1
నీకో ముద్ద తినిపించి
దిష్టితీసి మొటికలు విరిచి
“తూ… తూ” అనిపించి
దోసిలి విసిరాను-
అవే
ఈ నక్షత్రాలన్నీ
2
నువ్వు నిద్రపోయాక
ఒళ్ళోంచి తలని దించుతుంటే
నీ వేళ్ళలో
చీరచెంగు చిక్కుకున్నట్టు
కల
ఇప్పుడేం చేస్తున్నావ్?
దిండుమీద కాలేసుకుని
నిద్రపోతున్నావా?
3
ఈ రోడ్డు దాటుతున్నప్పుడే కదా;
“రేపెట్లా” అని
మనం గొడవపడింది?
మళ్లీ జాగ్రత్తగా చేతులు పట్టుకుని
రోడ్డు దాటింది
4
అటు కాకులేవీ ఇటు వాలలేదు
ఏ సమాచారం లేదు
షరతులేవీ నిలవలేదు
సరేలే
ఇదొకటీ చెప్పు
“బాగనే ఉన్నావా?”
5
అరల్లో కొత్త పుస్తకాలు
లెక్క తప్పకుండా తేదీలు
రాయడం కొత్తగా నేర్చుకుంటున్నా
ఇప్పుడేమని సంబోధించను?
6
ధ్యానంలో బుద్ధుడిబొమ్మ
ఆగిపోయిన గోడగడియారం
సగంనిద్రలో పిల్లిపిల్ల
ఇంట్లో ఏదోక మూల
నీ మాటొకటి
దొరికితే బాగుండు
7
మనకి పుట్టని పాప
అందర్లోకి అందగత్తె
అదిప్పుడు వెలిగిపోతోంది
పున్నమినాటి ఆకాశంలో!
8
నువ్వెలానూ తిరిగిరావుగా
అర్ధరాత్రి సముద్రం
తోడుకోసం పిలుస్తోంది
పోనీ-
వెళ్లిపోనా?
” వొద్దు తల్లీ, వొద్దు.
అర్ధరాత్రి సంద్రం పిలుపుల కన్నా
నీకై రెయ్యిమ్ బవళ్ళు ఆక్రోశిస్తున్ననీవాళ్ల తలపులకే తలొగ్గు, తోడుండు ”
అని అన్నారు త్రిపుర తండ్రి.
స్వాతి గారూ, చాలా చాలా బాగుంది, పూర్తిగా మరో ఆర్ద్రపు ఆకాశం కింద నిలబెట్టేశారు!!
నువ్వెలానూ తిరిగిరావుగా
అర్ధరాత్రి సముద్రం
తోడుకోసం పిలుస్తోంది
పోనీ-
వెళ్లిపోనా?
………………………చాలా చాలా చాలా లోతుగా, గాంభీర్యంగా వ్యక్తీకరించారు.
ప్రేమప్రకటనలోనూ పిసినారితనమే!
బాగుంది