కథ

ఆరోమలె

ఆగస్ట్ 2016

క్రిస్మస్‌రాగానే తను గుర్తొస్తుంది. ఆరోమలె! ఆమెకు నేను పెట్టుకున్న ముద్దుపేరు. నేనలా పిలిచినప్పుడల్లా నిప్పురవ్వలాంటిదో, మంచుపువ్వులాంటిదో చిర్నవ్వొకటి తన పెదాలమీదుగా రాలి కిందపడేది. తను మా స్కూల్లోకి అప్పుడెప్పుడో వచ్చిన కేరళ టీచర్. అవును! అప్పుడెప్పుడో, జీవితం మొదలయినప్పటిది తన పరిచయం. ఇప్పుడది స్నేహమో, ప్రేమో, మోహమో చెప్పమంటే చెప్పలేను. ఆమె గుర్తొస్తే మాత్రం ఏడుపాగదు.

అగ్రకులాలకీ, నిమ్నకులాలకీ, క్యాథలిక్స్‌కీ, ప్రొటెస్టెంట్స్ కీ తేడా తెలియని రోజుల్లో; ఇజాలు-నిజాలు నన్ను ప్రభావితం చెయ్యలేని రోజుల్లో,  ప్రిన్సిపాల్ నాన్నగారి సోషల్ క్లాస్‌లకు పూర్తిగా నేనింకా బలి కాని రోజుల్లో; నడుము కనపడినందుకు పరికిణీలను మెచ్చుకొని, నవ్వు దాచేస్తున్నందుకు బురఖాలని తిట్టుకుంటూ, చేతిలో శిలువతో నడిచే అమ్మాయిలకి చెయ్యేసుకొని నడవడం నేర్పిస్తున్నట్టు కలలుగనే రోజుల్లో  మొదటిసారి చూసానామెను. ‘ఆమెన్!’ ఎవరన్నారోగానీ, అదే ఆమెను చూస్తూ నేను విన్న మొదటి శబ్దం. మా క్లాస్మేట్స్ తో  కలిసి, గంగిరెద్దుల్లాగ ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ,  సైకిల్ మీద ఊరంతా తిరిగిన రోజుల్లో కూడా, ఏ అమ్మాయిపై కూడా నేను అంత మనసు పారేసుకోలేదు. సినిమాటిక్‌గా ఉంటే ఉండొచ్చుగాని, తనొచ్చాక ఆకలి తగ్గిపోయింది. తనొచ్చాక ప్రపంచమంతా కొత్తగా కనిపించింది. మేఘాల మించు ధవళకాంతితో ఆకాశాన్ని పోగులు చేసి నేసిన ఆమె తెల్లని గౌను, చంద్రుడు లేక బోసిపోయినట్టుండే ఆమె నుదురు, వెలుగులు దోబూచులాడే చూపు, పొదుపుగా మాట్లాడే పెదాలు, చైత్రపు మేను, వర్షపు ఎద…ఛ! ఇప్పుడు పోయెటిక్‌గా ఎంత ట్రై చేసినా అదోలాంటి ఇన్స్టింక్ట్ ఆపేస్తుందిగానీ, ఆమె అందంలో అణువంత కూడా అక్షరాల్లో పలకట్లేదు.

ఆమె రాకముందు జీవితం మరోలా గడిచేది. నిర్భయంగా, నిజాయితీగా, యవ్వనం సోకితే వచ్చే చిన్నిచిన్ని సంతోషాలేంటోకూడా తెలీనంత అమాయకంగా, ఏదోలా గడిచేది. ఆమె రావడం, నాలో మార్పు రావడం ఒకేసారి జరిగాయో;  ఆమెను చూసాకే నేను మారానో తెలీదు. అప్పటివరకూ సూరీడు తీన్మార్‌ వేసి పిలిచేదాకా నిద్ర లేవని నేను, సెలవులకి బద్దకాన్ని బహుమానంగా ఇచ్చే నేను, ఆ రోజుల సాక్షిగా మాయమయ్యాను. ఆమెను చూడాలని పొద్దున లేవడం, తోటలో కూరగాయలు కోసి తీసుకెళ్లడం, ఆమెకు అందివ్వడం, తను ప్రేమగా ఇచ్చే, చిత్రవిచిత్రంగా రుచించే మళయాళీ తేనేటిని గుటకలేస్తూ ఎంతగానో ఆస్వాదిస్తునట్టు నటించడం, అర్థం కాని భాషలో ఆమె చేసే ప్రార్థన వింటూ తప్పులన్నిటినీ క్షమించేయడం, నన్నూ క్షమించమని అడిగేయటం నా దినచర్య.

2

          మొదటిరోజు చర్చ్ దగ్గరే చూశానామెను. ఆ రోజు ఆదివారం. నాన్న పొద్దున్నే దింపేసి వచ్చాడట అక్కడ. తిరిగి తీస్కురావడానికి వెళ్లాన్నేను. అంతమంది మా వూరి జనాల మధ్యలో ఆమెను గుర్తుపట్టడం నాకేం కష్టం కాలేదు. ఆమెకు నేనెవరో, ఎందుకొచ్చానో చెప్పడం మాత్రం కొంచెం కష్టమైంది. ఇద్దరం వచ్చీరానీ ఇంగ్లీషులో పరిచయాలు చేసుకుంటూ, ఏదేదో మాట్లాడుకుంటూ ఇంటికి చేరాం. ప్రిన్సిపాల్‌గారి అబ్బాయిననీ,  వేసవి సెలవులకి వచ్చా అనీ,  ఈ ఊరు చాలా బాగుంటదనీ; అన్నం తినేప్పుడు కూడా, చదువురాని మా అమ్మకి నా ప్రావీణ్యం తెలియజేయాలని అక్కరున్నవీ అక్కర్లేనివీ, ఇంకొన్ని ఇంగ్లీషు ముక్కలు దంచడం, నమలడం, మింగడం పనిలో పనిగా జరిగిపోయింది. అమ్మా, నేనూ, తనూ ముగ్గురం; తనకోసం కిరాయికి తీసుకున్న రూం వైపు అడుగులేసాం. ఇంట్లో తిన్న ప్లేట్ తీయని నేను, బ్యాగులు మోస్తూ సహాయం చెయ్యడం నాకైతే భిన్నంగా తోచిందిగానీ, అమ్మకి తేడాగా ఏం తోచలేదు.

ఇంతకుముందే చెప్పినట్టు; ఆమెను చూడాలని పొద్దున లేవడం, తోటలో కూరగాయలు కోసి తీసుకెళ్లడం, ఆమెకు అందివ్వడం, తను ప్రేమగా ఇచ్చే చిత్రవిచిత్రంగా రుచించే మళయాళీ తేనేటిని కష్టంగా గుటకలేస్తూ – ఎంతగానో ఆస్వాదిస్తునట్టు నటించడం, అర్థంకాని భాషలో ఆమె చేసే ప్రార్థన వింటూ తప్పులన్నిటిని క్షమించేయడం, నన్నూ క్షమించమని అడిగేయటం నా దినచర్య. ఆమె ముస్తాబయ్యేలోపు నేను కూడా రెడీ అయిపోయేవాణ్ణి. మొదటిరోజు ఆమె చేసిన పామాయిల్ బ్రేక్‌ఫాస్ట్ తిన్న అనుభవం కొద్దీ మళ్లీ ఎప్పుడూ పొద్దుటిపూట ఆ సాహసం చేయలేదు. ఇంట్లోనే త్వరత్వరగా రెండు చపాతీలు తినేసేవాణ్ణి. మధ్యమధ్యలో ఆకలేస్తుందని అమ్మకి అబద్ధం చెప్పి, ఆమెకోసమని ఇంకొన్ని చపాతీలు టిఫిన్‌బాక్స్ లో  పట్టుకొని ఆమెను పిలవడానికి వెళ్లేవాణ్ణి. ఇద్దరం కలిసి మా వూర్లో జనాలకీ, మా వూరి కంకర రోడ్లకీ సైతం కన్నుకుట్టేలా చెట్టపట్టాలేసుకుని బడిదాక నడిచేవాళ్లం. ఆపై ఇద్దరం కలిసి స్కూల్ బస్సులో చుట్టుపక్కల ఊర్లకి కాన్వాసింగ్‌కి వెళ్లేవాళ్లం. ఎంత దిష్టి సోకిందో ఇప్పుడు తెలిసొస్తోంది. కానీ, ఏం లాభం? పోన్లే!

ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్‌కి అడ్మిషన్స్ సంపాదించడం మా డ్యూటీ. ఖాళీ ఖాళీ బస్సులో,  పచ్చని పొలాల మధ్యలోంచి,  పైర గాల్లోంచి; సాగిపోతూ, దారులనిండా ప్రేమలో పడిపోవడం మా విధో, కర్మో, ప్రాప్తమో తెలీదు. మధ్యాహ్నంకల్లా రోజూ ఒకటో రెండో కొత్త ఊర్లకి వెళ్లడం, నేను ఇల్లిల్లూ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ నన్ను పరిచయం చేసుకోవడం, నాతోపాటే తనూ వచ్చి చిన్నపిల్లలని దగ్గరికి పిలిచి “What is your name? Which class are you studying?” లాంటి కష్టమైన ఇంగ్లీషు ప్రశ్నలేసి వాళ్లని బెదరగొట్టడం, కలలో కూడా నా శీలాన్నీ, కార్యదీక్షతని అనుమానించలేని మా డ్రైవరు, మేమెప్పుడు ముగిస్తే అప్పుడు బస్సు మలుపుకుందామా అన్నట్టు ఎదురుచూడటం; వారం రోజులుగా ఇదే రొటీన్. ఎండాకాలమే అయినా పల్లెజనాలకి పని తప్పకనేమో, చాలా గడపలు తాళంవేసి ఎదురొచ్చేవి. మా రాకకి గుర్తుగా రెండు కరపత్రాలు ఆ తలుపుల సందుల్లో సేదతీరేవి. పాకవేసిన పూరిళ్లన్నీ నేనామెను వెనకనుండి ముద్దుపెట్టుకోవడానికనీ, పరిచి ఉన్న ఎండుగడ్డి కాసేపలా కునుకు తీయడానికని అప్పుడప్పుడు అనిపించేది. కానీ, చాలాసార్లు అనుకోవడం దగ్గరే ఆగిపోయాను. ఆరోమలె చురుకైన చూపంటే నాకిప్పటికీ భయమే!

మళ్లీ ఆదివారం వచ్చేసరికి సినిమాల్లో విలన్‌లా ఇంకో కొత్త క్యారక్టర్ ఎంట్రీ ఇచ్చింది. నాకు ఒకరోజు ముందే తెలుసు, కొత్త క్యారక్టర్ రాబోతుందని. నాన్న రాత్రే చెప్పాడు. ‘మనకి మొత్తం నలుగురైనా కేరళ టీచర్స్ కావాలి నాన్నా!  రేపు ఇంకో మేడం వస్తుంది. ప్రస్తుతానికి మీరు ముగ్గురు మేనేజ్ చెయ్యండి. ఇంకో ఇద్దరికోసం వెతుకుదాం,’ అని, కాస్త ఆందోళనగా…

“ఏం? ఇంటర్, డిగ్రీలు చదివిన వాళ్లు ఇక్కడెవరు దొర్కట్లేదనా మనకీ దిగుమతులు? వీళ్లకి తెలుగురాక ఇంగ్లీషులో మాట్లాడ్తారు ఇక్కడికొచ్చి,” ఇంకా ఏదేదో అనబోతూ ఎందుకో తను గుర్తొచ్చి ఆగిపోయాను. ఏదో అలజడి. రేపట్నుండి ఆమె పక్కన కూర్చునేది నేను కాదు. ఆమె దగ్గరికెళ్లి అదీ ఇదీ అడిగేయడమూ కుదరదు – ఇవే రెండు విషయాలు సుడులు తిరుగుతున్నాయ్ మనసులో.

ఆదివారం తెలవారుతుండగానే ఆ శాల్తీ వచ్చేసింది. రిసీవ్ చేస్కోవడానికి నేనూ, నాన్నా వెళ్లాం. వచ్చీరాగానే ఆ ప్రార్థనైతే మానలేదు. తర్వాత తననీ, కొత్త శాల్తీని నేనే చర్చికి  తీస్కెళ్లాను.వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే దిగులుదిగులుగా అనిపించింది. అదే రోజు సాయంత్రం, కాలేజీ రేపట్నుండి రీ ఓపెన్ అని ఫోన్‌కాల్ కూడా. బహుశా సిన్మా కష్టాలని వీటినే అంటారు కాబోలు. ఎల్లుండికల్లా జెండా ఎత్తేయాలని నాన్న ఆర్డర్‌వేసాడు. అమ్మ బట్టలన్నీ ఉతికేసింది.

మర్నాడు కాన్వాసింగ్‌కి  వెళ్లాం. ఇద్దరిలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తెలుస్తూనే ఉంది. నాతో మానేసి ఆమె తనతో మాట్లాడ్తూ ఉండిపోవడం, నాకు ఇంట్రెస్టింగ్‌గా లేక డ్రైవర్ వెనకసీట్లో కూర్చోవడం, అప్పుడప్పుడు ఇద్దరం ఒకర్నొకరు చూసుకుంటూ పరిచయస్తుల్లాగే నవ్వుకోవడం, ఏదో వెలితి ఆవహించడం; అన్నీ ఒక సీక్వెన్స్ లో జరిగిపోయాయి. రేపు తిరిగెళ్లడానికి ముందే తనకేదో ఒకటి చెప్పేయాలని ఏదో ఆతృత. వారం రోజుల్లో తనకి నేర్పిన కొద్దో, గొప్పో తెలుగు కాస్త పనికొచ్చేలాగే ఉంది.  కానీ, ఏం చెప్పాలో నాకే సరిగా తెలియట్లే. కనీసం ఇష్టం అని చెప్పడానికి ధైర్యం సరిపోవట్లే.

ఇల్లిల్లూ తిరుగుతుంటే ఎవరో ఒక ముసలామె, మొన్నొకసారి  మమ్మల్నిద్దర్నీ పెళ్లి పత్రిక ఇయ్యడానికి వచ్చినారా బిడ్డా! అని అడగటం, నేను తనకది చెప్పి ఇద్దరం నవ్వుకోవటం గుర్తుకొస్తున్నాయ్. అదే రోజు చేతిపై ముద్దుపెట్టుకున్నా కూడా నన్నేమీ అనలేదు. నన్నేమనకపోవడం తప్ప నా దగ్గర తనకి నా మీదున్న ఇష్టానికి సాక్ష్యాలేం లేవు. అది ఉద్యోగ భయమనో, ఊరికే వదిలేసిందనో అనుకోవడానికీ వీల్లేదు.

తిరిగొచ్చేటప్పుడు తనకి దగ్గరగా చేరి కూర్చున్నాను. కొత్తశాల్తీ, ఆరోమలె నా గురించే ఏదో మాట్లాడుకున్నారు. కొత్తశాల్తీ నా తలనిమిరి చిర్నవ్వొకటి నవ్విందిగాని అర్థం కాలేదు. కొత్తశాల్తీ అంటే భయం మాత్రం తగ్గింది. చెప్పాలని దాచుకున్న మాటలన్నీ బస్సు వెనకాలే, ఇంకా వేగంగా పరుగెత్తుతున్నాయ్.

డ్రైవర్‌కి చెప్పి, చపాతీలు తిందామని కాలువదగ్గర బస్సు ఆపించినపుడు; కాళ్లూ చేతులు కడుక్కోవాలని డ్రైవరూ, నీళ్లని చూసిన ఆనందంలో కొత్తశాల్తీ నీళ్లలోకి దిగారు. నేనూ, తనూ చెట్టు కింద కూర్చున్నాం. చపాతీని తుంచి నోట్లో పెట్టుకోబోతూ; పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపలేని చూపుతో, ఆమెవైపు చూసాన్నేను. ఆమెకి అర్థమవుతుందని చిన్న ఆశ. ఆమెకేదీ అర్థం కాలేదు.   నాక్కూడా పూర్తిగా ధైర్యం రాలేదు. అడగకుండానే ఆమె తినిపించడమొక్కటి జరిగింది. అంతా నా అదృష్టమే!

