కవిత్వం

రెండో రాత్రి

19-జూలై-2013

సమాంతర లోకాలనడుమ
పోగొట్టుకున్న కళ్ళనీ, కన్నీళ్ళనీ
చర్మపు గోడనీడన వెతుకుతూ
రక్తపు నాలిక..

అద్దం
పగిలిన నిశ్శబ్దపు కమురువాసనలతో
కాలిన రాబందుల రతి
ఎండిన చెట్టుమీద

సమాధిన బాల్యపు మలంలో
అజీర్ణమైన ఓ అయోమయపు కల
మీద ఇసుక చల్లుతూ
సాయంత్రాకాశపు అసంతృప్త సముద్రం..

అక్షరాలు కప్పుకున్న సీసాలోంచి
శాపగ్రస్థపు బల్లిమూతి
విదిల్చిన నిషిధ్దవాక్యపు
రంగుపువ్వుల చెమట బూడిద..
నోటికో..నుదుటికో..

నేలతవ్విన వెన్నెలల్లో
కాళ్ళు కడుక్కుంటూ
మొండెంలేని కాలం
చెప్పుల్లో చేరని క్షితిజమ్మీద..

చేతివేళ్ళదాకా మెలితిరుగుతున్న
కడుపులో దుఃఖపు నొప్పికి
ఙ్నాపకాల జెండా మీద
అదృశ్య గతాల అవనతం..
మంచు కురిసిన మురిక్కాలవలో ఈదుతూ
ప్రాణం.. ఆత్మనొంటరి చేసి..

రెండో రాత్రి సమీపిస్తోంది
కళ్ళనీ కన్నీళ్ళనీ తొడుక్కోవాలి..
ఒక్క మనిషైనా కనపడకపోతాడా
ఉమ్మేసిన మొహాన్ని తుడుచుకోడానికి..
కనీసం వినపడకపోతాడా
ఒక్క మనిషైనా..
కప్పేసిన మోహాల్ని తెరుచుకోడానికి