వాళ్లేమన్నారంటే!

ప్రశ్నించు

జూలై 2016

భావనల గురించి చెప్పాలంటే- నీ అంతరంగాన్ని సాంద్రంగా, ఉత్తేజంగా మలిచే భావాలన్నీ స్వచ్ఛమైనవే. నీలోని ఒక పార్శ్వాన్ని చేజిక్కించుకుని నిన్ను కకావికలు చేసినవి మాత్రం మలినమైన అనుభూతులు. ఆమాటకొస్తే పసితనపు ఆలోచన్లన్నీ మంచివే. నీ శక్తియుక్తులన్నిటినీ మించి నిన్ను ఉదాత్తంగా తీర్చిదిద్దగలిగే ఆలోచన ఏదైనా సరైనదే. ఏ విషయంలోనైనా గాఢత ఉండటం చాలా అవసరం. అది ఒళ్లెరగని మత్తులో మురికిలో ముంచే గాఢత కాదు. రక్తంలో పూర్తిగా కలిసిపోయి, అటుకొసన ఏముందో తెలిసిన ఆనందం, చిక్కగా ఉండాల్సిందే. అర్ధమౌతుంది కదా?

ఇకపోతే- సందేహించడం, ప్రశ్నించడం చాలా మంచి లక్షణాలు, ఐతే ప్రశ్నించడం ఎలానో సరిగ్గా నేర్చుకోవాలి. నీ ప్రశ్న ఏమిటో నువ్వు ముందు అర్ధం చేసుకోవాలి, అది సద్విమర్శగా మారాలి. నీ సందేహం నీ అనుభవాన్ని పాడుచేస్తుంటే, ఏ విషయమైనా అసహ్యంగా తోస్తే, అడుగు. వదలకుండా సాక్ష్యాలు వెతుకు, పరీక్షించు. ఇదంతా ఒక్కోసారి ఆశ్చర్యంగా, కొన్నిసార్లు సిగ్గుపరిచేలా ఉండొచ్చు. ఈ ప్రశ్నించే క్రమంలో గట్టి నిరసన కూడా ఎదురవ్వచ్చు . కాని లొంగిపోవద్దు, వాదించు. ప్రతిసారీ మరింత శ్రద్ధగా, పట్టుదలగా నీ వాదనని వినిపించు. ఏదో ఒకరోజు ఈ ప్రవ్రుత్తి నిన్ను పాడు చెయ్యకపోగా నీకు మేలే చేస్తుంది. బహుశా ఈ లక్షణం నీ జీవితాన్ని నిర్మించుకోవడంలో అన్నిటికన్నా మంచి/నాణ్యమైన పనిముట్టుగా పనికొస్తుంది.

ఇవ్వాళ్టికిది చాలు, మై డియర్ కప్పుస్. ఈ ఉత్తరంతో పాటు “ప్రేగ్ జర్మన్ లేబర్” మలి ప్రచురణలో అచ్చయిన ఒక చిన్న కవితను పంపుతున్నా. ఈ కవితలో చావు, పుట్టుకల గురించి, వాటి ప్రాముఖ్యత, గొప్పతనాల గురించిన నామాటలు నువ్వు చదవవచ్చు.

మూలం: Letters To A Young Poet – Rainer Maria Rilke (1875–1926) http://www.carrothers.com/rilke9.htm