ముఖాముఖం

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి – మొదటి భాగం

జూలై 2014

డయాస్పోరా రచయితల అనుభవాలను ఒక కూర్పుగా చేసి ఆటా సావనీర్లో వేద్దామనే ఉద్దేశంతో రచయితలకు ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకు ఆయా రచయితలు చెప్పిన సమాధానాలు, వారి అనుభవాలు ఇక్కడ మీకోసం (ఆటా వారి అనుమతితో):
ప్రశ్నలు:

1. డయాస్పోరా రచయితగా మీరు చేసిన రచనలు, మీరు పడ్డ ఇబ్బందులు, మీ సాహిత్య ధోరణిలో/గమ్యంలో వచ్చిన మార్పుల గురించి చెప్పండి? ప్రవాసదేశంలో మీరు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల్ని ఎంతవరకు సాహిత్యీకరించగలుగుతున్నారు?

2. అమెరికాలో మీరు భిన్న దేశాల సాహిత్యాలు చదువుతుంటారు కదా! అవి చదువుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఒక రచయితగా అంతర్జాతీయ పటం మీద మీరు ఎక్కడ ఉన్నారనుకుంటారు?

3. తెలుగు సాహిత్యంలో వచ్చిన మార్పుల్లో, వివిధ తెలుగు సాహితీ ఉద్యమాల్లో డయాస్పోరా రచయితల భాగస్వామ్యం ఎంతవరకు ఉంది?

4. ఇతర దేశాల రచయితల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు, కవులూ ఉన్నారా?

5. పుట్టిన నేలను విడిచాక కూడా డయాస్పోరా రచయితలు తమ మూలాలను అలానే కాపాడుకుంటూ సాహిత్యానికి మెట్టినింటి/కొత్త వొరవడి తీసుకురాగాలుగుతున్నారా?


వేలూరి వేంకటేశ్వర రావు


డయాస్పోరా అన్న నామవాచకాన్ని నిర్వచించి, స్వరూపనిరూపణ చెయ్యకపోతే నామటుకునాకు మీప్రశ్నలకి నిష్కాపట్యంగా, మనస్సాక్షిగా సమాధానం ఇవ్వటం సాధ్యం కాదు.

2000 సంవత్సరంనుంచీ కొన్ని సాహిత్య సదస్సులలోను, సభల్లోను, “ నాభావనలో డయాస్పోరా” గురించి చెప్పాను. తదుపరి 2002 లో ఈమాటలో (#eemaata.com#, November 2002)ఒక ప్రత్యేక వ్యాసం రాసాను. అందులోనుంచి కొన్ని వాక్యాలు తిరిగిరాయటం, నిజంచెప్పలంటే, పునరుక్తి దోషమే! అయినప్పటికీ, నన్ను నేను సమర్థించుకోవటం కోసం అవసరం అనిపించింది.

డయాస్పోరాలన్నిటికీ ఉండే ముఖ్య్తమైన లక్షణాలు ఏమిటి?

నా ఉద్దేశంలో ఈ క్రింది లక్షణాలు, అన్నీ కాకపోయినా, కొన్నయినా, డయాస్స్పోరా కమ్యూనిటీలలో కనిపిస్తాయి.
1. మాతృదేశ జ్ఞాపకాలు.
2. వలసకొచ్చిన దేశంలో మనని పూర్తి భాగ స్వాములుగా” వీళ్ళు” ఎప్పటికీ ఒప్పుకోరు అన్న నమ్మిక.
3. ఎప్పుడో ఒకప్పుడు మనం వెనక్కి తిరిగి మన మాతృదేశానికి వెళ్తాం అన్న నమ్మకం,( ఇది నిజంగా పిచ్చి నమ్మకం.)
4. సామూహిక సృహ, ధృఢమైన ఏకత్వ నిరూపణ (#project a strong uniform identity# )

