ప్రతీ రోజూ తీసే తెరను ఆరోజు ఉతకడానికన్నట్టు, ఆదివారం పొద్దున్నే చెరువొడ్డు చేరతాడు సూర్యడు. పొగమంచుని అటూ ఇటూ ఊది నీటి అట్టడుగు పొరల్లోకి వేళ్ళు ముంచి చేపల్ని తట్టి నిద్ర లేపుతాడు.
నేనూ.. నా వెనకే అచ్చంగా నాలాగే నడుస్తూ వాడూ, చెరువొడ్డు చేరతాం. తపస్సు చేస్తున్న ఋషుల్లా ఒకరి వీపుకు మరొకరి వీపునానించి కాలానికే గాలం వేస్తున్నట్టు కూచుంటాం. నిశ్శబ్దాన్ని మోయలేక గాలి కూడా మాతో అలా చతికిలపడిపోతుంది కాసేపు. పండగకు ఇల్లుచేరిన పిల్లల్లా సందడి చేస్తూ, చేతన మరిచిన చెరువుకు కొత్త ప్రాణం పోస్తూ, చేప పిల్లలు రెండు జట్లుగా చీలిపోతాయి. అప్పటివరకు గలగలమన్న చెట్లు, ఆట మొదలయినట్టు గట్టు మీంచి నిశబ్దంగా తొంగిచూస్తూ నిన్చుంటాయి. జడ్జిల్లా గెలుపెవరిదో చెప్పడానికన్నట్టు చెట్ల మీద పిట్టలు కంటిపాపలను మాత్రమే కదిలిస్తూ క్యూరియాసిటీతో కూచునుంటాయి.
***
వాణ్ని గెలిపించడం కోసం కొన్ని చేపలు ఓడిపోతాయి. ఆట ముగుస్తుంది.
***
విన్నర్ ని డిక్లేర్ చేస్తున్నట్టు పిట్టలు రెక్కలతో టపటపా చప్పట్లు కొడుతూ పైకి లేస్తాయి. అందరి విజయాలను తనే క్లెయిమ్ చేసుకుని టై లూస్ చేసుకుంటూ ఊపిరితిత్తుల నిండా వెలుగునంతా పీల్చుకుని పడమటికి ప్రయాణమైతాడు సూర్యడు.
బుట్ట నిండా చేపలతో మా వాడు, ఖాళీ బుట్టతో నేను ఇల్లుచేరతాము. చేపల పులుసుకు మసాలా నూరుతూ ఓడిపోయి గెలిచిన నాన్నను చూసి అమ్మ ముసిముసిగా నవ్వుకుంటుంది.
***
నేను గాలానికి ఎరవేయకుండా గట్టుమీదే వదిలేసిన ఎరలన్నీ ఆ రాత్రి వాటి వాటి మట్టిగూళ్ళలోకి మెల్లగా ప్రయాణమవుతాయి.
Very very special one, Ravi Garu.
వాక్యాలు ఒక దాని కింద ఒకటి పేరిస్తే కవిత్వం కాదని నిరూపించారు. ఇలాంటి కవిత్వం రాయడానికి కాస్తా నేర్పూ కాస్తా హృదయం ఉండాలి. ఏమైనా, ఓ మంచి కవిత చదివిన అనుభూతి. నెమరేసుకుంటూ మిస్టిసజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తూ.. మననం చేసుకుంటూ ఆలా చెరువు కట్ట మీద నడిచిపోతుంటాం… లేదంటే సూర్యుడి కిరణాన్ని పట్టుకుని విహాయాసం చేస్తాం.
అజంతా లాంటి కవి!
రవి గారూ,
మీ కథాత్మక కవిత్వం బాగుంది. ‘నేను’కు ‘నాన్న’కు మధ్య అభేదాన్ని మీరు స్పష్టంగా చెప్పకపోవటం ఉద్దేశపూర్వకంగానే జరిగిందనుకుంటా. ఇక కవితలో ఆంగ్లపదాలు ఎక్కువగా ఉన్నా ప్రతి సందర్భంలో అవి అతికినట్టటుగా ఉండటం విశేషం. అభినందనలు. Form దృష్ట్యా offbeat అయిన ఇట్లాంటి రచనలు ‘వాకిలి’లో బాగా రావాలని నా కోరిక.
మానస,
థాంక్స్!
తిరుపాలు గారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు! అంత పెద్ద మాట స్వీకరించలేను
ప్రతాప్ రెడ్డి గారు,
ధన్యవాదాలు.
ఎలనాగ గారు,
థాంక్స్! ఇది కథ లాంటిదే కదా అని Form అలా ఉంచేశాను. అవును మీరన్నట్టు ‘నాన్న’, ‘నేను’ ఒకటే. పిల్లల చేతుల్లో ఓడిపోడానికి చేసే చీటింగ్ లో ఉన్న మజాయే వేరు కదా!
బావుంది రవిగారూ. నాలాంటి నేను – నా లోపలి నేను గెలిస్తే నేను గెలిచినట్లే కదా!
వాక్యం వెనుక వాక్యం కదులుతుంటే, ఆ వెనుకే కళ్ళముందు ఫ్రేం బై ఫ్రేం కదులుతుంది… అద్భుతంగా ఉంది రవిగారు …. !!
రవి గారూ
కథాంతర్గతమైన కవిత , దానికి చివర మానవ సహజమైన ఒక మలుపు … బాగున్నాయి.
అభివాదములు
పేరాగ్రాఫ్ కవిత్వం, ఫాంలో కొత్తదనం అక్కడక్కడా , అరుదుగా ఎదురవుతుందనుకుంున్న. మానవీయ కోణాన్ని సున్నితంగా చెప్పడం గ్రేట్ .ుభాభినందనలు రవి వీరెల్లి గారూ …
రవి,
ఆదివారాన్ని Enjoy చెయ్యమని మీకు సెలవిస్తే…ఆ ఉదయాన్ని మీరూ మీ వాడూ కలిసి
ఇంత అద్భుతమైన కవిత్వంగా మార్చేయడం …..?
నరేన్.
ఇప్పుడే చదివాను.
చాలా బాగుంది.
..మరి మరి గుర్తుండి పోయేలా.
అభినందనలు.