ఆ రోజు రాత్రికూడా- తనదగ్గరికి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకొని రావాలని చాలా అనిపించింది. ఏం లాభం! తెలియనితనమో, పిరికితనమో ఏదో ఆవహించింది. తనూ రాలేదు. నేనూ పోలేదు. చందమామ రాక, చుక్కలు రాలక రాత్రి ఒంటరిగా గడిచిపోయింది. పడమటి పొద్దెనక నడిచిపోయింది. తెల్లవారంగానే నా ప్రయాణం మొదలు. హైదరాబాద్ వెళ్తున్నట్టు ఒక్కమాటైనా చెప్పలేదు తనకి.

3

కాలేజి ఉన్న రోజుల్లో కూడా తను చాలా గుర్తొచ్చేది . తనలాగే ఉండే, ఎవర్నైనా చూసిన రోజు అస్సలంటే అస్సలే ఆకలుండేది కాదు. క్రొవ్వొత్తులు వెలిగించుకొని కవిత్వంలాంటిదేదో రాయడం బహుశా అప్పుడే అలవాటైంది. తను క్యాథలిక్ అనీ, వాళ్ల నియమాలు కఠినంగా ఉంటాయనీ, నీతో పెళ్లికి ఒప్పుకోరనీ; అన్నీ నాకు నేనే చెప్పుకునేవాణ్ణి. ఎన్నడూలేంది, ఆదివారమొస్తే St. Barabara Church కి వెళ్లి ప్రార్థనలో కూర్చోవడం, ప్రార్థన ముగిసాక కాఫీ గుటకలేయడం, ఆ యేడాదిలోనే అలవాటయ్యాయ్.

దసరా సెలవులకి ఊరొచ్చాను. చేతిలో సెల్‌యేరు ప్రవహించని రోజులవి. ఆమెకు నేనొస్తున్నట్టు చెప్పడం వీలుపడలేదు. ఇంటికొచ్చాకే తెలిసింది, ఆమె సెలవులకి కేరళకి వెళ్లిపోయిందని…ఎప్పటిలాగే ఈ సారి కూడా సద్దులకాడ అమ్మాయిలకి సైట్ కొడ్తూ, జమ్మికాడి పాలపిట్టకు రాగాలు నేర్పుతూ గడిపేసాను కానీ, ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ వెంటాడుతూనే ఉంది. మళ్లీ రెండు నెలలు హైదరాబాధలోనే.

***

          ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నవంబర్‌కే అయిపోయినా, చివరిసారి దేవుడికిచ్చిన రెండు సబ్జెక్టులు సప్లిమెంటరీలో రాసి రావడానికి డిసెంబర్‌లో సగం అయిపోయింది. ఆ వూరూ, ఈ వూరూ తిరుగుకుంటూ మూడోవారానికల్లా ఇంటికి చేరుకున్నాను.

నేను ప్రపంచాన్ని మర్చిపోవడం ఇష్టంలేకేనేమో, వచ్చీరాగానే ఏదో ఒక క్లాసులోకి తోసి పాఠాలు చెప్పించడం నాన్నకి అలవాటు. ఎప్పటిలాగే పదోతరగతివైపు ముందడుగేసాను. త్రికోణమితిలో ఫైవ్‌మార్క్స్ క్వొశ్చెన్‌కి క్లాస్ తీస్కోవాలి. ఎత్తులు-దూరాలు మొదలుపెట్టగానే దూరంగా ఉన్న LKG క్లాసులో నిల్చొని తనక్కూడా తెలియని కొత్తకోణంలోంచి చూపొకటి విసిరింది ఆరోమలె. దెబ్బకి బోర్డుమీది సైన్ (sinθ) కాస్తా సిన్ లా కనిపించడం షురూ అయింది.

ఏవేవో ఆలోచనలు బోర్డునిండా. అవును! చెప్పి ఉండాల్సింది. తనక్కూడ ప్రేమేనని ఆమె చెప్పలేకపోతే మాత్రం, నాకేమైంది? నేనైనా వెళ్లేముందు చెప్పి వెళ్లాల్సింది. నిజంగా తనకి నేనంటే ప్రేమేనా?  ఏమో! తను కూడా,  నాలాగే గుర్తొచ్చినప్పుడల్లా అన్నం తినడం మానేసి అక్షరాలని పోగుచేసుకుందేమో! తనూ,  నాలాగే ఏడ్చుకుంటూ యేసుప్రభువుని ప్రార్థించిందేమో! పరిధిలేని వృత్తాల్లో ఆలోచనలన్నీ ఆమె చుట్టే.

పిల్లల ముఖాల్లో మునుపటి నవ్వుల్లేవు. సీరియస్ గా ఉన్నానని గుర్తొచ్చి సర్దుకునేలోపు ఇంటర్‌వెల్ కొట్టేసారు. టీ కోసం తనూ, తనకోసం నేనూ ఆఫీస్ రూం వైపుగా అడుగులేసాం.

4

          ఆఫీస్‌లోకి పోగానే అందరూ ఎప్పుడొచ్చావనో, ఎన్ని రోజులుంటావనో, ఏంటిప్పుడు చదివేదనో; తరతరాలుగా వినబడే అవే సోది ప్రశ్నలు నాపైన విసరడం, నేను ఒక్కొక్కరికి మర్యాదగా సమాధానాలు చెపుతూ ఆమె నావైపు చూస్తుందేమో అని ఆశగా ఎదురుచూడటం, ఆమె డస్టర్ దులుపుకొని ఏమీ ఎరగనట్టు క్లాసులోకి వెళ్లిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎప్పటిలాగే నాన్నకి చెప్పలేని సూచనలు, సలహాలు; మా స్టాఫ్ ధైర్యంగా నా నెత్తిపై రుద్దడం కూడా స్టార్ట్ అయిపోయింది.

మాటల్లోమాటగా తెలుసుకున్నదేమంటే రావాల్సిన ఇంకో ఇద్దరు మలయాళీలు రాలేదనీ; మావాళ్లలోనే  నలుగుర్ని  ప్రమోట్‌ చేసి,  వీళ్లిద్దరితోనే ఇంగ్లీష్‌మీడియంని నెట్టుకొస్తున్నారనీ; ఆరోమలె, కొత్తశాల్తీ దేనికో బాగా గొడవపడ్డారనీ; అదే కోపంతో కొత్తశాల్తీ క్రిస్‌మస్ సెలవులు అప్లై చేసుకొని ఇంటికి దొబ్బేసిందనీ; ‘ఎవరో ఒక్కరే ఉండాలనీ, దీన్ని తీసేస్తే తప్ప మళ్లీ రాను, ఎవర్ని రానివ్వను…’ లాంటి వార్నింగ్‌ ఏదో ఇచ్చిందనీ, సిలబస్ పెండింగ్‌లో ఉందనీ.

అడగాల్సిన పనే లేదనుకో. మా తెలుగు మీడియం పిన్నిగారు చెప్తారివన్నీను. ఇప్పటికే అర్థమయిపోయిందనుకుంటా! ఆమె ఓ ఆడరేడియో. ఇంతకముందెక్కడో విన్నాను. ఫుల్‌గా మందుకొట్టాకకూడా మగాళ్లు చెప్పలేని విషయాలు ఒకే ఒక్క టీ కొడ్తే చెప్పేస్తారంట ఆడవాళ్లు. అందరి సంగతేమోగాని మా పిన్నిగారి విషయంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం. ఈమె కొత్తలో వచ్చినప్పుడు, ఈ నోటిని చూసి భయపడే పిన్నిగారని నేను ఆమెతో వరస కలుపుకుంది. అమ్మో! లేకపోతేనా?

“పోతే పోయింది లెండి. రాకుండా ఎక్కడకు పోతుంది. వీళ్లకంత సీన్‌లేదు,”  డైలాగులైతే చెప్తున్నాగానీ మనసులో మాత్రం కాన్ఫిడెన్స్ లేదు. ఎలాగోలా  పిన్నిగారిని వదిలించుకొని క్లాసులోకి వెళ్లిపోయాను. తనొదిలేసిన LKGకే ముందు వెళ్లి ఆమె చిరుకోపానికి కందిపోయిన చిన్నారుల ముఖాల్లోకి తేరిపారా చూస్తున్నాను. కథేదన్నా చెప్పాలి వీళ్లకి ఓరల్‌గా. ఆపై లంచ్‌బెల్‌దాకా ఏదో ఒకటి ఆడించి, ఆయాని పిలిచి అన్నానికి కూర్చోబెట్టాలి. వీలైనంత నవ్విస్తూనే అక్కడోసారి, ఇక్కడోసారి చెయ్యిచాపాలి. వాళ్ల లేత చేతుల్లో ఒదగని అన్నం మెతుకుల్ని పట్టిపట్టి చూడాలి. ఏడ్చేవాళ్లకి తినిపించాలి. అంతా అయిపోయాక ట్యాంక్ దగ్గరికి తీస్కెళ్లి చేతులు కడగాలి.

