కవిత్వం

మా మంచి చెల్లెలు

మార్చి 2017

మా చెల్లెలు కవితలు రాయదు
ఇప్పుడు అకస్మాత్తుగా రాసే అవకాశమూ లేదు.
తను కూడా అచ్చం అమ్మలాగే. అమ్మ ఎప్పుడూ ఏం రాయలేదు.
కాస్త నాన్నలా కూడా, ఆయనా ఎప్పుడూ ఏం రాసిన గుర్తులేదు.

మా చెల్లెలి ఇంట్లో నాకు హాయిగా ఉంటుంది.
వాళ్ళాయనైతే కవిత్వం రాయడం కన్నా నూతిలో దూకడం నయమనుకుంటాడు.
పాడిందే పాటలా చెప్పిందే చెప్తున్నానేమో కానీ,
మా చుట్టాలెవరికీ ఈ పద్యాలు రాసే అలవాటు లేదు.
మా చెల్లెలి ఇంటి అల్మారాల్లో పాత కవితల కాగితాలేం దొరకవు.
తన చేతిసంచిలో కొత్త కవితల చిత్తు ప్రతులూ ఉండవు
తనెప్పుడైనా భోజనానికి పిలిస్తే, తన కవితలు చదివి వినిపిస్తుందేమో అనే భయం లేదు.
దాపరికాలు, దురుద్దేశాలూ ఏం లేకుండా, బ్రహ్మాండంగా వంట చేస్తుంది.
కమ్మటి కాఫీతో పాటు తన కొత్త కవితలేం ఇవ్వదు;
అంచేత వాటిమీద మనం పొలమారడమూ ఉండదు.

చాలా కుటుంబాల్లో ఎవరూ కవితలు రాయరు.
కానీ ఆ అలవాటంటూ ఒకసారి మొదలైతే, దాన్ని ఆపడం మహా కష్టం.
ఒక్కోసారి కవిత్వం తరతరాలకూ సంక్రమిస్తుంది అనుకోకుండా,
కుటుంబానురాగాల్ని సుడిగుండాల్లోకి తోస్తుంది.

కబుర్లాడేటప్పుడు మా చెల్లెలు మంచి మాటకారితనంతో నెగ్గుకొస్తుంది
కానీ రాతలో మాత్రం, తన రచనా సర్వస్వమంతా కలిసి,
శలవల్లో ఇంటికి రాసే కార్డు ముక్కలే.
ఆ ఉత్తరాలన్నిట్లో ప్రతీ ఏడాదీ ఒక్కమాటే నొక్కి చెప్తుంది.
అదేంటంటే, తను తిరిగొచ్చాక చెప్పాల్సినవి బోల్డు, బోల్డు సంగతులున్నాయని.

Original: In Praise of My Sister by Wisława Szymborska
అనువాదం: స్వాతికుమారి బండ్లమూడి
Picture Credit: https://poetarumsilva.com/2016/03/13/wislawa-szymborska-lacrobata-akrobata/