కథ

పాపం

జూన్ 2013

“నారిగా, ఇంకా ఎంతసేపు రా, అర ప్యాక్ సిగరెట్లు బూడిదయ్యాయిప్పటికే, చిక్కడపల్లీ S.V కార్నర్ కేఫ్ కొచ్చెయ్,
హీరోయిన్ దొరికిందా, రాత్రిలోగా షూటింగ్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ఎల్లుండి వరకు ఐపోతేనే మనకు డబ్బులిస్తాట్ట..”

“అన్నా, వొస్తున్నా, పాత హీరోయిన్‌కి కడుపట, వేరేవాళ్ళను వెతికేసరికి ఇలా, బాబాయ్ ఫోన్చేసాడు నువ్ మొబైల్ ఆన్సర్ చేయట్లేదని, ఫైనాన్స్ వాడు ఇంటికొచ్చి గొడవేసుకున్నాడట, ఇంతకీ హీరోయినెవరో తెలుసా, నీ ఫ్రెండ్ సుధీర్ వైఫ్..సుధీర్ కస్టాల్లో ఉన్నాడని తెల్సుగానీ, మరీ ఇంతా..”

“సర్లే, వొచ్చాక మాట్లాడదాం, లత ముందు ఇవేం వాగకు, కార్లోనే గా, జాగర్తగా డ్రైవ్ చెయ్”
వాడి మాటలతో ఆలోచనలెటు పరిగెడ్తున్నాయో తెలీక సంభాషణని సగంలోనే తుంచడానికి ఫోన్ కట్ చేసి నేను..

ఐదేళ్ళై ఉంటుందా ఆర్యసమాజ్‌లో సుధీర్, లతల పెళ్ళై, అప్పటికే లత ప్రెగ్నెంట్, అబార్షన్ కీ ఒప్పుకోలేదు,
పిల్లాడు పుట్టాక సుధీర్ వ్యాపారంలో నష్టపోయాడని విన్నాను, అందర్లాగే నేనూ కష్టాల్లో ఉన్న మిత్రుణ్ణి పరామర్శించడానికి జంకానా, అవునేమో, మనం చేసే ప్రతి మంచిలో సత్యమున్నట్టే, చెడులో కూడా సత్యముంటుంది, ఉండాలి, లేపోతే, తిండికే లేన్నేను మరొకడికి సాయం చేయడమేంటి..

“సర్, మిమ్మల్నే, సమోసా చల్లారుతుంది, తినండి, తెచ్చి చాలా సేపయింది”
సర్వర్.. పదినిమిషాల క్రితం సిగరెట్లు తేగా మిగిలిన చిల్లర ఇవ్వాల్సిన అవసరం లేకుండా నన్ను కాకా పడ్తూ, వర్తమానపు నిజాల్ని కాసేపు మర్చిపోడానికి గతాన్నో భవిష్యత్తునో ఆలోచించడమలవాటై..
ఏ ఆలోచనకైనా అంతిమ లక్ష్యం శరీరాన్ని బుధ్దినీ అలిసిపోయేలా చేయడమేనా..
వాష్ బేసిన్ మీద గోడకు వేలాడ్తున్న వినాయకుడికి నా సిగరెట్ పొగ హారతిపడుతూ,
నిజంగా దేవుడుంటే, హారతులకు మొహమ్మాడి, అభిషేకాలకు ఊపిరాడక ఎప్పుడో పరారయ్యేవాడు గుళ్ళలోంచి..
నావరకూ, చేసే పనే దైవం.. డబ్బు అప్రధాన్యం ,
సుధీర్‌తో ఓ సారి మాట్లాడితే, వొద్దొద్దు, లత ఇక్కడికొస్తుందని వాడికి చెప్పాలపుడు, అసలు వాడికి తెలుసా, తనిలా బ్లూ ఫిల్మ్స్ లో ఆక్ట్ చేస్తుందని, అసలు నారిగాడేం చెప్పి చచ్చాడో, అది లతకెలా అర్ధమైందో ..షిట్, తను నన్నిక్కడ చూస్తే సుధీర్‌కి చెప్తుందా,
లేదు, షార్ట్ ఫిల్మ్ కి ఫోటోగ్రాఫర్ కావాలని నన్నిక్కడికి తెచ్చారని, కానీ అది అబధ్దమని తెలిసి వెళ్ళిపోతున్నానని, నువ్ కూడా వెళ్ళిపో. ఇదో చీకటి రాజ్యం అని చెప్పేస్తే..
నమ్ముతుందా..ఎప్పటికైనా నమ్మకం అవసరమ్మీదే ఆధారపడుతుందెందుకో..
ప్రొడ్యూసర్ కం డైరెక్టర్గాడిక్కూడా చెప్పేస్తాను, హీరోయిన్ లేదనీ, షూటింగ్ నాల్రోజుల్తర్వాత పెట్టుకుందామనీ, అంతే..అంతే..లత నన్ను తప్పుగా అనుకోపోతే చాలు..