నేనూ లేని రోజుల్లో ఎవరు చేస్తారో ఇవన్నీ? ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజెందుకో అడగాలనిపించి అడిగేసా పిల్లల్ని. అవును! తనే. నా ఆరోమలె. నా ప్రతి ఇష్టాన్నీ ఇష్టంగా ప్రేమించే ఆరోమలె. తనే చేస్తుందట ఇవన్నీ రోజూ. ఈ రోజు కావాలనే ఈ పని నాకొదిలేసిపోయినట్టుంది. మధ్యాహ్నం తను రాలేదు. రూం లో ఒక్కతే కూర్చొని ఏడ్చేస్తుందో, నన్నే కావాలని ఏడ్పిస్తుందో…నాకేదీ అర్థం కాలేదు. మనసైతే మనసులో లేదు.

అవకాశం ఎప్పుడొస్తుందా అని ఏదో ఆలోచిస్తుండగానే, తనకి కాస్త ఫీవరిష్‌గా ఉందని, ఈ టిఫిన్‌బాక్స్ తనకిచ్చి రమ్మని అమ్మమాట. బాధపడాలో, సంతోషపడాలో అర్థం కాలేదు. అమ్మ మాట చల్లన. స్నానం చేసి బయల్దేరాను, ఆరోమలె దగ్గరికి. ఏం జరుగుతుందో ఊహించలేని అశక్తతతో. నేను కబుర్లు చెప్తూ ఆలస్యం చేస్తే అమ్మ నాకోసం ఎవరో ఒకర్ని పంపిస్తుందని కూడా గుర్తుచేసుకున్నా.

***

నన్ను చూడగానే లేచి కూర్చుంది ఆరోమలె. చనువుకొద్దీ నేనెళ్లి పక్కనే కూర్చున్నాను. “ఆరోమలె! How are you feeling?” తన భుజాలు పట్టి ఊపుతూ నేను. “Don’t call me ఆరోమలె,” ఓ కఠినమైన సమాధానం అటుపక్కనుండి.

తను ఏం మాట్లాడకున్నా నాకు మాత్రమే అర్థమవుతుంది ప్రపంచంలో.  తన భాషేంటో, తన కలలేంటో, తన ప్రతీ శ్వాసా నాకేదో చెప్తూనే ఉంది. మన్నింపులు ఒదగని గాలేదో ఇద్దరి మధ్యలో వీస్తూనే  ఉంది. మృదువుగా ఆమె చేతులు పట్టుకున్నా.  మునుపటి మోహమేదీ లేదు ఇద్దరిలో. కళ్లలోకి చూసుకునేంత ధైర్యం రాలేదు. తనకి తినిపించాలని, నుదుటిపై ముద్దిచ్చిపోవాలని అర్థమవుతోంది.  కానీ,  సినిమా కాదని, ఎప్పుడెవరొచ్చి  పిలిచేది తెలీదని, అవకాశమే లేదని కూడా అంతే స్పష్టంగా…

“I’m leaving ఆరోమలె…” ఆ ఒక్కమాట చెప్పాను. తనలో ఇంకా మౌనమే. మళ్లీ అలాగే పిలిచినందుకు కోపం నిండిన చూపులు కూడా. ట్యాబ్లెట్స్ వేస్కొమ్మని చెప్పడం కూడా మర్చిపోయాను.

5

జీవితంలో మునెపెన్నడూ చూడని ఓ సుదీర్ఘమైన రాత్రిని అనుభవించాక, మళ్లీ ఉదయం చూసా ఆమెను. ఆమె అడుగుల చప్పుడు గుండెకి తెలిసిపోయింది. అసలీ మళయాళీలకి చీర కట్టుకోవడం ఎక్కడ నేర్పుతారో. ఆ ఎక్స్ ట్రా పిన్, ప్రవాహంలాంటి యవ్వనంపై కొంగుని వదిలేసే తీరు. ఆహ్! నిద్రవీడని కన్నులమీదైనా నీళ్లుజల్లుతాయ్. మర్చిపోయా చెప్పడం.  అప్పటికీ ఇప్పటికీ మా నాన్న స్కూల్లో అమలుచేసే డిసిప్లిన్స్ లో  నాకన్నిటికంటే ఇష్టమైందిదే. లేడీ టీచర్లకుండే శారీ కంపల్షన్. తిట్టొద్దు!

ఆమె అమ్మతో ఏదో మాట్లాడి వెళ్లిపోయాక నన్నూ, మా స్కూల్‌మేట్స్ ఎవరో వచ్చి పిలుచుకెళ్లారు. అక్కడా ఇక్కడ తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రైంది. దాదాపుగా ఇంకో రెండున్నర రోజులు దేవీ కటాక్షంకోసం వేచిచూస్తుంటేనే గడిచిపోయాయ్. మళ్లీ ఒక సుదీర్ఘమైన రాత్రి రాబోతుందని అప్పటి వరకు తెలీదు.

డిసెంబర్ 25, రాత్రి 10.30. ఎర్లీగా పడుకున్న నన్ను, లేట్‌గా ఇంటికి వచ్చిన నాన్న ఏదో పనుందంటూ నిద్ర లేపాడు. ఆరోమలెని చర్చికి తీస్కెళ్లాలట. ఈ అర్ధరాత్రి, మా స్కూల్‌బస్సులో. ఈ సారి తీస్కెళ్లాల్సింది మా వూర్లో ఉన్న చర్చికి  కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే CSI చర్చికి. అప్పటికీ ఈ క్యాథలిక్, పాంథకోస్తలాంటి పదాల మీదా; వెళ్లిపోయిన కొత్తశాల్తీ రెండో కేటగిరీ అన్న విషయం మీదా – చాలానే రీసెర్చ్ చేసేయడంవల్ల, నాన్నేం చెప్తున్నాడో త్వరగానే అర్థమయిపోయింది. డ్రైవర్‌, తనూ  రెడీగానే ఉన్నారు. నాదే లేట్. ఏదో అయిష్టంగా ఉన్నట్టే ఫోజ్ కొడ్తూ బస్సెక్కి కూర్చున్నా. బస్ కదిలింది. మళ్లీ చాలా చాలా రోజులకి, చల్లటి గాలుల మధ్య, వాటి గుసగుసల శబ్దాల మధ్య, వణికించే చలిలో – ఆరోమలెతో నేను. నా ఆనందానికి అవధుల్లేవు.

“కోపం పోయిందా?” నిన్నంతా తనకి కనపడకుండా తిరిగేసానన్న ధైర్యంతో నేను.

చేతిలో బైబిల్, మనసులో ప్రార్థన, ముట్టుకుంటే కాల్చేసేంత చురుకైన చూపుల్తో, తెల్లటి వెన్నెలకి సొగసులుపోవడం నేర్పిస్తూ తెల్లటి చీరలో, నా ఆరోమలె.

“I’m not angry. Why should I get angry on you? I don’t know who you are” ముందే ప్రిపేర్ చేసుకున్న జవాబుని గట్టిగా తగిలేలా విసిరేసింది.

***

          CSI చర్చ్ దగ్గర ఆమెను దింపేసాక, ఆమె ప్రార్థన ముగిసేంతలో; నేనూ, డ్రైవరూ కబుర్లు చెప్పుకుంటూ కాలువదాకా నడిచెళ్లాo. బయటున్న చలికి తట్టుకోలేక ఆమె తిరిగొచ్చేలోపే మళ్లీ బస్సెక్కేసి తలుపులేసుకున్నాం.

ఆమె వచ్చాక, ధైర్యం చేసి మళ్లీ తన పక్కనే కూర్చున్నా. ఇప్పుడు పాపసంకీర్తనలు నా వంతు.

