కవిత్వం

సంగమం

జూలై 2017

వేసవి సాయంత్రం వర్ష ఋతువైపోయే అరుదైన క్షణాల్లో
ఖాళీ అయిన హృదయంలో మన సంభాషణలన్నీ దాచుకుని
మేఘం ఎక్కడికో వలసపోతుంది.

వర్షాకాలపు రాత్రి చలి యుగమైపోయిన వేళల్లో
మన కువకువలన్నిటినీ కప్పుకుని
చలి మెల్లగా జారుకుంటుంది.

ఒణికించే కాలంలో చుక్కలు చిగురించే పూట
మన దేహాలకి వెన్నెల పిండితో నలుగు పెట్టి
ఆకాశం ఆత్మీయంగా దిష్టి తీస్తుంది.

కాలానికతీతమైన మన ముద్దు మాటలన్నిటినీ
సహస్ర వర్ణాలతో మోహ గీతాలుగా
భూమి ముద్రించుకుంటూ సాగిపోతుంది.