“కరిగిపోయాను కర్పూరవీణలా..
కలిసిపోయాను నీ వంశధారలా..
నా గుట్టు జారిపోతున్నా..”
ఏం పాటల్రా నాయనా డబులో ట్రిపులో అర్ధాలు, సుశీలా, జానకా! సుశీలే.. కర్పూరమ్ అంటిస్తేనే కరుగుతుందా, మంచులా కాదా?!
టప్.. టప్..
ఈ రేడియోఛానళ్ళు పాటలకంటే మాటలే ఎక్కువ చెప్తాయి.
రెండు సరిపోతాయా, ఉహూ..
టప్..
తేజు ఉంటే బావుణ్ణు, ఆమ్లెటేసిచ్చేది.
ఐస్ క్యూబ్స్ కలిపిన విస్కీగ్లాసుమీద ఆవిరిబిందువులు కిందికిజారుకుంటూ, ఒకదాన్నొకటి కలిపేసుకుని అడుగున టీ పాయ్కీ గ్లాస్కీ నడుమ తెగని పొరలా..
అవ్నూ నేనెందుకు తాగుతానసలు?!
తేజు అడిగుండేది ఇక్కడుంటే, “శనివారమొచ్చింది, మరేం లేదా” అని నవ్వుతూ.
నేనేం, రోజూ తాగి ఛస్తానా, వీకెండ్సంతే , ఏదో అలా ఓ రెండూ మూడూ పెగ్గులు.. కలిపి ఐదు, అలా ఓ సిన్మా, Fritz lang “metropolis” చూడాలీవేళ కుదిర్తే, బబబ బ్ బ్ బ్ బాప్, “బర్ప్” అనెందుకంటారో త్రేన్పుని, శబ్దమే పలుకుబడి ఐనట్టుంది.
సోడా కాస్త తగ్గించాలి.
“ఏం సందేహం లేదు ఆ అందాలనవ్వే ఈ సందళ్ళు తెచ్చింది,
ఏం సందేహం లేదు..”
మంచి పాటేసాడు 92.7, ఏం సందేహం లేదు, రాశిఖన్నానా?! అక్షయ్ ఖన్నాకేమౌద్దో?!
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..
..ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్.
అబ్బా, పురాతన కాలంనాటి రింగ్టోన్, ల్యాండ్ లైనుకి ఫోనెవరై ఉంటారు?!
జనాలింకా ల్యాండ్ లైన్కి ఫోన్లు చేస్తున్నారా.. బాల్యమిత్రులెవర్దగ్గిరా ఈ నంబర్ లేదే!
-”హ.. హలో..”
“ఏం చేస్తున్నావ్ హీరో, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాలి,”
-”తేజూ, హ హ, లేదే, ఫోన్ బెడ్రూంలో ఛార్జింగ్లో ఉంది, పెళ్ళి బాగా జరిగిందా?! మామయ్యా వాళ్ళని అడిగానని చెప్పు,”
“హా, బానే జరిగిందిలేగాని, నేనివాళ రాట్లే, రేపు సాయంత్రమయ్యేట్టుంది, చుట్టాలందరూ కలిసారు చాన్నాళ్ళ తర్వాత, నువ్వూ రావాల్సింది, అడిగి చంపుతున్నారంతా”
-”సర్లే..”
“కిచెన్లో పొద్దుటి బిర్యానీ ఉంది, ఓవెన్లో పెట్టుకుని తినెయ్”
-”యా..”
“అండ్, ఫ్రిజ్లో పాలుంటాయ్, కాస్త వేడిచేసి తోడేసి పెట్టుకో, ఆదివారమెలాగూ తమరు పెరుగన్నమేగా..”
-”రైట్..”
“మరీ ఎక్కువ తాక్కు, ఫర్గాట్టు ఆస్క్ యూ, జ్వరం ఎలా ఉంది, తగ్గిందా,”
-”హా తగ్గిపోయిందే, ఏం పర్లే, యూ టేక్కేర్, ఫోన్చెయ్ అవసరమైతే, ఉంటా మరి, ఓకే నా..”
“డన్..” …బీప్ బీప్ బీప్ బీప్.
మొదట్సారి జ్వరం ఎప్పుడొచ్చిందో గుర్తుందా, ఐదేళ్ళప్పుడా, పక్కింటాటీ వాళ్ళింట్లోకి నన్నెత్తుకెళ్ళి గట్టిగా ఊపిరాడకుండా ముద్దులిచ్చినప్పుడు, మొట్టమొదటి జ్వరపు ఙ్నాపకం.. రెండోసారి, ఎప్పుడూ, ఈత నేర్చుకోడానికి బావిలో దూకినప్పుడు నీటిపాము వంటిని చుట్టుకున్నప్పుడా, ఎనిమిదేళ్ళా అప్పుడు, లేద్లేదు, అంతకంటే ముందే, ఇంటివెనక దర్గాలో ఎవర్దో శవాన్ని పాతేస్తున్నప్పుడు, హా అప్పుడే, అరబ్బీ మంత్రాలేవో, సల్లల్లహు అలాహి వాసల్లం, ఉహూ మర్చిపోయా, అప్పుడు చనిపోయిందెవరూ, మెకానిక్ షెడ్ సలీంగాడి నాన్నేనా, టైఫాయిడ్ జ్వరమ్తో, అసలెందుకూ జ్వరం,దెబ్బ తగిల్తేనే నొప్పిని భరించడం తెలుస్తుందేమో, అసలేమౌతుంది ఏదైనా మందులేని మాయ రోగం ప్రపంచాన్ని ముంచితే.. కొత్త నాగరికతేదన్నా పుడ్తుందప్పుడు ఏ అంతరిక్ష్యమ్మీంచో.
ధబ్ ధబ్ ధబ్ ధబ్ ధబ్, ధబ్బ్ బ్ ..ధబ్ ధబ్ ధబ్..
డోర్ చప్పుడా అది, ఎవడా వెధవ, మానర్స్ లేకుండా కొడ్తున్నాడు!
-”ఆగరా నాయ్నా వొస్తున్నాను…”
..ధబ్ ధబ్ బ్ ధబ్బ్
-”సోఫాలోంచి లేవనీయరా…” ఛ.. కాలు టీపాయికి తాకినట్టుంది మందు ఒలికింది
-”కమింగ్ కమింగ్, ..”
-”రేయ్, నువ్వా, ఫోన్చేయొచ్చుగా వొస్తున్నానని,…”
“వారినీ డ్యాడీ, సైలెంట్ మోడ్ ఫెలో, డోర్ తలుపులు బాద్దుంటే దొంగనుకున్నార్రా పక్క ఫ్లాట్ వాళ్ళు, ఎందుక్రా నీకా ఫోన్, చేస్తే లేపవు చూసినా రిప్లై ఇవ్వవు,”
-”సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ…”
“ఏంట్రోయ్, తీర్థం వాసనొస్తోంది, వైఫుని బైటికి పంపించి విధ్వంసక చర్యలేమైనా ప్లాన్చేసావా నాకు తెలీకుండా,”
-”అదేం లేద్రా, తేజు వాళ్ళింటికెళ్ళింది, ఏదో చుట్టాల ఫంక్షనట, నాక్కాస్త జ్వరంగా ఉండి, ఇంట్లో..”
“హా ఇంట్లో, టానిక్ తీసుకుంటున్నావ్… అంతేనా, రేయ్, దేరిద్రుడా, పుస్తకాలిచ్చేవరకూ పీక్కుతింటావ్, ఇస్తే ఎక్కడెక్కడో పెడ్తావ్,
అదేంట్రా టీవీ మీద “జోర్బా” నా?! ఈ సారి పుస్తకాలడుగు, తంతానొరేయ్”
-”కోపం తెచ్చుకోకురా, కూల్ మచ్చా, అన్నీ ఉన్నాయ్, ఏదీ ఎక్కడికీ పోలేదు, లైట్గా ఏమైనా తీసుకుంటావా?”
“లేద్రా, నాకేమొద్దు, పెదనాన్న చనిపోయారు, వెళ్తున్నానక్కడికే, నువ్వూ తోడొస్తావని..”
-” అవ్నా, ఎలారా, వొస్తాగానీ డ్రైవ్ చేయలేను,”
వొచ్చి పదినిమిషాలయ్యాక మరణం జన్మించిందా, నిర్యాణం కూడా అతిమామూలు విషయమైనందుకు ఏడవాలో నవ్వాలో..
