కవిత్వం

నువ్వూ, నేనూ..

జనవరి 2015

క స్థిరమైన దూరంతో
ఒకరినొకరం వెంబడించుకుంటూనే ఉంటాం.

నిషిధ్ధ వేదనొకటి
ఆకాశపు పొరల కింద
మన ఛాయల్ని చెరుగుతూంటుంది.

అక్షరాల్లోకి అనువదింపబడలేని
అప్రకటిత సత్యమేదో
నీ కుంచెలోంచి అలవోకగా రాలి పడిపోతుంది.

నువ్వేసే వలలో చిక్కకూడదనుకుంటూనే
నీకోసం చీకటిని మింగేస్తూంటాను.

నా బాహువుల్లో బలం లేదంటూనే
నాకోసం వెలుగుని విసురుతావ్.

అనంతమైన దిగంత గానంలో
శ్రుతి లయలమై ఉండీ
అనాదిగా మన బంధంలో అదే ఆవేశం.