కనీకనిపించని దూరంలో ముడుచుకున్న మొగ్గలా కూచునుంటుంది.
కవ్విస్తుంది. ప్రేమగా లోనికి లాక్కున్నట్టే లాక్కుని విసిరి కొడుతుంది. మాట్లాడినట్టే మాట్లాడి అలిగి కూర్చుంటుంది.
దగ్గరికెల్తావు. బుజ్జగిస్తావు. నవ్విస్తావు. నవ్వుతావు. అర్థం చేసుకుంటావు. అపార్థం చేసుకుంటావు. హత్తుకుంటావు. విసుక్కుంటావు. ఆఖరికి భోరు.. భోరుమని ఏడుస్తావు. సూర్యమండలాలు యానిస్తూ, అందని హై ఫ్రీక్వెన్సీని కూడా ట్యూన్ చేసుకుని ఆలోచిస్తావు. చివరికి ఎట్లాగైతేనేం ఆ శతకోటి పెటల్స్ ఉన్న అందమైన పూవుని ఆసాంతం విప్పి ఆ సువాసనల్ని అనువదించి కాయితమ్మీద పెడతావు.
చదివి చూసుకుంటావు. పొంగి, పొర్లిపోతావు, మురిసి, ముసిరింతై, కరిగి, ఆవిరై తేలిపోతావు. అబ్బబ్బబ్బ… ఇంత అందమైన పీస్ ఇంతవరకు ఎవరూ రాసుండరు అనుకుంటావు.
ఎక్కడికి పంపాలో నిర్ణయించుకుంటావు. పదికి పది మార్కులేసుకుంటే బాగా పేరున్న సాహిత్య పేజీకి, కొంచెం తక్కువ మార్కులేసుకుంటే మరో పత్రికకి పంపిస్తావు.
ఇక అప్పటినుండి నీ కళ్ళు, ఒంటిపైనున్న స్వేదరంద్రాలన్నీటిని రెంట్ చేసుకుని ఎదురుచూపులు మొదలెడుతాయి. కొత్తగా ప్రేమలో పడ్డప్పుడు కూడా నువ్విలా పడిగాపులు కాసి ఉండవు. ప్రియమైన ఎడిటరు దగ్గరినుండి ఏ ఉత్తరం ముక్కా రాదు. ప్రతీ ఆదివారం ఆ ఒక్క సాహిత్య పేజీ కోసం మొత్తం పత్రిక కొంటావు. అలా మూడు నాలుగు వారాలు గడుస్తుంది. ఎదో అనుమానం పప్పుబద్దల్ని పగులగొట్టుకుని పచ్చగా చిగురిస్తుంది. పంపించింది మరోసారి చదువుకుంటావు. అరె! బాగానే ఉందికదా ఎందుకు అచ్చువేసి ఉండరు?! పత్రిక ఎడిటర్ ను పాళితో పొడిచి చంపేయాలన్నంత కోపం వస్తుంది. “యే.. యీ పత్రికా ఎడిటర్లు అందరూ ఇంతే! వీళ్ళ మునివేళ్ళలో సూదులు గుచ్చా… వీళ్ల మొహాన సిరా మరిగించి పొయ్యా.. తెలిసినవాళ్ళ రచనలు పరమచెత్తగా ఉన్నా వేస్తారు. మబ్బుని పగ్గం వేసి గుంజేంత పవరున్న నా కవితను మాత్రం కనీసం చదివి కూడా ఉండరు,” అని నీలో నువ్వే సణుగుణుక్కుంటావు. రోజుకంటే ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతావు. బట్టల అట్టడుగులో ఉన్న శాలువా తీసి ముతకవాసనేసినా కప్పుకుంటావు. ఇంకో వారం గడుస్తుంది. సందె కాంతికిరణంలా, శబరి కంటిచూపులా, నీ ఎదురుచూపులో ముందున్న తీక్షణత తగ్గుతుంది. ఎదో జ్ఞానోదయం అవుతుంది. మరో పీస్ రాయడం మొదలెడతావు.