Merry Christmas Aaromale! I’m sorry for my absence. It’s not at all intentional. I’m still the same for you Aaromale! I’m the same stupid fellow who waited for your smiles and wandered for your mercy. ఆరోమలె! ఎనికి నిన్నె ఒత్తిరి ఇష్టమాన.

తన మొహంలో ఏదో ప్లెజెంట్ ఫీలింగ్. ఒక చిర్నవ్వు. నేనూ వచ్చీరాని మళయాళం ముక్కలు మాట్లాడినప్పుడల్లా తనలో విరబూసే అదే నవ్వు. దాన్నాపుకొని వెంటనే “Anything more Mr. Poet?” వ్యంగ్యంగా కవ్విస్తోంది నన్ను ఎందుకో?

తను నవ్వు చూసాక నా గెలుపు నాకర్థమయిపోయింది. Nothing Aaromale! Absolutely Nothing. If you are OK with it.  నెంగల్ రెండుం ఒళిచ్చోడు. That is the only thing left for me to speak now. రెట్టించిన వ్యంగ్యంతో నేను.

ఆమెలో కోపం మాయమైంది. అనుకున్నది చేసేయడానికి కారణాలవసరం లేకపోవడేమేనేమో ఆడతనమంటే.  ‘స్టుపిడ్ ఫెల్లో’ అంటూ ఒక నవ్వు. విండోస్ క్లోజ్ చేసి ఉన్నందుకేమో ఆమె నవ్వులు బస్సునిండా ప్రతిధ్వనించాయ్. ఆమె చేత్తో, నా చేయి అందంగా కలిసిపోయింది. మా ఇద్దరి ఆఖరి ప్రయాణం అదేనని తెలియకుండానే ఆమె భుజాలపై నా తల వాలిపోయింది.ఆమె ముద్దుతో చెంపలకి ఎరుపొచ్చింది.

6

ఉదయం ఎప్పట్లాగే తెల్లారింది.రాత్రి జరిగిందేదీ గుర్తులేదు. డ్రైవర్ మమ్మల్ని స్కూల్ దగ్గర వదిలేసి బస్ పార్క్ చేసి వెళ్లిపోవడం, చీకటి వీధుల్లో మేం నడుచుకుంటూ ఇంటికిపోవడం, ఇంటికి వచ్చేసరికి అమ్మా నాన్నా నిదరోవడం, రవ్వంతైనా అలికిడి చేయకుండా తన రూం దాకా నేను తోడెళ్లడం, చేతుల్లో నా చేయి కలిసిపోవడం, కొవ్వొత్తి వెలుగులో ఆమెని హత్తుకోవడం, ఏదీ అప్పటికింకా గుర్తు రాలేదు. ఎనిమిదింటికనుకుంటా తను స్కూల్‌కి వెళ్లబోతూ బాక్స్ రిటర్న్ చేసే నెపంతో ఇంటికొచ్చి అమ్మకేవో కబుర్లు చెప్తోంది. తినేదేదోచేసి తీస్కొచ్చింది కూడా!

ఏమయిందో మా ఇద్దరికీ. తన కళ్లలోకి చూద్దామంటే కొంచెం సిగ్గుగా, కొంచెం భయంగా, ఏదో గమ్మత్తైన భావన. తనుకూడా నేరుగా చూడలేకపోతోంది.

ఆ రోజు స్కూల్ పనిమీద సిటీకి వెళ్లాల్సి రావడం, ఆమె నాకోసం వెతుకుతున్నట్టు ఒకటే ఊహ ప్రయాణమంతా వేధించడం నాకు గుర్తు. వస్తూ వస్తూ ఆమెకోసం కొన్న   న్యూ ఇయర్ డైరీ, చాక్లెట్స్; నాన్నకి కనపడకుండా ఎట్లా దాచాలా అని ఆలోచించింది కూడా గుర్తు.

రాత్రి పదికి ఇంటికొచ్చాను. తిని మంచం మీద వాలేసరికి 11. నిద్రరాక అటు ఇటూ దొర్లుతుంటే 12. ఆమెను చూసొస్తే ఎలా ఉంటుందా అని సందేహిస్తుంటే 1. ఇంకో అరగంట గడిచిందో లేదో ఎన్నడు లేని వింతధైర్యమేదో నాలో ప్రవేశించింది. నిన్న ఇదే సమయానికి ఆమెలో లీనమవడం పదేపదే గుర్తొచ్చి అడుగులు అటువైపుగా పడిపోతున్నాయి.

గోడ దూకడం కొత్తకాదుగానీ, అంత చీకట్లో భయంభయంగా; ఆమె కావాలనే పిచ్చి ఆశతో, ఆమె కూడా నాలాగే మెలకువగా కలలు కంటుందనో, వేచి ఉంటుందనో- ఎనలేని విశ్వాసంతో, అంత చలిలో ఆమె గదిదాకా వెళ్లిపోయాను. వెనకవైపుండే మెట్ల మీద దిగులుగా, నిశ్శబ్దంగా కూర్చున్నాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. మనసంతా ఎలాగో ఉంది. ఉండబుద్ధి కావట్లేదు. వెళ్లిపోవాలనీ లేదు.

గట్టిగా పిలుద్దామంటే ధైర్యం రాక, ఎందుకో ఒకందుకు లేస్తుందనే చిత్రమైన నమ్మకంతో, అనుమానంతో అక్కడే ఒంటరిగా కూర్చున్నాను. నా అదృష్టమో, దురదృష్టమోగాని మా టామీ నాకు తోడుగా వచ్చేసింది, కూనిరాగం తీస్తూ.

దాని కూనిరాగం అరుపులకేనేమో, ఆరోమలె నిద్రలేచింది. పొడుగు చేతుల స్వెట్టర్, బ్లూ కలర్ స్కార్ఫ్, వణికించే చలికి శాలువానుకూడా అడ్డేస్తూ ముడుచుకుపోయిన ఆమె చేతులు, జీసస్ అంటూ కదిలిన పెదాలు, ఎరుపెక్కిన కళ్లు, లోపటికి లాక్కెళ్తూ ఆమె. ఏం మాట్లాడాలో అర్థం కాక నేను.

నన్ను వెంటనే పంపించదని తెలుసు. కోపంగా ఉందని కూడా తెలుసు. తలుపు వేసొస్తుంటే మాత్రం సంతోషమేస్తుంది.

“Why are you here?” ఒక సూటి ప్రశ్న అటునుండి.

తెలీనితనమో,అన్నీ తెలిసినతనమో, ఏమో? ఆమె అడగటంలో తప్పులేదు. తప్పేదన్నా ఉంటే అది నాదే. వెళ్లిపోతున్నట్టు నటిస్తూ ఇటునుండి ఒక sorry, ఒక ఎదురుచూపు.

కొన్ని క్షణాల మౌనం.

“ఆరోమలె! ఎనికి నిన్నె ఒత్తిరి ఇష్టమాన,”  ఆమెని నవ్వించాలని కాదు. అప్రయత్నంగా మళ్లీ ఆ వచ్చీరాని నాల్గు మలయాళం ముక్కలు.

మందలించాలనో, ముద్దుచేయాలనో తెలీదు. తనపై ఉన్న శాలువా తీసి ఇద్దరికీ కప్పేసింది. తన భాషలో ఏదో చెప్పడం మొదలెట్టింది, నాకేదీ అర్థం కాదని తెలిసీ.  తను అలాగ మాట్లాడటం వినలేదెప్పుడూ. తను చెప్పలనుకుంది అంత ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌లో చెప్పలేదని తెలుసు. నాకేదో చెప్పలేకపోతుందనీ, సతమతమవుతోందనీ అర్థమవుతోంది.

ఒక అమాయకపు ముద్దు. ఒక వెచ్చటి కౌగిలింత.

చేతివేళ్ల మాయలో ఇంకొద్దిసేపు. ఆపై మళ్లీ క్షణాల మౌనం. కొవ్వొత్తి వెలుగులో ఆమె పొడవాటి జడకి చిక్కులు తీస్తూ నేను. ఈసారెందుకో ఎందుకో కనీసం నిన్నటంత ధైర్యం కూడా లేదు.

