కవిత్వం

అనంతం

ఏప్రిల్ 2016

చిగురింతలనిచ్చి చిరునవ్వుని కోసుకోవాలనుకుంటాడతను.
ఆమె పులకింతలన్నీ పూలైపోవడం చూస్తూ నిలబడిపోతాడు.
కోయిల పిలుపుల మధ్య మామిడి పులుపుల్ని ఆస్వాదిస్తూ
పాటగా పరుగుదీస్తుందామె.

తాపాన్ని కొంత పంచుకుంటుందని వాడిగా వస్తాడతను
ఆవిరై అణువణువూ తననల్లుకుపోతున్న ముందుచూపుని గ్రహించలేడు.
తనకోసం ఒక్క పద్యమైనా రాస్తాడేమోనని ఎదురుచూస్తూనే
సగం వేడిని తీసేసుకుంటుందామె.

మేఘాన్ని చాటు చేసి ముద్దాడాలనుకుంటాడతను
ఆమె పెదవుల్లో పుట్టే మెరుపుల్ని దాచలేకపోతాడు.
వడగళ్ళనేరుకుంటూ కవితల్ని పారబోసుకుంటూ
గుండెని ఖాళీ చేసుకుని కూర్చుంటుందామె.

ప్రతి రేయినీ వెలిగిస్తూ చల చల్లగా ప్రేమిస్తాడతను
ఆమెలా ప్రేమని పద్మాలతో చెప్పడం నేర్చుకోలేడు
మొక్కల్లోని అల్లరినంతా తనలోకి ఒంపుకుంటూ
నింపాదిగా నవ్వుకుంటుందామె.

తెల్లటి పొగల తెరలకవతల స్తబ్దుగా ఉంటాడతను
ఒణుకుతున్న ఆమె పిలుపుల్ని వినలేడు
సూర్యుడిపక్కన అడుగులేసే సమయాల్లో
తన మనసుని వెచ్చగా వ్రాసుకుంటూ ఉంటుందామె.

ఆహ్లాదపరిచే ఉదయాలతో ఆమె ముంగురుల్ని సవరిస్తాడతను
ఏ వేదనలకో ఆమె వదిలించుకుంటున్న ఉత్సాహాల్ని గమనించడు
సరికొత్తగా అతను వ్రాయబోయే ప్రేమలేఖల కోసం
రాలి పడ్డ గుర్తులతో రోజుల్ని లెక్కిస్తూ ఉంటుందామె.