డైరీ

ఎనఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్

సెప్టెంబర్ 2016

“Its suffocating.. నిన్న కూడా కొండచిలువలు చుట్టుకున్నాయ్ నన్ను. చెప్తే నమ్మవు. అసలేదీ నమ్మవు. ఎముకలు విరిగేంత హత్తుకుని, ఊపిరి ఆగేంత ముద్దాడి ఎక్కడికో పారిపోతావు. మళ్ళీ ఎన్నాళ్లకోగానీ రావు. నాకేమో రాత్రులన్నీ పిచ్చి కలల్తో”..

“పో”..

*

ఎక్కడికి పోవాలి?

హొయలు హొయల నగరంలోనూ అంతే! శిథిలమైన ఊర్లోనూ అంతే! కొత్తగా ఎవరన్నా వస్తే కుక్కలు అరుస్తాయి. పక్షులు లేచిపోతాయి. రాళ్లతుట్టెల చాటుగా పదునుదేలిన మనుషులు. వొడుపుగా విసిరేందుకు మాటలు ఏరుకుంటూ ..

ఎందుకు పోవాలి?

అగాథ సౌందర్య మధుపానంలో స్థాణువయిపోయిన ఆత్మని వదిలి, అవధిలేని ఆనందంతో జారిపడే క్షణాలనొదిలి, దిగ్మండలానికే పరిధి గీసే దిగంతరేఖల చీకటినొదిలి.. అనంతమైన బాధని వదిలి..

*

“Its suffocating. I cant breath anymore..ఎట్ లీస్ట్ ఇప్పుడన్నా నిజాలు చెప్తావా?ఎందుకట్లా ఉంటావు? గుర్తున్నవి కాదు. మర్చిపోయినవేమన్నా…

ఏం?మాటలు చెప్పి దగ్గరవడమేనా? దగ్గరయ్యాక మాటలుండవా? నాకేమన్నా అయితే? కాదు సరే, నువ్వు స్వంతంగా నాకే కావాలనుంటే?ఏడుస్తావెందుకు? ఎన్నేళ్ళు నీకు? ఇంతకముందు ఎవరితోనైనా ఇంత దగ్గరగా..”

*

అవును.కాదు.నిజానికి లేను.అసలైతే ఉన్నాను; చెప్తాను.చాలా చిన్న కథ; ముగ్గురుంటారు.ముద్దుముద్దుగా మాట్లాడుకుంటూ..

ఆమెకేమీ తెలీదు. అప్పుడొక రోజు సముద్రం ఒడ్డున చీకట్లో ఇద్దరం గడపాలని తప్ప; అందుకని రాత్రి ఒంటరిగా కలుసుకుని అనువైన దారిలో తీసుకుపోవడం తప్ప; ఇసుక దేహంమీద నడిచే ప్రాణాన్ని ఆకలిగా ఉందని కాల్చుకుతినడం తప్ప;

నిజంగానే ఆమెకేమీ తెలీదు. ఎటుపోయినా ప్రపంచం ఒకేలాగా ప్రవర్తిస్తుందని, ఏ పడవనైనా సముద్రం ఒకేలాగా పిలుస్తుందని, ఎక్కడ తలదాచుకున్నా పాదాలు భూమిలోనే పాతివేయబడతాయని..

అతడికి తెలిసిందీ కొంచెమే; అలుపు తీరేలా గంతులెయ్యడం. అలలు అలలుగా చెదిరిపోవడం. ఆపై ఎందుకో నెమ్మదించడం.
పాప చాలా చిన్నది. దానికి తెలియడమంటే కూడా తెలీదు; కానీ భలే మాట్లాడుతుంది…

“నాన్నా!నాన్నా! నేను అల్లరి చేయను. నాకు ఊవెల కూడా కొనొద్దు. ప్లీస్ నాన్నా. నన్ను రానివ్వు. ”

“అమ్మని బతకనివ్వరని భయం కదూ పిచ్చి నాన్నకి! లోపలే దాక్కో! చిట్టి తల్లీ! లోపలే దాక్కో! పొత్తి కడుపు మీద చేతులు పెట్టి పిలవొద్దని చెప్తా నాన్నకి. పిలిస్తే నీకు అమ్మని చూడాలనిపిస్తదని గట్టిగా చెప్తా..”

*

“Stop there. Enough of everything.Get up and just leave this place! ముందే ఎందుకు చెప్పలేద్రా ఇదంతా?
పో..ఇక్కన్నుంచి..ఎంతగా నమ్మి, ఎంత మోహంతో చుట్టుకుని, ఎన్నిసార్లు ఏడ్చి, ఎంతమందిని వదులుకుని, ఎవర్నీ లెక్కచేయకుండా, ఎక్కడికిపోతున్నానో తెలీకుండా-

….ఆగు! ఒక్క నిమిషం..ఆ తర్వాత?”

*

తర్వాతేముంది? ఏం లేదు. నేను కూడా ఎవర్నీ లెక్కచేయకుండా, ఎక్కడికిపోతున్నానో తెలీకుండా, ఎప్పుడు నిద్రపోతానో ఎవరికీ చెప్పకుండా..

అరణ్యాల్ని దాటి వచ్చి అప్పటికప్పుడే ఎందుకు పారిపోయేదీ, గాయాల పరిమళంతో గాలినెందుకు నింపిపోయేదీ చెప్పేసాను. పసిదాని పాదాల మీద నిలిచిపోయిన అమ్మ చూపు గురించి, ఆకాశపు నీలి నదిలో దూకిన చేపపిల్ల చివరగా అన్న మాట గురించి ఇంకెప్పుడైనా చెప్తాను.

నిజమే కదా అడిగావు? సరే! అలవాటైన పూలభాషలో-

అదుపుతప్పి, రెక్క విరిగి, రత్నగంధపు రంగులన్నీ ఒక్కొక్కటిగా వెలిసిపోయి..నీ పెదవులమీద వాలే సీతాకోకకి, హాయిగా నిదురపోయే సీతాకోకకి; సేదతీరటం తప్ప వేరే ధ్యాస లేదని, నీకెప్పటికన్నా అర్ధమవుతుందా?

**** (*) ****