కవిత్వం

వర్షం

జూన్ 2017

గ్లాసెడు గోర్వెచ్చటి ప్రేమను గటగటా తాగు
నీటిచిదుపల చెంపల్ని వాయించే చిలిపి స్లిప్పర్స్ తొడుక్కో
పొద్దున్న ఆకాశం విచ్చుకున్నట్టు స్వేదరంధ్రాలన్నీటినీ తెరిచిపెట్టు
నీకు తెలిసిన ఆ ఏడురంగుల్ని పుట్టపురాగ మరిచిపో
నిలువనీయని ఇంద్రియాలను వచ్చిపొయ్యే గాలికి వదిలెయ్యి
పెయ్యి తుడుచుకున్నాక తువ్వాల దులిపినట్టు మనసుని జాడించు
ముఖ్యంగా ఆ మూలకున్న చెత్తిర్ని అస్సలే మందలియ్యకు
అగడుపడ్డట్టు వెలుగునడుక్కునే కంటిచిప్పల్ని మూలకు బోర్లించి
కలల మడుగులో ఓడనడిపే చిన్నపిల్లోడి కంటిచూపుని అరువుతెచ్చుకో

అదిగో
ముత్యపు నీటి బిందెల్ని మోసుకుంటూ
అడ్డదార్లో ఆయాసపడుకుంటూ అదొస్తుంది చూసావా-
దానికిపుడు
దేహాన్ని కాయితప్పడవగా చేసుకుని
లొంగిపో.

 
 
 
 
మొదటి ముద్రణ: తానా తెలుగుపలుకు, మే 2017