ఈ లక్షణాలు ముఖ్యమైనవని ఒప్పుకుంటే, తెలుగు డయాస్పోరాకి, ఇతర డయాస్పోరాలకీ ( ఐరిష్, తూర్పు యూరోపియన్, దక్షిణ అమెరికన్, వగైరా) పోలికలు చాలా స్వల్పం. ఒకేఒక్క పోలిక కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అది, కేవలం మాతృదేశ జ్ఞాపకాలు. దీనినే నాస్టాల్జియా అంటారు.( తూరుపు గోదావరి కొబ్బరి చెట్లు, నూజివీడు మామిడిపళ్ళు, వరిచేలు, సెలయేళ్ళు, ఆవు పిల్లలు, గేదె పాలు… వగైరా!) అది తప్పనటల్లేదు. కానీ అదొక్కటే డయాస్పోరా( రచనల ) ముఖ్యలక్షణం కాదని నా నమ్మిక.
పైన చెప్పిన రెండవ లక్షణం గురించి మనని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉన్నది. తెలుగు డయాస్పోరాగా మనం వలస దేశంలో భాగస్వాములమటానికి ఏ రకమయిన ప్రయత్నాలు చేసాము? చేస్తున్నాము? నిజం చెప్పాలంటే, మన సంస్థలు ఏవీ, రాజకీయంగా కాని,సాంఘికంగా కాని, ఉమ్మడిగా ప్రయత్నం చెయ్యటల్లేదని అనుకుంటున్నాను. ఉదాహరణకి, కొరియా నుంచి గత 25 సంవత్సరాలలో అమెరికాకి వలసకొచ్చిన జనాభాని చూడండి. ఈ రోజున కొన్ని అమెరికన్ రాస్ట్రాలలో రాజకీయంగా, సాంఘికంగా వారిదే పైచెయ్యి.

ఇకపోతే మూడవ లక్షణం కబుర్లలో కనిపిస్తుందికాని, కార్యాచరణలో కనిపించదు.
నాలుగవ లక్షణం గురించి చెప్పకండా ఊహకి వదిలిపెట్టటమే మంచిది.
పోతే, ప్రతి డయాస్పోరా కమ్మ్యూనిటీ తన సాహిత్యాన్ని సృష్టించుకుంటుంది. తన సాహిత్యానికి
తగినంతగా పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది.

తెలుగు దేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయని వాళ్ళం, గట్టిగా తెలుగు చదవని వాళ్ళం, గట్టిగా తెలుగు పత్రికలు కూడా చూడని, చదవని వాళ్ళం ఇక్కడికొచ్చాక మనకి ఇంగ్లీషుకన్నా తెలుగే బాగా వచ్చునని గుర్తించాం. మనం తెలుగులో”రచయితలం” అయ్యాం.

మనం రాస్తున్న రచనలలో చాలాభాగం మన పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటున్నది. మనం రాస్తూన్న రచనలని, అక్కడి విమర్శకులుగాని, ఇక్కడి సాహితీ రసజ్ఞులుగానీ, అభేదంగాను, చులకనగానూ, తక్కువచేసి condescending & patronizing గా, చూడడం జరుగుతున్నది. మన ఆలోచనాసరళిలో, ఊహల ప్రపంచాల్లో చెప్పుకోదగిన తేడా ఉన్నది. అది మన రచనల్లో బాహాటంగా కనిపించటల్లేదు. అక్కడి గీటు రాళ్ళతో, అక్కడి మీటరు కొలబద్దలతో మన అమెరికన్‌ తెలుగు “అడుగులని” , మన తెలుగు రచనలనీ పరిశీలించితే వచ్చే ప్రమాదం: “వాళ్ళు ఒప్పుకున్నట్టుగా రాస్తేనే రచన అవుతుందనే” దురభిప్రాయం. ఇది మన ‘నవ’ రచయితలకి రావడం మూలంగా, డయాస్పోరా రచనలు రావటల్లేదు. మనకి రచన మన జీవితావసరం. మనని మనం, మన తరువాతి తరాన్నీ, ఈ నూతన సమాజంలో మనుషులుగా, ఒక కొత్త సాంస్కృతిక మిశ్రిత ( Hybrid Cultural Community) సమాజంగా రూపొందించుకోడానికి రచన మన ప్రాణం అని నమ్మిన నాడు, ఇక్కడనుంచి మంచి రచనలు సమృద్ధి గా వస్తాయి.

తెలుగు దేశంనుంచి ముమ్మరంగా అమెరికాకి వస్తున్న చాలామంది ఇంకా “ సందఋశకులు” (#Visitors#) గానే కనిపిస్తారు. బహుశా ఆ ధోరణికి కారణం, ఒకకాలు అక్కడ ఉండబట్టి కావచ్చు. అక్కడ ఆస్తిపాస్తులపై వ్యామోహం కావచ్చు. శాశ్వతంగా అమెరికాకి వలస కొచ్చాము అన్న ధోరణి వంటబట్టకపోవటంతో, మూడవలక్షణం కొట్టవచ్చినట్టు కనపడుతుంది. ఆ లక్షణం రచనల్లోకూడా ప్రతిబింబిస్తుంది.
చాలా రచనల్లో అమెరికా సంస్కృతిని హేళన చెయ్యటం, ఇక్కడి కట్టు-బొట్టులని ఆక్షేపించడం, మన సంస్కృతి మహోన్నతమయినదని రచనల్లో ప్రతిబింబింపచేయటం అక్కడి పత్రికల్లో అచ్చుకోసం రాస్తున్నట్టుగా కనిపిస్తుంది గాని, ఇక్కడి నిజ వాతావరణానికి ప్రతిబింబంగా కనపడదు.

