నడుమొంగిన నిద్రగన్నేరు కొమ్మ కింద
ఎప్పుడో రాలే ఆ ఒక్క పువ్వు కోసం
కదలకుండా ఎదురు చూస్తున్న కోనేటిమెట్టులా
పిలుపుకు పడిగాపులు కాస్తూ
ఎన్నాళ్ళు?!
ఎన్నో దేహాల్ని పవిత్రం చేసి
పచ్చగా నవ్వుతున్న కాలం కోనేట్లోకి
పాత జ్ఞాపకంగా మిగిలిన రూపాయి బిళ్ళను గిరాటేసా.
పాటై చిగురించిన జీవితపు కొమ్మలోంచి
పండుటాకుల్లా ఒక్కొక్కటే రాలిపడే చరణాల్ని శృతి చేసుకుంటూ
తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని
విడిది పడవ వదిలి
వెళ్ళాలిక
సలపరించే ఆలోచనల్ని బుక్కపోసి
భావాల నొప్పిని పుక్కిలిస్తూ
నా నీలోంచి
ఉవ్వెత్తున ఎగిసే ప్రేమకెరటాల్ని ఈదుకుంటూ…
కాటగలిసిన దిక్కుల్ని ఒక్కటి చేయడం కోసం
తన నీడకు తానే నిప్పంటించుకుని తరలివెళ్ళే సూర్యునిలా
లోలోన ఘనీభవించిన చైతన్యంలోకి
తపస్సుకు బయల్దేరాలిక…
తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని
విడిది పడవ వదిలి
వెళ్ళాలిక…చాల సాంద్రంగా భావగర్భితంగా వుంది .గుడ్
@ తన నీడకు తానే నిప్పంటించుకుని తరలివెళ్ళే సూర్యునిలా @
చాలా బావుంది. మంచి ఉపమానం. మచి కవిత.
బయల్దేరడం ఒక చైతన్యానికి ప్రతీక.
కొన్ని సార్లు చాలా ఇష్టంగాను, ఇంకొన్ని సార్లు నిర్లిప్తం గాను, మరికొన్ని సార్లు అయిష్టంగాను ఎలా బయల్దేరినా …
అది జడత్వం నుండి గమనంలోకి…గమనంలో కూడా ఎదురొచ్చే ప్రవాహాలను ఆస్వాదిస్తూనో లేక ఎదుర్కుంటూనో సాగిపోవాలి.
చక్కని చిక్కని కవిత్వం ఎప్పటిలా మీ కవితలో పరచుకుంది.
ఇందులోని నిరాశ, చలిలో అతుక్కుపోయిన నాలుగు గోడల మధ్య ఏకాంతాన్ని తలపిస్తోంది.
నారాయణ.
సలపరించే ఆలోచనల్ని బుక్క పోసి
భావాల నొప్పిని పుక్కిలిస్తూ….
బాగుంది రవి వీరెల్లి గారూ.అభినందనలు.
పాటై చిగురించిన జీవితపు కొమ్మలోంచి
పండుటాకుల్లా ఒక్కొక్కటే రాలిపడే చరణాల్ని శృతి చేసుకుంటూ
తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని
విడిది పడవ వదిలి
వెళ్ళాలిక
తన నీడకు తానే నిప్పంటించుకుని తరలివెళ్ళే సూర్యునిలా
లోలోన ఘనీభవించిన చైతన్యంలోకి
తపస్సుకు బయల్దేరాలిక…
_________________ రవి గారూ, అంతులేని భావ సౌందర్యం!
నిజానికి ప్రతి లైనూ కోట్ చేయాలనిపించేంత బాగుంది మీ కవిత
మళ్ళీ మళ్ళీ చదివించిన కవిత రవి గారి “బయల్దేరాలిక”. మొదటి సారి చదవగానే రాస్తున్నది ఎవరు? కవితలో ఎన్నో పనులు చేస్తున్నది ఎవరు ? బయలు దేరవలసినది ఎవరు? ఈ భావ సంచలనం కవిదా? విశ్వజనీనత పొందిన మనిషిదా? అనిపించింది.
బయల్దేరాలిక –శీర్షికే చెబుతోంది తప్పని భావనను, అయిష్టతను. ఇష్టమైన పరిసరాలను వదిలిపోయే ఒక అప్రియ స్థితిని . ఎక్కడికి వెళ్ళాలి?