“డ్రైవర్ ఈజిప్ట్ గాడున్నాడ్లే, రెండు టీ షర్టులు పెట్టుకో, మళ్ళీ రేపు రాత్రి వరకొచ్చేద్దాం, పెద్ద దూరమేంలేదు, హుస్నాబాద్ దగ్గర, ఇక్కణ్ణించి ఒక 140,
చాల్రోజుల్నించీ నిమ్స్ లోనే ఉన్నాడు, హార్ట్ ప్రాబ్లెమ్ ఏదో, ఇవాళ పొద్దున డెత్ ఐంది, ఎన్నాళ్ళుంటాడ్రా ఇంకా.. డెబ్బై ఐదు దాటాయ్,”
వార్నీ, పెదనాన్న పోతే ఇంత మామూలుగా టీవీ న్యూస్ రిపోర్టర్లా చెప్తున్నాడేంటి వీడు!
-”సర్లే, ఐద్నిమిషాల్లో రెడీ ఔతా, ఆ గ్లాస్ తాగేయ్,”
తేజుకు చెప్పాలి, చావుదగ్గరికంటే పెద్దగా రెసిస్టెన్స్ ఏం ఉండద్లే, పైగా శివగాడి పెదనాన్నంటే, ఏం పర్లే.
బ..ర..ర్ప్, మళ్ళీ త్రేన్పా!
ఎన్నో పెగ్గిది, రెండా మూడా, ఏమైంతుoది నాకు, బెడ్రూంలొకొచ్చినవాణ్ణి మళ్ళీ హాల్లోకి ఎందుకు, రెండు ఈగలు వాలిన గ్లాసుని చెతిలొకిలాక్కుని గుటగుటమన్పించి మీసాలకంటిన మంచుతడిని టీ షర్ట్ ఎడమభుజానికి రాసి
-” సమాప్తం, రేయ్ శివా, నువ్వెలాగూ తాగవని, నేనే, హ హ. ఏమనుకోక,”
“అక్కడెలాగూ ఉంటుంద్లేరా, అందుకే తాగలా, త్వరగా రా, అవునొరేయ్, పావని ఫోన్చేసిందా ఈ మధ్య నీకు, ఒక నెలకిందట నీ నంబర్ అడిగింది, ఏదో ల్యాండ్ ప్లాన్ కోసం అన్చెప్పింది,”
-”పావనీ.. అది నాకెందుకు చేస్తుందిరా వొద్దనుకుని వెళ్ళిపోయాక , ఎక్కడుంటుందో ఇప్పుడు, బాంబేనా”
పావని, నాకు ఫోన్చేసుంటదా?! నేనే ఫోన్ చూసుకునుండను, అన్నోన్ నంబరని ఆన్సర్ చేసుండను, శివగాడ్ని నంబరడిగి ఒక మెసేజ్ చేస్తేనో, ఇస్తాడుగా, ఉహూ, వొద్దొద్దు, వాడికి తెలియొద్దు, వొద్దు.. సర్లే, కారెక్కాక ఫోన్ కాల్ లిస్ట్ ఓసారి చూసి వాట్స్ అప్ లో వెతుకుదాం.
***
రేయ్ ఈజిప్టూ ఆ డీవీడీ ప్లేయర్ సౌండ్ తగ్గించరా, నిద్రపట్టట్లే, రేయ్ నీకేరా, విన్పించట్లే, శివా రేయ్ చెప్పరా వాడికి, శివా.. రేయ్, ఎక్కడున్నావ్రా, కార్లో ఎవరూ లేరే, నేను, నేనెక్కడున్నానసలు, గుంపు.. గుంపు ఎవర్దది ..ఎవర్ని మోసుకెళ్తున్నారు, శివా, ఈజిప్టు గా ఎవర్ని ఎవరు మోసుకెళ్తున్నార్రా, పెదనాన్ననా హా.. కాదు కాద్ ..
నేనెక్కడ.. కుదిపేస్తున్నారెవరు, నన్నేనా నన్నేనా మోసుకెళ్తుంది, కాలివేళ్ళు కదలట్లే, కట్టేసారా, మరి ముక్కురంధ్రాలు, అవెందుకు మూయలేదు, గాలి పీల్చుకుంటున్నానా అసలు,
హా.. హా, గాలి, రేయ్ ఆపండ్రా, నేన్చావలేద్రా దించండి, దించండి కిందికి, ఎవరో ఏడుస్తున్నారు, ఎవరూ?! ఎవరది ఏడుపు, ఏడుపొస్తోంది నాక్కూడా, కళ్ళు తెర్చుకుంటున్నాయ్ మెల్లగా, ఎదురుగా రోడ్మీద లారీ, లారీ, నా ముందెవరూ, శివా రేయ్ శి..
“రేయ్, లేరారేయ్, నువ్వూ నీ గురకా, కార్ సౌండుకంటే నీ రీసౌండే ఎక్కువుందిరా శరచ్చంద్రా”
కలా ఇదంతా, నేను కార్లోనే ఉన్నానా, వెనకసీట్లో, ఎప్పుడెక్కానసలు, కంప్లీట్ బ్లాక్ ఔట్, ఫోన్, నా ఫోనేది, ఈజిప్టు గాడెందుకు నవ్వుతున్నాడు,
హాయ్ య్ య్, మందు బాగా పన్జేసింది, జొరం తగ్గిందిలే!
-” శివా, నా ఫోనేద్రా”.. తేజూ ఫోన్చేసిందో ఏమో!
“నీ ముందున్నసీట్ జిప్ లో చూడు, సైలెంట్లోనే పెట్టి చచ్చావా ఇంకా”
హమ్మయ్య, తేజూ చేయలా, చంపేసేది లేపోతే,ఏదో మెసేజొచ్చిందే, ఎవరూ…
*(హాయ్, శరత్, ఎలా ఉన్నావ్?!)
పావనీ, పావనీనే, హా, తనొక్కతే నన్ను శరత్ అని పిల్చేది, హా, తనే, ఏమని రిప్లై ఇవ్వనూ, మూడేల్లైందా తన పెళ్ళై, ఇప్పుడేంటి సడన్గా, అతను బానే ఉన్నాడ్గా, నాకంటే మంచోడే అన్చెప్పిందిగా అప్పుడు, అసలింతకీ పావనీయేనా మెసేజ్ చేసింది.. చూద్దాం…
(హాయ్, నేను బావున్నా, నువ్వు?? ఏంటీ సడన్ సర్ప్రైజ్, నీడ్ ఎనీ హెల్ప్?? )
*(సిల్లీ క్వష్చనే అనుకో, నీ వైఫెలా ఉంది?). అప్పుడే ఎంక్వైరీలుమొదలయ్యాయా, ఐతే పావనీదే..
