అనువాద కథ

ఉలిపికట్టె

డిసెంబర్ 2016

నగనగా ఒక ఊరు. ఆ ఊరంతా దొంగలే. చీకటి పడగానే ప్రతీవాడూ దొంగతాళాల గుత్తి బొడ్లో దోపుకుని గుడ్డి లాంతరు చేత పట్టుకుని బయల్దేరేవాడు. దొరికిన ఇళ్ళల్లో దూరడం, చేతికందింది మూటగట్టుకోడం. తెల్లారేవేళకి దొంగసొమ్ముతో ఇంటికి చేరేసరికి వాడిల్లు ఇంకెవడి చేతిలోనే గుల్లయి ఉండేది.

అలా అందరూ ఒకరినొకరు దోచుకునే వాళ్ళు. కలిసి మెలిసి సుఖంగా బతికేవాళ్ళు. ఒకడు ఎదిగిందీ, ఇంకోడు చితికిపోయిందీ లేదు. ఒకణ్ణొకడు దోచుకుంటూ, ఆ గొలుసు దొంగతనాలు ఊళ్ళో చివరి వాడు తిరిగి మొదటివాడిల్లు కొట్టెసేదాకా క్రమం తప్పకుండా సాగేవి. ఆ వూర్లో వ్యాపారమంతా అమ్మేవాళ్ల, కొనేవాళ్ళ మోసపు తెలివితేటల మీదే నడిచిపోయేది. అక్కడి ప్రభుత్వం ఒక మాఫియా. ప్రజల్ని వీలైనన్ని రకాలుగా దోచుకునేది, జనమేం తక్కువోళ్ళు కాదు, పన్నులు ఎగ్గొట్టడం ద్వారా ప్రభుత్వానికి న్యాయం చేసేవాళ్ళు. ఇంకేం! పేదా గొప్పా తేడాల్లేకుండా జీవితాలు నల్లేరు మీద బండిలా సాగేవి.

ఉన్నట్టుండి ఒకరోజు ఎక్కణ్ణుంచొచ్చాడో ఒక నిజాయితీపరుడు ఆ వూరొచ్చాడు. రాత్రుళ్ళు గోనెసంచి, గుడ్డిలాంతరు పట్టుకుని వూరిమీద పడకుండా ఇంటిపట్టున కూర్చుని చుట్టకాల్చుకుంటూ తత్వాలు పాడుకునేవాడు. మిగతా దొంగలు యధావిధిగా తమ వంతు ప్రకారం అతనింటికొచ్చినప్పుడు గూట్లో దీపం చూసి బయటే ఆగిపోయేవాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు జరిగింది. ఇక తప్పనిసరై అందరూ అతనికి నచ్చజెప్పాల్సొచ్చింది. “బాబ్బాబూ, నీకు తిండికి లోటులేకండా ఉంటే ఉండనీ, చుట్ట కాల్చొద్దనీ, పాటలు పాడుకోవద్దనీ మేమెవరమూ చెప్పం. కాకపోతే నువ్వొక సంగతి తెలుసుకోవాలి. నువ్వు రాత్రుళ్ళు ఇల్లు పట్టుకు వేలాడితే వూళ్ళో ఒక ఇల్లు ఆకలితో మిగిలిపోతుందని గుర్తుంచుకో.” అని అతన్ని బతిమాలారు.

నిజాయితీపరుడికి అది నిజమే అనిపించింది. దొంగల సౌకర్యం కోసం అతను ప్రతిరాత్రి ఇల్లొదిలి పోయి తెల్లారి ఎంచక్కా తిరిగొచ్చేవాడు. దొంగతనాలు మాత్రం చేసేవాడు కాదు. వూరి లాకులు దాకా వెళ్ళి కాలవనీళ్ళు ఎందాక పోతున్నాయో చూసొచ్చేవాడు. తీరా వచ్చిచూస్తే ఏముంది? ఆసరికే ఇల్లంతా లూటీ అయుండేది.

