ఇంటికి రానీయని ఆట పేరు వేరు.ఊరవుతలకుర్కిచ్చె సెలవు పేరు వేరు. పొద్దున్నే తట్టిలేపే మనిషి పేరు వేరు.రాత్రైతే భయమేసే చీకటి పేరు వేరు. ఏమీ ఉండదు నేర్చుకునెట్ది. గీరలు మార్తయి-బండిదోలుడు మారదు;పైసలు మార్తయి-చేయి చాచుడు మారదు;దెబ్బలు మార్తయి- తగిలిచ్చుకునుడు గంతే;సాయితలు మార్తయి- సాయంజేసుడు గదే..
లాగు పొడుగైతది. దినం పొడుగైతది. ఎండ ఇంకింత ఎక్వనేగొడతది. మనుషులు ఇంకింత కొంచెపడుతుంటరు. ఒక్కపూట బళ్ళో నేర్శిన ఈత బరిబాతల నిన్ను బయటకు ఈడ్వదు.ఒక్కశిత్తమనుకుని చేశిన దొంగతనం కట్టేశిన చెట్లకి కనికరం ఉండదు. వయిలు ముట్టకుండా రాశిన పరీక్ష, సొప్పబెండుదెచ్చి చేశిన గాలం..సాకలి సదువుని బండకేశికొట్టదు. గొంతులగుచ్చుకొని మాట్లాడనీయదు
అనుకుంటంగాని- తాకుడుగాల్లోడు యెటు అడుగేస్తే ఏంది. తపాలాలు గిన్నెలు తాకుతనే ఉంటయ్. తలంబ్రాలు నెత్తిల పడ్తనే ఉంటయ్. అమ్మ చేతి సరాతం, అయ్య చేతి పగ్గం ఎటు తిర్గీ మెత్తగా అంటుతనే ఉంటయ్. మొద్దునిద్రోడు ఎన్నూర్లు తిర్గినా పల్లేరుకంపలు కలుస్తనే ఉంటయ్.
ఒప్పుకోవుగాని ఉరేయ్! కట్టెలకుపోయిన జంగలి కాలిపోతాంటే ఏడ్చిన పిలగానివి నువ్వే అయుండొచ్చు. కళ్ళనిండిన పిల్ల యెల్లిపోతాంటే ఆకురాలిన అడవి నీదే అయుండొచ్చు. ఎండ లగ్గాంచి సంపుతా ఉంటే ఎవరి గుడిసెలోను నీకు చోటుండకపోవచ్చు. ఎవ్వరూ నీకిన్ని నీళ్ళివ్వకపోవచ్చు.
పగటివేశగాళ్ళం. పగుళ్లిచ్చినోళ్లం.పగటి కలకె కండ్లు చెదిరి కూర్పట్లబడేటోళ్ళం. ఉరేయ్! ఎండదెబ్బదగలకుండ ఏం జెయాల్నో తెల్వద మనకి?చల్..గడ్డివాముల ఈతగెలకి కళ్ళని అతికించుకొని రావాలె. పక్కోని చేతిలో సిగరెట్ పెట్టెచింపి టప్పాలాట ఆడినట్టు ఊహించుకోవాలె. ఆఫీస్ టేబిల్ మీద పులి మేక గీయాలె. టైముంటే అర్ధ రూపాయి చేతిలో పట్టుకుని పొద్దంతా ఐస్ వాడి కోసం ఎదురుచూస్తుండాలె.
**** (*) ****
Painting: Bala krishnan
Credit: http://webneel.com/i/0/1-watercolor-paintings-by-balakrishnan/05-2015/d?n=9979
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్