నీకు తెలీందేం కాదు.
నిలకడగా బండి నడిపేస్తున్నా… చూశావుగా? ఇన్ని మైళ్ళు వెనక్కిపోయి వెతుక్కోలేను కానీ- అదిగో ఆ నల్లేరుకింద నలిగిపోయిన మనసుని అసింటా వంగితీసి జేబులోకి తోసెయ్యి. అప్పుడే చెప్పి వెళ్ళాల్సింది- ఆ గ్రహంలోంచి జులాయిగా నువ్వొక ఈల వెయ్యగానే ఇక్కడ అత్తరుబుడ్లు పగులుతాయని, నిషాసీసాలు ఒలుకుతాయని, ఊచల సందుల్లోంచి పదాలు తుర్రుమని దూరిపోతాయని, కళ్ళ కరకట్టలు తెగిపోయి…
–
“ఈ చేపల్ని నీళ్ళల్లో వదిలింది నువ్వే. కోపం రాదా మరి?”
“ఎవరో తెంపేస్తున్న పూలమాలల్ని లాక్కుని నీళ్ళు చల్లి ఆకుల్లో పరిచింది నువ్వు కాదూ?”
“మాటలు చెప్పావు, ముద్దు చేశావు, ముద్దలు కలిపి పెట్టావు- ఎట్లా క్షమించను?”
“ఆకులు ఊడ్చి అవతల పోశావు, ఆటలు నేర్పావు, అలసటొస్తే అరచేత్తో చెమటని అద్దావు. భలే విసిగించావులే!”
“అసలు బుధ్ధుందా నీకు?”
“ఏ కోశాన్నైనా మనిషివేనా నువ్వు?”
(అద్దపు గోడల్లోపల అస్తమానం గీరే తాబేలు పిల్లల్లాగా… దా, బాగా పోట్లాడుకుందాం. వందడుగులు జారిపోయాక ఇంకో వెయ్యి పెద్ద తేడా పడదులే.)
-
తేయాకుతోటల కొండవాలులో పొద్దెరక్క దొర్లిందీ, యాష్ ట్రే అంచుమీద నుసిలో రాలిపడింది- నువ్వూ నేనూ చెరోసారి. ఇన్నేళ్ల ఈదులాటలో ఆకలేస్తే పాలకేడవడం తప్ప ఇంకేం నేర్పుకోలేదుగా ఒకళ్లకొకళ్ళం? ఆ తర్వాత పళ్లబిగువున ప్రాణాల్ని భరించేది, శాపవశాన సుగంధాల్ని సహించేది, అంతా పాత కథే.
కొత్త సంగతులంటావా!
పువ్వై నలిగింది, పాటై మెలి తిరిగిందీ ఇక చాలనీ, బాణమై నాటేదీ, కవచమై కాచేదీ ఇంకాసేపే అని. మళ్ళీ పుడితే పిచ్చివాడి కేకగానో, బొద్దింకమీసాల్లానో- మోహంలాంటి కవిత్వంలోకి, కవిత్వాన్ని మించిన అబద్ధంలోకి…
పిచ్చి మొద్దూ! అడిగానని అలగొద్దు కానీ ఇన్నివేల రంగుల్లో వృధా పోయింది ఒక్కటైనా ఉందంటావా?
” ఇన్నివేల రంగుల్లో వ్రుధాపోయిందీ ఒక్కటైనా ఉందంటావా? ” <3
చాలా బాగుంది మేడం గారు …
అభినందనలు …