అలా ఓ వారం తిరిగేలోపు, మన నిజాయితీపరుడు బికారి ఐపోయాడు. అతని ఇల్లంతా ఊడ్చిపెట్టుకుపోయింది. తినడానికి పిడికెడు బియ్యం కూడా మిగల్లేదు. ఐతే స్వయంకృతం కాబట్టి ఇదో పెద్ద బాధ కాదు. అసలు సమస్య వేరే ఉంది. రోజూ మిగతావాళ్లని ఎంచక్కా తనిల్లు దోచుకుపోనిచ్చేవాడు, ఇతను మాత్రం ఎక్కడా చేతివాటం చూపెట్టడు. అంచేత ఇతను కొల్లగొట్టాల్సిన ఇల్లు మాత్రం, ఆ ఇంటివాళ్ళు బయట పని కానిచ్చి తిరిగొచ్చేసరికి నిక్షేపంగా దర్శనమిచ్చేది. ఇంకేముంది, కాలం గడుస్తున్నకొద్దీ, అలా మిగిలిపోయిన డబ్బుతో వాళ్ళు డబ్బున్నవాళ్ళుగా తయారయ్యేవాళ్ళు. వాళ్లకి బతుకుతెరువుకోసం దొంగతనం చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ నిజయితీపరుడి ఇల్లేమో అతను దొంగసొమ్ముతో నింపుకోడు కాబట్టి అతనింటికి దొంగతనానికి వచ్చినవాళ్లకి ఏం దొరికేది కాదు. క్రమక్రమంగా వాళ్ళు పేదవాళ్ళుగా అయ్యేవాళ్ళు.

ఇక ఈ నడమంత్రపు సిరిని పొందినవాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా రాత్రుళ్ళు కాలవగట్టుకి షికారుకెళ్ళడం నేర్చుకున్నారు. అలా పోనుపోనూ చాలామంది ధనవంతులుగా, ఇంకా చాలా మంది పేదవాళ్ళుగా మారిపోయారు. ఈ వ్యవహారమంతా గందరగోళంగా తయారైంది.

ఇదిలా ఉందగా,  షికారుకెళ్ళే గొప్పవాళ్లకో ఆలోచన వచ్చింది. ఇలానే మనం రోజూ పనిమానేసి షికారుకెళ్తే ఎన్నాళ్ళు సాగుతుంది అని? సరే ఐతే, బీదవాళ్లకి కాస్త భత్యమిచ్చి మనకోసం దొంగతనాలు చేయించుకుంటేనో! అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మనుషుల్ని పెట్టుకున్నారు. ఒప్పందాలు రాసుకుని జీతాలు, మామూళ్ళూ మాట్లాడుకున్నారు. ఈ రాతకోతల్లో కూడా ఏం మెలిక పెడదామా, ఎలా ఇంకా గొప్పవాళ్లమౌదామా అనే అందరూ ప్రయత్నించేవాళ్ళు. అలా అలా ఉన్నవాళ్ళు మరింత ఉన్నవాళ్ళుగా, లేనివాళ్ళేమో బొత్తిగా బీదవాళ్ళుగా మారిపోయారు.

అసలు కొంతమంది ఎంత డబ్బు కూడబెట్టారంటే వాళ్లకసలు దొంగతనం చెయ్యల్సిన పనిలేకుండా పోయింది.  అలాగని ఊరుకుంటే లేనివాళ్ళొచ్చి వీళ్ల ఇళ్ళు దోచుకుపోకుండా ఉండరు కదా! అందుకని ఏం చేశారంటే, లేనివాళ్లలోకెల్లా అతిపేదవాళ్లని చూసి, వీళ్ల ఇళ్లకి, ఆస్తులకి కాపలావాళ్ళుగా పెట్టుకున్నారు. దాన్నుంచి పోలిసులు తయారయ్యి, జైళ్ళు పుట్టుకొచ్చాయి. వాటివల్ల కొత్త ఉద్యోగాలు, మనుషులు వేరు వేరు వర్గాలుగా విడిపోవడం మొదలైంది.

ఈ నిజాయితీపరుడు వూర్లో అడుగుపెట్టాక పట్టుమని కొన్నేళ్లైనా గడిచాయో లేదో, జనం దొంగతనాల గురించి మాట్లాడ్డమే మానేశారు. ఇప్పుడంతా గొప్ప,పేద అనే మాటలే చెప్పుకుంటున్నారు. ఏదేమైనా, ఏ పేర్లతో పిల్చుకున్నా వాళ్లంతా ఇప్పటికీ దొంగలే.

ఎవరిమాట ఎలా ఉన్నా ఈ నిజాయితీపరుడు మాత్రం కొద్దిరోజుల్లోనే ఆకలితో చచ్చిపోయాడు.

**** (*) ****

మూలం: The black sheep by Italo Calvino
అనువాదం: స్వాతికుమారి బండ్లమూడి