సంపాదకీయం

సొంతవాక్యం

సెప్టెంబర్ 2014

కొండతల్లికి పిల్ల జాలులా పుట్టి, నడక నేర్చుకుని నదిలా మారి, కాసేపు రాళ్ళ కోతలు భరిస్తూ, కాసేపు హాయిగా పల్లాల మీదుగా కూడా పయనిస్తూ, ఎప్పుడూ సముద్రాన్నే పలవరిస్తూ ముందుకే వెళ్ళే నదిలా మనం రాబోయే కష్టాలను బేరీజు వేసుకుంటూ సుఖాలకనుగుణంగా గమనం మార్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాము. కానీ, ఒకడుగు ముందుకు వేస్తే మొల్దారాన్ని పట్టి రెండడుగులు వెనక్కి లాగుతుంది జ్ఞాపకాల కొక్కెం. సాలిడ్ స్టేట్ హార్డ్ డిస్క్ లా చప్పుడు చేయకుండా జ్ఞాపకాలను క్రంచ్ చేస్తూ మెదడు మనల్ని వెనక్కి పంపి ఎదో ఓ పాత ట్రాక్ లోకి తోసేస్తుంది. ఇక ఆ ట్రాక్ లోనే తియ్యగా కూనిరాగం తీస్తూ, తిరుగుతూ, బయటికి రావడానికి ప్రయత్నిస్తూ కావాలనే ఓడిపోతుంటాం. పొద్దున్నే పొయ్యి వెలిగించుకొని చాయ్ పెట్టుకున్నట్టు, రోజూ మన శరీరాన్ని ఎదో ఓ జ్ఞాపకం కాల్చుకుతింటూనే ఉంటుంది. అమ్మనొ, ఎలిమెంటరీ స్కూల్ మాష్టారినో, చిన్ననాటి మిత్రుడినో మన గుండెల్లోకి గబాల్న తోస్తుంది. వెనక్కి తిరిగి నడిచొచ్చిన దారుల మీంచి మళ్ళీ నడవాలన్న తీవ్రమైన కోరిక మనకు ఉన్నా, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే వెసులుబాటు లేక జ్ఞాపకపు పావురానికి ఓ ఉత్తరం కట్టి పుట్టిన ఊరికి సాగనంపినట్టు కాయితం మీద ఏవో నాలుగు మాటలు రాసుకుని సంతోషిస్తుంటాము.

జ్ఞాపకమంటే గుర్తొచ్చింది. మీకందరికీ ఎలిమెంటరీలో సొంతవాక్యాలు రాసిన రోజులు ఇంకా గుర్తుండే వుంటాయి. మాస్టారు ఏదైనా పదం ఇస్తే అప్పటికప్పుడు ఆ పదంతో సొంతవాక్యం రాసి ఇవ్వాలి. వాక్యం కుదురుగా, కుందనపుబొమ్మలా లేకపొతే అమ్మాయిలతో చెంప దెబ్బలు వేయిస్తారనే భయం. ఆ భయంతో రాసిన నాలుగు అక్షరాలూ కాస్తా అలుక్కుపోవడాలు, అక్షరాలు ముత్యాల్లా లేకపోతే “కోడి కెలికినట్టు, కొంగ తొక్కినట్టు” ఏంటిరా ఈ రాతలు అని మాస్టారు తిట్టిపోయడాలు ఇంకా గుర్తుండే వుంటాయి. ఇప్పటికి కూడా మీరు వాక్యం రాసినప్పుడల్లా తెలుగు మాష్టారు మీ కళ్ళ ముందు కర్ర పట్టుకుని నిలబడి నిలదీస్తున్నట్టు అనిపిస్తుంటుంది కదూ?! మీరు ఎలిమెంటరీ బళ్ళో ఏవో స్వంత వాక్యాలు రాసే ఉంటారు కదా?! మొట్టమొదటి వాక్యం ఏం రాసారో గుర్తుందా? “నాకు అమ్మంటే ఇష్టం” అనో “సీత ఈ రోజు స్కూలుకు రాలేదు” అనో, లేదా చిలిపిగా “పొట్టి జుట్టు సీత పొడుగు ముక్కు పద్మను కొట్టింది” అనో రాసుంటారు కదూ? సరే, మీ ఎలమెంటరీ రోజులు గుర్తు తెచ్చుకుని సరదాగా ఇప్పుడు “జానెడు”, “బెత్తెడు” అనే పదాలు వాడి ఓ మూరెడు వాక్యం రాయండి చూద్దాం! :-)

