“The Grasses” by Rumi
ఏ గాలైతే
చెట్లని పెకిలించివేస్తుందో
అదే గాలి
గడ్డిని మురిపిస్తుంది.
దివ్యమైన అదే గాలి-
నిలువ సత్తువలేనీ
ఒదగక ఉండలేనీ
గడ్డిపూల వినమత్రకి
జోలపాడుతుంది.
***
కొమ్మలు ఎంత మొద్దుబారినా
గొడ్డలిపెట్టుకు ముక్కలవుతాయ్.
ఆకులది అదృష్టం.
వాటినది ముట్టుకోదు.
హోరుగాలి వాటినసలే
ముట్టుకోదు.
***
ఏ గాలైతే
ఉఛ్ఛ్వాస నిశ్వాసలై దేహంలో గమిస్తుందో
అదే గాలి
ఆత్మలో ప్రతిఫలిస్తుంది.
దివ్యమైన అదేగాలి-
కోపమై,శాంతమై
నశింపజేస్తూ,జీవింపజేస్తూ
ఆత్మ నిత్యత్వాన్ని
గుర్తుచేస్తుంది.
***
మిత్రుడా!
దేవుడు సముద్రం.
అలలు అతనిలోనే
సృష్టింపబడ్తాయ్.
అలలు అతనిలోనే
లయింపబడ్తాయ్.
ప్రవక్తకైనా,ప్రాపంచికుడికైనా
దేవుడుతప్ప వేరే
యధార్ధమేదీ లేదు.
అలలు అలలుగా ఉరకలువేసినా
హొయలుహొయలుగా నృత్యం చేసినా
అంతా వాడి అల్లరి.
వాడు గొంతెత్తి పాడితేనే
సముద్రంలోంచి సంతోషం వీస్తుంది.
***
మిత్రుడా!
గడ్డిపూవుల్లా ఊగుతాం సరే.
గాలిగాక
తీరానికీ సంద్రానికీ మధ్య
అలల ఊయల ఊపేదెవరు?
దేవుడుగాక
ఇంత మధురంగా
గాలిపాటలు పాడేదెవరు?
“The Origin of the World” by Rumi
మిత్రుడా!
మట్టినుండి పుట్టిన మనమంతా
అనాదిగా విశ్వంలో సంచలించిన
పదార్ధాలమే.
బయటికి
దుక్కాలు,కోరికల్లో చలిస్తున్నట్టు కనిపించినా-
సాలెపురుగు దేహంలో
తన ఉనికి రహస్యం ఉన్నట్టు
మనలోనూ
సమస్త నక్షత్రమండలాల జ్ఞానం నిక్షిప్తమై ఉంది.
Original: Rumi
Translation: Nanda Kishore
సాలెపురుగు దేహంలో
తన ఉనికి రహస్యం ఉన్నట్టు
మనలోనూ
సమస్త నక్షత్రమండలాల జ్ఞానం నిక్షిప్తమై ఉంది….
గొప్ప కవితను పరిచయం చేశావు నందా…