ఏం వ్రాయాలి నీకు? చలి కాలం కాస్తా కరిగిపోయింది. వచ్చే వసంతం మాటేమో కానీ, ఉక్కపోత మొదలయింది.
నువ్వు వదిలి వెళ్ళిన పొదరింట్లోనే ఇప్పుడు కూర్చుని ఉన్నాను.
ఏమైనా వ్రాయాలి కానీ, గుండె కాస్త తేలికగా ఉందీవాళ. వ్రాసే కొద్దీ పెరిగే బరువుని మోయడానికి కూడా మనసు సిధ్ధపడాలిగా.
అక్షరాలు రాలే కొద్దీ గుండె తనువంతా కొట్టుకోవడం మొదలవుతుంది. వాన జోరందుకునే కొద్దీ, ఈ పరిసరాలనుంచి విడిపోవడం ప్రారంభమవుతుంది. అలవాటే కానీ, ఇవాళ రావాలని లేదు పడవలోకి. అలల ఊపుని కూడా తట్టుకోలేననిపిస్తోంది.
నిశితంగా గమనించాలనుంది. నీవల్ల ప్రభావితమవుతున్న క్షణాలు రుతువులకి లొంగని పూల తోటలుగా ఎలా మారుతున్నాయో.
ఇప్పటికైనా తెలుసుకోవాలనుంది. నీ తలపుల్లోంచి జారే ఆనందమంతా అంతమంటూ లేని ఆకాశంలా ఎలా మారిపోతోందో.
కొన్ని రోజులిలాగే తేలిగ్గా గడిచిపోవాలి. పాత్ర నిండిపోవాలంటే ఏకాంతంగానే ఈ పూల కళ్ళలోకి చూస్తూ కూర్చోవాలి. ఈ పూలతో స్నేహించి రేకులుగా విచ్చుకోవాలి. తెలియని లెఖ్ఖలేవో తప్పకుండా తెలుసుకోవాలి.
మాట్లాడుకుంటాయవి తెలుసా? నీ గురించీ నా గురించే కాదు, పుప్పొడిని ఎత్తుకెళ్ళే తుమ్మెద గురించి కూడా.
ఆ .. అన్నట్టు .. తుమ్మెదంటే గుర్తొచ్చింది ..ఎక్కడో అడవిలోపలి కోనేట్లో ఓ కలువ , చంద్రుడి మీద పాడుకున్న గీతాన్ని ఆ తుమ్మెద వచ్చి వినిపిస్తేనే కదూ నేనప్పుడు అక్షరాల్లో నింపి పెట్టింది.
ఆ పాటకి అర్థం చెప్పమని నువ్వు పట్టుబట్టినప్పుడే కదా వెండి మబ్బులన్నిటినీ దారాలుగా పేన్చి, చంద్రవంక ఇరుకొసలికీ కట్టి మనం ఊయలూగింది. అప్పుడే కదూ, ఊయల వేగానికి జోరుగా కురిసిన వెన్నెల చినుకులు మొగ్గల మీద విసురుగా రాలుతున్నాయని నేను పరుగెత్తుకెళ్ళి దోసిలి పడితే, ఆ మొగ్గల విరుపుల్లోంచి నాలుగు పద్యాలు రాలింది? పోనీ ఆ పద్యాలే వ్రాయనా ఇప్పుడు మళ్ళీ?
అలా అర్థంకానట్టు నటిస్తావు కానీ, నీకు మాత్రం తెలియదా? ఇదంతా నువ్వు నేర్పిన ఛందస్సేనని?
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్