( తేజూ, యా, షి ఈజ్ ఫైన్, మీ ఆయన??) నీకెందుకురా వాడెలా ఉంటే
*( బావున్నాడు, తను చెన్నై లో, నేను బాంబే, 6 నెల్లైంది తనకు ట్రాన్స్ ఫరై, ప్రమోషన్)
( అవునా, గుడ్ టు నో దట్), ఏంట్రా ఇది, టీనేజ్ పిల్లల్లా ఈ ఫోన్ఛాటింగ్, అవసరమా ముప్పై ఏళ్ళకు, సోదాపి అసలేం కావాలో కనుక్కో,
( ఏంటి సంగతులు),
*(ఏంలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అన్పించింది, చాలాసార్లు నీకు ఫోన్చేసాను, బట్ నువ్వెప్పుడూ ఆన్సర్ చేయలేదు, ఆర్యూ కంఫర్టబుల్ టాకింగ్ టు మి, డోంట్ హెసిటేట్)
( ఏం పర్లే గానీ, అసలు మ్యాటరేంటి) కడుపులో కాల్తుంది, బిర్యానీ ఇంట్లోనే వొదిలేసొచ్చానా, పెరుగన్నమైనా తెచ్చుకోవాల్సింది,
-” శివా, ఏదైనా ఊరొస్తే ఆపరా ఆకలేస్తుంది, నీళ్ళుంటే ఇవ్వు”
“ఇక్కడన్నీ పల్లెటూళ్ళేరా, పద్నిమిషాలాగు, హుస్నాబాదొచ్చాకా టిఫిన్చేసి టీ తాగుదాం, ఎలాగూ డిన్నర్ టైమైంది, బాడీని రేపు పొద్దున కాల్చేస్తారట,
నైట్ ఇక్కడే హోటల్లో ఉండి పొద్దునే వెళ్దాం, వాటర్ బాటిల్ వెనకే ఉంది చూడు, సీట్ మీద”
*(ఎక్కడున్నావ్ ఇప్పుడు, ఒక్కడివే ఉన్నప్పుడు నాకోసారి ఫోన్చేయగలవా, మాట్లాడాలి, కాస్త ఇంపార్టెంట్)
ఇంపార్టెంటా, నాతోనా, ఏమై ఉంటుంద్దీనికసలు, కొత్తింటి ప్లాన్ ఫ్రీగా కొట్టేద్దామనా, కొంపతీసి డబ్బులేమన్నా కావాలంటదా
(యా, ష్యూర్, నేనే నీకు కాల్చేస్తా, కాస్త ఫ్రీ అయ్యాక),
“నాన్నా, శరచ్చంద్రా, మనూరొచ్చేసింద్రా, టిఫినా? అన్నమా? ఏం తిందాం? అలా చూడకొరేయ్, హోటల్రూం బుక్చేసాడు అన్నయ్య, అన్నీ అరేంజ్ చేసాడ్లే, అన్నీ…”
-”అన్నయ్య ఎవర్రా,”
“పెదనాన్న వాళ్ళ చిన్న కొడుకు, నిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, వదిన కూడా డాక్టరే, అందుకే ఆయన్ని ఇన్నిరోజులూ ఇన్ పేషెంట్గా ఉండనిచ్చారందులో, అదో పెద్దకతలే, దిగు, ఫ్రెషై టీ తాగుదాం,”
-”మరి పెద్డ కొడుకు, అమ్మాయిల్లేరా,”
“ఉహూ, పెద్ద కొడుకు ఇంటిదగ్గరే ఉండి పొలం చూసుకుంటాడు, రేయ్ ఈజిప్టూ, ఇవిగో పైసలు, ఏమన్న తిని హోటల్ రాజధానికొచ్చేయ్”
***
రాత్రి పదిన్నరకి రాజధాని హోటల్ కం లాడ్జ్ మూడో అంతస్థు 304 రూంకొచ్చేసరికి ముగ్గురు కూర్చుని తాగుతున్నారెవరో,
ఎప్పట్లాగే పాత అలవాటుతో బ్రాండ్ ఏదో పోల్చుకోవాలోసారి, బ్లెండర్స్ ప్రైడా, వొద్దు రా నాయనా, ఇంట్లో టీచర్సుంది కదరా, తెచ్చేవాడ్ని,
ఇప్పుడీ హార్డ్ విస్కీ తాగడమెలా. ఐస్ క్యూబ్స్ ఐనా ఉన్నాయా, ఉహూ, నో ఛాన్స్..
“అన్నయ్యా, వీడు, శరచ్చంద్ర, సివిల్ ఇంజనీర్, నా బెస్ట్ ఫ్రెండ్”
ఆపరా శివా నీ ఇంట్రో, ఐస్ క్యూబ్స్ లేవురా,
#”హాయ్ శరత్, అయాం డాక్టర్ నీరజ్, కం కం రండి,వీళ్ళు మనాళ్లె, మా మామయ్యావాళ్ళు, కమిన్, ప్లీజ్ బి కంఫర్టబుల్, శివా ఐస్ తెప్పించు, ఐపోయింది”
హమ్మయ్య, ఐసొస్తుంది,
#”శివా నేను మామయ్యను ఇంటిదగ్గర డ్రాప్ చేసొస్తా, మీరు కానివ్వండి అందాకా, శరత్, కబోర్డ్ లో స్కాచుంది, తీస్కోండి, మేక్ యువర్సెల్ఫ్ ఎట్ హోం..”
ఆ ముసినవ్వు నన్ను చూసేనా, నీరజాక్షుడు అనుకున్నంత అమాయకుడేం కాదురో, వీడి నవ్వెందుకో బావుంది, నిమ్స్ లో డాక్టరంటే పధ్దతిగా మడి కట్టుక్కూచుంటాడనుకుంటే, పర్లే, బానే ఉన్నాడు, మంచి కంపనీయే,
-” ఓకే నీరజ్, వెళ్ళి రండి, విల్ బి వెయింటింగ్ ఫర్ యూ”, నేనూ నవ్వానా.. అసంకల్పితంగానేనా, కొందర్ని చూడహానే కనెక్ట్ ఐపోతామెందుకో, కారణాలుండవ్, రూమ్ ఖాలీ ఐంది, ప్రశాంతంగా,
-” రేయ్ శివా, మీ అన్నయ్య బావున్నాడ్రా, వెరీ వార్మ్.. మందు కలుపుతున్నా త్వరగారా డ్రెస్ చేంజ్ చేసుకుని, నేనిలాగే ఉంటా, నో ఛేంజ్,
అదుగో, హోటల్బాయ్ వొచ్చినట్టున్నాడు”
” వార్మా బొంగా, చెప్తానుండు, తమ్ముడూ ఐస్ టేబుల్మీద పెట్టేయ్, అలాగే, కింద రిసెప్షన్లో మా కార్ డ్రైవరుంటాడు, ఓ చికెన్ బిర్యానీ పార్సెల్ ఇవ్వు, సరేనా, డోర్ గట్టిగా వేసేయ్ బైటినుండి”
” ఇప్పుడ్చెప్పరా శరచ్చంద్రా, హా, మా అన్నయ్య, వార్మ్ కాదురా వర్మ్, వాడో ఛండాలుడు, మా పెదనాన్న ఎప్పుడో చచ్చిపోయాడు, రెస్పిరేషన్ ఆగి ఇరవై రోజులైంది, ఇంటికి తీసుకెళ్లమని కూడా చెప్పారు డాక్టర్లు, ఇన్నాళ్ళూ వాడికీ వాడి పెళ్ళానికీ లీవ్ దొరకలేదని వెంటిలేటర్మీద ఆర్టిఫీషియల్ రెస్పిరేషనిచ్చి ఉంచారు ఊరికే, ఇప్పుడు సెలవులు ఉన్నాయని శ్వాస ఆపేసారు, బైటికి సెలవులు దొరకలేదనే చెప్పారుగానీ, లోపల చాలా ఉన్నాయ్రా, ఆయన పోయాకా ఆస్థి, పొలం పంపకాలకు ఇబ్బంది ఔతుందేమో అని ఈ ఇరవై రోజుల్లో అవన్నీ సెటిల్ చేసుకుని ఇప్పుడొచ్చారు, ఇంకేమైనా మిగిల్తే సర్దేయడానికి”
-”సర్లే, ఎవడి బతుకు వాడిది, మనకెందుగ్గానీ, గ్లాసివ్వరా శివా”
” రేయ్ నువ్ కానీ, నాకో కాల్ ఉంది మాట్లాడొస్తా, మా బాస్గాడు, అదే మొన్న డిజైన్ చేసిన యాడ్ గురించి, పొద్దుణ్ణిoచీ మర్చిపోయానసలు వాడ్తో మాట్లాడదామనుకుని, కాస్త కాకా పడ్తే మనకొచ్చే యాడ్ ఇన్-ఫ్లో పెరగొచ్చు”
-”సర్లే పోగానీ, త్వరగా రారా..”
అంతే.. ఎవడి బతుకు వాడిది, ఎవడి మెతుకు వాడిది, Art of survival is the only story that never ends ..
మెసేజెస్ చూస్కోవాలోసారి, తేజుతో మాట్లాడాలి, మెసేజెస్ చాలా వొచ్చాయే!
తేజు, ( గుడ్ నైట్ హీరో, కాల్ యూ మాణిoగ్). సరే, ( గుడ్ నైట్, టేక్కేర్ ),
మరో మెసేజెవర్దీ, పావని, ఇదినన్ను వొదల్దా ఇవాళ!
*( శరత్, ఫ్రీ అవ్వలేదా ఇంకా?), లేదే, బాగా టైట్ గా తాగుతున్నా, ఫ్రీ అవలేను,
పోనీ ఓసారి మాట్లాడి చూద్దాం, ఎవరి బతుకేమిటో మనకెలా తెలుస్తుంది, అబావ్, ఛ, సాలేగాళ్ళు, బోర్ వాటర్తో ఐస్ చేసినట్టున్నారు, దెబ్బకొట్టేసింది టేస్ట్,
ఫోన్రింగౌతుంది, కాలర్ట్యూనా, “3″ ఫిల్మ్ పాట, అనిరుధ్ గాడు చేసిన అత్యంత మంచిపనుల్లో ఇదోటి,
(( పోనీ పో.. పో నీ.. పో, తనియాగ తవికిండ్రే తునై వేండా అన్బే పో.. పిడమాగ నడకిండ్రే ఉయిర్ వేండాం దూరం పో,..))
