కవిత్వం

కొన్ని సమయాల్లో…

22-ఫిబ్రవరి-2013

తల నిండా పూలు తురుముకుని
ఆకాశాన్ని ఆశగా చూస్తున్న చెట్టుని
ఏ పాట పాడమంటాం?
ప్రతి ఒంపులోనూ
రచించలేని రాగాల కువకువలే

ఒంటి నిండా మెరుపులద్దుకుని
పరుగెట్టే సెలయేటిని
ఏ ఆట ఆడమంటాం?
ఉరికే ప్రతి మలుపులోనూ
తెరకెక్కించలేని భంగిమలే

జీవితమంత పరుచుకున్న ఆకాశంలో
లెక్కించలేనన్ని పాత్రల్లో
ఎప్పటికప్పుడు మారిపోతున్న బ్రతుకు లిపి

నేర్చుకున్నదేదీ అక్కరకు రాని సమయాల్లో
కనుపాపల్లో గీసుకునే
ఆకాశ చిత్రం మాత్రమే
నన్ను కొత్తగా వెలిగిస్తుంది.