పుస్తక పరిచయం

ఆధ్యాత్మికంగా మేల్కొల్పే “Only love is real “ by Dr. Brian Weiss

మే 2017

“అంతా ప్రేమే… అంతా ప్రేమే. ఆ ప్రేమ ద్వారానే అవగాహనా శక్తి, తద్వారానే ఏర్పడే సహనం. అక్కడే… సరిగ్గా అప్పుడే సమయం ఆగిపోతుంది. అంటే అంతా వర్తమానమే అయిపోతుంది. యదార్థమే వర్తమానం. మానసికంగా భూతకాలంలోకో, భవిష్యత్తులోకో ప్రయాణించేసి అక్కడే తిరగాడుతూ ఉండటం ఎప్పటికైనా బాధనీ, అనారోగ్యాన్నీ మాత్రమే కలిగిస్తుంది. అలా మన కాలం మన చేతుల్లోంచి ఒలికిపోకుండా ఒక్క సహనం మాత్రమే ఆపగలదు.

అన్ని ప్రశ్నలకీ ప్రేమే అంతిమ సమాధానం. ప్రేమ నైరూప్యమైనది కాదు. అది నిన్ను నిర్మించి నీ ఉనికిని కాపాడే ఓ దివ్య శక్తి. అందుకే ప్రేమమయమైపో. ప్రేమని అనుభూతించు. ప్రేమని దాచుకోకుండా వ్యక్తపరుచు. ప్రేమ భయాన్ని పోగొడుతుంది. ప్రేమని అనుభూతించేటప్పుడు భయం ఉండదు. సృష్టిలో ప్రతీదీ శక్తే. ప్రేమ అన్ని రకాల శక్తులనీ మించినది.”

ఇవే కాక ప్రేమ గురించి ఇంకా ఎన్నో రహస్యాల్ని తెలుసుకున్నాడు అమెరికాలో ప్రఖ్యాత సైక్రియాట్రిస్ట్, డాక్టర్ బ్రియాన్ వెయిస్. తన ప్రాక్టీస్ ద్వారా ఎందరికో మనోవ్యాకులతను దూరం చేసే క్రమంలో అనుకోకుండా అతనికి పూర్వజన్మల మీదా, వాటి కర్మ ఫలాల మీదా అతనికి మునుపు ఉన్న నమ్మకాలన్నిటినీ సవాలు చేసే పరిస్థితి ఎదురవుతుంది. తన పేషంట్లను హిప్నటైజ్ చేసి, వారి మానసిక, శారీరక బాధలకి కారణాలు తెలుసుకోవడం కోసం వారిని కొన్ని సంవత్సరాల వెనుకటి స్థితికి తీసుకువెళతాడాయన. ఆ సమయంలో కాథరిన్ అనే పేషంట్ అనుకోకుండానే తన ఇప్పటి జన్మకి ముందు సమయం అంటే, తను తల్లి కడుపులో పడకముందు ఉన్న పరిస్థితుల్ని అలా ట్రాన్స్ లో ఉండే వివరిస్తుంది. అలా తను నమ్మని ఒక నిజాన్ని కళ్ళ ఎదుట తన ప్రమేయం తోనే జరిగిపోవడాన్ని చూసి విస్తుపోతూనే క్షుణ్ణంగా మరిన్ని విషయాలు తెలుసుకుంటాడు ఆయన.

అలా “పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ని” నమ్మక తప్పని పరిస్థితి మొదలవుతుంది. రోగుల వివరాలతో పాటు తన ఉనికికే సంబంధించిన ఎన్నో విషయాలు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ట్రాన్స్ లోకి వెళ్ళి గత జన్మలలోకి ప్రవేశించి అప్పటి విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా చెబుతున్న తన పేషంట్ల ద్వారా తెలుసుకుంటాడు.

ఆ తరువాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రస్థుత జన్మల్లో రోగులు పడుతున్న ప్రతి బాధకీ వారి పూర్వ జన్మల్లో ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకున్నాక, అతనికి చికిత్స మరింత సులభమైపోతుంది.

ఎలిజబెత్ అనే యువతి చిన్నతనమంతా తండ్రి యొక్క నిరాదరణ, తాగుడుకి బానిసైన అతను తన తల్లిని పెట్టిన క్షోభ చూస్తూ పెరుగుతుంది. ఆమె తన తల్లికి మూడో సంతానమైనా, అత్యంత ఆత్మీయ స్నేహితురాల్లా పెరుగుతుంది. తనకు చదువు పూర్తయి దూరంగా ఉన్న ఊరిలో ఉద్యోగం వచ్చాక, తల్లికి ప్రమాదకరమైన కాన్సర్ వ్యాధి శోకిందని తెలిశాక విపరీతమైన భయానికి లోనవుతుంది. ఆమె ఎందరినో ప్రేమించేంత వరకూ వెళ్ళి ఎవరితోనూ బంధం నిలవకపోవడం కూడా ఆమెను తీవ్రమైన వేదనకు గురిచేస్తుంది. కొన్నాళ్ళకి తల్లి దూరమైపోవడంతో భరించలేని నైరాశ్యానికి లోనయి, అనారోగ్యంపాలవుతుంది. ఆ డిప్రెషన్ భరించలేక డాక్టర్ బ్రెయిన్ వెయిస్ ని కలుస్తుంది. ఆమెకు చికిత్స మొదలుపెట్టడం కోసం, ఆమె యొక్క మానసిక వేదనకి కారణాలు సేకరించడం కోసం, ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ ద్వారా మెల్ల మెల్లగా హిప్నటైజ్ చేస్తూ ఆమెను కొన్ని జన్మల వెనుకకి తీసుకువెళతాడు.

