ప్రత్యేకం

మెటాకవితలు మూడు

ఫిబ్రవరి 2017

నువ్వు ఎదురుచూస్తున్న పద్యం

రగా నాలోకి తొంగి చూస్తూ అతను
నా రాక కోసం, నన్ను తీసుకుపోవడం కోసం
ఒక విసుగులేని ఎదురు చూపుని
అతని తేటకళ్లలో నేనొకనాడు చూశాను

నా విశ్వాసపు పాటలోని ముసలి మూలుగుల్నీ
అది చూపించిన ఉక్కురంగు కొండల్నీ చూశాను.
వాటికోసమే వెతుకుతున్నానని
మరచిపోయేటంత దూరం వచ్చాను

యుగాల క్రితం నాకు పరిచితమైన నీకోసం
నాతో వెతికించుకోవడానికే
నువ్వు జన్మించిన సంగతిని మరచిపోయావనీ
ఎన్నో జన్మలుగా నీకోసం తపిస్తున్నాననీ
నిన్ను నువ్వు కోల్పోడానికే
నన్ను మరచిపోతుంటావనీ
అప్పుడే గుర్తించాను

మనిద్దరి జన్మాంతర శక్తులు ఏవో
ఆ పర్వతసానువుల మధ్య తవ్విన
ఒక సెలయేట్లో
నేనెప్పుడో మునిగిపోతాను

అదిగో తిరిగి మళ్లీ మొదటిసారి
అక్కడి పచ్చికబయళ్లలో
నాతో షికారుకి రమ్మని నిన్ను ఆహ్వానించాను
అక్కడే, నువ్వెప్పటినుండో వెతుక్కుంటున్న
పద్యాన్ని, అస్తవ్యస్తమైన నీ శైలిలో గరుకు దారులన్నీ
నునుపుతేలేదాకా నేను చదివి వినిపించలేదూ,
అది వింటూ నువ్వు నిదురలోకి జారుకోలేదూ?

నువ్వు లేకపోతే నాకు శాశ్వతత్వం
దొరుకుతుందనే నా ఆలోచన నుంచీ
నువ్వు దూరంగా జరుగుతూ ఉంటావు
నువ్వక్కడ గురక పెడుతూ నిద్రలోకి జారినప్పుడూ
నిన్ను చూస్తూ, నువ్వు తిరిగి నాకోసం మేలుకొనేదాకా
నేను అక్కడే నీకోసం కనిపెట్టుకుని ఉంటాన్లే.

The Poem You Have Been Waiting for, by TarfiaFaizullah
Telugu Translation: Nagaraju Pappu


అమెరికాలో స్థిరపడి, అక్కడే చదువుకున్న TarfiaFaizullah బంగ్లాదేశ్ కి చెందిన కవయిత్రి. ఆమె తన కవిత్వంలో బంగ్లా స్త్రీల సమస్యలను, 1971 యుద్ధంలో బంగ్లా స్త్రీలపై పాకిస్తాన్ సైనికుల అత్యాచారాల చరిత్రను చిత్రించారు.

**** (*) ****

Pages: 1 2 3