అంతమాత్రంచేత చక్కని డయస్పోరా అనుభవాలతో నిండిన రచనలు రాలేదని అనను. వచ్చాయి; వస్తున్నాయి. కానీ అవ్వన్నీ పూర్తి నాస్టాల్జియా గోలలో (Noise) లో కలిసిపోతున్నాయి.
ప్రతి సంవత్సరం తెలుగుదేశంనుంచి వేలకొద్దీ “ వలస” కి వస్తున్నారు. అయితే, వీరిలో చాలామందికి, విద్యార్థులుగా వచ్చిన వారికున్న అనుభవాలు లేవు. స్నేహబృందాలుకూడా, మనభాషవారితోనే ఎక్కువ. మన భోజనం తప్ప మరొకటి నప్పదు. మన ఆటపాటలు తప్ప ఇక్కడి ఆటలు, పాటలు అంటే విముఖత. ఇవన్నీ కూడా సహజమైన డయాస్పోరా సాహిత్యం పుట్టటానికి ఆటంకమనిపిస్తున్నది.

ఆఖరిగా ఒక మాట.
మనం తెలుగు డయాస్పోరాయే!
మనలో బోలెడుమంది రచయితలున్నారు. అదీ నిజమే!
అయితే మనరచనలు డయాస్పోరా రచనలేనా? డయస్పోరా జీవితానికి నిజమైన ప్రతిబింబాలేనా? ఈ ప్రశ్నలకి నిష్కర్షగా సమాధానం చెప్పటం కొరివితో తలగోక్కోవటమవుతుందేమోనని నా భయం.

నేను గత 50+ సంవత్సరాలలో పాతిక పైచిలుకు కథలు, నలభై వ్యాసాలూ రాసాను. ఇది ప్రపంచ సాహిత్య సముద్రంలో ఒక చిన్నని నీటి పరమాణువు. అంతర్జాతీయంగా మన తెలుగు సాహిత్యం ( 1920 ల తరువాత వచ్చిన నవ్య సాహిత్యంతో సహా) ఇంగ్లీషులోకి అనువదించి, ఆ సాహిత్యం ప్రపంచసాహిత్య తెరపై చూపటం డయాస్పోరా కర్తవ్యం. ఆ పని చేస్తున్నవారిని ప్రోత్సహించడం మన విధ్యుక్త ధర్మం.
తెలుగు సాహితీ ఉద్యమాలలో ( అవి ఏ రకమయిన ఉద్యమాలైనా కానీయండి!)తెలుగు డయస్పోరా రచయితల చెప్పుకోదగినంతగా ఏమీ చెయ్యలేదని నానమ్మకం. ఆ పని చెయ్యటానికి అవకాశం ఉన్నదా అన్నది వేరే ప్రశ్న.

*** * ***


వంగూరి చిట్టెంరాజు


1.

“డయాస్పోరా రచయిత” అంటే విదేశాలలో స్థిరపడిన రచయిత అనే అర్ధంలోనే మీరు వాడారని అనుకుంటున్నాను. లేక “డయాస్పోరా ఇతివృత్తాలతో” రచనలు చేసిన రచయిత అనే అర్ధంలో వాడినా నేను అర్హుడినే కదా! అంచేత పరవా లేదు.

ఇక నేను ఒక రచయితగా పాఠకులని, కొందరు విమర్శకులని ఏమైనా ఇబ్బంది పెట్టానేమో కానీ, నేను మటుకు ఏమీ ఇబ్బందులు పడ లేదు. ఆ మాటకొస్తే నేనే ఇండియా లో ఉండి ఉంటే, అక్కడి సాహిత్య వాతావరణంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడి ఉండేవాడినేమో! నాకు తెలిసీ ఉత్తర అమెరికాలో మటుకు రచయితలు అందరూ…నాతో సహా… తమకున్న సర్వ స్వాతంత్ర్య వాతావరణాన్ని చాలా మటుకు సముచితంగానే, సామరస్యంగానే ఉపయోగించుకున్నారు.

