కవిత్వం

ఒక స్వప్నం – రెండు మెలకువలు

జనవరి 2013

దుప్పటి చిరుగులగుండా తప్పిపోయిన చుక్కల్ని లెక్కిస్తూనో
చిక్కటి చీకటి చిమ్మిన వాసనల్ని నాసికమీదుగా తెలివికి పట్టిస్తూనో
ఓ కలను కళ్ళకద్దుకోవాలి
ఈ రోజైనా..

పసివాడి ఏడుపుని ఎప్పట్లాగే బహిష్కరించి
మనిద్దరం ఏకాంతంగా నగ్న నాగులమై సంగమిస్తున్నపుడు
శాశ్వతంగా ఆగిన ఓ చిరుశ్వాస,
ఆ ఙ్నాపకాలని సృజించే నీ స్పర్శనుండి యుగాలుగా
నేను అస్పృశ్యమై పారిపోతుండగా
పాలకడలిలో దాహం తీర్చుకుంటూ వాడు, మనవాడే,
ఎందుకొచ్చావని ప్రశ్నిస్తూ..

నరకంలో నా తండ్రి,
కంటి శుక్లాలకు చూపుని చిదిమేసి
పచ్చని పొలాలమ్మి పిచ్చుకలగుంపును చెదరగొట్టిన
నా మీద యముడికి పితూరీలు చెప్తూ..
విచిత్రం, యముడు నా తండ్రి పాదాల మీద
ఏడుస్తూ, అతణ్ణి నవ్విస్తూ..

బాల్యం దొంగిలించిన పెన్సిల్
కాలంతో పెరిగి, గుండెల్లో గుచ్చడానికేమో రంపాలతో పదునుదేల్చుకుని
లోకపు కూడళ్ళపై నా బొమ్మగీసి “దొంగలకు దొంగ” అని అరుస్తుండగా,
సాక్షానికొస్తూ
నేనిన్నాళ్ళూ తస్కరించిన ఙ్నానం..

శూన్యం దగ్గర అపరిచితుడు, ఊర్ధ్వముఖంగా..
ఆలోచనల వేగం మా దూరాన్ని తగ్గిస్తుంటే
అతన్నెపుడో కలిసిన ఆనవాలు కలలో ఉపకలలా మెరుస్తూ,
ఆకాశం అద్దమై అతడి ముఖం లేని ముఖాన్ని చూపగా
అనుమానమేమీ లేకుండా నేనకున్నదే నిజమై ..
నా ముఖం తప్ప మిగతా శరీరం శూన్యమై..

అనుభవాలే కలలౌతాయో
కలలే అనుభవాలిస్తాయో.
ఏ కలా నన్ను నానుండి దాచలేక
ప్రతీ కలా.. ఓ ప్రతీక లా,

రెండుమెలకువల మధ్య
వంతెనైన సుషుప్తికి ఆధారమయే అవస్థే కలలై,
మనస్సంద్రాన
ఒడ్డుకొచ్చి మరలే అలలే కలలై,
నిజంగా
కొన్ని కలలు నిజంకంటే గొప్పగా దృశ్యాలు ఆవిష్కరిస్తూ..
అబధ్దాన్ని నిజం చేసే పరిణామంలో వేకువకి దొరికిపోతూ..