ఇట్లు మీ..

రాధా మనోహరాలు – 1

జనవరి 2017

నిండు పున్నమి రాత్రుల్లో, నా బాల్కనీ అదృష్టంలో సగం తీసుకుని
నడి నెత్తికి వచ్చేసిన చంద్రుడిని అంతసేపు చూస్తూ, అవునూ, నీకు టెలీపతీ అంటే అర్థం కాలేదన్నావు కదూ ఒకసారెప్పుడో.

అంత వెన్నెల్ని తాగేసిన ఆ మత్తులో కూడా ఎక్కడో హాల్లో సైలెంట్ మోడ్ లో ఉన్న నా మొబైల్ వైపు అసంకల్పితంగా ఎందుకు అడుగేశానంటావు? మొబైల్ చేతిలోకి తీసుకోగానే నిశ్శబ్దంగా అందులో నీ పేరు ఎలా వెలిగిందంటావు?

నీకు గుర్తుందో లేదో, ఆ రోజు ఫోన్ ఎత్తగానే ‘హలో’ కూడా చెప్పకుండా “ఇవాళ నీ ప్రొఫైల్ పిక్ లో ఉన్నట్టే నువ్వు ఎప్పుడూ.. ఎప్పుడూ అలా నవ్వుతూనే ఉండాలి. ఉంటావా? “ అని అడిగావు.

అప్పుడనిపించింది నాకు. కొన్ని సంవత్సరాలుగా నీ స్నేహంలో చందమామ కథలా మారిపోతున్న నా జీవితానికి ‘లైఫ్ సెటిల్ అయిపోయింది’ అనేదే సరయిన పేరని.

నువ్వేదేదో మాట్లాడేసి “ఎప్పుడూ నేనేనా.. నువ్వేమైనా మాట్లాడు “ అన్నావ్.

“ లైఫ్ సెటిలైపోవడం అంటే ఏంటి? “ అని అడిగేశాను.

అకస్మాత్తుగా నేనలా అడిగేసరికి బిత్తరపోయావ్ కాసేపు. “సగం జీవితం గడిచిపోయాక ఇప్పుడు అడుగుతున్నావంటే .. ఇదేదో తిరకాసు ప్రశ్నే .. నువ్వే చెప్పు .. “ అన్నావ్.

“నదినీ, సముద్రాన్నీ కూడా నేనే అవడం “ అన్నాను.

“ఇన్ని యోజనాల దూరంలో ఉన్నానన్న జాలి కూడా లేకుండా పేరు లేని భాషలో మాట్లాడతావు చూడు” అన్నావ్ కోపంగా.

అప్పటికంతే.. మొబైల్ మూతి ముడుచుకుంది.

నాకు తెలుసు చెప్పినా నీకు అర్థం కాదు.

***

ఒక్కోసారి తప్పదు మరి. నా నిఘంటువుని చదివేసిన ఆకాశం కురవక తప్పనప్పుడు, ఆ నీలగిరి పర్వతాల ఎత్తుల్లోనే సెలయేరై పుట్టాలి. ఆ హొయల దూకుడుకి దోసిలిపట్టే లోయనూ నేనే కావాలి. అంతే… కొన్ని ప్రవాహాలెవరికీ అందకూడదు. కొన్ని వానలెవరినీ తడపకూడదు.

నీ నవ్వు తగిలి నా పెదవి అందంగా వంగినప్పుడో, నీ రూపం నా కంటి కొసలకి కాటుక దిద్దినప్పుడో లోపలికి రావాలి. పూలు కోసుకోవడానికి కాదు, నా మునివేళ్ళ సోయగం చూసుకోవడానికి.

ఆకాశాన్ని దించుకోవడానికి కాదు నా కంటి వైశాల్యాన్ని కొలుచుకోవడానికి.

అలా పెదవుల్లోంచీ, మునివేళ్ళ పరిశోధనల్లోంచీ బయటపడే ఆకుపచ్చని వాక్యాలు ఇక్కడ పెరిగి తీగలై ఎదగాక, రాలే నాలుగు చినుకులే నింగి సంతకాలనుకుని నేల సంబరాలు చేసుకుంటుంది చూశావా.. ఆ కాలంలో చెబుతాను నా పదాలకి అర్థమేమిటో.
గుండెలో జాగా లేక, ఈ పూలన్నీ కోసి తెచ్చి నీ దోసిట్లోనే పోసి వెనుతిరగుతాను. అంతలోనే మళ్ళీ గుండె గుబాళింపుతో బరువెక్కిపోతోందని క్షణకాలం ఆగుతాను.

అప్పుడు సందు చూసి మాలతీ తీగలతో చుట్టేసి ‘ నేస్తమా ! ఈ జన్మ మొత్తం నీకు వసంతమొక్కటే రుతువని’ నుదుటన నెమలీకతో వ్రాసేసే నీకు ఏమివ్వగలను? ఇలా నా అక్షరాల తోట రాసిచ్చెయ్యడం తప్ప?

**** (*) ****