సంపాదకీయం

ఇంతకీ- ఎందుకనీ రాయడం?

ఏప్రిల్ 2015

ఎందుకు రాస్తావు?

“ఎప్పుడూ కాదుకానీ, ఎప్పుడో ఒకసారి, అదెప్పుడో ఎందుకో ఇంకా సరిగ్గా తెలీదు. ఏదో ఆరాటం మొదలౌతుంది. ఎక్కడా తిన్నగా ఉండనీదు, చేస్తున్న పనేంటో అర్థం కాదు. అప్పుడొకటే దారి. వీలు చేసుకుని ఎక్కడోచోట కూర్చుని ఉన్న ఫళాన రాసెయ్యాలి. హమ్మయ్య! రాసేస్తానా, అప్పుడు కాస్త ఊపిరాడటం మొదలౌతుంది.”

మరి నీసంగతి?

“ఏదైనా కష్టమొస్తుంది కదా. చాలా పెద్ద విషాదం ఒక్కోసారి. బాగా బాధేస్తుంది. ఏడ్చినా, ఎవరితో చెప్పుకున్నా తీరదు. ఆ తీవ్రత, విషాదపు లోతు ఉన్నదున్నట్టు బయటికి పంపాలంటే రాసుకోడం తప్ప వేరే దారి లేదు.”

సరే- ఇంకా ఎప్పుడెప్పుడు?

“ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. ఒక అన్యాయం, ఒక మూర్ఖత్వం, ఒక అణచివేత కనపడతాయి. ఆ ఒక్కటీ ఒక్కటి కాదనీ, వాటి మూలమైన భావజాలం మనుషుల్లోనూ, సమాజపు తీరులోనూ లోతుగా ఇంకిపోయి ఉందని, అలాంటివి జరుగుతున్నాయని తెలీని వాళ్లకి చెప్పాలని, ఎందుకు జరుగుతున్నాయో అప్పటికప్పుడు బేరీజు వెయ్యకుండా మరిన్ని ఉదాహరణలతో చర్చించాలని, రచనలద్వారా, ఆ ఆలోచననీ, వివేకాన్నీ విస్తరించాలనీ ఉంటుంది.”

కథో కవితో చెప్పగల నేర్పు, భాష, శైలి లాంటివన్నీ కేవలం సాధనాలు (టూల్స్) గా అర్ధం చేసుకుంటే వీటన్నిటినీ వాడుకుని రాసే శక్తి/బలహీనత/అనివార్యత ఏదైతే ఉందో అదే రచన. మాములుగా అందరూ చూసే ఒక ర్రైల్వే స్టేషన్ దృశ్యాన్నో, ఒక సాయంత్రపు సంతనో, ఒక వర్షాకాలపు మధ్యాహ్నాన్నో టెలిస్కోపిక్ కళ్లతో చూస్తాడు రచయిత. తన అభిప్రాయాల్లోకి, ఆలోచనల్లోకి, తన భావజాలపు లోతుల్లోకి అదే పదునైన చూపుని విసురుకుంటాడు. ఒక అనుభూతిగానో, అనుకంపనగానో తను అనుభవించిన సంచలనాన్ని భాషా ప్రపంచపు అర్థాల్లోకి ఇరికించటానికి పదే పదే ప్రయత్నిస్తుంటాడు.

రచన చేసేటప్పటి రచయిత స్థితి ఒక పూనకమో, ట్రాన్సో అనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో తనేమిటో దానికి దూరంగా మరొక కొత్త మనిషిగా, ఆ కాసేపటికి ఆ రచనా వస్తువే తన పూర్తి అస్తిత్వంగా మారిపోతాడు. ఒక్కోసారి తన అనుభవానికి, తెలివికీ మించిన ఊహాశక్తితో రచయిత పరిధిని మించి రచన ఎదిగిపోవడమూ, దానికది స్వతంత్రంగా కొత్తదారుల్లో సాగిపోవడమూ కూడా నివ్వెరపోయి చూసుకుంటాడు. ఇది నేను రాయడం వల్ల వచ్చింది కాదు, నా ద్వారా బయటకొచ్చింది అని అర్థం చేసుకుని అక్షరాల ముందు వినమ్రుడౌతాడు.

***

“చూడు- ఇన్ని రాత్రులు మేలుకున్నావ్. మధ్యలో తిండి సహించక మానుకున్నావ్, ఏడ్చావ్, జుట్టు పీక్కుని తలబాదుకున్నావ్. చివరికి ఈ పుంజీడు కాగితాల మీద ఏదో రాశావ్. అసలెవరైనా చదువుతారంటావా? ఇదంతా కనీసం ఒక్క మనిషికైనా సరిగ్గా అర్థమౌతుందంటావా? అసలెందుకూ రాస్తావ్?”

వేళ్ల మెటికలు విరుచుకుంటూ, అప్పటిదాకా మోస్తున్న టన్నుల బరువుని దింపుకున్నవాడిలా నిట్టూర్చి అతనన్నాడు-
“నేనూ ఆలోచించాను. నేనురాసేది చాలామందికి, అసలెవరికీ అర్థం కాకపోవచ్చేమో అని రూఢీగా అనిపించింది కూడా ఒకసారి. కానీ రాశాను. లోకం సంగతేమో కానీ, రాసుకున్న ప్రతిసారీ బహుశా, నాకు నేను ఏమైనా అర్థమౌతానేమో తెలుసుకోడానికి రాస్తాను.”

**** (*) ****