నేనెక్కడ అనే కదా మొదలైంది..
ఉన్నారు.తెగిపడ్డ చేతులవాళ్ళు, పగిలిన కన్నులవాళ్ళు, విరగ్గొట్టుకున్న కాళ్ళని లేవదీసుకుని నడిచేవాళ్ళు. చెప్పడం దేనికి? ఒక్కో ఋతువుకి ఒక్కో కళ, ఒక్కో నక్షత్రానిది ఒక్కో ఆకాశం..
నాలుగంటే నాలుగు వానచినుకులు చేరినందుకు సరస్సు పొత్తిళ్ళనిండా నీలికలువలు పూసి ఉండటం నువ్వెప్పుడూ చూసి ఉండవు. నాలుగు రోజుల పరిచయానికే తమ సమస్తాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన మనుషులగురించి నేనూ ఏమీ మాట్లాడి ఉండను.
నిజానికి ఉన్నారు. దేవదారు నీడల్లో తలదాచుకుంటూ ఒంటరిగా ఓపిగ్గా ఎదిగొచ్చిన వాళ్ళున్నారు. వెనకనుండి పట్టుకునో,కాళ్ళకి చుట్టుకునో నిలువెత్తు దేహంపై ఎగబాకినవాళ్ళున్నారు.
ముళ్ల పొదలా నన్ను అల్లుకుపోయి ఒక్కొక్క అణువుని చీల్చినవాళ్ళు..పున్నాగపువ్వుని అవలీలగా తుంపి రికామీగా ఎటో ఊదుకుంటూపోయినవాళ్ళు.. తూనీగ రెక్కల్ని వేళ్ళకొసన ఇరికించి గాలిని దాచామని గర్వపడిన వాళ్ళు..
ఒక్కరనేమిటి- పత్తిలా పగిలి నవ్వినవాళ్ళు, దీపమై రగిలి ఏడ్చినవాళ్ళు..
కొండవాళ్ళు, నదులవాళ్ళు, మైదానాలవాళ్ళు, సముద్రాలకి అటుపక్క సంచారం చేసుకునే వాళ్ళు..అసలయితే ఒకప్పుడు అందరూ ఉన్నారు. కానీ ఉన్నట్టుండెందుకో ఊపిరి తడబడింది. ఎగశ్వాస బాగానే ఉండిందిగానీ దిగశ్వాస బాగా కష్టమైంది. గొంతులో రకరకాల మాటలు కొట్లాడుకుని, కలల్లో ఎవరెవరో చొరబడి, పూలరాసుల బరువుకి భూమి తిరగడం ఆగి..
హ్మ్..ఎక్కువ రోజులు అట్లా గడవలేదు. ఊపిరి సరిగా అందలేదు.నగరాలవాళ్ళు నన్ను వెలివేయడం సరైందని, అడవులవాళ్ళు నన్ను వేటాడక తప్పదని తీర్మానించుకున్నారు.
నదిమీదపోతూ ఆగిచూసినవాళ్ళు తియ్యగా పిలిచి పడవలో విసిరేయాలని, చెట్లమీద ఎగురుతూ ఆగి చూసినవాళ్ళు గట్టిగా కరుచుకుని గూటికి అతికించాలని ఒక్కొక్కరూ ఒక్కోలాగ ప్రణాళిక వేసుకున్నారు.
“ఆ తర్వాత?”..
తర్వాతేముంది. చాలా యేళ్ళు నేను పారిపోయాను.
“ఇంకా?”..
ఇంకేం లేదు. ఒక పదునైన రాయిని మృదువు చేసేందుకు హొయలుపోయే ఓ సెలయేరు. అది నువ్వు.
నిజమే. ఒక్కసారి చలితో వణికిపోయినందుకు, తన ఎముకల్లో నెగడు వేసుకున్న సహచరి గురించి, ఆమె వెచ్చటి చేతుల గురించి ఇప్పటికీ నేనేమీ మాట్లాడి ఉండను. ఉరివేసుకున్న ఆమె పాదాలమీద ఊగి ఊగి అలసిపోయిన కళ్లని, విస్తారమైన తన కనుపాపల చివర తడిసిపోయిన జీవితాన్ని నువ్వూ ఎప్పుడూ చూసి ఉండవు.
**** (*) ****
Painting: All at once by Anna Hryniewicz (Ireland)
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్