***

You can’t really succeed with a novel anyway; they’re too big. It’s like city planning. You can’t plan a perfect city because there’s too much going on that you can’t take into account. You can, however, write a perfect sentence now and then. I have.” ― Gore Vidal

నవల, కథ, కవిత్వం ఇలా ఏది రాయాలన్నా ముందు వాక్యం కుదురుగా రాయడం నేర్చుకోవాల్సిందే. పెద్ద నవలలూ, కథలు రాయడం కష్టమే, కానీ ప్రయత్నిస్తే చక్కని వాక్యాలు కొన్నయినా రాయొచ్చు. చచ్చే లోపు చక్కని వాక్యం ఒక్కటైనా రాయాలనే తపన ఉండాలి. వాక్యం ప్రాణం పోసుకుని మనతో మనసువిప్పి మాట్లాడే వరకు తరిచి తరిచి చూసుకోవాలి, శ్రద్దగా మళ్ళీ మళ్ళీ తిరగ రాయాలి.

కవిత్వం అభ్యాసం చేస్తే వస్తుందో రాదో తెలియదు గానీ రాత/కోతలు సాధనతో సాధించుకునే విద్యలే! కొంతమంది రాసిన వచనం చదువుతుంటే కళ్ళు వాక్యంవెంట పరుగుపెట్టి వెనక్కి రానని మొరాయిస్తుంటాయి. ఆ స్వచ్చమైన, స్పష్టమైన వాక్యనిర్మాణం వెనుక ప్రత్యేకమైన పథకం ఎదో ఉన్నట్టు మనకనిపిస్తుంది. ప్రతీ వాక్యం ఓ చిక్కటి అనుభూతిని మోస్తూ, అనుకోకుండా వచ్చిన అవార్డ్ లా ఆశ్చర్యాన్ని పంచుతుంది. వాక్యం మొదటి నుంచి చివరి వరకు రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. అబ్బ! వచనం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. మంచి వాక్యాలు చదవడానికి హాయిగా ఉండి మన మనసుల్లో పదికాలాల పాటు పదిలంగా నిలిచిపోతాయి.

వాక్యం నిడివి గురించి నోబెల్ గ్రహీత “Orhan Pamuk” అన్నట్టు, “Even the composition of my sentences—I prepare the reader for something and then I surprise him. Perhaps that’s why I love long sentences.”, ఎంతైనా పొడుగు జడలా పొడుగు వాక్యం సొగసే వేరు! కానీ, వాక్యాల నిడివి పెంచితే dilute అయి తప్పులు దొర్లే అవకాశం ఉంటుందనేమో, “Every word you add dilutes the sentence.” అని Miller Williams అంటారు. వాక్యం నిడివి సంగతి ఎలా ఉన్నా అసలు విషయమే లేకుండా ఉత్తి పర్రే ఉంటే, పాయింట్ లేని వ్యాసంలా ఉంటుంది.

ఈ మధ్య కొంత మంది రాస్తున్న వాక్యాలు చూస్తే, ఆ వాక్యాల నిడివి కంటే వాక్యాల చివర పెడుతున్న చుక్కల పొడుగు ఎక్కువగా ఉంటుంది. వాక్యం తెగ్గొట్టి చుక్కలతో, డాష్ లతో అతికిస్తే, మధ్యలో పువ్వులూడిపోయిన మల్లెపూదండలా ఉంటుంది. ఇక కవిత్వం విషయానికొస్తే, ఈ చుక్కల గోల మరీ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్య చదువుతున్న కవితల్లో కవిత్వం నిండుగానే ఉన్నా కొంతమంది చుక్కలను అరువు తెచ్చుకుంటున్నారు. కవితలో కవిత్వం కంటే చుక్కలే ఎక్కువై ఇది చుక్కల కవిత్వంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. కవిత్వం రాసేటపుడు మనకు కావలసినట్టు పాద/వాక్య విభజన చేసే సౌకర్యం ఉంటుంది కాబట్టి చుక్కలను, అనవసరమైన విరామచిహ్నాలను కొన్నింటిని కవితలోంచి తన్ని వెళ్ళగొట్టవచ్చు.

