ఇట్లు మీ..

రాధా మనోహరాలు – 2

ఫిబ్రవరి 2017

నీకు వ్రాయడం మొదలుపెట్టానో లేదో .. ఎవరి మొబైల్ లోంచో తెలీదు లీలగా ఆ పాట

“తుమ్ మానో యనా మానో .. పర్ ప్యార్ ఇన్సాన్ కి జరూరత్ హై … “

ఇప్పుడిక ఈ విషయం తప్ప ఇంకేమీ మాట్లాడాలనిపించడం లేదు. ఆ పాట పల్లవి అలాంటిది మరి.

పదాలు మాత్రమే మిగిలే ప్రయాణాలని తెలిసి కూడా పల్లవిని నిర్లక్ష్యం చేస్తూ పాటని అల్లేసుకుంటాం. అలరించలేకపోయిన పాట తోడు అవసరమే లేదని వాడిన దండలో దారంలా పారేసుకుంటాం.

ఇంత దూరం విసురుగా సాగి వచ్చాక , నడక తనంతట తాను నెమ్మదించాక , జీవితం సుధ్ధ వచనమైపోయిందని పొగిలి ఏడ్చే పిచ్చి వాళ్ళం మనం.

ఏ ధ్వనీ చెయ్యకుండానే ప్రతిధ్వని కోసం చెవులు రిక్కించే వెర్రివాళ్ళం కూడా.

పోనీలే .. ఎవరు వ్రాసుకున్న పాటయితేనేం, ఎవరు పాడుకున్న పల్లవైతేనేం? మేల్కోవడం ముఖ్యం కదా ఎప్పటికైనా.
రెక్కలు విరిగిన పదాలూ, మేఘాలే రాలని దృశ్యాలూ, పూలు పూయించలేని మాటలూ మనకొద్దు. ఇక్కడే ఆత్మని బంధించే దేహాల చరసాలల్ని శుభ్రపరుచుకుందాం వస్తావా.

ప్రపంచాన్ని గదిలో పెట్టి గడియపెట్టేశాక అనూహ్యంగా తెరుచుకునే ఆ గుప్త ద్వారాలు దాటి సౌందర్యోన్మత్త లోకానికి చేరుకుందాం.
చంద్రవంక ఇరుకొసల నుండీ తేనె చుక్కలమై జారిన వాళ్ళం. ఇప్పుడు గులాబీల తోటలోకి మంచు బిందువులమై నిర్భయంగా రాలిపడదాం.
ఒకరికొకరం చిన్ననాటి కథల్లో రెక్కల గుర్రాలమైపోదాం.

ఇంద్రధనుస్సుని తెచ్చుకుని నడిచే దారంతా పరుచుకుని రెండు విడి రంగులమైనా కలిసే పయనిద్దాం.

నదుల్లనీ కలిసి ప్రయాణిస్తూ ఒంపు తిరిగే చోట , నక్షత్రాలు చెట్లకి పూసే తోటలో విహరిస్తూ, కోటి కాంతుల లోకాన్ని కొత్తగా నిర్మించుకుందాం.
ప్యార్ జరూరత్ హై నిజమే. కానీ, ఆ ప్రేమ కోసం లోపలొక లోకాన్నిలా నిర్మించుకోవడం ఇంకా ముఖ్యమని ఆ పసివాళ్ళకి చెప్పి తీరాలి కదా ఎవరో ఒకరు!

నీ కంటి చూపుతో జతకలపక కేవలం మరో జత కళ్ళగానే మిగిలిపోయే వ్యక్తి, నీకేమీ కాదనే నిజాన్ని తెలుసుకుని అన్వేషన కొనసాగిస్తూ అలా పాడుకుంటూ పోవడం వీళ్ళకి నేర్పించేదెవరు?

ఏమిటోలే. సంబరాలతో ఆనందాలు విరజిమ్మాల్సిన ప్రత్యేకమైన రోజుల్లో కూడా, హింస చూపించే పెట్టెలకి కళ్ళనీ, చెవులనీ అతికించేసే కాలం కదా. విషాన్ని పీల్చుకుంటూ పెరిగాక తోటి మనసుల్ని కాల్చుకు తినేలా ఎదగడంలో వింతేముంది?

అందుకే పద. మనమైనా మనసుల్ని మనో లోకంలోనే వదిలేద్దాం. అక్కడే సదా సంచరిస్తూ ఉందాం.

మనోల్లాసాన్ని పంచడానికి ఏ కారణమైతేనేం. అక్కడినుంచి తెచ్చే తీపి పదాలతో ప్రపంచాన్ని అభిషేకిద్దాం. ఏదో ఒకనాటికి రంగుల ముగ్గై మురిపించకపోదులే.

అంతదాకా .. ప్రయత్నిస్తూనే ఉందాం మన లోకం సాక్షిగా. నక్షత్ర మండలపు దీవెన మనిద్దరినీ కలుపిన కాంతి సంవత్సరాల వారధి, లోకాల్ని దాటి విస్తరించేంతగా.

**** (*) ****