ప్రత్యేకం

మెటాకవితలు మూడు

ఫిబ్రవరి 2017

ముదుసలిగా కవి చిత్రం

1.
రాతబల్ల దగ్గర నేనుండగానే
పిల్లలు నా సమాధిమీద ఆడుకుంటుంటారు
నా చిట్టచివరి పద్యం పూర్తవుతుంది
నా కీర్తిశేషాన్ని వాళ్లు తుడిచేస్తారు
అప్పుడిక నేనొక భారద్వాజాన్నని
ఎవరికీ తెలిసే అవకాశం లేదు
చీకటి మూలల్లో కీచురాయినై కూసానని మాత్రమే
చరిత్ర గుట్టుగా చెప్పుకుంటుంది

2.
ఎందుకలా మూర్ఖంగా
శాపగ్రస్త పదాలని కూరుస్తూ ఉంటావు?
ఎంత కాలమని మూర్ఖంగా
జీరబోయిన చరణాలకి
జీవం పోస్తూ ఉంటావు?
ఊరంతా కూలిపోయింది నిద్రలోకి,
అచేతనంగా ప్రపంచం
నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు
పండు ముత్తైదువలా నీ పద్యం ఒకటి
కాలంచెల్లిన కట్టుబాటుతో
తన గతవైభవాల గాథలని మోసుకొస్తుంది
అయితే ఏం,
ఆమెతో నా ప్రేమ కూడా ఈనాటిది కాదుగా

Portrait of a poet as an old man, by Leah Goldberg
English Translation: Anne Canter
Telugu Translation: Nagaraju Pappu


ఇస్రాయెల్ కి చెందిన ప్రసిద్ఢ కవయిత్రి Leah Goldberg. హీబ్రూలో ప్రథమ శ్రేణి కవయిత్రి. రెండో ప్రపంచ యుద్ధం, ఇస్రాయెల్ స్వాతంత్రం, యూదుల వలసలు, హోలోకాస్టు ఇవన్నీGoldberg వస్తువులు. ఆమె రాసిన కవితల్ని చదువుతున్నప్పుడు నాకు శ్రీశ్రీ ఖడ్గసృష్టి జ్ఞప్తికి వచ్చింది. ఆధునిక హీబ్రూ సాహిత్యంలో గోల్డ్ బర్గ్ కవిత్వాన్ని శబ్ద సౌందర్యానికి, లిరికల్ నిర్మాణానికి, ప్రకృతి చిత్రాలకి చిరునామాగా చెప్పుకుంటారు.కవిని, కవిత్వానుభూతిని ఒక చిత్రంగా పోల్చి చూపించే పద్యాలు చాలా కనిపిస్తాయి Portrait of a poet as a craftsman, as a young man, as an artist ఇలా ఎన్నో. ఆ బాణీకి చెందిన కవిత ఇది. ఆఫ్రికన్ భాషలో వచ్చిన poet as a housewife అనే పద్యం ఈ బాణీలో వచ్చిన మరో చక్కటి పద్యం.

Pages: 1 2 3