దీనికి మనం అంటించిన తమిల్పాటలు ఇంకా వొదిలినట్టు లేదు,
-”హలో, హా పావనీ, ఏదో మాట్లాడాలన్నావ్”
“నిన్ను కలవాలి, తొందర్లొ..”,
వార్దీనమ్మ, ఏమైంద్డీనికసలు,
” వీలైతే బాంబే రాగలవా, ఒక రెండ్రోజులు”,
-”ఏమ్, ఏమైందసలు, ఐ డింట్ గెట్ యూ”,
“అబార్షన్, రెండ్నెల్ల కింద, అప్పట్నిoచీ నీతో మాట్లాడాలని, ఒక్కసారైనా, ఈ మూడేళ్ళలో చాలా ట్రై చూసా, నీతో మాట్లాడ్డానికి, కానీ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకున్నా,
బట్, అబార్షనయ్యాక, తట్టుకోలేకపోయా, అప్పట్నిoచే నీతో మాట్లాడాలని, ఏమో,ఎందుకంటే, ఏమో, పెళ్లై మూడేళ్ళైనా.. ఏమో”
అబార్షన్, పావనికి పిల్లలంటే చాలా ఇష్టం, అలాంటిది మిస్ కేరేజ్ అవడం, ఛ!, నా పిచ్చి అలవాటు, ఫోన్ అటెండ్ చేసుండాల్సింది, ఎంత ఏడిపించానో ఇన్నిరోజులూ,
మరీ అంత ఫీలైపోకురోయ్, ఈ కొత్త రిలేషనేదో ఎక్స్ ట్రా మారిటల్..ఉహూ, మారిటల్ అనొచ్చేమో..ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయిగా.. టర్నింగ్ తీసుకుంటున్నట్టుంది,
ఇదిగో పావనీ, నేనప్పట్లా లేనే, దీనికెవరైనా నా ఇప్పటి ఫోటో చూపిస్తే బావుండు, కొంచమైనా వెనక్కి తగ్గొచ్చు,
” నిన్నోసారి చూడాల్నుంది, ఇప్పుడే, నీ పిక్స్ వాట్స్ అప్ చేయ్, బలవంతమేంలే, నీకు ఇష్టమైతేనే”
-”నువ్ కూడా, నాకూ నిన్ను చూడాల్నుoది”
అప్పుడెప్పుడో ప్రేమిoచిన పిల్ల మళ్లీ రీ యూనియన్ ప్లాన్చేద్దామంటే ఏ మగ వెధవైనా వొదులుకుంటాడా, మ్యాటర్ మరీ ముందుకెళ్ళకపోయినా కనీసం ఫోటో ఐనా చూద్దాం,
ఇప్పుడెలా ఉందో.. తప్పేం లేదుగా, యెహే తప్పేం లేదు, ఒక్కటే లైఫ్, ఏం చేసినా ఇప్పుడే, అంతే, సాహసం చేయరా అర్భకా, ప్రేమకుమారి దక్కేను..
(క్లింగ్)
ఇది నాకంటే స్పీడ్ గా ఉందిగా, అప్పుడే ఫోటోలు పంపేసింది, ఏమాటకామాటే “రెజీనా కస్సండ్రా” కాస్త లావెక్కినట్టుంది, అప్పటికంటే బావుందిప్పుడే,
మంచు కరిగి నీరౌతుంది, తాగేయాల్తొందరగా, పెగ్ లైటైపోద్ది లేటైతే, గుటుగ్గుటుగ్గుటుగ్గ్,
శివగాడింకాసేపు రాపోతే బావుణ్ణు, ఏమై ఉంటుందసలు, అబార్షనైతే నాతో ఎందుకు మాట్లాడాలన్పించింది, లోన్లీగా ఫీలౌతుందా, వాడు చెన్నైలో ఉంటాడుగా, ఐనా, భార్యకు అబార్షనైతే దగ్గరుండకుండా ప్రమోషనొచ్చిందని పరాయూరికి పోవడమేంటో, అంతేనా, లేక పాత రిలేషన్ రి బిల్ట్ చేసుకుని నన్ను వాడుకోవాలనేమైనా..
శరత్గా వొద్దూ, ఇలాంటివి మనకు తెమలవు, తొందరపడి దూకేయకు, అనవసరంగా ఆవిరైపోగలవ్, ఉహూ, కానీ, తనే అలా అడిగాకా, రెండ్రోజులు ఉండడానికి రమ్మని, నాకేం భయమిక, వెళ్ళొస్తే పోలా, అదో అనుభవం, మనసెందుకో బెడ్రూంవైపు లాగుతుంది, ఛఛ.. ఏమాలోచిస్తున్నాను నేనసలు.. వి ఆర్ మారీడ్, వి కాంట్ డు దట్,
ఒరేయ్ పాపీ, అన్నీ నువ్వే అనేసుకుని నువ్వే సంఘర్షించుకుని సమాధానపడ్తావేమిరా మూర్ఖా, పాపని కూడా అడుగు, తెల్సుకో అసలేం కావాలో,
ముందు తేజుకేం చెప్పాలసలు, రెండ్రోజులు సెమినారనా, కాలేజ్ చదువైపోయ్ ఏళ్ళయ్యాక ఇంకా సెమినారేంట్రా సెగ్గడా మొఖమోడా, ఉహూ.. బాంబేలో ఫ్రెండ్ పెళ్ళని చెప్తే,
ఏ ఫ్రెండ్, నా ఫ్రెండ్సందరూ తనకూ తెల్సుగా, ఏం చేయాలి. రెండ్రోజులు, నరాల్లాగేస్తున్నాయెందుకో, మందెక్కువై నరాల వీక్నెస్ ఏమైనా ఐ ఉండొచ్చా,
ఒకవేళ అన్నీకలిసొస్తే రెండ్రోజులు నేనూ పావని, బాంబేలో…
” సారీరా, బాస్గాడు సొల్లేసాడు, లేటైందా, పెగ్ ఫిక్స్ చేయ్ తొందరగా, ఏంట్రా ఇది, ఇంకా రెండోదేనా, ఎలాంటోడివి ఎలా ఐపోయావ్రా”
-”హా నువ్వొచ్చావుగా, ఇక స్కోర్ పెంచుదాం”
దుర్మార్గుడా, మంచి రసస్పందనని ఆస్వాదిస్తున్నప్పుడే పెగ్గులో పటికబెల్లంలా అడ్డురావాలా, ఈరాత్రికి ఊహలే ఇక,
(క్లింగ్),
పావనీ నుండా, వాట్స్ అప్ ఏనా,
*(ఏమైoదోయ్, షాకయ్యావా చూసి, ఇంకేమైనా చూస్తావా)
ఏం జరుగుతుందసలు, నిజమేనా.. నాకు మత్తెక్కి మతిస్పందించడంలేదుకదా..నిజమే నిజమే, ఛ,
నాలుగేళ్ళ క్రితం ఇలాటి సౌకర్యాల్లేక ఎన్ని అనుభూతుల్ని కోల్పోయిందో ఒక తరం, హోల్డాన్ హోల్డాన్, ఇడియట్, ఏంటా వెర్రాలొచన్లు, ఆర్యూ లాస్ట్, వొద్దు వొద్దొద్దు, స్టాపిట్ స్టాప్ దిస్ షిట్, ఎక్కడ్నించెక్కడికెళ్తున్నావసలు, వొద్దు,
(పావనీ,కాస్త అర్జెంట్ పనుంది, రేపు మాట్లాడ్తా, గుడ్ నైట్)..
అమ్మయ్య, చెప్పేసా.. చెప్పేసాను గుడ్నైట్, ఇంక మాట్లాడొద్దు, అంతే, చాలిక, చాలు, తేజుకి తెలిస్తే, తేజూ నాలాగే ఆలొచిస్తే, అమ్మో, వొద్దొద్దు, చాలిక, లెట్స్ స్టాప్ హియర్, అంతే అంతే,
” ఏంట్రోయ్ మళ్లీ ఆఫ్ లైన్లోకి వెళ్ళిపోయావా, ఈ మధ్య నీకు ఆలోచన్లెక్కువయ్యాయ్, అంతా బానే ఉందా, ఏదో కొత్తగా బిహేవ్ చేస్తున్నావ్ ఇవాళంతా”
-” నాన్నా, షెర్లాకూ, అంత లేదురోయ్, ఏదో పని టెన్షన్, అవ్నూ, నీ సంగతేంటి, బాసేమన్నాడు, ఆ చిప్స్ ఇటివ్వు, పల్లీలు బాలేవ్రా, వాసనేస్తున్నాయ్”
“చికెన్ ఆర్డర్ చేసాలే, వొస్తుంది కాసేపట్లో, హాహ్, బాస్గాడ్ని బానే దువ్వాన్రా, రిజల్ట్స్ కన్పిస్తాయ్ ఒక్క రెండ్రోజుల్లో, యాడ్ ఏజెన్సీల్లో సమస్యేంటంటే క్లయింట్సుకి మనమీద నమ్మకమొచ్చేవరకూ వెయిట్చేయాలి, టేక్స్ టైమ్,.”