***

ఒక్కసారిగా మా ఏకాంతం ముక్కలైంది. టామీ గట్టిగా అరుపులు మొదలెట్టింది. రాత్రినెవరో కోసుకుపోతున్న చప్పుడు. గీరల్లోంచి, గోడల్లోంచి, నరాల్లోకి, పెదాల్లోకి. రాత్రినెవరో కోసుకుపోతున్న చప్పుడు.

ఎడ్లబండ్లు ఉరుకుతున్నాయ్, మా దుమ్ము రోడ్ల మీద. పక్కవూరి వాళ్లెవ్వరో అడవిలోకి పోయొస్తున్నట్టున్నారు. మా గుండెలు ఇంకా ఇంకా వేగంగా కొట్టుకుంటున్నాయ్. వణుకు వణుకు.  వేళ్లలోంచి వేళ్లలోకి, పెదాల్లోంచి పెదాల్లోకి పాకుతోంది.

టక టక టక టక శబ్దం ఆగిపోయేలోపు  ఇంట్లోకి చేరిపోవాలి. టామీ వీధంతా వినపడేలా గట్టిగట్టిగా అరుస్తోంది. నాన్న నిద్రలేస్తేనో? నేనక్కడ లేకపోవడం చూస్తేనో? నేను తిరిగెళ్లడం ఇంకెవరన్నా చూస్తేనో! పరువు, విలువలు, నువ్వు నమ్మిన సిద్ధాంతాలు. నాన్నా!నాన్నా! అయ్యో ఎన్ని మాటలు పడతావో కదా? నాకు ఎందుకు గుర్తు రాలేదిదంతా?

పరిస్థితి నాకంటే తనకే త్వరగా అర్థమయింది. ఎడ్ల బండి వీధి మలుపు దాటడం కిటికీ దగ్గరుండి చూసొచ్చింది. నుదుటిపై ముద్దుపెట్టి ”నో వన్ విల్ బి అవేక్” అంటూ ముందు తలుపు తీసింది. ఒక్క ఉదుటున అక్కడ్నుండి బయటపడ్డా. వేగంగా ఇంటికి నడుస్తున్నా. టామీ నా వెనకాలే పరుగెత్తుతూ మధ్యమధ్యలో మళ్లీ గట్టిగట్టిగా అరుస్తోంది. ఏదో అలజడి. ఇంటివాకిట్లోకి రాగానే అమ్మ అప్పుడే లైట్ వేయడం గమనించుకొని, కుక్క అరిచినందుకే బయటికొచ్చి చూస్తునట్టు నటించాను. ”ఎవలో కట్టెలకు పోయొస్తున్నరె. ఎడ్లమీదికి ఉరుకుతాంది కుక్క,” అనుకుంటూ అకారణంగా దానిమీద కోపం చూపించి, నా తప్పుని దాచుకుని, భయంభయంగా మంచమెక్కాను. నిదురైతే పట్టనే లేదు.

7

          ఎప్పటిలాగే తెలవారింది. మళ్లా కాస్త పోయెటిగ్గా చెప్పాలంటే, తేలియాడే నిదురమబ్బులు ఆమె రావడం చూసి పక్కకి తప్పుకున్నాయ్. కాంతి ఇంటినిండా పరుచుకుంది.

పొలం కోత కోసే రోజు కావడంతో అమ్మా నాన్నా ఇద్దరూ, పొద్దున ఆరున్నరకే, కూలీల్తో పాటు పొలం దగ్గరికి వెళ్లిపోయారు. ఆరోమలె తలుపు తీసుకొని ఇంట్లోకి రావడం నేను గమనించలేదు. వంటగదిలోకెళ్లి టీ చేయడం మొదలు పెట్టిందని కూడా గమనించలేదు.  నుదుటిపై ముద్దుపెట్టుకుందనీ, నన్నే చూస్తూ కూర్చుందనీ మెల్లిమెల్లిగా అర్థమైంది. లేవగానే అదృష్టదేవత కళ్లముందు నిలుచున్నట్టనిపించింది. అటూ ఇటూ చూసి చేతులు చాచాను. తనకర్థమై – గట్టిగా హత్తుకొని ”ఐ విల్ గెట్ యువర్ టీ” అంటూ టీ గ్లాస్ చేతికిచ్చి పక్కన కూర్చుంది. రెప్పవేయకుండా చూస్తూ, వేళ్లు విరుస్తూ కూర్చోవడంతో ఎందుకో ఆ పొద్దు ఆమె చాలా చాలా నచ్చింది.

పొద్దున్నే మా అమ్మ నాకు టీ ఇచ్చి లేపమనీ, చపాతీలు పెట్టమనీ చెప్పెళ్లిందనీ,  మధ్యాహ్నం ఇద్దరికీ లంచ్ బాక్స్ తనే పంపిస్తానందనీ, ఆరోమలె ఏదో చెపుతూ ఉండగా నా మనసులో రాత్రి జరిగిన ఎపిసోడ్ రీళ్లు తిరుగుతోంది. నేను పరధ్యానంగా ఉన్నందుకేమో, ఆరోమలె చిరు అలకని పెదాల మీద ఒలికిస్తూ “Dont eat me like this”అని హెచ్చిన స్వరంతో కోప్పడ్తూనే, “Go n get ready da. We should be there before prayer” అంటూ లాలించింది. స్నానం చేసి రాగానే ఆమె టవల్‌తో తలని తుడిచీ, నుదుటిపై ముద్దుపెట్టీ, చపాతీలు తినిపించీ, కబుర్లు చెప్పి నవ్వించీ; ఇంకోసారలా రావొద్దంటూ, తనకి రాత్రి సరిగా నిద్రపట్టలేదంటూ మందలించీ, తను నాకెంత స్వంతమో చేతల్తోనే చెప్పుకొచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటామా? ఇంతే ఆనందంగా, ప్రేమగా. ఏమో! ఎప్పుడూ జలపాతంలాగా ఎగిరి దూకే నేను ఎందుకో ఆ క్షణాల్లో ఒక్కమాటా మాట్లాడలేకపోయాను

***

చేతుల్లో చెయ్యి వేస్కొని స్కూల్‌కి నడుస్తున్నప్పుడు, మా తెలుగు మీడియం పిన్ని టిఫిన్ బాక్స్ ఎట్లా తినేదీ, టామీగాడు P.E.T సర్‌ని ఎట్లా ఉరికించిందీ; ఇంకా ఏవేవో గుర్తుచేసుకుంటూ మా తోటి టీచర్స్ మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ పోయాం. ఎంత నవ్వితే అంత ఏడుస్తామని చిన్నప్పుడెవరో చెప్పారు. మా కథలో అయితే అదే జరిగింది చివరికి.

ఆ రోజు ప్రేయర్‌లో, నాన్నెలాగూ చూడలేడన్న ధైర్యంతో, తన పక్కకెళ్లే నిలుచున్నాను. ఇంటర్‌వెల్‌వరకు ఎవరి క్లాసెస్ వాళ్లు చెప్పుకొని థర్డ్  హవర్‌లో ఇద్దరం, LKG, UKG పిల్లల్ని తీసుకొని, ఓరల్ క్లాసెస్ సాకుతో ప్లేగ్రౌండ్‌కి చివర ఉండే చింతచెట్ల దగ్గరికి చేరుకున్నాం. పిల్లలకి ఇంగ్లీషు నేర్పించడం మానేసి పాటలు పాడిస్తూ, డ్రామాలు చేయిస్తూ, ఇది ఇల్లనీ మేము అమ్మానాన్నలమనీ కథలు చెప్పుకున్నాం.

ఎంతోసేపు బతిమాలితే తనో ప్రభువు పాట మొదలెట్టింది. ”పరణ్యాలున్ పరణ్యాలున్ తీరాత్త నన్మగల్,” నాకు ఒక్కముక్క అర్థం కాలేదుగానీ, తను పాడుతుంటే వినడం నాకు ఆనందం. ఇదే పాట అప్పుడెప్పుడో వచ్చిన కొత్తలో ఒకసారి పాడితే  ”నడిపించు నా జీవననావ” అంటూ వెక్కిరించానుగానీ, ఇప్పుడెందుకో తన పాటలో మాధుర్యం నిశ్శబ్ధంగా గుండెల్లోకి ప్రవహిస్తోంది.

ఇద్దరం కలిసి ఒక డ్యూయెట్ ప్రార్థన ఏదన్నా నేర్చుకొని అందరిముందూ పాడాలనిపించేంత పిచ్చి కోరిక కలిగింది, తన పాట వింటుంటే.

