కవిత్వం

పాడుబడిన సంధ్య

01-ఫిబ్రవరి-2013

నాకెప్పటికీ సాయంరాని సాయంసంధ్య
పగటిని పగల్దీసి పాయల్జేసి
అంగాలన్నీ ఒక్కోటే నరుక్కుంటూ
చిట్లిపోయి చితికిన నల్లటితునకల్ని కలిపికుట్టింది..

ఆఖరి కిరణం భూమ్మీద నాటుకుని ఓ
చీకటివిత్తనాన్ని మొలిపించగానే, ఎప్పట్లాగే
నాదికాని నా ప్రపంచాన్ని నామీద పాతేసి
సరిహద్దులు దాటిన
మూలశంక మొహమేసుకున్న కాల్చేసిన సిగరెట్ పీకలా
సూర్యుడు..

వెలుగుకీ తమోరేఖకీ నడుమ నటిస్తున్న సంధికాలంలో
నిద్రలేస్తూ అరణ్యాలు,స్మశానాలు, ఉద్యమాలు, వికటపాలోచన్లు..
ఉదయాస్తమయాల్ని నిర్దేశించుకోలేక
కాసేపు భ్రమణమాపి కాస్మోస్ ని పీలుస్తూ భూమి.

రజస్వలించిన రక్తపు దారులేస్తూ
అర్ధగోళాన్నాక్రమిస్తూ చీకటి..
సంధ్యకి అతిమామూలుగా నదిలో నీళ్ళొదిలి
నింగికి నీలిమలనద్దుకుంటూ నాగరికుడు..

శిథిలాల్లోంచి నిర్మాణాలు, నాగరికతల్లోంచి ఆటవికతలూ
కోట్లసంవత్సరాలుగా పునరావృతమౌతూనే..
పొరల్లో పాపాల్నీ ప్రాయశ్చిత్తాల్నీ కప్పుకుని
రేపుని కలగంటూ చరిత్ర…
తన నీడనెక్కి దారితప్పింది
పాడుబడిన సంధ్య..