-”అవున్రా, అసలు పావనీ నంబరెందుకు తీసుకుందంటావ్ నీ దగ్గర”
అడిగేశానా, ఎందుకూ, ఏదో తెలియాలి, అదేంటో దొరకట్లా, వీడేమనుకుంటాడో నా గురించి, ఏదైతే అది ఐంది, నాకున్నంత వైల్డ్ ఊహ వీడికుండదులే,
“ఏమోరా, ఒకప్పటి లవర్స్ మీరు, మీకే తెలియాలి మీ సీక్రెట్స్ , బట్ తను చాలా డల్గా మాట్లాడింద్రా, అప్పట్లా లేదిపుడు అనైతే అర్ధమైంది, మే బి, పెళ్ళితో తను హ్యప్పీగా లేదేమో, మే బి తను నీకేదో చెప్పాలి అనుకుంటుందేమో, అది, మే బి, సంజాయిషీనో, సలహానో,”
అయ్యబాబోయ్, వీడు దుస్సాధ్యుడు, అసలే మందులో ఉన్నా, మొత్తం చెప్పినా చెప్పేస్తా, డైవర్ట్ చేయాలి ఎటోఅటు, డైవర్షన్,
-” ఏరా మీ అన్నయింకా రాలేదు, వొస్తాడంటావా”,
మళ్లీ ఐస్ ఐపోయిందా, మంచు లేకుండా తాగ్గలగడం అలవాట్చేసుకోవాలి,
“వొస్తాడ్లే, మనం కానిద్దాం, మళ్ళీ ఏదో గొడవేసుకుంటున్నట్టున్నారు, అసలు మా నాన్న, పెదనాన్న కాకుండా ఇంకో బాబాయున్నాడు,
ఆయన్ని చిన్నప్పుడే మా నానమ్మా వాళ్ళ అక్క దత్తత తీసుకుంది మగ పిల్లలు లేరని, ఇప్పుడాయనొచ్చి నాకూ నా పిల్లలకూ ఏమైనా ఇవ్వాలి అంటున్నాట్ట, అసలిదంతా ఎందుకొచ్చిందంటే… …”
ఆస్థులు పాస్తులు ఎకరాలూ భూములూ అస్థికలు పస్తులు అప్పులూ భ్రమావడ్డీలు, బృ బృ బృ బృ బృ బృ….
నిద్రొస్తోంది, పడిపోతున్నా మెల్లిగా, శివగాడేం చెప్తున్నాడో..
***
పొద్దున్లేచి స్మశానం దగ్గరికెళ్ళేప్పటికే అందరూ వొచ్చారు, చితి చుట్టూ రిలేటివ్స్ అంతా ప్రదక్షణలు చేస్తున్నారప్పటికే,
శివగాడు పరుగెత్తుకెళ్ళి ఆఖరి రౌoడు చేరిపోయాడు లైన్లో, రాత్రి కల, పావనీ నేనూ గొడవ, గుర్తులేదేంటో,
కలల్లో ఎప్పుడూ జరిగిపోయినవాటి తాలూకూ నీడలే కన్పిస్తుంటాయెందుకో, జరగబోయేవి ఎందుకు కన్పించవో, కలలు మన విష్ ఫుల్ థింకింగ్ కి విజువల్ రూపాలేగా..
శివగాడు, నీరజ్, పక్కనెవరూ, నీరజ్ వైఫా, ఎవరూ ఏడవట్లేదెందుకూ, ఎలాగూ పోతాడని ముందే తెలిసిపోతే సమయానికి కన్నీళ్ళు రావా,
(క్లింగ్)
పావని.. వాట్స్ అపా..
అప్పుడప్పుడూ సంతోషంగా ఉంటుందెందుకో, నా చుట్టూరా జనాలు అప్డేటై నన్ను అప్డేట్ చేయిస్తున్నారేమోనని,
*(good mrng hon), లాభమ్లే, ఇది మరీ దూసుకెళ్ళిపోతుంది దారితెలీని రోడ్డుమీద, (క్లింగ్ మళ్ళీ), నైటీలో సెల్ఫీ..
(ఉమ్, బావుందికానీ మీ ఆయనకు పంపితే ఇంకా బావుండేది),
*(అందుకే పంపా)
విస్ఫోటనం ఎక్కడో, నేనున్న వాతావరణం ఏంటి, ఈ పరిస్థితులేంటి, ఈ రొమాంటిక్ ఛాటింగేంటి, (మళ్ళీ క్లింగ్)
*( ఏం పంపకూడదా , నువ్ నాకేం కాదా)
భగ్ భగ్ భ్ భ భ్గ్ గ్ గ్, మంటలు, చితి మండిoదా.. గాలివాటం చూసి కిరోసీన్ చల్లుతున్నారు, మంటలు, కడుపులోంచి గొంతులోక్కూడా,
భుగ్ భుగ్ భు భగ్ భు భ్, “నువ్ నాకేం కాదా?” నేనెవరికైనా ఏమైనా ఐతే, అది నాకే కదా, కాస్తోకూస్తో తేజుక్కూడా, కానీ పావనికి నేనేమౌతా,
ఎందుకు చేస్తుందిదంతా,
శివగాడి పెదనాన్న ముఖం చూడ్డమే మర్చిపోయా, ఇప్పుడా ముఖమేది, కాలిపోయిందా, నిజంగా ముఖాలు కాలిపోతే మనం ఒకర్నొకరం గుర్తుపట్టగలమా, మెల్లగా ఒక శరీరం బూడిదౌతుంది,
“”ఎన్నేండ్లు బత్కుతడువయా, ఎనబైకొచ్చిండు దగ్గర్దగ్గర, మస్తుతీ, మస్తు సుకపడ్డడు, సుఖంగ సచ్చిండు, ఏంగావాలింక, బీడీముక్క ఉన్నాదోటి, నిన్నేనుల్లా, ఇయ్యరాదు”"
అంతే, ఏం చేసినా చచ్చేముందే, పోయాకేం చేయలేం, సుఖపడ్డా దుఃఖపడ్డా ఇప్పుడే, గడియారం పరిగెడ్తుంది ప్రతీ మెదడ్లో, టిక్ టిక్ టిక్ టిక్ టిక్….
“”పైశలెంతిచ్చిర్రు, 1500 ఆ, ఛత్, ఏంట్లకొస్తయివయా, ఎన్మిదిమందుంటిమి, పీన్గెకు స్నానం అంటిరి, కట్టెల్దెస్తిమి, గ్యాస్నూనె మనదేనాయె, అంత ఐనంక మల్ల సాఫ్ చేషేది మనమేనాయె, బొందకాడ గుడ్క పైశలు పెట్టపోతె సంపాయించిందెందుక్వయా, పొక్కల పెట్కోనీకా ఇంకో వెయ్యడుగు, కల్లెవలు తాగుతుర్రు ఇయ్యాల్రేపు, అంత క్వార్టర్లకెగవడ్డరు, పైసలు సాలై”"
మందు.. లిక్కర్, ఎవ్వడు పుట్టినా ఎవ్వడు చచ్చినా దీనికి మాత్రం చావు లేదు, నిజంగా మందు గాయాల్ని మాన్పుతుందా, ఉహూ, నిద్రపుచ్చుతుందంతే కాసేపు, మెలుకువొచ్చాక మళ్ళా మామూలే, బాధ గాయం క్లేశం నొప్పి, నివారణ-మందు, ఫలితం-నిద్ర, ప్రతిచర్య- మెలకువ, ఇదో సైకిల్…
(క్లింగ్)
*(ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను?)
రెడ్ కలర్ అనార్కలీలో నడుముదగ్గర ట్రాన్స్పరెంట్ గా బొడ్డు కన్పిస్తూ, నాకెందుకు చూపెడ్తుందసలు, నన్ను జలసీ చేయడానికా… నేను తనని మిస్స్ అయ్యానని, అంత అందగత్తెని వొదులుకున్నాన్ని..నాకెందుకు..