తొలి దశలో సాహిత్యంలో కూడా నాయకత్వ ఎజెండాలు ఉన్నవాళ్లు సహజంగానే ఆ దిశలో నలుగురినీ చుట్టూ పోగేసుకుని, ఆ ప్రయత్నంలో అప్రయత్నంగానే అమెరికా లో ఔత్సాహిక దశలో ఉన్న రచనలని ఇండియా లో గొప్ప రచనలతోనో, తమ ఉన్నత ప్రమాణాలకి తగినట్టుగా లేవు అనో ఇక్కడి రచయితలని నిరుత్సాహ పరిచారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ నాటి కథల్లో సహజంగానే “నాస్టాల్జియా” ధోరణి ఎక్కువగా ఉండడం, “ఆ ఏదో పాపం, ఉన్నంతలో బానే రాసుకుంటున్నారు” అని ఇండియా లో సాహితీవేత్తలు ఇక్కడి వారిని చిన్న చూపు చూడడం కూడా అటువంటి వాతావరణానికి కారణాలు. నా సాహిత్య ధోరణిలో ఎక్కువ మార్పులు లేవు కానీ, గమ్యంలో మార్పుల కారణంగానే, సాహిత్యానికి పెద్ద పీట వెయ్యడానికే 1994 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపించడం జరిగింది. 1998 మేము నిర్వహించిన మొట్టమొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు అమెరికాలో సాహిత్య వాతావరణాన్ని అందరూ సరి అయిన విధంగా అంచనా వేసుకునే అవకాశం కల్పించింది.

ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా మహాసభల సావనీర్లు, స్థానికంగా అక్కడి సంస్థాగత వార్తా పత్రికలూ తప్ప రచయితలకి ప్రచురణావకాశాలు లేనే లేవు. ఇప్పుడు, ముఖ్యంగా ఎవరి రచనలు వారే తమ బ్లాగ్ లో ప్రచురించుకునే అవకాశం ఉండడంతో, పాతిక, ముఫై ఏళ్ల క్రితం లాగా సంస్థాగత పత్రికలలో పత్రికలలో ముద్రణావకాశాల కోసం ఆయా సంపాదకుల ఆమోదాల కోసం ఎదురు చూడవలసిన అవసరం ఇప్పుడు లేదు. ఈ విధమైన నియంత్రణా రహిత సాహిత్యం మంచిదో, కాదో చర్చనీయాంశమే!
ఇక “పరాయి దేశం”…..(అంటే అమెరికా అనే మీ ఉద్దేశ్యం అనుకుంటున్నాను)… లో వాస్తవ పరిస్తితుల్ని నా పరిధిలో, నేను ఎన్నుకున్న శైలి లో కనీసం యాభై పైగా ఇతివృత్తాలతో కథలు కాని కథలు వ్రాయగలిగాను. నా మాట ఎలా ఉన్నా, అమెరికా తెలుగు కథకులు స్పృశించని ఇతివృత్తాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి, ఇక్కడ తల్లిదండ్రులకీ, పిల్లలకీ, యుక్తవయస్కులకీ మధ్య సంబంధాల గురించీ, వీసా సమస్యలూ, త్రిశంకు స్వర్గాల గురించీ, ఆఫీసుల్లో భిన్న జాతులతో ఉద్యోగం చెయ్యడంలో ఉన్న పరిస్తితులు, ఇక్కడ ప్రభుత్వాధికారులతో, పోలీసులతో వచ్చే సమస్యలూ మొదలైన అంశాల మీద లోతయిన కథలు ఇంకా రావాలి. వాటికి తగిన సాహిత్య వాతావరణం ఇక్కడ ఉంది అనే నా నమ్మకం.

2.

భలే ప్రశ్న! ఈ దేశం నాకు చేసిన “అన్యాయం” ఏమిటంటే….ఇక్కడికి వచ్చాక ఉన్న అమూల్యమైన ఆ కాస్త సమయమూ కేవలం తెలుగు భాషకి, నాటకాలకి, ఇతర సాంస్కృతిక పరమైన అంశాలకి వెచ్చించడానికే సరిపోయింది. నేను ఇండియాలో ఉండగా ఆంగ్ల సాహిత్యం మీద నాకున్న “పట్టు” గురించి మా బంధువులూ, మిత్రులూ గర్వంగా చెప్పుకునే వారు. ఇక్కడికి వచ్చాక అది కూడా పోయింది. అందుచేత నాకు ఆంగ్లం తొ సహా భిన్న దేశాల సాహిత్యాల మీద ఏ విధమైన అవగాహనా లేదు. నేను అంతర్జాతీయ పటం మీదే కాదు, విభజనకు ముందు ఉన్న యావత్ ఆంధ్ర ప్రదేశ్ పటం లో కూడా నాకు అణుమాత్రమైనా చోటు లేదు. అవసరం వచ్చినప్పుడు గూగుల్ లో వెతికేసి ఇతర భాషా, సాహిత్యాల మీదా, ఆయా రచయితల “కొటేషన్స్” ఇచ్చేసి మార్కులు కొట్టెయ్యొచ్చు కానీ ….ఎందుకొచ్చిన ఆర్భాటం చెప్పండి ?

3.

