ అలా నవ్వగలిగితే బావుండు..
స్ఫోటకపు మచ్చల్తో, బండముక్కు, నల్లటి పెదాలతో నా నవ్వెలా ఉంటుందో..
అద్దంలో నన్ను నాకు చూపిస్తే గుర్తిస్తానో లేదో..

సూర్యుడు పడకింటివేపు పరిగెడ్తూ..
వుమెన్స్ కాలేజ్ అమ్మయిలూ, వెనకే ఆ
చూపులకోసం వెతికే పాంట్లూ చొక్కాలూ,
పగిలిన పుట్ట పంపేసిన చీమలై, సాయంత్రాన్ని నిరూపిస్తూ..

ఆమె ఇక రాదేమో..
రాత్రి తిండి అడుక్కోడానికి పోవాల్సిందే ఇక, నే
వెళ్ళాక ఆమె వొస్తేనో, లేదు లేదు, నేనిక్కడే ఉండాలి,
అసలామె నన్ను మనిషిలా చూస్తుందా, బిచ్చగాడినెవరైనా మనిషిలా చూడగలరా..

మొన్న మిగిలిన గుడుంబా పొట్లాన్ని కడుపులో దాచుకుని
ముతకవాసనేస్తున్న నా బొంతను చర్మానికి అతికించుకుని
ఆమెకోసం వెతుకుతుండగా, ఇంకాసిన్ని బస్సుల్ని నిద్రలేపుతూ కాలం..
నన్నే చూస్తూ నా ఖాలీ బొచ్చె..

నిజమే,
ఎదురుచూడ్డం పెద్ద కష్టమేం కాదు,
సమయాన్ని చంపేసే కిటుకు తెలిస్తే..