కవిత్వం

నదితో నాలుగడుగులు

12-ఏప్రిల్-2013

1

మలుపు మలుపులో
మరో కొత్త పాటకు స్వరం దిద్దుకుంటూ
మంద్రంగా
సాగిపోతుంది నది.

రెప్పపాటి రోజుల్లా
ఒక్కొక్కటిగా ఒడ్డు చేరి నిష్క్రమించే
అలలు లెక్కిస్తూ కూర్చున్నా.

జవాబు చెప్పే లోపే ప్రశ్న మార్చే జీవితంలా
ఒకటి రెండై
రెండు నాలుగై
లెక్క తేలని అలలలలు.

2

రోజూ చదివే పుస్తకమేకదాని
బడికెళ్ళడం మానడుగా!
పుట మారుస్తూ
పొలిమేరల్లో సూర్యుడు.

కట్టు బట్టల్ని గుట్టపైనే వదిలేసి
నగ్నంగా నది నీట్లోకి దూకుతూ
సన్నటి ఈరెండ.

జారుతున్న పుప్పొడిపైటను సరిచేసుకుంటూ
గాలి విల్లు వొంచి
పరిమళాన్ని ఎక్కుపెట్టి
దిక్కులన్నీటిని ఒక్కొక్కటిగా చిత్తుచేస్తూ
కొమ్మ చివరంచుల్లో
ఓ పువ్వు.

3

నది గలగలా పాడే పాటలన్నీటికీ
నేనే బాణీ కట్టానంటూ
కొమ్మెక్కి కొండతో వాదిస్తుందో కొంటె కోయిల.

కొండకున్న
ఓపికా
స్థిరత్వం
కోయిల కెక్కడిది!

మత్తెక్కిన దిక్కుల్ని
మలిసంజకి వదిలేసి
కోయిలా
నేనూ
ఎవరి గూట్లోకి వాళ్ళమే.

4

పాపం!
తల్లి పొత్తిళ్ళలో మళ్ళీ పుట్టడానికి
జీవితాంతం పరిగెత్తే నది

పుట్టు అనాధ.

 


(
వర్జీనియా లోని శనండొహా పిల్లనదితో ఓ రోజు)

*** అమెరికాలో(మేమున్న ప్రదేశంలో) కోయిలలు లేవు కానీ ఇక్కడి Northern Mockingbird అనే పిట్టనే అమెరికన్ కోయిల అంటారు. ఇది మన తెలుగు కోయిల అంత మధురంగా పాడదు కానీ మన కోయిల కంటే చాలా పొడుగు పాటలు పాడి ఊదరగొడుతుంది.