ఈ తెలుగు సాహితీ ఉద్యమాల్లో డయాస్పోరా రచయితలకి ఏ విధమైన భాగస్వామ్యమూ
లేదు. ఉండే అవకాశమూ లేదు. అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే “ఉద్యమం” అనగానే ఏదో ఒక “ఎజెండా” ఉండాలి అనేది నా అవగాహన. డయాస్పోరా రచయితలకి అటువంటి, ఎటువంటి “ఎజెండా” ప్రస్తుతానికి లేదు. కానీ, అమెరికా తెలుగు వారి మీద కూడా ప్రభావం చూపిస్తున్న ప్రస్తుత రాజకీయ పరిమాణాల దృష్ట్యా, ఉన్నవాటి కంటే మరింత ప్రత్యక్షంగానే వర్గ ప్రాధాన్యతలూ, మాండలీక అభిమానాలూ ఇక్కడ సాహితీవేత్తలు కూడా బాహాటంగానే ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు బహుశా దాన్ని డయాస్పోరా ఉద్యమ సాహిత్యం అంటారేమో!

ఇక్కడో చిన్న విషయం గుర్తుకొస్తొంది. కొన్నేళ్ళ క్రితం ఒక తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు గారు మా ఊరు వచ్చారు. అప్పుడు నేను “మా అమెరికా తెలుగు రచయితల సాహిత్యానికి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి మీరు సహాయం చెయ్యగలరా?” అని అడిగాను. ఆయన నవ్వేసి “నేనేమీ చెయ్య లేను కానీ, మీరు “డయాస్పోరా ఉద్యమ సాహిత్యం” అని పేరుపెట్టి కాస్త ఎమోషనల్ గా, తెల్లవారో మరొకరో మీ కష్టాలకి కారణం అని రెచ్చగొట్టే రచనలు చెయ్యండి. అప్పుడు మీకు కావలిసినంత గుర్తింపు వచ్చి తీరుతుంది.” అన్నారు.

4.

లేకేం..చదివిన వారు చాలా మందే ఉన్నారు. ఇయాన్ ఫ్లెమింగ్, జేమ్స్ ఎర్ల్ గార్డ్నర్, పి.జి. వుడ్ హౌస్, రస్సెల్, ఓ హెన్రీ , జెన్ ఆస్టిన్, పేర్ల బక్ …..ఇలా అందరూ నేను చిన్నప్పుడు ఉధృతంగా చదివిన వారే! వారు నన్ను ప్రభావితం చేశారా అంటే …అది అనుమానమే.

5.

అసలు నేను పుట్టిందే అందుకు అని నా గురించి చాలా మంది అనుకుంటూ ఉంటారు.
అందులో కొంతయినా నిజం ఉంది అని నేను అనుకుంటాను. ఇలాంటి పెద్ద , పెద్ద మాటలకి దూరంగా ఉండి నాకు తోచిన, నేను చెయ్యదగ్గ పనులు మాత్రమే చేసుకుంటూ పోవడమే నాకు తెలిసిన మిగలిన నిజం.

