ఆమె మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, ఒక్కోసారి ఘాటుగా ఉంటాయి. “పొద్దుపొద్దునే మొహం కడుక్కోగానే నేను చేసే పని నాలుకకు పదును పెట్టడం” అని నిస్సంకోచంగా చెప్పగలిగే తెగువ కూడా ఉంది. స్వేచ్చనీ, ప్రేమనీ సమానంగా కోరుకుని ఒంటరితనంతో మిగిలిపోయే ఒక స్త్రీ గొంతుక ఆమె రచనల్లో వినపడుతుంది.
కథకురాలిగా, కవయిత్రిగా, విమర్శకురాలిగా, సంపాదకురాలిగా సాహిత్యంతో సుదీర్ఘమైన, గాఢమైన అనుబంధం ఉన్న మహిళ డొరోతీ పార్కర్ (ఆగస్ట్ 22, 1893 – జూన్ 7, 1967). ఆవిడ స్క్రీన్ ప్లే రాసిన సినిమాలు అకాడమీ అవార్డులని గెలుచుకుని ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. డొరోతీ రచనలు ఆమె ఆదర్శాలకి, రాజకీయ, సామాజిక అభిప్రాయాలకి అద్దం పడతాయి.
“నేనొక స్త్రీవాదిని. స్త్రీల గురించిన విషయాలకే కట్టుబడి ఉంటాను. ఈ నగరంలో కనీస సౌకర్యాలు లేని రోజుల్లో కూడా మహిళా ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం. ఆడవాళ్లకు సమానహక్కుల కోసం ఎన్నో నిరసనల్లో భాగమయ్యాం. సరదాకోసం ఊహాత్మకమైన కథలు రాసే రచయిత్రులు పుట్టుకొస్తారని అప్పుడు ఊహించలేదు.”
తన రచనల ప్రయోజనం ఏమిటో పై మాటల్లో డొరోతీ స్పష్టం చేసింది. ఈ బలమైన అభిప్రాయలు, కార్యకలాపాల వల్ల ఆవిడ తన సినీ రచనా వ్యాసాంగానికి దూరం కావల్సి వచ్చింది కూడా.
డొరోతీ రచనాశైలిలో కొట్టొచ్చినట్టు కనపడేది వ్యంగ్యం. మూస ఆలోచనల్ని, కట్టుబాట్లని కాదని స్వతంత్రభావాల్ని, ప్రతీ స్త్రీకీ ఉండే ప్రత్యేకమైన అభిరుచుల్ని, ఆకాంక్షలనీ వ్యక్తపరచడం ఆవిడ రచనల ప్రధాన ఉద్దేశం. హాస్యం, చమత్కారం ఆమె వాక్యానికి అలంకారాలు. నిజాయితీ, నిర్మొహమాటత్వం, ధైర్యం ఆవిడ రచనల్లోనూ, జీవన విధానంలోనూ అడుగడుగునా కనిపిస్తాయి.
మచ్చుకి కొన్ని డొరోతీ వాక్యాలు:
ఆమె పద్ధెనిమిది భాషలు మాట్లాడగలదు. కానీ ఏ ఒక్క భాషలోనూ “కాదు” అని చెప్పడం రాదు.
నాకు మగవాళ్లలో నచ్చేవి మూడు విషయాలు- అందం, క్రూరత్వం, మూర్ఖత్వం.
నన్ను తీసుకెళ్ళు, లేకపోతే వదిలెయ్. లేదంటే ఎప్పట్లానే రెండూ చెయ్యి.
పారిస్ రివ్యూ ఇంటర్వ్యూ లోని కొన్ని ప్రశ్నలు, సమాధానాలు:
బాల్యంలోని అనుభవాలని మీ కథలకి ప్రేరణగా వాడుకున్నారా?
-అవేగనక రాసుంటే మీరిప్పుడు నాతో కూర్చుని మాట్లాడేవాళ్ళు కాదు.
ఐతే, మీ రచనలకి ప్రేరణ?
- డబ్బుతో నాకున్న అవసరం
అది కాకుండా?
- మనకి ఇష్టం లేనివాటిని గురించి రాయడం చాలా తేలిక. ఒక చెత్త పుస్తకమో, పనికిరాని నాటకం గురించో అడిగితే చక్కగా రాయొచ్చు.
“బిగ్ బ్లాండ్” ఆలోచన ఎలా వచ్చింది?
- నా స్నేహితురాలు ఒకావిడ చాలా కష్టాలు పడటం చూశాను. చూసింది, అనుభవించింది రాయడమే రచయితల పని అనుకుంటాను. అభూతకల్పనలు నాకిష్టం ఉండవు.
మీరు కథలెలా రాస్తారు? ముందొక చిత్తు రాసుకుని తర్వాత తిరగరాస్తారా?
- ఒక కథ రాయడానికి నాకు ఆర్నెల్లు పడుతుంది. పూర్తిగా ఆలోచించుకొని ఒక్కో వాక్యమూ జాగ్రత్తగా రాస్తాను. విడిగా ప్రతులేమీ ఉండవు.
పాత్రలకి పేర్లెలా పెడతారు?
- టెలిఫోన్ డైరెక్టరీ, పత్రికల్లో సంతాప సందేశాలు – వీటినుంచి.
డొరోతీ పార్కర్ రచనలు, వాటి గురించిన విమర్శలు.. ఇంకా మరికొన్ని:
2. ఒక టెలెఫోన్ కాల్ – కథ
3. ముఖాముఖి – కవిత
5. తెలుపూ, నలుపూ, చామనచాయ కథలు – నిడదవోలు మాలతి గారి ‘తెలుగు తూలిక’ బ్లాగ్ నుండి.
బాపు బొమ్మలు తెలుసు కదా? కాకపోతే బిల్ వాటర్ సని వి అయినా ఖచ్చితంగా తెలిసి వుంటాయి. కిక్కిరిసిపొయినా సమస్తం లోంచి ఎరెసర్ పెట్టి అంతా తుడిపీ ఊపేసి రెండో రెండునర్రో గీతలు వుంచి సమస్తాన్ని చూపించడం. అదే ఇక్కడా. వాహ్!
డొరోతీ పార్కర్ జీవితకాలం 1983 నుండి 1967 అని పొరపాటున పడినట్లుంది ఈ వ్యాసం మొదట్లో రెండో పేరాలో. పుట్టిన సంవత్సరం సవరించాలనుకుంటాను.
అవునండీ. సవరించాం.
ధన్యవాదాలు!
-సం.
అన్వర్ గారు చెప్పిందే నేనూ చెబుతాను .
నావ్యాసానికి లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.