హేయ్ ఊరుకోరా, మరీ అర్ధంకానట్టు నువ్వూ నీ దేబ్యపు నటనా, కాసేపు ప్రొసీడైపో, ఫ్లోలో కొట్టుకెళ్ళు, ఈత నేర్చుకోకు రా, మునిగిపోయి తేలు, అదో అనుభవం, చూద్దాం, ఏం జరుగుతుందొ, రెసిస్టెన్స్ వొచ్చేవరకూ మనకు అపాయం కానంతవరకూ కలుగులోకి దూరిపోవడమే,
(బావుంది, నైస్, కానీ, బొడ్డు కన్పిస్తుంది)
ఏం రిప్లై ఇస్తుందో, కోప్పడ్తుందా, నేనే తొందరపడ్డానా, తను కాజువల్గా పంపి ఉండొచ్చుగా, నేనే వేరేలా నాకు నచ్చినట్టుగా అనుకున్నానా, వేరొకడి భార్యతో నేను ఇలా…. ఎలా ఇప్పుడు?!
(క్లింగ్)
*(థాంక్యూ, స్మైలీ తొ),
ఏం సందేహం లేదు, షి ఈజ్ పుల్లింగ్ మై లెగ్స్, వొద్దు ఇక చాలు, ఇంకా జారొద్దు, చాలా దూరమొచ్చావిప్పటికే, తేజుకి తెలిస్తే నిన్నెప్పటికీ క్షమించదు, నీకింకా అవకాశముంది మనిషవడానికి, వొద్దు, తేజు ప్రేమించినంతగా నిన్నెవరూ చూస్కోలేరు, పావని కూడా, ప్రేమ కాదది, మరింకేదో, ఇంకేదో, నిన్ను నువ్వు పోగొట్టుకోకు,
తేజుకు తెలిస్తే, ఎలా తెలుస్తుంద్రా నాయ్నా, ఏం కాదు, ఈ ఒక్కసారికి, ఏం కాదు, ప్రయత్నిద్దాం, వొస్తే ఒక ఒక రాత్రి, పోతే మన్దేముంది, ఏం కాదు, ఏం కా.., బొడ్డెంత బావుంది..
డోంట్ మిస్ దట్ బ్యూటీ.. డోoట్..
“రేయ్, శరచ్చందూ, పద, కార్లో కూర్చుందాం,”
శివగాడెప్పుడొచ్చాడు, చూసాడా నేను ఛాటింగ్ చేయడం!
-”ఇంకా ఎంత సేపురా”
“పుర్రె పగిలేవరకూ ఉండాల్ట, వాళ్ళుంటార్లే, మనం హోటల్కెళ్ళి, కాసేపు పడుకుని సాయంత్రం బయల్దేరుదాం, చీకటయేప్పటికి హైద్రాబాద్లో ఉండాల్రా, బాస్ గాడ్తో మీటింగుంది, పద, ఎక్కు, మందేమైనా తీసుకుంటావా”,
-”వొద్దురా, ఇంటికెళ్దాం, అంత బాలేదిక్కడ, నాకు”
నేనేనా మందొద్దు అన్నది, అనుమానంగా చూస్తున్నాడా వింతగానా వాడ్నన్ను…
***
ఏం సందేహంలేదు ఆ అందాలనవ్వే ఈ సందళ్ళు తెచ్చింది..
ఆ పాటే.. మళ్ళీ, 92.7, హోండా అమేజ్ కార్లో, హైద్రాబాద్కి బయల్దేరిన రెండు గంటల్తర్వాత నిద్రలేచి,
అదేంటో కార్లో కూచోగానే నిద్రొచ్చేస్తది, ఏం సందేహం లేదు, మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టిoచాడు వీడు, వెరైటీ టేస్టున్న వెధవల్లో నా ఫస్ట్ ఫ్రెండ్ వీడే,
వెనక సీట్లో పడుకుంటున్నట్టున్నాడు, గురక లేకుండా, ఓసారి ఈజిప్ట్ గాడ్ని గెలకాలి, వెళ్తున్నప్పుడు నా గురకన్చూసి నవ్వుతాడా , చెప్తా,
-”రేయ్ ఈజిప్టూ, ఎంత దూరంరా ఇంకా”
“ఇంకా 40 అన్న, గంటలో ఉంటం సిటీల, ట్రాఫిక్ ఏం లేపోతే”
-”ఓ పది లక్షల్లో కార్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఇదెంత ఇస్తుంది మైలేజ్, ఇరవయ్యైదుకు తగ్గదటగా?!”
“అమేజ్ బానే ఇస్తదన్న, 20 -25 నడుమ, హోండాలనే మొబిలో వొచ్చింది కొత్తగా, 7 సీటర్ అది, ఏక్దం ఉంది బండి, ఆ బండి తీయిర్రి ఫ్యామిలీ పెద్దగుంటే”
ఫ్యామిలీ పెద్దగుంటేనా, కావాలనే అంటున్నాడ, అనుకోకుండా అన్నాడా,
“అవున్రా, నీకా పేరెలా వొచ్చింద్రా”
“అప్పట్ల మా అయ్య పన్జేయనీకి ఆ దేశం పోయిండు, అక్కడేవో పీతిగొడ్లో ఏవో ఉంటయట కద, జఖాస్ ఫేమసంట కద, అట్ల ఆ పేరు నా పానానికొచ్చింది”
-”పిరమిడ్లురా నాయనా, పీతిగొడ్లు కాదు”,
“పోనీగని, ఔ అన్నా, ఒక్క ప్లాన్ ఏయనీకి ఎంత తీస్కుంటవ్, గదే ఇంటిప్లాన్”.
ప్లానా, ఇందాకట్నించీ వీడేమన్నా నర్మగర్భాలంకారం ప్రయోగిస్తున్నాడా, లేక నాకే అలా అన్పిస్తుందా,
-”అది పార్టీని బట్టి ఉంటుంద్రా, ఎక్కువంటే లక్ష, తక్కువంటే మనవాళ్ళకు ఫ్రీగా గీసిస్తా అడిగితే”,
ఏమైంది పావనికి,ఇంకా మెసేజ్లేదు, నేనే చేయాలని ఎదురుచూస్తుందా ఏంటి, వొద్దొద్దు, లోకువౌతావ్, నువ్వెంత సైలెంట్గా ఉంటే నిన్నంత పొటెంట్ అనుకుంటుంది లోకం, అవన్నీ, పాత సామెతల్రా, నచ్చిన పిల్లదగ్గిర సిగ్గేంట్రా, మెసేజ్ జేసేయ్, అడిగేయ్, తొందరగా తెగ్గొట్టు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని, వెన్నులోంచొక్కసారే వొణుకు, ఎందుకు, తప్పుచేస్తున్నట్టు తెలుస్తున్నందుకా.., వెనకాల్నిoచెవరో అంతా చూసి నవ్వుతున్నట్టు, ఎవరది, శివగాడేనా, చూసేది, ఉహూ, వాడికేం అర్ధంకాదులే చూసినా, అంతే, వాడికేం అర్ధంకాదు,
ఏంపర్లే,
(క్లింగ్)
పావనీ ఆ, అంతెత్తున ఎగసిన అలలమీద గోడ మొలిచినట్టు నిరుత్సాహం కారంతా నిండి.., తేజు మెసేజ్జేసిందెందుకూ,
(ఎక్కడున్నావ్, రాత్రి చుట్టాల గెట్ టుగెదర్ ఉంది, బంజారాహిల్స్ Zaffron లో, ఇంటికి త్వరగా వొచ్చేయ్)
( సరే, ఆన్ ది వే),
పావనీకేమైoది, ఒక్క మెసేజైనా చేయాల్సిందిగా, ఫోన్చేస్తేనో, ఆదివారంగా, వాళ్ళాయన బాంబేకొచ్చుంటాడా, వొస్తే నాకు చెప్పేదేనేమో, చెప్పలేదంటే, వాడు చెప్పాపెట్టకుండా వొచ్చాడా, ఆ షాక్తో తను నాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయిందేమో, గుర్తున్నా కుదర్లేదేమో, ఒకవేళ ఇదంతా వాడికి తెలిసిపోయిందా…
ఎన్నెన్ని కారణాలు వెతుకుతామో ఒక సమస్యకి, వెతగ్గ వెతగ్గా అసలు సమస్య మాయమై, కారణాలే పేరుకుపోయి కన్పిస్తాయేమో, అసలు నిజంగా సమస్యంటూ ఉండదేమో, సమాధానాలు అనేవాటిని వెతకాలనే మన పిచ్చి ప్రయత్నంలోనే ప్రశ్నలు పుట్టుకొస్తాయేమో,
” అన్నా, బండి ఆప్తున్నా, పిషాప్”
-”వాటర్బాటిల్ తీస్కెళ్ళరా, అలాగే ఫ్రంట్ మిర్రర్ కడుగోసారి”
ఎంత మురికైనా నీరు కడిగేస్తుంది, మరి నీటికే మురికైతే? ఆలోచనలు మలినమైనా, మనసు పవిత్రంగా ఉండాలా? మనసు ఆలోచనలూ వేరువేరా? బుధ్ది మనసు ఒకటేనా?
