కవిత్వం

ఆఖరి అడుగు

జూలై 2015

కంటి పువ్వు మీద వాలింది.
ఉదయానిదో సాయంత్రానిదో తెలియని
సంధ్య.

ఇంకా పాలేర్లలా పనిచేయలేమని
నరాలన్నీ మొరాయించే వరకూ
నెత్తిమీదో, వీపుమీదో లేదా ఛాతీమీదో
మొయ్యాల్సిందే.
ఉత్తి బరువు మార్చుకోడానికి తప్ప
నోటికెప్పుడూ అందిరాలేదు
చేతులు.

లెక్కలన్నీ పూర్తిచేసుకుని
వెలుగుకలాన్ని చెవిలో చెక్కుకుని
ఎప్పుడూ పాడని పాటొకటి పాడుకుంటూ
నాతోపాటే చివరి కొండ దాటుతుంటాడు
మిత్రుడొకడు.

నాతో పుట్టి
నాలోనే పెరిగిన శత్రువొకరు
ఇక ఇక్కడ్నుంచి
నా బరువు తనే మోస్తానంటాడు.

ఇంకొకే ఒక్క
చిక్కటి అడవిలాంటి
చీకటి పొర
అదీ దాటేస్తే…