కవిత్వం

బాల్యం తిరిగొచ్చింది

05-జూలై-2013

ఎన్నేళ్ళ క్రితమో
నిర్దయగా నన్నొదిలిపోయిన బాల్యం
ఇవాళ నీ మెత్తని అరచేతిలోంచి
తిరిగి నాలోకి ప్రవహిస్తోంది.

నా వేలు పట్టుకుని నువ్వు నడిపిస్తుంటే
నిన్న అడుగులు నేర్చుకున్న నీ దగ్గర
ఇష్టమైన దారిలో నడవడం
ఇప్పుడే నేర్చుకుంటున్నాను.

చిట్టి చిట్టి పదాలు నీకు నేర్పుతూనే
నానార్ధాలకో విపరీతార్ధాలకో బెదరడం మానేసి
భావాలకి రెక్కలిచ్చి
పెదవులపైకి ఎగరేయడం నేర్చుకుంటున్నాను.

అంతర్జాలంలో వలేసి
నీకోసం కొన్ని ఆటల్ని పట్టుకుంటాను కానీ
నువ్వు నాకు నేర్పే ఆటలాడాక
నింగి తారల్ని చూసి
విద్యుద్దీపాలెందుకు తలొంచుకుంటాయో
తెలుసుకుంటున్నాను.

అందరూ అన్నివైపులా చేరి
స్వేఛ్ఛగా పెరిగిన కొమ్మలన్నీ నరికేసినా
చిటారుకొమ్మన పూసిన పుష్ప మాధుర్యంతోనే
చెట్టు పరిమళించినట్టు
నీ నవ్వుల్లోనే
నేను విరబూయడం నేర్చుకుంటున్నాను.

ఆకాశపు వెలుగునంతా
సాయంకాలానికల్లా ఏరుకొచ్చి ఒకచోట కుప్పగా పోస్తే
ఏ అల్లరి మబ్బో
ఆ వెన్నెల కుప్పని భళ్ళున ఒలకబోసినట్టు
నీ చేష్టలు
నా జీవిత పుస్తకంలో ప్రతి కాగితం లోను
వాడని పూలుగా పేర్చుకుంటున్నాను.

యవ్వనానికీ తిరిగొచ్చిన బాల్యానికి మధ్య
శత సహస్ర రహస్యాల దూరాన్ని
కొంటె చూపుతోనే చెరిపావో
తప్పటడుగులోనే కొలిచావో కానీ

నేను నీకు అమ్మనో
నువ్వే నాకు అమ్మవో తెలీని సందిగ్థావస్తలో
నా పెద్దరికమంతా
సెలయేట్లో కురిసే వాన చినుకైపోయింది.