అసలు వాక్యం ఎలా రాయాలి? కుదురుగా అంటే ఏమిటి? అని మీరు తిరుగు ప్రశ్న వేయవచ్చు. సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలంటూ వాక్యాల్లో రకాల గురించి గానీ, వాక్యనిర్మాణక్రమం లోని ప్రాథమిక నియమాల గురించి గానీ నేనిప్పుడు చెప్పటం లేదు. కేవలం రాయాలన్న కోరిక ఉంటే సరిపోదు. వాక్యం రాసేంతసేపే నీది, రాసాక అది అందరిది కూడా అవుతుంది కాబట్టి, వాక్యం గురించి తెలుసుకుని, నేర్చుకుని, కాస్త సాధన చేసి శ్రద్దగా రాయాలి. అప్పుడే నీ వాక్యాన్ని అందరూ హత్తుకుని ఎత్తుకుంటారు, అని మాత్రమే చెప్పాలనుకున్నాను.

 

ఇక వాక్యం గురించి మన ఎలనాగ గారు ఏం పలవరిస్తున్నారో/పాడుకుంటున్నారో ఒక్కసారి వినండి:

“వాక్యాన్ని చదివితే వంగి దానికి మొక్కాలనిపించాలి. అట్లాంటి వాక్యాల్ని రాసే నైపుణ్యం రచించేవాడి కలంలోకెక్కాలి. హుందాగా ఉందా నీ వాక్యం అనేది ఎంతో ముఖ్యం. బ్యాలెన్సు లేని వాక్యం బాధిస్తుంది – ఇది తథ్యం. నిజాయితీ లేని వాక్యం రాయితీని మింగి మొలుస్తుందనటానికి సాక్ష్యం అది కలిగించే నమ్మక రాహిత్యం. కథా రచయితలారా, గ్రహించండి ఇది సత్యం. గొప్ప ఇతివృత్తం చిక్కని కథ కాకపోవటానికి చక్కని వాక్యాల లోటు సైతం ఓ ముఖ్య కారణం. కథాకథనం వగైరా బాగున్నా వాక్యం బాగుండకపోతే ఫలితం సున్నా! చక్కని వాక్యం చదివేలా చేస్తుంది కథను. చప్పనైన వాక్యం చదివే వాడికి ఇస్తుంది వెతను.
ఉద్బోధ చేస్తున్నానని ఉడుక్కోకండి అన్నలారా.
వినయంతో చెప్తున్నా, కనండి సత్యాన్ని కన్నులారా.
***
వచన ప్రక్రియలోకి వచ్చే ముందు వాక్యరచనా కౌశలాన్ని వశపర్చుకోవాలి తమ్ముడూ. ఇప్పుడిప్పుడే సాహితీ రంగంలో తప్పటడుగులు వేసే చిట్టి బాబులూ, చిట్టి అమ్మలూ! మీకోసమే రాస్తున్నానిది, దీన్ని పట్టించుకోవాలి మీరెప్పుడూ. వాక్యమే రాయలేనప్పుడు వ్యాసమెలా రాస్తామన్నది ఆలోచించకపోవటం తప్పు కదూ.
గొప్ప రచనల్ని చదివినప్పటి పరిశీలనే రాయించాలి నీచేత. సహజ ప్రతిభ లోపించినప్పుడు సాధననే ఆశ్రయించాలి. అట్లా అని అనుకరించ కూడదు, అనుకరణనెప్పుడూ ప్రతిఘటించాలి. కథలోనైనా నవలలోనైనా సాధారణంగా వాక్యం కలిగించకూడదు కంగాళి. కవిత్వం మాత్రం వేరేలా కూడా ఉండొచ్చునని గ్రహించాలి.
శ్రీరంగ నీతులు చెప్తున్నానని చీదరించుకోకు తమ్ముడూ.
ఏదో కొంత తెలుసనుకుని రాసినందుకు ఏవగించుకోకు నన్ను అమ్మడూ.”