వాటికి శుధ్ది మరణమేనా? కాలిపోడమేనా? నేనే ఏదో ఆశిస్తునాను పావనిద్వారా, అందుకే అదెక్కడ దొరక్కుండా పోతుందేమో అన్న భయం కలిగించిన సూడో కన్సర్న్ యే కదా ఇదంతా, సెక్స్ అంత ముఖ్యమా, అదిలేకుండా ఓ ఆడా మగా స్నేహితుల్లా ఉండలేరా, కనీసం అలా ఉండగల నియంత్రణకు లోబడగలరా, ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదోమూల అగ్నిపర్వతం బద్దలవ్వాల్సిందేనా,
బాసూ, ఆపుతావా నువ్వూ నీ లూసర్ ఫిలాసఫీ ఉవాఛల వాచాలత, దొరికితే ఏదైనా తిను, లేదా దొరికింది తిను, ఆకల్తో మాత్రం ఛావకు, ఇక్కడ ఫ్రీగా టన్నులకొద్దీ సానుభూతి దొరుకుతుందిగానీ, నీ ప్రయత్నం లేకుండా ఆకలి తీర్చలేరెవరూ…
“ఒరేయ్, శరచ్చంద్రుడా, నా “Zen and the art of motorcycle maintenance” బుక్ నీ దగ్గరే ఉoది కదా?! సడెన్గా గుర్తొచ్చిందెందుకో సగం నిద్రలో,” శివగాడు, ఇంచుమించు అకస్మాత్తుగా భయపెట్టి,
“గుర్తుందా, ఇంటర్లో మనం టూ వీలర్ మీద బెంగలూర్ వెళ్ళినప్పుడు అనంతపూర్ దగ్గిర టైర్ పంచర్, తెచ్చుకున్న డబ్బులైపోవడం, నీ ఫాస్ట్ ట్రాక్ వాచ్ అక్కడ పంచర్ షాప్ వాడికిచ్చి డబ్బిచ్చి విడిపించుకుంటాం అన్చెప్పి, హ హ… ”
-”హా హా, గుర్తుంద్రా, నాకు డ్రైవింగ్ రాదని మెయిన్రోడ్డు మీద పంచర్ షాప్ వరకూ మూడు కిలోమీటర్లు బండి తోయించడంకూడా గుర్తుంది..”
“జెన్”, జెన్ మతం కాదు లైఫ్ స్టైల్ అంటార్గానీ, అదీ బౌధ్దపు తునకేగా, విగ్రహారాధన కూడదన్న బుద్దుడికి విగ్రహాలు పెట్టి పూజ్జేస్తున్నాం,
మనం దేవతా మనుష్యులం, మనం నిజంగా భూమ్మీదే పుట్టామా, ఎక్కడో పుట్టి ఆవాసాన్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చిన ఏలియన్స్ కాదా, డార్విన్ ఎవల్యూషన్ మొత్తం కరక్టేనా, మరి మనిషి తర్వాతి రూపం (post man) ఎలా ఉండబోతుంది, ఈ సారైనా అందరూ ఒకేరంగులో ఉంటే బాగుంటది, కలర్ డిస్క్రిమినేషన్ లేకుండా, తెల్లగా,
మక్కాకు పోయేవాళ్లంతా తెల్లబట్టల్తోనే పోతార్టగా, అక్కడ తలనీనాలు ఇచ్చొస్తారట, హిందూ గుళ్ళలాగా, కాబాలో ఇంతకుముందుంది నిజంగా శివాలయమేనా, జాకిర్ నాయక్ ని అడగాలిది, ఏదో ఒకటిచెప్పి ఆర్గ్యుమెంట్ గెలిచేవాడే అర్ణబ్ గోసాయిగాడు…
(క్లింగ్)
*(శరత్, కాస్త బిజీగా ఉన్నా, రాత్రికి ఫోన్చేస్తాను, బై,)
బిజీ.. బిజీఆ, మూడు గంటల్నించీ ఎదుర్చూస్తుంటే కనీసం ఒక్కనిమిషమైనా మాట్లాడాలన్పించలేదా పావనీ, ఆమ్ ఎన్ ఇడియట్, ఇగ్నోర్ హర్, జస్ట్ ఇగ్నోర్ హర్ , అంతే,
నువ్వూ కాస్త బెట్టు పెంచుకోవాలోయ్, మరీ మెతగ్గా ఉంటే కుదర్దు, తీసేయ్ ఫోన్లోంచి నంబర్, ఓ రెండ్రోజులు మాట్లాడకపోతే తెలిసొస్తుంది నీ ఇంపార్టెన్స్, అంతే డెలీట్ హర్ కాంటాక్ట్,
హే.. మరీ పిల్లాడిలా చేయక్రా, తేజు ఉన్నప్పుడు పావని ఫోన్చేస్తే ఆన్సర్ చేసి మాట్లాడగలవా? కెన్ యూ? లేదు, నీకా దమ్ము లేదు, ఎందుకంటే మీది స్నేహం మాత్రమే కాదని ( కాకూడదనీ) నువ్వనుకుంటున్నావ్ ఏదో మూల నీక్తెలీకుండానే, కాబట్టి ఇకనుంచీ నువ్వు అబధ్దాలు మొదలెడ్తావ్, నీ ఫోన్ కి ప్రైవసీ కావాలంటావ్, పాత పాస్ వర్డ్స్ అన్నీ మార్చేస్తావ్, నీక్తెలీకుండానే నువ్వు మరో నీడలోకి మారిపోతావ్, తేజుకి ఇదంతా తెలీదు, తెలిసినా నువ్వెందుకు చేస్తున్నావో తెలీదు, అదీ తెలిసాక, షిట్…
“ఛలో అన్నా, పోదామా ఇంక”,
“పిషాప్ అన్నావ్ కదరా, మరింతసేపు..”
“అది అద్, పిషాప్ కాదన్నా, హె హె ”
షిట్!
***
ఇంటికొచ్చి ఫ్రెషై తేజుని తీసుకుని బంజారాహిల్స్ Zaffron కెళ్ళేసరికి రాత్రి 11.45, ఇంతకుముందుచాలాసార్లొచ్చినా కూడా ఏదో కొత్తగా ఉందివాళ,
పైన ఓపెన్ టెర్రేస్ మీద క్యాండిల్ లైట్ డిన్నర్కి రిజర్వ్ చేయబడ్డ టేబులదగ్గరికి రాగానే మామయ్యొచ్చి
“అల్డూ, రండ్రండి, జ్వరం తగ్గిందా, పాప చెప్పింది, ఏదో ఫ్రెండ్ పెదనాన్న..”
-”హా, అది పొద్దునే ఐంది మామయ్యా, ఇప్పుడు బావున్నా, ఎందుకీ గెట్ టుగెదర్, సడన్గా”
” ఏంలేదు, మా వాళ్ళు నిన్నోసారి చూస్తానంటేనూ, నిన్న పెళ్ళిక్కూడా రాలేదు కదా..”
పెద్ద టేబుల్, పది పన్నెండు మంది, ఎవరేమౌతారో కూడా తెలీదు, నాకంటే పెద్దోళ్ళని అంకులనీ, చిన్నోళ్ళనీ బ్రదర్ అని నెట్టుకురావడం అలవాటు,
ఇక్కణ్ణించి హైద్రాబాద్ కాంక్రీట్ వెలుగులు గట్టిపడ్తున్నట్టు లైట్లు మిణుకుమిణుకుమంటూ, అంతా ఎవరికినచ్చింది వాళ్ళు ఆర్డర్చేస్తున్నారు, అపోలో ఫిష్, మటన్ టిక్కా, చెకెన్ మొఘలాయ్, ఫ్రైడ్ రైస్,
-”కర్డ్ రైస్”,
ఏంటందరూ కొత్తగా చూస్తున్నారు నన్ను, పెరుగన్నం అన్నందుకా… కవర్చేయాలి ఏదో ఒకటి, తేజుకి తెలిసిపోద్ది నేను మూడీగా ఉంటే,
-” హ హ, ఇక్కడ పెరుగన్నం చాలా బావుంటుంది మామయ్య, మీరూ ట్రై చేయండోసారి, నాన్ వెజ్జే కావాలనుకుంటే బార్బీక్యూ కే వెళ్ళేవాళ్ళం, అక్కడింకా బావుంటది”
తేజు నవ్వుతుందెందుకో, ఇవాళ ఆదివారమని నా టైమ్ టేబుల్ గుర్తొచ్చినందుకేనా, కానీ, నేనేం తాగలేదే, ఆకల్లేదు కడుపుకి, ఏదో తెలుసుకోవాలనుంది, నాకు తెలీకుండా ఏదో జరుగుతున్నట్టుంది, పన్నెండైoది.. పావనింకా ఫోన్చేయలేదు, చేస్తే నేనిప్పుడిక్కడ మాట్లాడగల్నా, మెసేజైనా పెట్టుండాల్సింది ఒకటి.