ప్రొడ్యూసర్గాడికి నూరేళ్ళు, వాడే ఫోన్జేస్తున్నాడేమిటో..

“ఛోటూ, సింగల్ ఛాయ్ పంపు,
హలో..ప్రొడ్యూసర్గారూ, చెప్పండి..”

“పెద్ద చిక్కొచ్చిందయ్యా, మన హీరో వేరే ఫిల్మ్ లో బిజీగా ఉన్నాట్ట, రేప్పొద్దునైతేగానీ రాడట, మనకీరాత్రికే షూటింగైపోవాలి, తప్పదు బడ్జెట్ లేదిక, పోనీ నువ్ చేయరాదూ హీరోగా, చూసాన్నిన్ను, బావుంటావ్ కండల్తో..కెమెరాపనికి నీకొచ్చేదానికి ఐదింతలిస్తా. అవునోయ్, పెళ్ళైందా నీకు, ఏమైనా అనుభవముందా అని, ఐనా ఇప్పటి కుర్రాళ్ళను అడగాల్సిన ప్రశ్నా ఇది.హ హ..సర్లే, ఆలోచించుకుని చెప్పవోయ్”

గుండెవేగం హెచ్చి, చెమటలు ముఖాన్ని నింపి, కడుపులో ఏదో అలజడి.. ఏంటిదంతా..
ఒక్కరాత్రికి లక్ష, అప్పులు తీర్చి పెళ్ళిచేసుకుని, నాన్న నవ్వితే చూడాలనుందోసారి, కానీ నేను..లతతో… మంచమ్మీద..
తప్పేంటి.. నేను కాపోతే ఎవరోఒకరు గడపాల్సిందేగా తనతో, నాలాగే తనకెన్ని అవసరాలో. ఐనా ఇక్కడికొచ్చేవాళ్ళు ఏం తెలీకుండా అంత అమాయకంగా రారుగా, తనని గుర్తుపట్టనట్టుంటే సరి,అంతే, యెస్, ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటే లక్ష నావౌతూ.
ఫ్రీజర్ మీద “కోకో కోలా ఓపెన్ హాప్పీనెస్” యాడ్ కళ్ళకతుక్కుని కర్తవ్యబోధ చేస్తుండగా, చల్లారిన ఛాయ్ ని చప్పరిస్తూ నాలిక..

చేసే పనే దైవం, కానీ పుణ్యంతోపాటూ అర్ధమూ కావాలిగా ఆకలికి, ఆలోచించింది చాలిక, తొందరగా ప్రొడ్యూసర్గాడికి ఫోన్‌చేసి చెప్పెయ్, నేనేం తప్పు చేయట్లేదుగా, తప్పొప్పులు నిర్ణయిస్తూ కూర్చుంటే గమ్యం చేరలేం, అందరూ చూసేది ఆఖరి మజిలీనేగానీ గమనాన్ని కాదేమో,

***

“లైట్స్ ఆన్..కేమెరా..యాక్షన్..: డైరెక్టర్ కం ప్రొ గాడి అరుపు, హోటల్ రూంలో పరుపు మీద లత, అప్పటికంటే అందంగా, నన్నెందుకో తొలిసారి చూసినట్టుగా ప్రవర్తిస్తూ, పరవశిస్తూ నన్ను దగ్గరికి లాక్కుంటూ..
తన కళ్ళలో కన్నీటిపొర కదుల్తూ.. బహుశా నేనొక్కడినే చూడగలుగుతున్నానా, ఆశ్చర్యం, నా కళ్ళూ మసకలై తన ముఖాన ఓ దరహాసరేఖ మెరుస్తూ, నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టుంది..ఎక్కడో..
నాలోనేనా..