లోలోన ఘనీభవించిన చైతన్యంలోకి
తపస్సుకు బయల్దేరాలిక…
అయితే దానికన్నా ముందు బయటి పరిస్తితులేమిటి? అవి ఒకరివా? అందరికీ చెందినవా?
నడుమొంగిన నిద్రగన్నేరు కొమ్మ కింద
ఎప్పుడో రాలే ఆ ఒక్క పువ్వు కోసం
కదలకుండా ఎదురు చూస్తున్న కోనేటిమెట్టులా
పిలుపుకు పడిగాపులు కాస్తూ
ఎన్నాళ్ళు?!
కోనేటి పక్కన బాగా పెరిగి నడుం వంగిపోయిన నిద్రగన్నేరు కొమ్మ—నిద్ర గన్నేరు కొమ్మ దేనికి ప్రతీకగా వాడారు? వంగిన కొమ్మే ఎందుకు, నిటారుగా ఉన్న కొమ్మలెందుకు నచ్చలేదు? ఏదైనా అడ్డం వస్తేనేగా కొమ్మ నడుం వంగిపోయేది? ఏమా అడ్డంకులు? ఎప్పుడో రాల్చే ఒక పువ్వు కోసం—అంటే ఆ కొమ్మకు ఎప్పుడో తప్ప పూలు పుయ్యవా? అంతేగా , పూస్తే రాలితీరతాయిగా ? ఎప్పుడో పూసే ఆ అపురూప సుమాలు ఏమిటి? కదలకుండా ఎదురు చూసే కోనేటి మెట్టులా పిలుపుకు పడిగాపులు కాస్తూ …..పడిగాపులు కాయడం ఒక ఇష్టమైన కష్టం.
పిలుపు ఒక శబ్దం , ఒక చలనం అది ఎప్పుడో రాలే ఒక పువ్వు ..అదీ ఎప్పుడో తప్ప రాలని అపురూప సుమం , మళ్ళీ బాగా పెరిగి నడుం వంగిపోయిన కొమ్మ నుండి ఎన్ని యుగాల ఎదురు చూపు — ఎంత అద్భుతమైనది అయితే ఇక్కడ కదలని కోనేటి మెట్టులా పడిగాపులు కాస్తున్నది ఎవరు?
అది కవా? మరెవరైనానా? అన్నీ ప్రతీకలే ? అర్ధం కవిగారిని అడగవద్దు ఆయన కవిత ఆస్వాదించవలసిన బాధ్యతా మనదే మరి.
ఎన్నో దేహాల్ని పవిత్రం చేసి
పచ్చగా నవ్వుతున్న కాలం కోనేట్లోకి
పాత జ్ఞాపకంగా మిగిలిన రూపాయి బిళ్ళను గిరాటేసా.
ఇక్కడ కాలం కోనేరు, ఎన్నో దేహాలను పవిత్రం చేసి పచ్చగా నవ్వుతున్న కోనేరు పచ్చదనం ఒక స్థబ్దతా? రంగైతే నాచు వల్ల వచ్చినదేగా ? మరి సతత హరితమా ? పాత జ్ఞాపకం రూపాయి బిళ్ళా? కోనేరు కాలమయితే విసిరినది రూపాయా , జ్ఞాపకమా? దేహాలను పవిత్రం చేసి అపవిత్ర మయిన కోనేటికి ఇచ్చుకున్నది సంపాదనా? ఏ రకమైన సంపాదన , డబ్బా? వ్యామోహమా? కాలం స్తంభిస్తే కదిపేది జ్ఞాపకమా ?
పాటై చిగురించిన జీవితపు కొమ్మలోంచి
పండుటాకుల్లా ఒక్కొక్కటే రాలిపడే చరణాల్ని శృతి చేసుకుంటూ
తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని
జీవితం కొమ్మనుండి పాటై చిగురించినవి పండుటాకుల చరణాలా? ఒక దశ తరువాత పండుటాకులే చివురిస్తాయా?
తోలు బుర్రనిండా ఒంటరితనాన్ని ఊదుకుని –ఎంత బాగా చెప్పారు ? ఎముకలు తోలుగా మారి ఖాళీగా మిగిలాక నింపుకునేది ఒంటరితనాన్నా? అది మళ్ళీ ఎవరికీ వారే ఊదుకోవాలి.