*** * ***


వేమూరి వేంకటేశ్వరరావు


నేను 1961 లో అమెరికా వచ్చేను. 1967 వరకు తెలుగులో రచనలు చెయ్యలేదు. రాయడం మొదలుపెడుతూనే కంప్యూటర్లు అనే పుస్తకం తెలుగులో రాసేను. తరువాత కొన్ని వైజ్ఞానిక కల్పనలు రాసేను. తరువాత సైన్సుని జనరంజక శైలో రాయడం మొదలు పెట్టేను. వాటిని తెలుగు పత్రికలలో ప్రచురించేవాడిని. ఈ కార్యక్రమంలో ఎప్పుడూ అధిగమించలేని ఇబ్బందులు పడలేదు.
అమెరికాలో అలనాటి నా అనుభవాలని “అమెరికా అనుభవాలు” పేరిట ఒక పుస్తకం ప్రచురించేను. కినిగె వారు ఈ పుస్తకాన్ని ఇ-పుస్తకంగా మళ్లా ప్రచురించేరు.
గత ఏభై ఏళ్లల్లో నా గమ్యంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. ఇప్పటికీ సైన్సుని తెలుగులో రాయాలనే నా అభిలాష. కథల రూపంలోనూ, వ్యాసాల రూపంలోనూ, పుస్తకాల రూపంలోనూ కొనసాగుతూనే ఉంది.
నేను తెలుగు సాహిత్యం కాని ఇంగ్లీషు సాహిత్యం కాని అంత ఎక్కువగా చదవలేదు – ఇండియాలోనూ చదవలేదు, అమెరికా వచ్చిన తరువాత కూడ ఎక్కువగా చదవలేదు. కాలేజీలో తారసపడ్డ పాఠ్య పుస్తకాలే నా సాహిత్య పరిచయం. నన్ను నేను ఎప్పుడూ ఒక గణనీయమైన రచయితగా ఊహించుకోలేదు. నా రాతలన్నీ సరదాకి, కాలక్షేపానికి రాసినవే. నన్ను నా రచనా వ్యాసంగంలో ప్రభావితం చేసిన వారిలో అయిజాక్ అసిమావ్, ఆర్థర్ క్లార్క్ అగ్రగణ్యులు. మనదేశపు రచయితలలో మహీధర నళినీమోహన్.
“తెలుగు సాహిత్యంలో వచ్చిన మార్పుల్లో డయస్పోరా రచయితల పాత్ర ఎంత?” అనే ప్రశ్నకి సమాధానం కాలమే నిర్ణయించాలి. అమెరికా నుండి వెలువడిన సాహిత్యంలో పరిపక్వత, పుష్ఠి లేవని పెదవి విరచిన సమీక్షకులు చాలమంది ఉన్నారు. కాని నా అభిప్రాయం ప్రకారం అమెరికా వచ్చి స్థిరపడ్డ తెలుగు వాళ్లు తెలుగు భాషని ఇరవై ఒకటవ శతాబ్దం లోకి తీసుకురాడానికి సాహిత్యపరంగానూ, సంస్థాపరంగానూ, సాంకేతికంగానూ గణనీయమైన కృషి చేశారన్నది నిర్వివాదాంశం. పోతన ఖతి, RTS, ఇంగ్లీషు లిపిలో రాసిన దానిని తెలుగు లిపిలోకి మార్చే పద్మ , ఈమాట అంతర్జాల పత్రిక, మొదలైనవన్నీ అమెరికాలో ఉన్న తెలుగువారి చొరవ, చలవల వల్ల పుట్టినవే కదా?

*** * ***


అఫ్సర్


1.

అమెరికా వచ్చాక రాసిన రచనల్లో నా మటుకు నేను qualitative గా తేడా వచ్చిందని అనుకుంటున్నా. ఇబ్బందుల మాటకి వస్తే, సృజనాత్మకంగా ఏం రాయాలీ, ఎలా రాయాలీ అన్న ముఖ్యమైన ఇబ్బంది మొదటి నించీ వుంది. ఇక్కడికి వచ్చాక ఇంకో కొత్త ఉనికి కూడా తోడవ్వడంతో ఈ కోణం నించి రాయడంలో ఇంకా అంత సౌకర్యంగా లేదు.

వలస అన్నది నా కవిత్వంలో మొదటి నించీ చెప్తూనే వున్నాను. ఇక్కడికి వచ్చే ముందు 2000లో వచ్చిన నా కవిత్వ సంపుటి పేరు “వలస”. పదేళ్ళ తరవాత వచ్చిన పుస్తకం “ఊరి చివర” ఈ రెండీటిలోనూ వలస వేదన వుంది. ఇప్పుడు నేను రాస్తున్న కవిత్వంలో గానీ, కథల్లో గాని ప్రవాస జీవితం ఎక్కువగా కనిపిస్తోంది, ఇక్కడి జీవితం కొంచెం కొంచెంగా అర్థమవుతూ వుంది కనుక!

వాస్తవ పరిస్థితి మనం అనుకున్నంత, పైకి కనిపిస్తున్నంత తేలిక కాదని అర్థమయ్యాక రాయడం కష్టమవుతుంది. వచనంతో పోల్చినప్పుడు కవిత్వంలో ఇది కొంత తేలిక. ఎందుకంటే, కవిత్వం ప్రధానంగా ఉద్వేగ కళ. కథలో ఆలోచన కూడా ముఖ్యం కాబట్టి, కథల్లో ఈ ప్రయత్నం అంత బలంగా కనిపించడం లేదని అనుకుంటున్నా.

2.

ముఖ్యంగా అమెరికన్ కవిత్వమూ, కథానికలు నా ఆలోచన పరిధిని పెంచాయి. ఇక్కడి కవిత్వంలో వుండే ease, కథనంలోని వైవిధ్యం నాకు నచ్చుతుంది. యూనివర్సిటీలో సాహిత్య పాఠాలు చెప్పాలి కాబట్టి సాహిత్య సిద్ధాంతాలు కూడా చదవక తప్పదు. కాని, నేను ఎక్కువగా కవిత్వమూ కథలే చదువుతాను. నా విద్యార్థులలో భిన్న దేశాల వాళ్ళు వుండడం వల్ల వాళ్ళ నించి కూడా ఆయాదేశాల సాహిత్య చర్చలు చేస్తుంటాం. నిజానికి ఈ చర్చల్లో ఎక్కువ నేర్చుకుంటాను. ఇవన్నీ చదువుతున్నప్పుడు/ వింటున్నప్పుడు మన సాహిత్యం ఇంకా నిర్దిష్టతని అందుకోవాలని అనిపిస్తుంది.
ఇక అంతర్జాతీయ పటం అంటారా? అది నన్ను భయపెడ్తుంది, అంత దూరం ఆలోచించ లేను. కాబట్టి, నా పటం మీద నేను హాయిగా కదులుతూ వుంటే చాలు అనుకుంటా.

