కొత్త పుస్తకం కబుర్లు

రంగుల్లో తడిసిపోదామిలా…

ఆగస్ట్ 2017


జీవితమంటేనే రంగుల మయం. ఆ రంగుల్ని గుర్తించి ఒడిసిపట్టుకుని ఆనందాన్నో, విచారాన్నో, తీవ్రమైన వేదననో వ్యక్తపరచగలగడమే కాకుండా, చదువరులకి కూడా తమ జీవితంలో మారుతున్న రంగుల్ని చూసుకోగలిగేలా చెయ్యడం కళాకారుడికే సాధ్యం. ఒక చిత్రకారుడు తన అనుభవాల్నీ, అనుభూతులనీ తనకు నచ్చిన రంగుల్లో ప్రపంచానికి వ్యక్తపరిచినట్టు, కవి అందమైన పదచిత్రాలతో చెబుతాడు. అలా చెప్పాలంటే ఎక్కడో ఓ చోట కాసేపు ఆగాలి. అలా ఆగిన కాస్త సమయంలోనే తనలో విప్పుకుంటున్న పొరల్నీ, కలిగే మార్పుల్నీ చదువరులకి అర్థమయ్యే రీతిలో అందించగలగాలి.

ఈ సంకలనంలో తను గమనిస్తున్న రంగుల్ని మన మీదకి వెదజల్లి మనల్ని మేల్కొల్పుతాడు కవి. సమాజం గురించో, మానవ సంబంధాల గురించో లేక తనలోపలి సంఘర్షణల గురించో చెప్పేటప్పుడు ఈ కవి యొక్క అభివ్యక్తి, నాకైతే నిజంగానే చిత్రకారుడికి అవసరమైన రంగుల శాస్త్రాన్ని గుర్తుచేసింది. తాను గుర్తించిన రంగులన్నిటినీ పాఠకులమీదకి చల్లాలని ఈయన చేసిన ప్రయత్నం సఫలమైంది.

ప్రతి కవితలోనూ తను చెప్పాలనుకున్న విషయం యొక్క గాఢత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయం గురించి తాను పడుతున్న మానసిక వేదన కవితలో కనిపించి పాఠకుడిని చుట్టుకుంటుంది. ఒకపట్టాన ఆ అనుభూతినుంచి మనం కూడా బయట పడలేం. ఆలోచించకుండా ఉండలేం.

‘బాల్కనీలో ఊయల’ కవితలో

“అశరీరికి, మనసున్న వారికి
స్థిత ప్రజ్ఞత
కుదరదేమో
ఆ అవసరమూ లేదేమో “ అంటారు.

మనసున్నవారికి, ప్రతి దానికీ స్పందించే గుణం ఉన్నవారికి స్థితప్రజ్ఞత అంత సులభంగా ఎలా సాధ్యపడుతుంది?

ఇలాంటి వారు స్పందిస్తేనే కదా, నేటి సమాజంలో, మానవ సంబంధాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న లోటు పాట్లనూ, మరిచిపోతున్న మధురమైన విషయాలనూ ఇలా సంకలనపరిచి మనల్ని కాస్త జాగ్రత్తపడమని చెప్పగలిగేది.

అనుభూతులూ, స్పందనలూ లేని జీవితం చప్పగానే కదా ఉంటుంది. అందరికీ సాధ్యం కాని విషయమది. అందుకే ‘ఇలా, యెలా‘ కవితలో

“పరిమళించడం ఓ అనుభవం!
అనుక్షణం క్షణ క్షణమై పరవశించడం ఓ వరం!!
మనసుని వెలివేసిన బానిసలమై
శూన్యాడంబరాన్ని చుట్టుకుని
నిత్య ఉదయాస్తమయాల మధ్య
వికశించక వివశించక
జీవన్మరణాలమై,
ఇలా, యెలా !?” జీవించగలుగుతున్నాం అని ప్రశ్నిస్తారు.

అనుభవాల్లో అనుభూతులుండటం లేదని గమనిస్తూనే ఉంటాం. ఉద్వేగాల్ని కోల్పోతున్నామని తెలుసుకుంటూనే ఉన్నాం. అలా అన్నీ తెలిసి కూడా ఇలా యేలా ఉండగలుగుతున్నాం? అంటూ ఆధినిక జీవన విధానంలో కొట్టుకుపోతూ, మనసనేది ఒకటుందని కూడా మనుషులు మర్చిపోతున్నారని ఆయన వేదన వ్యక్తం చేస్తారు తన కవితల్లో.