ఏమైంది, ఏమిటీ శబ్దం నిశ్శబ్దంలోంచి, హ్యాప్పీ బర్త్ డే ఆ, ఎవర్దో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్టుంది, ఉహూ, ఈ టేబుల్దగ్గరికే వొస్తున్నారేంటి కేక్తీసుకుని,
ఎవరు పుట్టారేంటి కొత్తగా, అంత సంతోషమెందుక్రా నాయనా పుట్టిన్రోజులంటే..ఇక్కడ పుట్టిన్రోజ్జేసుకుంటున్నాడంటే ఉల్ఫా గాడే వాడు…
ఓఫ్ ఫ్, నాదే కదా, నాదేనా, హా, అందుకేనా ఈ గెట్ టుగెదర్, తేజూ, నాకో మాటైనా చెప్పాల్సిందే, నాకు చెప్పకుండా ఇదంతా, అసలెందుకు,
నన్నెందుకు ఇంత ప్రేమిస్తున్నావ్, నమ్ముతున్నావ్, నన్ను నమ్మకండ్రా నాయన్లారా, నేను దానికి తగను, నమ్మకండి, తేజూ నేనో జంతువును,
“అల్డూ రండి, కమాన్” స్వఛ్చంగా నవ్వుతూ మామయ్య
” హీరో, కమాన్.. హ హ” తేజూ, చప్పట్లు కొడ్తూ..
అన్ని తేబుల్స్ వాళ్ళూ నిలబడి చప్పట్లుకొడ్తూ విష్ చేస్తున్నారు, ఎందుకో, ఎవరు వీళ్ళంతా, నాకుతెల్సా, కేవలం కాసేపు ఒకడ్ని సంతోషపర్చాలని ఇందరి తాపత్రయమా, ప్యాంట్ జేబులో ఫోన్ రింగౌతుంది, చూడాలా, పావని ఐతే, హా, పావనే, అంటే తనుకూడా, ఇందుకే చేసిందా ఇదంతా, రి యూనియన్…
” చందూ, ఫోనెవరూ, ఇటివ్వు నేను మాట్లాడ్తా, ముందు కేక్ కట్ చేసెయ్” తేజూ.. కాస్త కోపపు నవ్వుతో,
-” నథింగ్, అన్నౌన్ నంబర్” కాల్ కట్ చేసానా, నేనేనా,
అన్నౌన్ నంబరా, వెయిటర్ ఏవో కాక్టెయిల్ గ్లాసులు తెచ్చి పెట్టాడు టేబుల్మీద, మంచులో ముంచిన రంగువెలిసిన ద్రావకం,
“చందూ కమాన్, అందరూ వెయిట్చేస్తున్నారు, ఇట్స్ యువర్ డే మాన్” తేజూ.. ప్రశాంతంగా,
నాకు తెలుస్తుంది, ఇంకెప్పుడూ పావని జీవితంలోకి వెళ్ళకూడదని, వెళ్ళలేననీ, నాకు తెలుస్తుంది తను కూడా ఇకపై నాతో మాట్లాడదనీ,
డెలీట్ హర్ కాంటాక్ట్, డెలీట్ ఇట్ నౌ, ఇట్స్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ యూ, అంతే తీసేయాలి. అన్నీ తీసేయాలి, మెదడ్లో దోపుకున్న చెత్తంతా,
బావున్నానిపుడు.. నేనూ తేజూ, అంతే.. కొన్ని కంఫర్టబుల్గా మర్చిపోగలిగితేనే కంట్రోల్డ్ గా బ్రతగ్గలం.
” హీరో, రా స్వామీ, కాక్టెయిల్లో ఐస్ కరిగిపోతుంది, నీ ఇష్టం లేటైతే”..
అవును, మంచు కరిగిపోతుంది, కళ్ళలో కూడా, రెండు బొట్లుగా, గాయాలూ విరహాలూ అబార్షనైన రక్తమూ గడ్డకట్టిన కాలమూ అంతా కరిగిపోతుంది,
చాన్నాళ్తర్వాత నిశ్శబ్దంగా ఏడవడానికి ఓ అకేషన్, చాలా కారణాలున్నాయ్, ప్రశ్నలనే వెతుక్కోవాలిక.
ఒకటే జీవితం, ఏం చేసినా ఇప్పుడే, కానీ, మనల్నే జీవితం అనుకునేవాళ్ళని మోసంచేస్తే ఆ ప్రశ్న “నేనే” ఔతానేమో!!
**** * ****
ఈ కథని చాలా మంది చదువుతారు, చదివిన అందరికి చాలా AlOchanalE కలుగుతాయి.. అయినప్పటికీ ఎక్కుమంది ఇక్కడ కామెంట్ రాయడానికి సాహసించకపోవచ్చు
నా కామెంట్ –
జీవితసత్యం కథగా రాయబడింది అనిపించింది చదవగానే! హీరోనో లేదు రచయితో హృదయమున్నోడు కాబట్టి అలా ముగిసింది కథ! Hats off వంశీధర్ గారూ!
అయిసు క్యూబులూ, మందులూ మాకులూ – కథలో పొంగుకొచ్చే ఆలోచనా సంవేదనలూ అదో గొప్ప కాక్ టెయిల్! గొప్ప కిక్కిచ్చేసిన కథ వంశీ గారు. ముగింపు అంత సులభంగా తేల్చేశారు ? అంత ఈజీ నా? అవునంటున్నారా?
sreeram garu @ అంత తొందరగా, అంత సులభంగా ఏం ముగియలేదనే అనుకుంటున్నా, ( ఏ కథకూ పర్టికులర్గా “ముగింపు” అంటూ ఉండదేమో), ఏకథలోనైనా పాత్రలు భవిష్యత్తులోకి ప్రయాణిస్తూనే ఉంటాయ్, ఎక్కడా ఆగవు, ఐతే నేను ఇక్కడ వాళ్ళ consciousness ని ఒక “టైమ్ ఫ్రేం”లోకి కుదించే ప్రయత్నం చేసాను, రేపేమైనా జరగొచ్చు, శరత్ పావనితో మళ్ళీ మాట్లాడొచ్చు, తేజుకి ఇదంతా తెలిసి గొడవలవ్వొచ్చు, ఇవేం కాకుండా వాళ్ళ రహస్య ప్రేమ కొనసాగైనా ఉండొచ్చు,
అర్థమయ్యింది వంశీ గారు. నా ప్రశ్నలోనే కొంత అవగాహనా లోపం ఉంది. నేను అడిగి ఉండాల్సిన ప్రశ్న – ఆ నిర్ణయం అంత సులభమా అని? సమాధానం ఆల్రెడీ చెప్పేశారు. థేంక్స్
అన్నట్లు ఇంకో ముఖ్యమైన మాట, ” చదువుతున్నంతసేపూ ‘ కాశీభట్ల ‘ కనిపించారు. లిక్కరూ, ఐస్ క్యూబులూ కారణం కాదు, మరింకేదో ! తెలీదు
ఇంకాస్త కథ నడిచుంటే బావుండేదేమో అని కూడా అనిపించింది.
వంశీది సమకాలీన ఇతి వృత్తమే కాదు … సమకాలీన భాష కూడా ! కూర్చున్నవాడు లేస్తున్నపుడు కాలు తగిలి మందు వొలికి పోవడం, ఈగలు వాలిన మందు గ్లాసు … తాగినప్పుడు పెదవులకు అంటుకున్న నురుగును భుజానికి రాసుకోవడం … ఇవన్నీ రచయిత సునిశిత పరిశీలనా దృష్టికి నిదర్శనం. చౌరస్తా నుండి వంశీ కథలు చదువుతునే ఉన్నా … మనసుకు మైల్డ్ గా మత్తెక్కినట్టు, తాగినప్పుడు చెంపలు తిమ్మిరెక్కినట్టు ఉంటుంది తన వచనం. వంశీకి శుభాకాంక్షలు.
కథ చాల బావుంది
కథ బావుంది. రాసిన శైలీ, వాడిన భాష కూడా బావుంది. కానీ, ముగింపు విషయంలో కథకుడిగా అలా చేయిచేసుకోవడం నచ్చలేదు.