3.

తెలుగు సాహిత్యానికి సంబంధించి డయాస్పోరా రచయిత అంటూ వొక ఇంకా విడిగా ఏర్పడ్డదో లేదో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు నాకు. కాని, ఇప్పుడు రెండు దేశాల మధ్య రాకపోకలు, సాంస్కృతిక సాహిత్య రాకపోకలు కూడా పెరుగుతున్నాయి. ఈ బంధం ఇప్పుడు చాలా విలువైంది. తెలంగాణా ఉద్యమం వల్ల ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. ఆ ఉద్యమ ప్రభావం ఈ మధ్య అమెరికా తెలుగు సాంస్కృతిక రంగంపైన బాగా పడింది అనుకుంటున్నా. లేకపోతే, బతుకమ్మ ఆట అనేది వొకటి వుందని అయినా ఇక్కడి వాళ్లకి తెలిసే అవకాశం లేదు కదా?! అమెరికా తెలుగు రచయితలు ఈ నిర్దిష్ట వాస్తవికతని ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. లేకపోతే, వాళ్ళు ఈ కాలంలో నిలబడలేరు.

మన ప్రధాన సమస్య ఏమిటంటే, అస్తిత్వ గుర్తింపు మనకి అంతగా తెలియదు. వొకే సమయంలో భిన్న అస్తిత్వాలు ఉంటాయన్న చైతన్యాన్ని వొప్పుకోడానికి మన సాహిత్య జీవులు ఇప్పటికీ సిద్ధంగా లేరు. Multi-culturalism, diasporic identity అనేవి సిద్ధాంతాలు కావు, అవి జీవన వాస్తవికతలు అనే కనువిప్పు మనకి కలగాలి.

అలాగే, తెలుగు నాట వస్తున్న మార్పులూ, ఉద్యమాలు కూడా ఇక్కడి రచయితల ఆలోచనల్లో భాగమైనంత బలంగా రచనల్లో కాలేదని నేను అనుకుంటున్నా. ఆ కారణంగా మన డయాస్పోరా సాహిత్యం ఇంకా abstract గానే వుంది.

4.

చాలా మంది వున్నారు. కొన్ని పేర్లు అంటూ చెప్పడం కష్టం. నాకు లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్, మిడిల్ ఈస్ట్ రచయితలు ఎక్కువగా నచ్చుతున్నారు. వాళ్ళ సినిమాలు కూడా నేను ఎక్కువ చూస్తూ వుంటాను. సంఘర్షణ వున్నచోటే మంచి సాహిత్యం పుడ్తుంది అని వీళ్ళు నిరూపిస్తున్నారు. బహుశా, వీళ్ళకి సరిసమానమైన సృజన చేయగలిగిన శక్తి మన తెలంగాణా, సీమ, ఉత్తరాంధ్ర రచయితలకు వుందనుకుంటున్నా.

5.

ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి డయాస్పోరా తెలుగు రచయితలు. ఇప్పటికీ ఇక్కడి రచనల స్థాయి వొక వొరవడిని అందుకోవడం లేదు. డయాస్పోరా జీవితంలో చాలా ముఖ్యమైన దశ –integration. ఇక్కడి వాతావరణంలో లీనమైపోవడం! అది మిగిలిన దేశాల వాళ్ళు సాధించినంత ప్రభావవంతంగా మనం సాధించలేకపోతున్నాం. చివరికి పాకిస్తానీ రచయితలు కూడా ఈ విషయంలో మన కంటే ముందే వున్నారు. ప్రవాస రచయితగా తనని తాను ఊహించుకోగలగడం తెలుగు రచయితకి కొంచెం కష్టమైన ప్రక్రియ. ప్రవాస అనుభవం భిన్నమైనది అనే మౌలిక భావన నుంచి ఇది మొదలు కావాలి. ఆ భిన్నత్వాన్ని చూడాలంటే, మన లాగే పుట్టిన నేలని విడిచి వచ్చిన వాళ్ళు కొత్త చోటులో ఎలా సంఘర్షిస్తున్నారో అర్థం కావాలి. మనం మనవాళ్ళతో కాకుండా, నల్లవాళ్ళతో, మెక్సికన్లతో, ఇక్కడ వున్నా భిన్న దేశాల భిన్న సంస్కృతుల వాళ్లతో కలసిపోగలగాలి. అది ఇంకా మనకి అలవాటు కావడం లేదు.