అందుకే ‘ కూలుతున్న ఇల్లు ‘ కవితలో కూడా అంటారు…

“మాయమవుతున్న పిచ్చుకలనీ పట్టించుకోని
మొద్దెక్కిన మనసులు
విడిపోతున్న చేతుల్లో
కత్తుల్ని పూయిస్తున్నాయి” అని.

ఆయన కవితల్లో గాఢత మనల్ని ఆయన అనుభవించిన మానసిక వేదనలోకే తిన్నగా తీసుకుపోతుంది.

మనుషుల మధ్య సత్సంబంధాలు కరువై, మెత్తగా పిలిచే, చల్లగా పలకరించే ఆప్యాయతలూ, అనురాగాలూ మాయమై స్థబ్దత పేరుకుపోతున్న బ్రతుకుల్లో తరచుగా పలకరించే వెలితిని గురించి ‘అవునా?’, ‘నీలోనే నీవైనప్పుడు’, ‘ముసురు’ వంటి కవితల్లో అద్భుతంగా వివరిస్తారు.

జీవితమంటే ఆనందంగా ఉండటం అనేదే తెలుసుకోకుండా, తెలుసుకున్నా, ఆ తమ జీవితాలకి తామేవిలువా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా నగర వాసులు తమ క్షణాల్ని తామే కసిగా ఎలా కాల్చుకుంటున్నారో ‘ఓ భిన్న దృశ్యం’ లో గట్టిగా చెబుతారు.

‘కాలుష్యపు మత్తులో జోగి
హద్దులు దాటిన నగరపుటంచుల్లో
తాంత్రిక పాతాళ భైరవి సాక్షిగా
మార్జాలగతుల్లో విలాసనృత్యాల్లో
పరదేశీరాగం విశృంఖలత్వాన్ని
స్ఖలిస్తున్న దృశ్యం’

అనడంతోనే నగర జీవన విధానంలో జనులు దేనికోసం దేన్ని కోల్పోతున్నారో చూడమని ఆవేదన చెందుతారు.

ఒక్కసారి మనసారా పలకరించి చూడు క్షణాలు పువ్వులా ఎలా విచ్చుకుంటాయో అంటారు ‘పలకరించి చూడు’ లో.
ప్రమిదల్లో తైలాన్ని నింపి వెలిగించినంత మాత్రాన దీపావళి రాదు. మరి ఎలా ఉంటే దాన్ని దీపావళి అందాం? ఎంత బాగా చెప్పారు కదా అనిపించింది ‘దీపావళి’ కవిత చదివితే.

వానజల్లు ప్రేమలో తడిసి, బరువెక్కి, ఆ ప్రేమద్వారా తను పొందిన శక్తినంతా ఈ మట్టి విత్తుల్లోకి నింపి, పచ్చటి పైరుల్ని తయారుచేసినట్టు, మనసుని తాకి, తడిపిన అనుభూతులు కవితలై మొలకెత్తడం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఊపిరి పోసుకునేవేళ’ కవితలో చెబుతారు.

మనసైన మనిషితో నడకెంత ఆహ్లాదకరమో ‘కాలంతో పాటు వెళ్ళి వద్దాం, వస్తావా? ‘ కవితలో సున్నితంగా చెబుతారు.

ఆధునిక ప్రపంచపు పోకడ జీవితాలపై ఎటువంటి రాక్షస ప్రభావం చూపిస్తోందో మనందరికీ తెలుసు. మనుషుల్లోంచి జీవాన్ని గడగడా తాగేసి, మనచే సృష్టింపబడిన యంత్రాలే మనల్నెలా అనుభూతుల్లేని రబ్బరు బొమ్మలుగా మార్చేస్తున్నాయో తెలిసీ మనం అటువంటి జీవితానికే దాసోహమంటున్నాం. ఈ రకమైన విధానంతో ప్రపంచం ముందు ముందు ఏమైపోతుందో అన్న వేదన ‘చూడు, చూస్తూనే ఉండు!’ కవితలో కనపడుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవిత గురించీ ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఈ సంకలనంలో ప్రతి కవితా గాఢమైన అనుభూతిని మిగిల్చేదే. ప్రతి కవిత యొక్క నిర్మాణమూ ఒక పధ్ధతిలో సాగిపోతుంది. తను చెప్పదలుచుకున్నదేదో పాఠకుడి మనసులో గట్టి ముద్రే వేస్తుంది. సంకలనంలో పదాల పునరుక్తి పెద్దగా ఏమీ కనపడదు. తన అనుభూతుల్నీ, అనుభవాల్నీ ఇలా ముద్రించడం ద్వారా మన మీదకి చాలా రంగులే రువ్వారు విజయ్ గారు. చదవండి మీరూ ఆ రంగుల్లో మరో రంగై తడిసిపోండి.

**** (*) ****