అదే సమయంలో పెడ్రో అనే ఓ ధనవంతుడు కూడా డాక్టర్ బ్రియాన్ ని కలుస్తాడు. అతను ఎంత గొప్ప ధనవంతుడైనా కొద్ది నెలల క్రితమే అతను అమితంగా ప్రేమించే తమ్ముడిని కోల్పోవడం, జీవితంలో అతను గాఢంగా ప్రేమించగల యువతి దొరక్కపోవడంతో నిరాశకు గురైన మనిషి. వీటితో పాటుగా ఏ డాక్టరూ నయం చేయలేకపోతున్న భుజం నొప్పి కూడా అతన్ని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తుంది.

బ్రెయిన్ వెయిస్ అతనికీ ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ మొదలుపెడతాడు.

వాళ్ళిద్దరూ తమ ప్రస్థుత జీవితాల్లో ఇంకా సరయిన తోడు దొరకలేదని వేదన చెందుతున్న వాళ్ళే. థెరపీ సెషన్లు పూర్తయ్యేకొద్దీ పూర్వ జన్మల్లో జరిగిన అత్యంత వేదనా భరిత సంఘటనలు తెలుసుకునేకొద్దీ, వారిలో మెల్ల మెల్లగా మార్పు వస్తుంది. ఎందరో పేరొందిన డాక్టర్లు సైతం తగ్గించలేకపోయిన పెడ్రో భుజం నొప్పి, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఆ జన్మలో తను అనుభవించిన ఒక విషాదకర సంఘటన థెరపీ ద్వారా తిరిగి అనుభూతించాక అతి విచిత్రంగా మాయమైపోతుంది.

అటు పెడ్రో, ఇటు ఎలిజబెత్ కూడా, రిగ్రెషన్ థెరపీలో వెనుకటి జన్మల స్థితికి చేరుకునే కొద్దీ, ప్రతి జన్మలోనూ తాము ఎంతగానో అభిమానించే/ప్రేమించే అదే వ్యక్తి ఆ మునుపటి జన్మలో కూడా అత్యంత ఆప్తుడిగా/ఆప్తురాలిగా తమతోనే ఉండటం గమనిస్తూ వస్తారు. కానీ, అది వారిద్దరే అని విడి విడిగా బ్రియాన్ దగ్గరకి కౌన్సిలింగ్ కి వస్తున్న వారికి తెలియదు. వారిద్దరి థెరపీ చేస్తూ, సెషన్స్ ని, రికార్డ్ కూడా చేస్తున్న బ్రియాన్ కీ చివరి వరకూ తెలియదు.

ఇక పెడ్రో బాధ చాలా వరకూ తీరిపోయి అతను ఆ ఊరి నుంచి వేరే దూర నగరానికి శాశ్వతంగా వలసపోయే ముందు జరిగిన సెషన్ లో బ్రియాన్ కి ఒక క్లూ దొరుకుతుంది. పెడ్రో వెతుకుతున్న ప్రేమ ఎలిజబెతే అని, ఎలిజబెత్ తను చేరుకోవాలని తపించిపోతున్న ఆత్మ బంధువు పేడ్రోనే అనీ, అతనూ, ఎలిజబెత్ ఇద్దరూ కూడా జన్మ జన్మలుగా ఆప్తులుగా ఉంటున్న వ్యక్తులని. సోల్ మేట్స్ అని అర్థమవుతుంది. కానీ, అది తను చెప్పలేడు. వాళ్ళిద్దరూ ఎదురుపడాలి. ఒకరినొకరు గుర్తుపట్టాలి. అందుకు అతనేం చేస్తాడు, అలా ఎదురు పడ్డాక వారిద్దరూ ఎలా ప్రవర్తిస్తారు? చివరికి ఏమవుతుంది అనేదే ముగింపు.

ఇది నిజంగా జరిగిన కథ. ఇందులో ఒక పదం కూడా కల్పితం కాదని నవల మొదట్లోనే చెబుతారు బ్రియాన్ వెయిస్. ఈ నవల మొత్తం వీరిద్దరి రిగ్రెషన్ థెరపీ సెషన్లతో అత్యంత ఉత్కంఠంగా సాగడం మాత్రమే కాదు, వారి వారి పూర్వ జన్మల్లోని అనుభవాల ద్వారా వారిద్దరిలో ఒక్కొక్కటిగా ఆజ్ఞానపు పొరలు చిరిగిపోయి జ్ఞానం వికసించినట్టే మన లోపల కూడా అతి ముఖ్యమైన తలుపులేవో తెరుచుకుంటాయి. ఈ నవల చదివాక మన జీవిత దృక్పధమే మారిపోతుంది. ఏ తలుపు శాశ్వతంగా మూసివేయాలో, ఏ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచాలో తెలుస్తుంది. అన్నిటికీ మించి జీవన గమనానికి అత్యంత అవసరమైన సహనం ఏర్పడుతుంది. అందువల్లే, మనం మాట్లాడే పధ్ధతితో సహా, మన ప్రవర్తన, జరిగే సంఘటనలకి మనం స్పదించే తీరు, అన్నీ మారిపోతాయి. జీవితంలో ప్రతి ఒక్క క్షణమూ ఎంత విలువైనదో తెలుస్తుంది. ఇంత గొప్పగా జీవితాల్ని ప్రభావితం చేసే పుస్తకాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇటువంటి పుస్తకాల్ని చదవకుండా వదలకూడదు.

**** (*) ****