*** * ***


శంకగిరి నారాయణస్వామి (కొత్తపాళీ)


1.

నేను ముఖ్యంగా కథలు రాస్తుంటాను. పడిన, పడుతున్న ముఖ్యమైన ఇబ్బంది తెలుగు భాష దైనందిన జీవితంలో లేకపోవడంతో అర్ధవంతమైన ఒక చక్కటి వాక్యం రాయడానికి మూడు చెరువుల నీళ్ళు తాగినంత శ్రమ అవుతున్నది. కానీ ఆ మాత్రం శ్రమపడి రాస్తున్నందుకు, భాష, శైలి బావున్నాయని పది మందీ మెచ్చుకున్నారు. So, I guess it is worth the effort. పదేళ్ళకి పైన కథలు రాయడం, ఇరువైపులా సాహిత్యకారులైన మిత్రులతో ముచ్చటించడంలో గ్రహించిన ఇంకొక విషయం అక్కడ ఉంటున్న వారికి అమెరికా రచయితల రచనలను గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఉండాలని ఆశించడం కూడా మన వేపునుంచి బహుశా అత్యాశేమో.

వాస్తవ పరిస్థితుల్ని సాహిత్యీకరించడం అంటే మీ ఉద్దేశమేవిటో నాకు సరిగ్గా అర్ధం కాలేదు. నేణు రాసేది ఫిక్షను, అంటే కల్పితం. కానీ ఫిక్షను కూడా నిజజీవితంలోంచే పుడుతుందనీ, అందులోనూ అమెరికా ప్రవాసాంధ్రుల కథల్ని మనమే రాసుకోవాలనే రెండు బలమైన ఆలోచనలతో నేను రాస్తున్నాను. వాస్తవ పరిస్థితుల్ని సాహిత్యంలో పెట్టడం అంటే న్యూస్ రిపోర్టులు రాయడం కాదు కదా. సాహిత్యం పుట్టాలంటే చుట్టుతా ఉన్న వాస్తవ పరిస్థితుల్ని గురించి లోపల ముందు మథనం జరగాలి, అప్పుడూ కదా .. వెన్నో, హాలాహలమో, అమృతమో పుడితే ..

2.

నేను ఒక్క అక్షరం కాగితమ్మీద పెట్టే ముందే ప్రసిద్ధులైన వివిధ అంతర్జాతీయ రచయితల ఫిక్షను చదివాను ఇంగ్లీషులో. ముఖ్యంగా కథానిక పరిణామంలో తెలుగు కథ చాలా కుంచించుకు పోయింది అనిపిస్తుంది. అమెరికా కథకులు కథానికని మనం చూసేదానికన్న చాలా భిన్నంగా చూస్తున్నారు. నా కథలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి అని చెప్పుకోగలిగే స్థాయి కానీ గర్వం కానీ నాకు లేవు. కానీ జంపా లహిరి ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలడీస్ సంపుటిలో ఎ టెంపరరీ మేటర్ లాంటి కథలు కొన్నైనా రాయగలనని ఆశగా ఉంది.

3.

చాలా తక్కువ.

4.

కథానిక రచనకి సంబంధించి .. లేదనే చెప్పాలి. చదివినప్పుడు ఆస్వాదించిన రచనలూ, రచయితలూ రాస్తూ పోతే చాలా పెద్ద జాబితా అవుతుంది.

5.

ఇది చాలా పెద్ద ప్రశ్న. మిగతా డయాస్పోరా రచయితలు అందరూ ఏమి చేస్తున్నారు, ఏమి రాస్తున్నారు అని నేను పరిశీలన చెయ్యలేదు. మూలాలను కాపాడుకోవటం అంటే ఏమిటి? మొన్న మొన్నటి దాకా కూడా అమెరికా తెలుగు రచయితలు విడిచి వచ్చిన దేశం/ఊరు/మనుషుల మీద బెంగతో నాస్టాల్జియా రచనలే ఎక్కువగా చేశారు. అక్కణ్ణించి ఇక్కడ సంసారం నిర్వహించడం, పిల్లల్ని పెంచడం, కొద్దిగా పిల్లల పెళ్ళిళ్ళు – ఇలాంటివి కథా వస్తువులయ్యాయి. విస్తృతమైన ప్రవాస జీవితానుభవాన్ని సాహిత్యంలో పట్టుకోవడంలోకి ఇంకా ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నామని అనుకుంటున్నా.


మరికొంతమంది ప్రవాస రచయితల అనుభవాలు ఆగస్ట్ సంచికలో చదవండి…


(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)