కవిత్వం

ఛందోబధ్ధం

ఫిబ్రవరి 2016

ఎంత మోహనం
కనుచూపు తాకిడితో కాంతి జనకాలమైపోవడం.
చినుకులో బందీలై ఈ పాత్రలోకి చిందిపోవడం.
కొన్ని జన్మల క్రితమే
ఒకరి చిత్రాన్ని మరొకరం గీసుకుంటూ
నల్లటి చందమామల మధ్య కట్టుకున్న
నక్షత్రాల వంతెన మీంచి
ఇప్పుడు ఒకరిలోకొకరం నడిచి రావడం.

ఎంత సుందరం
గుండె భాష మాత్రమే అనుమతింపబడే లోయలోకి
ఇలా జంటగా జారిపోవడం.
ఎవరూ దోచుకోలేరని
సెలయేటి రాళ్ళ మధ్య
మనం దాచుకున్న తీపి గుర్తులన్నీ
వెలికి తీసి ఇచ్చిపుచ్చుకునే వేళ
నమూనాలైనా మిగల్లేదనుకున్న
మన శిల్పాలన్నీ
సెలయేటి నీటిలో నీడలై ఆడటం

ఎంత చందోబధ్ధం
ఈ పురాతన ద్విపదలో
ఇద్దరం చెరో పాదమూ అవడం.