మరో కొత్త మొదలు ముడుచుకున్న మొగ్గలా కనిపిస్తుంది. ఫిర్ సే శురూ…
***
రాయడానికి కావలసిన inspiration బలంగా ఉండాలేగానీ ఈ రిజెక్షన్స్, ఈ విమర్శలు, కాలిగోటికి తాకే పోటురాళ్ళ లాంటివి. కాసేపు జివ్వుమన్నా ముందొచ్చే తొవ్వ గురించి మందలించి చెబుతాయి.
ఈ మధ్య పేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను. “పత్రికలో ఒక రచయిత రచన అచ్చు కావాలంటే ఆ పత్రికలో రచయితకు తెలిసిన వాళ్ళుండాలి. పత్రికా సంపాదకులు వాళ్ళకు తెలిసిన రచయితల రచనలు ఎట్లా ఉన్నా వేస్తారు. కొత్తవాళ్లవి కనీసం చదవరు“, ఇదీ దాని సారాంశం.
ఇందులో నిజానిజాలు అంత ఈసీగా తేల్చేవి కాదుగానీ, నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే, పత్రికా సంపాదకులు తమకు అందిన రచనలన్నీ పొల్లుపోకుండా చదవకున్నా కనీసం చూడనైతే చూస్తారు. అది కొత్త రచయితదైనా, పే..ద్ద పేరున్న రచయితదైనా.
1987 లో అనుకుంటా, పోస్ట్ కార్డు మీద ఓ కవిత రాసి, ఆ కవితకు శీర్షిక కూడా పెట్టకుండా ఆంధ్రభూమి వీక్లీ అడ్రస్ కి పోస్ట్ చేశా. పాపం అప్పటి ఎడిటర్ ఎవరోగానీ ఆయనకి మొక్కాలి. కవితకు ఆయనే టైటిల్ పెట్టి ప్రచురించారు. నా మొట్టమొదటి కవిత అచ్చులో చూసుకున్నది అప్పుడే. మరిచిపోలేని మరో విషయమేమిటంటే, పారితోషికం కూడా పంపించారు.
ఆఁ.. అప్పుడున్నంత మంచి ఎడిటర్స్ ఇప్పుడెక్కడున్నారు అనేగా మీరంటారు?!
కచ్చితంగా ఉన్నారు. అటు అచ్చుపత్రికల్లో ఉన్నారు. ఇటు వెబ్ పత్రికల్లోనూ ఉన్నారు. పత్రికలకు రచనలు పంపడానికి సంపాదకుల ఈమెయిలు అడ్రసులు కావాలేగానీ వాళ్ళు మనకి యార్లు కానక్కరలేదు.
బాధ్యత, నిబద్ధత ఉన్న ఏ సంపాదకులైనా వాళ్లకు వచ్చిన ప్రతీ రచనని ఒక్కటికి రెండు సార్లు చదివి, నచ్చిన రచనలను ఎడిటోరియల్ బోర్డులో చర్చిస్తారు. రచన అందిందని ఈమెయిలు పెడతారు. ఎడిటింగ్ అవసరం అయితే సజెషన్స్ పంపిస్తారు. ప్రచురించేదీ, లేనిది తెలియజేస్తారు. కొత్తవాళ్ళవి, పాతవాళ్లవి అని కాకుండా కొత్తదనం ఉన్న అన్ని రచనలకూ ప్రాముఖ్యత ఇస్తారు.
మీ రచన వీలయినంత ఎక్కువ మందికి చేరాలంటే, ఎప్పుడూ మీ ఫేస్బుక్ వాల్ కొ, మీ డైరీకో పరిమితం చేయకుండా వీలయినన్ని పత్రికలకి పంపించండి. అప్పుడప్పుడూ జిల్లాల్లోంచి విడుదలయ్యే చిన్న చిన్న అచ్చుపత్రికలకి కూడా పంపండి.
ఫేస్బుక్ లో దొరికినన్ని కామెంట్స్ వెబ్ పత్రికల్లో దొరక్కపోవొచ్చు, అచ్చుపత్రికలో మీ రచన చదివిన ప్రతీ ఒక్కరూ మీకు ఫోన్ చేయలేకపోవొచ్చు. కానీ మీ రచన ఏమారుమూలో ఉన్న ఏ ఒంటరి గుండెనైనా నింపొచ్చు. మీ కవిత మరొకరి కంటికి దీపం కావచ్చు. మీ కథ ఇచ్చిన ప్రేరణ ఒక కుటుంబాన్నే బాగుచేయొచ్చు.
