కవిత్వం

ఈ రోజు నీ పేరు మీదే!

ఆగస్ట్ 2016

నిజాలనీడలెక్కడ నిద్రలేస్తాయోనని
సూర్యుడు కళ్ళు తెరవని రోజు-

ఎప్పుడూ ఆహ్వానించే గుడి తలుపులు
ముఖంమీదే మూతపడ్డ రోజు-

నిలువెత్తు నమ్మకపు ద్వజస్తంభం
చిన్న సందేహపు సుడిగాలికి విరిగిపడ్డ రోజు-

గణగణమని జపించే స్నేహపుగంటలు
ఒక్కొక్కటే తెగిపడ్డ రోజు-

ఎన్నో దు:ఖాల్ని సునాయాసంగా తోడి
అవతల పారబోసిన విశ్వాసపు బొక్కెన తాడు
పికిలి పోయిన రోజు-

కాలాలతో తిరస్కరించబడ్డ రోజు-

దారానికి ఎక్కించలేక
పువ్వుల్లేని దండలా
పూసల్లేని అబాకస్ లా
ఏ లెక్కల్లోనూ ఇమడని రోజు-

కనుకొలుకుల్లోంచి చివరి చినుకులా రాలి
దేహాన్ని దాటి
మనసులోయల్ని కోస్తూ
ఇప్పుడప్పుడే ఇంకిపోని రోజు…

ప్రభూ
ఈ రోజు మీద నీ పేరే రాస్తున్నా.