కవిత్వం

ఆ తర్వాత

జూలై 2017

నని తాను రెండుగా చేసుకొనుటకు ఆమె చేత వాళ్ళు అంగీకరింపజేసిన వృత్తాంతాన్ని నిన్న ఆసాంతం చదువుకున్నాం.
ఏడ్చి రప్పించడం, ఏడిపించి పంపించడం ఎన్ని యుగాలనాటి ఆట కదా వాళ్లకి!
లతలు పన్నడం, వలలు దాచడం,
ప్రాణం నింపడం, పిట్టలై ఎగిరాక గురిచూసి పడగొట్టడం
ఏ జన్మలోనో వంటబట్టిన కిటుకులు.

సుదీర్ఘ కావ్యాల, ఆకర్ణాంత నేత్రాల, కనకమయచేలాంచలాల చాటుని జీర్ణదేహాలు,
మానని గాయాల, ఆగని స్రావాల, ఆరని దుఃఖాల వెనక నదీమూలాలు.
ఇదిలా ఉండగా…
పూరేకు మబ్బులు ఉప్పుటేళ్లపై వర్షించాక,
ఎగిరిపోయిన పావురాల గుర్తుగా రాలిన ఈకలు మాత్రం మిగిలిపోయాక,
అమ్మ మీద ఒట్టేసి వాళ్ళంతా కలిసి ఆమెకి చెప్పిన ఒకేఒక అబద్ధం;
పసిపిల్లలకి ఎప్పటికీ తెలీకూడని పరమ రహస్యం.

పుప్పొడిని రంపపు పొట్టుగా
మంచుపొడిని ఇనపరజనుగా
మంత్రిస్తూ ఊరినుండి ఊరికి తిరుగుతుంది;
చెప్పాల్సిన కథొకటి మిగిలిపోబట్టి కానీ,
ఇంకా ఈలోకం తో ఆమెకేం పనుందని?

 
 

Painting: Rita Canino