మీరు మీకోసం రాసుకున్నా.. మాతో, మా పాఠకులతో పంచుకోండి.
**** (*) ****
బావుంది రవి గారూ.
ప్రతి రచయితకు, కవికి ఉండే అపోహలను చాలా సున్నితంగా ‘తప్పు’అని చెప్తూనే కర్తవ్యాన్ని బోధించారు. ముఖ్యంగా మీ చివరి వాక్యాలు ” మీ రచన ఏమారుమూలో ఉన్న ఏ ఒంటరి గుండెనైనా నింపొచ్చు. మీ కవిత మరొకరి కంటికి దీపం కావచ్చు. మీ కథ ఇచ్చిన ప్రేరణ ఒక కుటుంబాన్నే బాగుచేయొచ్చు,” ఒక అనుభవజ్ఞు డైన కవిగా , సంపాదకుడిగా ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయి. ధన్య వాదాలు మరియు అభినందనలు.
విజయ్ కోగంటి
“కానీ మీ రచన ఏమారుమూలో ఉన్న ఏ ఒంటరి గుండెనైనా నింపొచ్చు. మీ కవిత మరొకరి కంటికి దీపం కావచ్చు. మీ కథ ఇచ్చిన ప్రేరణ ఒక కుటుంబాన్నే బాగుచేయొచ్చు. ” నిజమే కదా. ఒక రచనకు ఇంతకన్నా పెద్ద బహుమతి ఏముంటుంది?
ఎక్కడికి పంపాలో నిర్ణయించుకుంటావు. పదికి పది మార్కులేసుకుంటే బాగా పేరున్న సాహిత్య పేజీకి, కొంచెం తక్కువ మార్కులేసుకుంటే మరో పత్రికకి పంపిస్తావు
ఎడిటర్స్ కూడా ఇలా మాట్లాడుతూ ఉండాలి.- పాఠకులతో, రైటర్స్ తో! .. కనీసం అప్పుడప్పుడైనా..ఇలా.!
.
నా ఆముద్రిత కథల కవితల బొత్తి ఎక్కడ ఉందో చె్ప్మా ?
ధైర్యం విలోలంబై అన్నట్టు ,ఎన్ని స్వయం రెజెక్షంసూ ?
ఎన్ని బుర్ర లో నే నిరాక్షిణ్యం గా చంపబడ్ద పాత్రలూ ..
అయ్యో అయ్యో …
సరే మరి ..ఈ సారి చూద్దాం ..
ఏ మూల ఎవరి ప్రాణానికి బెడదా గా మారుతాయో
ఎవరి కొస ప్రాణాలకి అవలంబన అవుతుందో ? హోరినీ !
ఈ కథే ప్రచురింప బడితే ఇంక మన కథ నీటు గా పంపించేయొచ్చూ
ఇంక తుడుపులూ , మలి రాతలూ అక్కరలేదు అంటూ
ఎవరికో ఒక్కరికైనా ..ఊపిరి పోయొచ్చు నా రచన ..
శుభం ..మంచి ప్రేరణ పొందాను అండీ
ధన్యవాదాలు ..నిఝం గా ..
వసంత లక్ష్మి
చాలా బాగా చెప్పారు. కాని కొన్ని పత్రికలు నెలలకొద్ది పంపించిన రచనల పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతుంటారు. త్రిప్పి పంపించరు! దాని వల్ల maro చోట ప్రయత్నిచాలంతే ….!?
ఏ మేఘం ప్రాణం తీస్తుందో
ఏ మేఘం ప్రాణం పోస్తుందో ఎవరికెరుక
బాగుందండి!!!
మీ సోదర సంపాదకునిగా మీ ప్రతి వాక్యాన్ని ఆమోదిస్తున్నా.
మీ సంపాదకీయం బాగుందిసార్,
మీరు చెప్పింది నిజమే సర్