***

          మధ్యాహ్నం నాకు సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవబోతోందనీ, ఎల్లుండి వెళ్లిపోవాలనీ చెప్పాను. తనూ సరేనంది. వారానికోసారన్నా మాట్లాడుకోవడానికి వీలుగా ఆదివారం మధ్యాహ్నం పూట స్కూల్ ల్యాండ్ ఫోన్‌దగ్గర వెయిట్ చెయ్యమని చెప్పాను. పేపర్లు దిద్దుకునే సాకేదన్నా చెప్పి, అలా ఉండొచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చాను.

తను నాకంటే జీనియస్. వాళ్లింటి అడ్రస్‌ని Fromలో స్కూల్ అడ్రస్‌ని To లో రాసిన ఖాళీ కవర్లు హ్యాండ్‌బ్యాగ్‌లోంచి తీసిచ్చింది. ముందు నవ్వాను. అలా అయితేనే ఆ ఉత్తరాలు తనకి చేరతాయని నమ్మకం. తన తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

***

సాయంత్రం డ్రిల్‌హవర్ టైంలో దిగింది ఆ కొత్త శాల్తీ. కేరళనుండి తనతోపాటే ఇంకెవడో వచ్చాడు. కొబ్బరిచెట్టులా ఉన్నాడు. వాణ్ణింతకుముందెప్పుడో చూసాన్నేను. అవును! వాడే. ఆ టీచర్స్ బ్రోకర్ గాడు. ’నా ఆరోమలె నాకుండుంటే మీడియేటర్ అనే మర్యాదగానే పిలిచుండేవాణ్ణే,’

కొత్త శాల్తీ (పరిచయం పెద్దగా పెరగనందుకేమో, ఎప్పుడు చూసినా దాన్నలాగే పిలవాలనిపిస్తుంది).  వచ్చీరాగానే తిట్లదండకమేదో చదవడం మొదలెట్టింది. ఆ బ్రోకర్‌కూడా కొత్తశాల్తీకి సపోర్ట్ అంట. పాంథకోస్తనే అంట. ఇంతకుముందే ఇద్దరు బాగా పరిచయమంట. ఆరోమలె చెప్పింది. వాడు ఏదో తిడుతూనే ఉన్నాడు. నా ఇంగ్లీషు ఎందుకూ పనికి రాలేదక్కడ.

చేతుల్తో వరిగొలుసులు కొన్ని ముడులేసుకుంటూ-అమ్మా, నాన్నా తిరిగొస్తున్నారప్పుడు. ఆరోమలె ఏడ్చుకుంటూ వాళ్ల దిక్కుగా పరుగెత్తింది.

ఆ రాత్రంతా ఇద్దరిలో ఎవరుండాలనే దానిమీద పంచాయతీ జరిగింది. అంతా ఏకపక్షమే. నేను కూడా ఏదన్నా మాట్లాడి ఉన్నా బాగుండేది. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ నాన్నకి కోపం వస్తుందో అని మౌనంగా ఉండిపోయా. నాన్నముందు నా పిరికితనమెంతో నాకు మరోసారి బాగా తెలిసొచ్చింది.

***

          పంచాయితీలో ఎవరేం వాదించారోగాని, నా ఆరోమలె బదులు ఇంకో టీచర్ రాబోతోందనీ, తనని వేరే స్కూల్‌కి పంపిస్తాననీ తేల్చాడు బ్రోకర్. అకడమిక్ ఇయర్ లో ఇలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే ఎట్లా? అని కోప్పడ్తూనే, ఇంతకు ముందే వీళ్లిద్దరికీ మంచిగా కలిసుండమని చాలాసార్లు చెప్పిచూసిన అనుభవంతో ఒప్పుకోక తప్పలేదు నాన్నకి.

“I have not done anything worst Sir! మీరు చెపితె చేస్తను. అది ఎందుకు సెపుతుంది నాకు పని. Who is she to order me?” ఆరోమలె దైన్యం గుండెల్ని మెత్తగా కోసుకుపోతున్న ఫీలింగ్. ఇది తప్ప వేరే గతిలేక కాదు. వద్దన్నాక కూడా తనెందుకు వాదించాలి? తన గుణం అది కాదు. నాకు తెలుసు. తనెంత మొండిగా మాట్లాడగలదో నాకే బాగా తెలుసు. ఏం లాభం?

ఆమె ప్రతీ కన్నీటి చుక్కా నా చేతకానితనాన్ని, ఏమీ చెప్పలేనితనాన్ని అపహాస్యం చేస్తోంది. నేనేగనక ఒప్పుకొని ఉంటే, ఆమె నాకిష్టమని చెప్పుంటే యుద్ధమే జరిగేదేమో!

“జరగనీ, ఏదైనా జరగనీ! నీ  కాళ్లు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టనీ… అసలు ఊరికే రావొద్దనీ అక్కడ్నే పడి ఉండమని చెప్పనీ. నువ్వు తల ఎత్తి చెప్పలేనప్పుడు ఎందుకు చించుకుంటావ్?”

తప్పదు. బ్యాగ్‌తో పాటే ఈ విషాద ఘడియల్ని కూడా మోసుకుపోవాల్నేను. ఆకురాలు కాలం ఒకటి. రేయ్! ఇడియట్! స్టాప్ దిస్ ఇడియాటిక్ పొయెటిక్  థాట్ ప్రాసెసింగ్. సాలె! ఏదన్న చెయ్.  పోతే మళ్లీ రాదురా తను. ఆపు తనని,”  ఎవడో అరుస్తున్నాడు లోపల. నా వల్ల కాలేదు. ఎంత ప్రయత్నించినా నోట మాట పెగల్లేదు. అంతటి అశక్తుణ్ణి నేనని తెలుసుకుంటే సిగ్గనిపించింది. అర్ధరాత్రి లేచి అటూ ఇటూ తిరిగినా, ఆమె గది మెట్లెక్కేంత ధైర్యం రాలేదు. నిజానికి – నిద్రపోవడం తప్ప ఆ రాత్రికిక నాకు వేరే గతి లేదు.

8

          పొద్దున్నే తన ప్రయాణం మొదలైంది. లగేజ్ అంతా రాత్రికి రాత్రి సర్దేసుకుంది. ”నాన్నెందుకే లగేజ్ మోయడం, నేను తీస్కుపోతా,” అంటూ నేనూ బయల్దేరాను. అమ్మకి నేను పొద్దున లేవడంతోనే అర్థమై పోయింది. ఇవ్వాళ నన్నేమీ అనకూడదని. నాకేమో తనొచ్చిన మొదటి రోజు బ్యాగ్ మోస్తూ ఇంటికి తీస్కురావడం గుర్తొస్తోంది.

“తను మరో చోట పని చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్! కేరళకి తిరిగెళ్లిపోవడానికి సిద్ధమైంది,” వచ్చీరాని తెలుగులో బ్రోకర్‌గాడేదో చెప్తున్నాడు నాన్నకి. రోడ్‌మీదికి రాగానే నైట్‌హాల్ట్ బస్సులో-శాలువా వేసుకొని మొదటి విండో సీట్ పక్కన కూర్చుంది ఆరోమలె.  నాన్నా, వాడూ లెఫ్ట్ లో కూర్చున్నారు. నాన్నేమీ అనుకోడనో, అనుకున్నా పర్లేదనో  ధైర్యం నాది.  తన పక్కనే కూర్చున్నాను.

5.15 am.  పదిహేన్నిమిషాలు ఆలస్యంగా బస్సు స్టార్ట్ అయింది. తన చేతిలో చెయ్యివేసి, ఆరోమలె “I’ll be missing you,” అని చెప్పాలనున్నా;  ”She is mad. She doesn’t know how to behave with others. Don’t let this disturb your mind. Be happy da. You can come here for next summer,” అంటూ నాన్నకి వినబడేలా పనికిరాని పురాణమేదో చెప్తూ, మౌనాన్ని పరీక్షిస్తూ, తన కళ్లలోకి చూడ్డానికి ధైర్యం లేకున్నా, ఇంటిదగ్గరే తన బ్యాగ్‌లో పెట్టిన న్యూ ఇయర్ డైరీని, అందులోని ఉత్తరాన్నీ రహస్యంగా చూపెడ్తూ బస్ దిగిపోయాను.