విడిది పడవ వదిలి వెళ్ళాలిక
ఏది విడిది? ఏది పడవ? కాలమా? జీవితమా? సచేతనతా?
పడవలో ఉంటే పడవ నదిలో ఉందా? చెరువులో ఉందా? ఎందుకా పడవ విడిదయింది?
సలపరించే ఆలోచనల్ని బుక్కపోసి
భావాల నొప్పిని పుక్కిలిస్తూ
నా నీలోంచి
ఉవ్వెత్తున ఎగిసే ప్రేమకెరటాల్ని ఈదుకుంటూ…
సలపరించే ఆలోచనల్ని? ఎక్కడివి? ఏమిటవి? బుర్రలో ఉన్నాయా? ఎలా వచ్చాయి? భావాల నొప్పి—బావాల వల్ల నొప్పి కలిగితే ఏలాంటి భావాలు?
• నా నీలోంచి ఉవ్వెత్తున ఎగిసే ప్రేమకెరటాల్ని—నా నీ ఎంత గొప్ప భావ ప్రకటన –ఎవరా నీ నా ? నా అనుకున్న బాంధవ్యాలా? భగవంతుడా? మరెవరు? – ముడి వేసుకుపోయిన బాంధవ్యాల బలిష్టత.
• కాటగలిసిన దిక్కుల్ని ఒక్కటి చేయడం కోసం—దిక్కులు ఎందుకు కాట గలిసాయి ? తన నీడకు తానే నిప్పంటించుకుని తరలివెళ్ళే సూర్యునిలా-అద్భుతమైన ఇమేజరీ
• ఘనీభవించిన చైతన్యం లోకి తపస్సుకు వెళ్ళడం
• రవిగారూ విశ్లేషణ రాస్తే ఒక పరోశోధనా గ్రంధమవుతుంది.
• ఇంత క్లిష్టత అనితర సాధ్యం. హాట్స్ ఆఫ్ .
ఒక అంతర ప్రయాణం, అయిష్టమయినా వెళ్లి తీరాలి, ఒక తపస్సుకోసం వెళ్ళాలి, అదీ ఘనీభవించిన చైతన్యంలోకి. అయితే ఆ ప్రయాణానికి ప్రేరణ బాహ్యమయినది.
బయట ఎంతకాలం వేచి ఉన్నా, ఏంలాభం? మనునికిని మనం త్యజించి లోలోనికి వెళ్ళాల్సిన అవసరం …గొప్ప భావన , గొప్ప కవిత
అద్భుతం గా అనిపించింది.. శ్రీపాద స్వాతి గారు మీ స్పందన వల్లే ఈ కవితను, కవిని కొంతైనా అర్థం చేసుకున్నాను. రవి వీరెల్లి గారికి ధన్యవాదాలు.
స్వాతీ గారు,
థాంక్ యు సో మచ్.
చాలా బావుంది. మీ “చిన్నోడి అమ్మ” తర్వాత నాకు నచ్చిన మరో రచన మీనుండి.
చాలా బావుందండి…
రవీ దూపలోని కొన్ని కవితలు వెంటాడుతుంటాయని అనుకునెవాణ్ణీ కానీ ఇక దాన్ని భర్తీ చేసేట్టుగా ఈ కవిత ఉంది. ప్రతీ వాక్యాం కోట్ చేసేదిగా ఉంది..చదివిన మూడు సార్లూ భిన్న అనుభూతులు…మీరింకా రాయాలని సీరియస్ గానె అడుగుతున్నా..అభినందనలు
స్పందించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. Thank you so much for your encouragement!
చాలా బావుందండీ…
“నడుమొంగిన నిద్రగన్నేరు కొమ్మ కింద
ఎప్పుడో రాలే ఆ ఒక్క పువ్వు కోసం
కదలకుండా ఎదురు చూస్తున్న కోనేటిమెట్టులా…”
పైన స్వాతి గారు చెప్పినట్టు ఈ కోనేటి మెట్టు సుదీర్ఘ నిరీక్షణతోనే కవిత చాలా భావగర్భితంగా మొదలైందండీ! మీ కవితలెప్పుడూ వెంటనే ఓన్ చేసుకునేట్లు ఉంటాయి!
నిషిగంధ గారు,
ధన్యవాదాలు.
రవి