తను వెళ్లిపోయింది. కిటికీలోంచి కూడా చూడకుండా, చివరిమాటన్నా చెప్పకుండా, అచ్చం నాలాగే తనూ వెళ్లిపోయింది. తనొక్కతే వెళ్లలేదు. చెట్లూ, చెరువూ, చుక్కలూ, ఆకాశం ఒక్కటేమిటి- నాదనిపించే ప్రతీ అందం తనతోపాటే వెళ్లిపోయాయ్.

***

          నవ్వురాకా, ఏడ్వలేకా ఆ రోజెలాగో గడిపేసానుగానీ తను మాత్రం కదల్లేదు. నా మనసునిండా తనే. నా ప్రయాణం ఇంకో రెండు రోజులకి వాయిదా వేసుకున్నాను. తను వెళ్లాక సేఫ్‌గానే చేరుకున్నానని స్కూల్‌కి ఫోన్ చేసి చెప్పమన్నాడు నాన్న. ఆ ఒక్కమాట, కనీసం న్యూ యియర్‌కైనా కాల్ చేస్తుందనే ఆశ ఇంకో రెండు రోజులు అక్కడే కూర్చోబెట్టాయ్.

ఎంత ప్రయత్నించినా తను, నా ఆలోచనల్లోంచి అణువంతైనా పక్కకి జరగట్లేదు. చిన్న పిల్లలందరూ తన గురించి అడుగుతున్నారని నర్సరీ క్లాసెస్‌కి వెళ్లడం మానేసాను. శరీరానిక్కూడా నేనబద్ధాలాడటం ఇష్టం ఉండదనుకుంటా. రాత్రికల్లా రెండ్రోజులకి సరిపడా జ్వరం వచ్చింది.

9

“ఆకాశవాణి-వరంగల్ కేంద్రం-ఈనాటి చిత్రసీమలో ముందుగా విచిత్రసోదరులు చిత్రంనుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన నిన్ను తలచీ మైమరిచా గీతం వింటున్నారు,”

చిన్నాన్నవాళ్లింట్లో రేడియోలో మైల్డ్ టోన్లో వినిపిస్తోంది. పాట వినటంలో లీనమైపోయాను. ప్రతి వాక్యం నాకే అన్వయించుకుంటూ మరీ వింటున్నాను. తనకీ, నాకూ మధ్య నింగికీ నేలకీ మధ్య ఉన్నంత దూరం లేకున్నా ఎందుకో నాకీ  పరిస్థితి? పాట ఆగిపోయింది. అరుగుపైనుండి ఇంట్లోకిపోతూ నేనింకా అందులోనే.

మంచంపై ఉన్నానేగాని లోకం మరొకటి. తనతో కలిసి పాడిన పాటలెన్నో గుర్తుకొస్తున్నాయ్. పడుకున్నా ఎలాగో! ఎప్పుడు పడుకున్నానో, ఎలా నిద్రపట్టిందో నాకే గుర్తులేదు.

***

మనసులో బాధ శరీరమంతా  వ్యాపించిందేమో- అదే రాత్రి నడుచుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది.

జ్వరం ఎక్కువగా ఉంది – సూదిగుచ్చుతూనే అమ్మతో మాట్లాడ్తున్నాడు డాక్టర్, ”ఇవి ఇప్పుడు వేయండి. ఈ చీటిలోవి పొద్దున తెప్పించండి,” అంటూ  భుజం మీద చెయ్యేసి బయటిదాక తీస్కొచ్చాడు.

నేనూ, అమ్మా ఇంటివైపు నడుస్తున్నాం. ఎముకలు కొరికేసే చలి. ఆమె జ్ఞాపకాలు, అలసట. అన్నీ కలిసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. తను దక్కపోతే?మళ్లీ కనపడకపోతే? ఎలా? అయ్యో! ఎలా నేను బతకడం?

ఆ కొత్తశాల్తీని బండకేసి కొట్టాలనిపించేంత కోపం వస్తోంది. మతం, వర్గం అని వేరుచేసే మనుషులంటే ఎప్పట్నుండో ఉన్న విరక్తి కాస్తా ఆలోచనల్నిండా మళ్లీ చెలరేగుతోంది. కొద్దికొద్దిగా నాకు, నేను కాకుండా పోవడం తెలుస్తోంది. రాత్రి తీవ్రత పెరుగుతున్న కొద్దీ తన ధ్యాస కూడా అంతే తీవ్రమై పోతోంది. ఓ క్షణం బతకాలనీ, మరోక్షణం చావాలనీ వచ్చే ఆలోచనల దుమారంలో కొట్టుకపోతున్నాను.

***

అప్పటికే రాత్రి 11. అమ్మ లోపలికి రమ్మని ఎంత బతిమాలిన వినకుండా, మళ్లీ అరుగుమీదే కూర్చున్నా. నాన్న ఇంటికి వచ్చే టైం అది. బయటే ఉండి ఏదో ఒకటి అనిపించుకోవడంకంటే ఇంట్లోకి వెళ్లడమే మంచిదనుకున్నాను. ఆలోచనల్ని కొంచెమైనా పక్కకి మళ్లించాలని టీవీ ఆన్ చేసాను. చూడాలనిపించలేదు.

తన పాటలు. అవును! మనసంతా అవే.

కొంచెం నవ్వు, కొంచెం ఏడ్పు వచ్చేది ఇన్నిరోజులూ. ఇవ్వాళెందుకో ఒక్క ఏడుపే. ఈ చలితో కూడా ఏదో డిస్ట్రబెన్స్. నన్ను పిచ్చోణ్ణి చేయాలని ప్రకృతికూడా ప్రయత్నిస్తుందనిపించేంతగా.

***

Jan 1

అందరూ సంవత్సరం తెలీకుండానే గడిచిపోయిందని కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకవేమీ రుచించలేదు. దూరంగా పోయి, కుప్పనూర్చిన పొలంలో కూర్చొని; తనగురించి, తనపై నా ప్రేమగురించి రాస్కుంటూ కూర్చున్నాను. రాయగా రాయగా కొంచెం రిలీఫ్‌గా అనిపించింది.

న్యూ ఇయర్‌రోజు ఫోన్ రాలేదు. ఇక రాదని కూడా అనిపించింది.

E.Mలో ఒక పాప గ్రీటింగ్ గీసి నా పేరు తన పేరు కలిపి రాసివ్వడం చూసి ఏడ్పొచ్చింది. ఆ పిల్లకి ముద్దుపెట్టి, ప్లేగ్రౌండ్ అంతా ఎత్తుకొని తిప్పాను. నా ప్రేమ ఎవరికి చెప్పుకోను. ఆ పసిదానికా? ఏమో! చెప్పకుండానే దానికే అర్థమయిపోయిందేమో. వెంటనే కాకున్నా ఆరోమలెకి కూడా నా పరిస్థితేంటో అర్థమవుతుందేమో. నన్ను నేను సమాధానపర్చుకోవడం మొదలుపెట్టాను. మళ్లీ ఇప్పుడే కలవకున్నా ఎప్పుడో ఒకసారి కలుస్తామన్న ఆశ కలిగింది. ఆ రోజు సాయంత్రమే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను.

***

          ఆరోమలె! ప్రపంచం నిండా నిన్నే చూస్తుంటా.  ఇక్కడ వర్షం కురిసినప్పుడల్లా మనిద్దరం తడుస్తూ ఇంటికిపోతుంటాం. ఎండ పొద్దుల్లో మనం తిరిగిన ఊర్లు, చలికాలం చివరివరకూ నీ ముద్దుల వెచ్చదనం. ఆరోమలె! ఎనికి నిన్నె ఒత్తిరి ఇష్టమాన. వెళ్లిపోతేనేం? నువ్వెళ్లిపోతేనేం? నేను బతకలేనా? ఆరోమలె! I’m in love. I’m in love with you. మళ్లీ వస్తావా నాకోసం? I wanna live with you.

ప్రతీ క్రిస్మస్‌కి తనకి రాసిన ఉత్తరంలోని వాక్యాలు గుర్తొస్తూనే ఉంటాయ్.

బహుశా ఆమెక్కూడా…

**** (*) ****